నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా

ఆనం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఫొటో సోర్స్, Facebook

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు రూటే సెపరేటు. ఈ జిల్లా రాజకీయాలు, రాజకీయనేతలు ఎప్పుడూ ట్రెండ్‌‌లో ఉంటారు.

ఇటీవల కాలంలో అధికార వైసీపీ రాజకీయ వ్యవహారాలు వేడెక్కుతున్నాయి. ఆ మధ్య ఆనం రామనారాయణ రెడ్డి, ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.... అధికార పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం వినపడుతోంది.

2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ కండువా కప్పుకున్న నేతలే కాకుండా ఆరంభం నుంచి జగన్ వెంట నడిచిన వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్ నేతలను ఇప్పటికే అధికారికంగా పక్కన పెట్టేశారు. వెంకటగిరి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హోదాలో మరో నాయకుడిని కూర్చోబెట్టారు.

ఆ ఎపిసోడ్ గడిచి నెల రోజులు దాటకముందే తాజాగా నెల్లూరు రూరల్ పరిణామాలు వైఎస్సార్సీపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

జగన్ విధేయుడిగా పేరొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తన అసంతృప్తి స్వరాన్ని వినిపిస్తున్నారు.

ఈ పరిణామాలతో జిల్లాలోని ఇతర అసంతృప్తి నేతల్లోనూ కదలిక కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన నేతల్లోని అసంతృప్తిని అవకాశంగా మలచుకోవాలనే ఆశతో విపక్షం ఎదురుచూస్తోంది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఫొటో సోర్స్, Kotamreddy Sridhar Reddy/Facebook

ఆరంభం నుంచి దూకుడే

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే రాజకీయాలు చేశారు. ఏబీవీపీలో పనిచేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉంటూ యువజన కాంగ్రెస్‌లో కీలక స్థానానికి ఎదిగారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచిన తొలితరం నాయకుల్లో ఆయన ఒకరు. పీసీసీ కార్యదర్శిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

2014, 2019 ఎన్నికల్లో వరుసగా కోటంరెడ్డి గెలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున గెలిచిన ఆయన విపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చినా తనదైన దూకుడు శైలితోనే ఉన్నారు.

నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మురికి కాలువలో దిగి నిరసన తెలియజేయడం వంటివి ఆయన శైలికి అద్దం పడతాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ తన పంథా మార్చుకోకపోవడం శ్రీధర్ రెడ్డి స్టయిల్.

అంతకుముందు 2000 సంవత్సరంలో విద్యుత్ చార్జీల తగ్గించాలంటూ చేపట్టిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి మీద దేశద్రోహం కేసు కూడా నమోదయ్యింది.

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ మీద నల్ల జెండా ఎగరవేసినందుకు దేశద్రోహం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు.

ఎమ్మెల్యే కాకముందు, ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ జీవితమంతా ఆందోళనల పర్వమే. చివరకు ఏపీలో వైఎస్సార్సీపీ నేతలంతా వ్యతిరేకించినప్పటికీ అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు.

స్వయంగా ఆయనే వెళ్లి పాదయాత్ర చేసే వారిని కలిశారు. తమ పార్టీ విధానానికి విరుద్ధంగా సాగుతున్నప్పటికీ తన నియోజకవర్గానికి వచ్చిన వారిని కలిశానని ఆయన అప్పట్లో ప్రకటించారు.

శ్రీధర్ రెడ్డి

ఫొటో సోర్స్, Kotamreddy Sridhar Reddy Twitter

ఫొటో క్యాప్షన్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సీరియస్ విమర్శలు

వైఎస్ జగన్ క్యాబినెట్‌లో తనకు బెర్త్ దక్కుతుందని శ్రీధర్ రెడ్డి ఆశించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా పని చేసినందున, తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని శ్రీధర్ రెడ్డి భావించారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడు కూడా ఆయనకు పదవి రాలేదు. నాడు బహిరంగంగానే ఆయన తన అసహనాన్ని ప్రదర్శించారు.

‘గడపగడప మన ప్రభుత్వం’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, వెనుకబడిన వారిలో ఆయన పేరు కూడా ఉందని జగన్ పదే పదే చెప్పినా శ్రీధర్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో సీన్ మారుతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి.

చివరకు ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన కార్యకర్తలతో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబుతున్నట్లుగా ఆ ఆడియోలు ఉండటం అలజడి రేపింది.

