గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్‌లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.
అదానీ గ్రూపు ‘స్టాక్ మానిప్యులేషన్’, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని ఇటీవల అమెరికా ఇన్వెస్టిమెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఒక నివేదిక విడుదల చేయడంతో, అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనం అవుతున్నాయి.
ఆ నివేదికకు ముందు ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో ఉండే అదానీ ప్రస్తుతం 15వ స్థానానికి పడిపోయారు.
మరోవైపు ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ కంటే ముఖేశ్ అంబానీ మరోసారి ముందుకు వచ్చారు.
ఈ నివేదిక అదానీ గ్రూపు సంస్థలపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే, గతంలోనూ ఇలాంటి కొన్ని చేదు అనుభవాలను తను ఎదుర్కొన్నట్లు ఒక ప్రైవేటు మీడియా చానెల్‌తో ఇటీవల అదానీ చెప్పారు.
అలాంటి అనుభవాలను మరచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని ఈ ఇంటర్వ్యూలో అదానీ వ్యాఖ్యానించారు.
ఆయన చెప్పిన రెండు ఘటనల్లో ఒకటి 2008 నవంబరు 26 నాటి ముంబయి దాడులు. ఆ దాడుల సమయంలో అదానీ.. తాజ్ హోటల్‌లోనే ఉన్నారు. ఆ హోటల్‌లో విడిదిచేసిన వారు కూడా ఆనాడు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఇక రెండో ఘటన గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది 1998లో జరిగింది. తుపాకీ గురిపెట్టి ఆనాడు అదానీని కొందరు కిడ్నాప్ చేశారు. రూ. 15 కోట్లు ఇస్తేనే విడిచిపెడతామని ఆనాడు ఆయన్ను బెదిరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా కిడ్నాప్ జరిగింది?
అది 1998 జనవరి 1. అహ్మదాబాద్‌లోని కర్ణావతి క్లబ్ నుంచి అదానీ అప్పుడే బయటకు వచ్చారు. తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరై శాంతిలాల్ పటేల్‌తోపాటు కారులో మహమ్మద్‌పురా రోడ్ వైపుగా వెళ్లాలని ఆయన భావించారు.
‘‘అప్పట్లో అదే అహ్మదాబాద్‌లో అతిపెద్ద క్లబ్. అయితే, క్లబ్ నుంచి బయటకు వస్తూనే అదానీని కిడ్నాప్ చేశారు’’ అని గుజరాత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు రాజ్ గోస్వామి చెప్పారు.
‘‘వారి కారు ముందే, ఒక స్కూటర్‌ను పార్క్ చేశారు. దీంతో అదానీ తన కారు ఆపాల్సి వచ్చింది. అప్పుడే పక్కనే ఉన్న ఒక మారుతీ వ్యాన్ నుంచి ఆరుగురు బయటకు వచ్చారు. బలవంతంగా గౌతమ్ అదానీ, శాంతిలాల్ పటేల్‌లకు తుపాకీ గురిపెట్టి వ్యాన్‌లోకి ఎక్కించారు’’ అని గోస్వామి వివరించారు.
‘‘కిడ్నాప్ తర్వాత వీరిద్దరనీ ఎవరికీ తెలియని చోటుకు తీసుకెళ్లారు. గురువారం ఆ కిడ్నాప్ జరిగింది. మళ్లీ శనివారం అదానీ క్షేమంగా ఇంటికి వచ్చారు’’ అని గోస్వామి తెలిపారు.
అహ్మదాబాద్‌లోని సర్‌ఖేజ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై అప్పట్లో ఒక ప్రాథమిక విచారణ నివేదిక కూడా నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
చాలా కథలు
అదానీ కిడ్నాప్ ఎలా జరిగిందనే అంశంపై ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాజేశ్ పాండే బీబీసీతో మాట్లాడారు. ‘‘బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ అప్పటికే అలాంటి కిడ్నాప్‌లు చాలాచేసింది. అదానీ కిడ్నాప్ కూడా వారే కుట్ర పన్నారు’’ అని ఆయన చెప్పారు.
‘‘అసలు గౌతమ్ అదానీని పోలీసులు కాపాడారా? లేదా ఆయనే కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నారా? లేదా డబ్బులు కట్టి బయటకు వచ్చారా? ఈ విషయంలో చాలా అంశాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై స్పష్టత లేనప్పటికీ, మొత్తానికి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు’’ అని జర్నలిస్టు గోస్వామి చెప్పారు.
