ఫిన్‌లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రీతి రాజేశ్వరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చదువులు అనగానే, లక్షల్లో ఫీజులు…అవి కట్టలేని తల్లిదండ్రులు; బరువైన పుస్తకాలు... అవి మోయలేని పిల్లలు; బట్టీలు పట్టించే ఉపాధ్యాయులు... ర్యాంకుల వెంట పరుగులు తీసే విద్యార్థులు గుర్తొస్తారు.
ఇవేవీ లేకుండా ఆడుతూ పాడుతూ, తల్లిదండ్రులకు పైసా ఖర్చులేకుండానే....చదువులో శెభాష్ అనిపించుకునే విద్యార్థులు ఉన్నారంటే మీరు నమ్మాల్సిందే.
ఎందుకంటే.. ఫిన్‌లాండ్‌లో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఉన్నతవిద్యలో అగ్రస్థానంలో ఈ నార్డిక్ దేశం అనుసరిస్తున్న ఉత్తమ విద్యావిధానం ఫలితం అది.
తాజాగా అక్కడ విధానాలపై అధ్యయనానికి తమ టీచర్లును పంపించాలనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదన పంపడం, దీన్ని మరోసారి పరిశీలించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వెనక్క పంపడంపై చర్చ జరుగుతోంది.
ఇంతకీ ఫిన్‌లాండ్ విద్యావిధానం ప్రత్యేకత ఏమిటి? దీనిపై చాలా దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, Getty Images
అదీ ప్రత్యేకత..
అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లో గత 20 ఏళ్లుగా ఫిన్‌లాండ్ విద్యార్థులదే పైచేయి. అందుకే అక్కడి విద్యావిధానం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచమంతటా పెరుగుతోంది.
దీంతో దిల్లీ నుంచి కూడా ఓ టీచర్ల బృందం అక్కడకు వెళ్లి, అక్కడి విద్యావిధానంపై అధ్యయనం చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశ జనాభాలో విద్యావంతుల శాతం ఎక్కువగా ఉండే దేశాల్లో ఫిన్‌లాండ్ 8వస్థానంలో ఉంది. హైస్కూలు విద్యను పూర్తి చేసిన వారు ఎక్కువగా ఉన్న దేశం కూడా ఇదే.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహించిన గ్లోబల్ కాంపిటిటివ్ స్టడీ ర్యాంకుల్లో అత్యుత్తమ విద్యావిధానం ఉన్న దేశంగా నిలిచింది ఫిన్‌లాండ్.
దాదాపు 50 ఏళ్ల క్రితం ఫిన్‌లాండ్ ప్రభుత్వం విద్యావిధానంలో సమూలంగా మార్చిన ఫలితమే ఈ మార్పు అంటారు విద్యారంగ నిపుణులు.
పెరుగుతున్న జీవన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలనే నినాదంతో దీన్ని రూపొందించారు. ఇది పూర్తిగా వికేంద్రీకృత విద్యావ్యవస్థ.

చదువుల్లో ఏం ఉంటాయి? ఏం ఉండవు?
- అక్కడ ఏడాది చివరలో తప్పనిసరిగా జరిగే ప్రామాణిక పరీక్షలు అసలు ఉండవు.
- డిటెన్షన్ పద్ధతి, అంటే ఫెయిలైన విద్యార్థులను పై తరగతులకు వెళ్లకుండా ఆపెయ్యడం ఉండనే ఉండదు.
- ర్యాంకులు, గ్రేడ్లు ఉండవు, పోటీలు ఉండవు, పోల్చిచూడటాలూ ఉండవు. పోటీతత్వానికి బదులుగా టీం వర్క్, టీం స్పిరిట్, పరస్పర సహకారం వంటి విలువలు నేర్పిస్తారు.
- హైస్కూల్ చివరి సంవత్సరంలో మాత్రమే ఒక్క పరీక్ష ఉంటుంది.
- పాఠానికి, పాఠానికి మధ్య విద్యార్థులకు 15 నిమిషాల ఆటవిడుపు ఉంటుంది.
- 7 ఏళ్ల వయసు దాకా బడికి వెళ్లడం తప్పనిసరేం కాదు. అంటే చిన్న వయసు నుంచే పిల్లలపై ఒత్తిళ్లు ఉండవన్న మాట.
పునాది రాళ్లు గట్టిగా ఉండాలనే సూత్రాన్ని పాటిస్తుంది ఫిన్‌లాండ్. అందుకే బేసిక్స్‌పై పట్టుసాధించేలా పిల్లలకు అవకాశాన్ని కల్పిస్తుంది.