అంతకు ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీరియస్ విమర్శలు చేశారు. తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాను 11 సిమ్‌లు వాడుతున్నానని తెలిపారు. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికే విపక్ష నేతలు కొందరు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తుండగా ఈసారి అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో అధికార పార్టీ ఉలిక్కిపడింది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఫొటో సోర్స్, Kotamreddy Sridhar Reddy/Facebook

సొంత కులస్తుల అసహనం

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి గట్టి పట్టుంది.

2014 ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు గానూ 7 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి మాత్రమే టీడీపీ ఖాతాలో చేరాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ బోణీ కూడా కొట్టలేకపోయింది. 10 సీట్లను వైఎస్సార్సీపి గెలుచుకుంది.

ఇక జిల్లాలోని 10 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో ఏడుగురు రెడ్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో మొన్నటి ఉప ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచిన మేకపాటి విక్రమ్ రెడ్డి మినహా అందరూ సీనియర్ నాయకులే.

దాంతో క్యాబినెట్ కూర్పులో వారిని సంతృప్తిపరచడం వైఎస్సార్సీపీ అధినేతకు సాధ్యంకాని పనిగా మారింది. పార్టీ బలంగా ఉన్న జిల్లాలో సొంత కులస్తులు రాజకీయ చక్రం తిప్పుతున్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ తలనొప్పులు మాత్రం తప్పడం లేదు.

పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని భావిస్తూ వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన దాదాపు పార్టీకి దూరమయినట్టుగా భావిస్తున్నారు.

ఆనం కూడా ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగంగానే ఎత్తి చూపుతున్నారు. అభివృద్ధి పనులు జరగడం లేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నేదరుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. దాంతో ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ దూరం పెట్టినట్లు అయింది.

వైఎస్ జగన్‌తో ఆనం రామనారాయణ రెడ్డి

ఫొటో సోర్స్, YSRCP/Facebook

‘అది మంచిదికాదు’

రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిల పరిణామాలు చూస్తే నెల్లూరు జిల్లాలో ఇద్దరు కీలక నేతలు జగన్ వైఖరిని సహించడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ పి.రమేష్ బాబు అన్నారు.

"నెల్లూరులో రెడ్లు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ మీద తిరుగుబాటు చేశారు.

కోవూరు ఎమ్మెల్యే కూడా పూర్తి సంతృప్తిగా లేరు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వయసు, వ్యక్తిగత వివాదాలతో వచ్చే ఎన్నికల్లో కష్టం.

మరొకవైపు ఆనం, కోటంరెడ్డి ఎపిసోడ్స్ నడుస్తున్నాయి.

మంత్రిగా ఉన్న ఒక్క కాకాణి గోవర్థన్ రెడ్డి తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరిపైనా స్థానికంగా అసంతృప్తి ఏదో స్థాయిలో ఉంది.

దానిని ఆధారంగా చేసుకుని ముగ్గురు, నలుగురు అభ్యర్థులను మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

దీనిని నాయకులు సహించడం లేదు. అధినేత వ్యవహారశైలి వారికి రుచిస్తున్న దాఖలాలు లేవు. " అని బీబీసీతో రమేష్ బాబు అన్నారు.

సీనియర్లు, తన వెంట నడుస్తూ వచ్చిన నాయకులను తగిన రీతిలో గౌరవించిన దాఖలాలు లేవని వారంతా మధనపడుతున్నట్టుగా రమేష్ బాబు అన్నారు.

పాతవారిని దూరం చేసుకుంటూ కొత్త నేతల వైపు చూడాల్సిన పరిస్థితి రావడం వైఎస్సార్సీపీకి అంత శ్రేయస్కరం కాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఫొటో సోర్స్, Kakani Govardhan Reddy/Facebook

‘టీకప్పులో తుఫాన్ లాంటిదే..’

ఆనం రామనారాయణ రెడ్డి చేసిన విమర్శల మీద వైఎస్సార్సీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. ఆయనకు కౌంటర్లు ఇచ్చారు.

కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆచితూచి మాట్లాడుతున్నారు.

"కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జరుగుతున్న ప్రచారమంతా మీడియా సృష్టి. ఆయనకు పార్టీలో ఏదయినా సమస్యలు ఉంటే అధిష్టానం మాట్లాడుతుంది. సీనియర్ నాయకుడు. తగిన గౌరవం ఇస్తాం. మాట్లాడుతాం. ఆ సమస్యలను పరిష్కరిస్తాం.