అయితే, గౌతమ్ అదానీని కాపాడేందుకు రూ.5 కోట్లను కిడ్నాపర్లకు ఇచ్చారని రాజేశ్ పాండే చెప్పారు. ‘‘ఆ డబ్బులను దుబాయ్‌లో ఇర్ఫాన్ గోగాకు ఇచ్చారు. ఇర్ఫాన్ కూడా బబ్లూ గాంగ్ సభ్యుడే’’ అని ఆయన వివరించారు.
‘‘అప్పట్లో పలు కిడ్నాప్, హత్య కేసులపై అరెస్టుచేసి బరేలీ జైలుకు బబ్లూ శ్రీవాస్తవను తరలించారు. అతడే డబ్బులను తీసుకునేందుకు ఇర్ఫాన్‌ను పురమాయించాడు. ఆ రోజుల్లో హవాలా మార్గాల్లో ఈ డబ్బులు చేతులు మారాయి’’ అని రాజేశ్ పాండే చెప్పారు.
‘‘అహ్మదాబాద్‌లోని ఒక ఇంట్లోనే గౌతమ్ అదానీని ఉంచారు. ఈ కిడ్నాప్ విషయంలో అదానీ చాలా భయపడ్డారు. అందుకే ఈ కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన ముందుకు రాలేదు. దీంతో ఈ కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో అందరినీ వదిలిపెట్టేశారు’’ అని రాజేశ్ పాండే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా జరిగింది?
అదానీని వదిలిపెట్టాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు ఇంగ్లిష్ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అప్పట్లో ఒక కథనం ప్రచురించింది. దీనిపై తొమ్మిది మందిపై ఆరోపణలతో కేసు కూడా నమోదుచేశారు. అయితే, 2018లో నిందితులందరినీ వదిలిపెట్టేశారు.
అదానీ కిడ్నాప్ కేసులో 2009లో పోలీసులు అభియోగపత్రాన్ని నమోదుచేశారు. దీనిలో గ్యాంగ్‌స్టర్ రెహమాన్ అలియాస్ ఫజల్, భోగీలాల్ దర్జీ అలియాస్ మామాలను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.
ఫజల్ సొంత రాష్ట్రం బిహార్. 2006లో నేపాల్ సరిహద్దుల్లో ఆయనను అరెస్టు చేశారు. మరోవైపు కిడ్నాప్‌కు 14 ఏళ్ల తర్వాత దర్జీని 2012లో దుబాయ్ నుంచి భారత్‌కు అధికారులు తీసుకురాగలిగారు.
అయితే, దర్యాప్తు సమయంలో కిడ్నాపర్‌లను గుర్తుపట్టేందుకు అదానీ ముందుకు రాలేదు. మరోవైపు ఆయన కోర్టుకు వచ్చి వాంగ్మూలం కూడా ఇవ్వలేదు.
సాక్ష్యాలు లేకపోవడంతో ఇద్దరు ప్రధాన నిందితులనూ 2018లో కోర్టు విడిచిపెట్టింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న మిగతావారిని కూడా కోర్టు విడిచిపెట్టేసింది.

ఫొటో సోర్స్, ani
ఉత్తర్ ప్రదేశ్‌తో సంబంధం ఏమిటి?
అదానీ కిడ్నాప్ అయిన అదే ఏడాది సెప్బెంబరు 6న గుజరాత్‌కు చెందిన మరో మిలియనీర్ వ్యాపారవేత్త బాబు భాయ్ సింఘ్వీని కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు జరిగాయి.
‘‘అప్పుడు బాబు భాయ్ సింఘ్వీ తన కారులో ఉన్నారు. ఎప్పటిలానే కారు ముందు ఒక స్కూటర్ ఆగింది. పక్కనే మారుతీ వ్యాన్ కూడా ఆగింది. దీంతో వెంటనే తన కారును జన సందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాల వైపుకు తీసుకెళ్లారు. ఈ ఘటన భుజ్ జిల్లాలో జరిగింది’’ అని రాజేశ్ పాండే వివరించారు.
అప్పటి హోం మంత్రి ఎల్‌కే అడ్వాణీకి బాబు భాయ్ సింఘ్వీ సన్నిహితులు. దీంతో ఈ కేసుపై పోలీసులు మరింత ఎక్కువ దృష్టిపెట్టారు.
బాబు సింఘ్వీని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, దిల్లీ, ముంబయి, నేపాల్, దుబాయిలలో ఉండే కొందరితో తరచూ మాట్లాడినట్లు అప్పటి భుజ్ ఎస్పీ కేశవ్ ప్రసాద్ చెప్పారు.