ఫిన్‌లాండ్ విద్యావిధానం విశేషాలేంటి?
ఫిన్‌లాండ్ విద్యా విధానంలో నిర్బంధ విద్యకు ముందు బాల్యవిద్య, బాలల సంరక్షణను కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది.
మొదటి ఏడాది నుంచి 6 ఏళ్ల వరకూ ప్రీప్రైమరీ విద్యను 2015 నుంచి తప్పనిసరి చేశారు.
ఇక పిల్లలకు ఏడేళ్ల వయసు నుంచి 16ఏళ్ల వయసు వచ్చే వరకూ.. అంటే 9 ఏళ్ల పాటు నిర్బంధ ప్రాథమిక విద్య అందిస్తారు.
ఆపై అప్పర్ సెకండరీ విద్య - ఇందులో సాధారణ విద్యే కాకుండా వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కూడా ఉంటాయి.
ఉన్నత విద్యను యూనివర్సిటీల్లో లేదా అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీల్లో అభ్యసించాలి. ఆపై వయోజన విద్యను అభ్యసించొచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఈ విద్యావిధానం ఎందుకు మెరుగైంది?
లైఫ్ లాంగ్ లెర్నింగ్.. అంటే జీవితాంతం విద్యాభ్యాసం, ఉచిత విద్య అనే రెండు సూత్రాలపై ఆధారపడి అక్కడి విద్యావిధానం నడుస్తుంది.
ఓఈసీడీ అందించిన వివరాల ప్రకారం, ఫిన్‌లాండ్‌లో విద్యార్థులకు ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా చాలా తక్కువ హోం వర్క్ ఉంటుంది. అది సరాసరి అరగంట మాత్రమేనట.
అక్కడ ట్యూషన్స్ కూడా ఉండవు. వారానికి 20 గంటలు మాత్రమే క్లాసులుంటాయి. అంతే కాదు...ఫిన్‌లాండ్‌లో ప్రతి విద్యార్థి కనీసం 2, 3 భాషలు మాట్లాడగలరంటే అక్కడి విద్యావిధానం గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకూ, ఫిన్‌లాండ్ వాసులతో పాటు ఈఈఏ అంటే యూరోపియన్ ఎకానమిక్ ఏరియాలోని 30 దేశాలకు చెందిన వారెవరైనా ఇక్కడ ఉచిత విద్యపొందొచ్చు. అంటే.. విద్యను అందరికీ సమాన హక్కుగా భావిస్తారు.

ఫొటో సోర్స్, Thinkstock
ఉపాధ్యాయులకూ స్వేచ్ఛ
ఫిన్నిష్ ఉపాధ్యాయులకు స్వయంప్రతిపత్తి ఉంటుంది. అంటే పై అధికారులు చీటికీ మాటికీ తలదూర్చరు.
అయితే వారికి ఆన్-జాబ్ ట్రైనింగ్‌తో పాటు, టీచింగ్ మెథడ్స్‌పై పూర్తి స్థాయి శిక్షణను పక్కాగా అందిస్తారు.
సాధారణంగా మాస్టర్స్ డిగ్రీతో పాటు, టీచింగ్ స్కూల్స్ నుంచి ఉన్నత విద్యార్హతలుంటేనే ఉద్యోగం వస్తుంది.
అక్కడ టీచర్ ఉద్యోగం రావాలంటే ఇక్కడ ఐఏఎస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేంతగా కష్టపడాల్సి ఉంటుందనుకోవచ్చు.
ప్రభుత్వ ఖర్చులో భారీ వ్యత్యాసం
ఫిన్‌లాండ్‌లో ఒకే రకమైన పాఠశాలలు ఉండటం, ప్రైవేటు పాఠశాలలను అనుమతించకపోవడం, విద్య వ్యాపారీకరణ జరగకపోవడం, విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండటం వల్లనే అది ఆదర్శంగా మారిందని ఉపాధ్యాయ సంఘం పూర్వ నేత ఏ నరసింహా రెడ్డి బీబీసీతో అన్నారు. అదే భారత్‌లో చూస్తే, పదహారు రకాల పాఠశాలలున్నాయని ఆయనన్నారు.
వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఫిన్‌లాంలో 2020లో విద్యపై జీడీపీలో 5.9 శాతం ఖర్చు చేయగా, భారత్ 4.5 శాతం ఖర్చు చేసింది.
విద్యను వ్యాపారంగా మార్చకుండా, ప్రభుత్వ ఖర్చును పెంచడం ద్వారానే ‘భావి భారత పునాదులు తరగతి గదుల్లోనే నిర్మాణమవుతాయి’ అని విద్యావేత్త రజినీ కొఠారీ ఒకప్పుడు చెప్పిన మాటలు నేడు నిజమవుతాయంటున్నారు విద్యారంగ నిపుణులు.
ఇవి కూడా చదవండి:
- భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
- బీబీసీ మోదీ డాక్యుమెంటరీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దిల్లీలోని జేఎన్‌యూలో డాక్యుమెంటరీ ప్రదర్శనపై నిరసనలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదు?
- 8 ఏళ్ల వయసులోనే సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కూతురు...ఈ నిర్ణయంపై ఎవరేమన్నారు?
- సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లూ... జర భద్రం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