అన్నీ సర్థుకుంటాయి. ఇప్పుడు జరుగుతున్నదంతా టీ కప్పులా తుఫాన్ లాంటిదే. ఫోన్ ట్యాపింగ్ గురించి ఆయన చెప్పారు. అందులో ఆయనకు స్పష్టత ఉందా లేదా అని కనుక్కుంటాం.

సహజంగా అలాంటి ట్యాపింగ్ జరగదు కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకుని అనుమానాలు తీరుస్తాం" మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ని మారుస్తున్నారంటూ సాగుతున్న ప్రచారం కూడా పుకారేనంటూ ఆయన మీడియాతో అన్నారు.

మరోవైపు శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ సేవాదళ్ విభాగం నాయకుకడు గిరిధర్ రెడ్డితో పార్టీ నేతలు చర్చలు జరిపారు. పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో గిరిధర్ రెడ్డి మంతనాలు జరపడంతో ఈ ఊహాగానాలు వచ్చాయి.

అందుకు తగ్గట్టుగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తనకు అప్పగించాలని గిరిధర్ రెడ్డి కోరినట్టు బాలినేని ప్రకటించడం విశేషం.

వైఎస్సార్సీపీ

అసంతృప్తులు ఇంకా ఉన్నారు...

వైఎస్సార్సీపీలో జరుగుతున్న పరిణామాలు తమకు సంబంధం లేదని, అయితే ప్రజా వ్యతిరేకతను గమనించిన చాలామంది నాయకులు వైఎస్సార్సీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.

"రాష్ట్రమంతా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్‌ని జనం ఇంటికిపంపుతారు.

దీనిని చాలామంది గ్రహించారు. ఎమ్మెల్యేలు కూడా జగన్ ధోరణితో విసిగిపోయారు. అందుకే బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోనే కాదు అన్ని చోట్లా ఇలాంటి ఎమ్మెల్యేలు తమ మనసులో ఉన్నది వెల్లడించబోతున్నారు. జగన్ తో ఉంటే తమకు కూడా కష్టమేనని అందరికీ అర్థమవుతోంది" అంటూ టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య బీబీసీతో అన్నారు.

"ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నా ఎందుకు స్పందించడం లేదు. ఇంటిలిజెన్స్ చీఫ్‌ సీతారామాంజనేయులు మీద చర్యలు తీసుకోవాలి. అప్రజాస్వామికంగా సాగుతున్న ధోరణికి సీఎం బాధ్యత వహించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ వైఖరి సహించలేని ఇంకా చాలామంది అసంతృప్తులు బయటపడతారంటూ వర్ల రామయ్య అన్నారు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి

ఫొటో సోర్స్, Balineni Srinivasa Reddy/Facebook

‘టీడీపీలో చేరాలనుకున్నారు’

నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిణామాలపై వైఎస్సార్సీపీ దృష్టి పెట్టింది. పార్టీ సమన్వయ కర్త బాలినేని నెల్లూరు‌లో మంత్రి కాకాణితో భేటీ అయ్యారు. బుధవారం నాడు తాడేపల్లి‌లో పార్టీ అధినేతతో సమావేశం ఉంటుందని మీడియాకు తెలిపారు.

"శ్రీధర్ రెడ్డి టీడీపీ‌లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పోయే వాడు పోకుండా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎందుకు? మా దగ్గర టికెట్ రాదనుకున్న వారే అటు పోతున్నారు. శ్రీధర్ రెడ్డి కన్నా ఎక్కువ మార్లు గెలిచిన వాళ్ళకి కూడా మంత్రి పదవులు రాలేదు. నా పదవి కూడా పోయింది. అయినా పార్టీ కోసం పనిచేస్తున్నా" అంటూ బాలినేని వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ తో సమావేశం తర్వాత నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్‌ని నియమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వెంకటగిరిలో ఎమ్మెల్యే గా ఆనం ఉండగానే కొత్త ఇంచార్జ్‌ని తెరమీదకి తెచ్చిన చందంగా నెల్లూరు రూరల్‌లో కూడా జరుగుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆనం రామనారాయణరెడ్డి కూడా ఆరోపణలు చేశారు. సొంత పార్టీ వాళ్ళే ట్యాపింగ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి అంటూ ఆయన వాపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)