‘‘ఎక్కువసార్లు లఖ్‌నవూలోని ఒక నంబరుకు వారు ఫోన్ చేశారు. దీంతో యూపీ పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అరుణ్ కుమార్‌ను మేం సంప్రదించాం. ఆయన యూపీ పోలీస్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా పనిచేసేవారు’’ అని కేశవ్ ప్రసాద్ వివరించారు.

బబ్లూ గ్యాంగ్ పనేనా?
ఈ కిడ్నాప్ ప్రయత్నంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కరడుగట్టిన నేరస్థుల ముఠా శ్రీప్రకాశ్ శుక్లా గ్యాంగ్ పాత్ర ఉండొచ్చని కేశవ్ ప్రసాద్ అనుమానించారు.
అయితే, యూపీ టాస్క్ ఫోర్స్ ఈ కేసుతో శ్రీప్రకాశ్ శుక్లా గ్యాంగ్‌తో సంబంధంలేదని, ఇది బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ పని అని తేల్చింది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం ఒకప్పుడు బబ్లూ పనిచేసేవారు.
1993నాటి ముంబయి దాడుల్లో దావూద్ ఇబ్రహీం పాత్రపై అధికారులు దృష్టిసాధించడంతో ఈ గ్యాంగ్‌లన్నీ విడిపోయాయి. ముఖ్యంగా బబ్లూ శ్రీవాస్తవ, ఛోటా రాజన్ ప్రత్యేక గ్యాంగ్‌లు పెట్టుకున్నారు.
1995లో సింగపూర్‌లో బబ్లూను కేంద్ర దర్యాప్త సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన్ను భారత్‌కు తీసుకొచ్చి, జైలుకు తరలించినట్లు రాజేశ్ పాండే చెప్పారు.
యూపీ టాస్క్ ఫోర్స్ చేపట్టిన దర్యాప్తులోనే గౌతమ్ అదానీని కూడా బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటికి బబ్లూ జైలులో ఉన్నారు.

ఫొటో సోర్స్, FB/IPS RAJESH PANDEY
15 మంది వ్యాపారవేత్తల కిడ్నాప్
మొత్తంగా 15 మందికిపైగా దిగ్గజ వ్యాపారవేత్తలను బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు రాజేశ్ పాండే చెప్పారు. ఈ కేసుల్లో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆయన వివరించారు.
‘‘గౌతమ్ అదానీని గురువారం కిడ్నాప్ చేసినట్లు బబ్లూ నాతో చెప్పారు. ఆ తర్వాత చాలా అంశాలపై బబ్లూ మాట్లాడారు. కిడ్నాప్ తర్వాత వీరంతా డబ్బుల కోసం చర్చలు జరిపారు. అయితే, రేపు బ్యాంకు మూసివుంటుంది, బ్యాంకులు లేకుండా మీకు నీకు రూ.15 కోట్లు ఇవ్వలేను, ఈ లోగా ఇక్కడికి పోలీసులు వచ్చేస్తారు అని అదానీ కిడ్నాపర్లకు చెప్పారు. కిడ్నాపర్లతో అదానీ చాలా మంతనాలు చేపట్టారు’’ అని రాజేశ్ పాండే వివరించారు.
నిజంగా డబ్బులు ఇచ్చారా లేదా పోలీసులు ఆయన్ను విడిపించారా? అనే అంశాన్ని ధ్రువీకరించేందుకు అదానీ తరఫున వ్యక్తులెవరూ స్పందించలేదు.
అయితే, ఇదేమీ కథకాదని, తాను నేరుగా అదానీని కిడ్నాప్ చేసిన బబ్లూతో మాట్లాడానని రాజేశ్ పాండే చెప్పారు.
1998నాటికి గుజరాత్‌లో పెద్ద వ్యాపారవేత్తగా అదానీ పేరు సంపాదించారు. 1988 నుంచి 1992 మధ్య అదానీ దిగుమతుల వ్యాపారం 100 టన్నుల నుంచి 40 వేల టన్నులకు పెరిగింది.
ఆ తర్వాత ఎగుమతులపైనా అదానీ దృష్టిసారించారు. క్రమంగా భారత్ నుంచి ప్రతి వస్తువునూ ఎగుమతి చేసే స్థాయికి అదానీ గ్రూపు ఎదిగింది. ముంద్రా పోర్టును తీసుకున్న తర్వాత వీరి వ్యాపారం మరింత విస్తరించింది.
అయితే, కిడ్నాప్ సమయంలో అదానీ అంత ప్రముఖ వ్యాపారవేత్తకాదని, అందుకే ఆయన కేసు గురించి చాలా మందికి తెలియకపోవచ్చని రాజేశ్ పాండే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















