ఫిలిప్పీన్స్: విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా చిత్రమైన టోపీలు... వైరల్ అవుతున్న ఫోటోలు

ఫొటో సోర్స్, MARY JOY MANDANE-ORTIZ
కాలేజీ ఎగ్జామ్స్ సమయంలో ‘యాంటీ చీటింగ్ క్యాప్’లుగా పిలుస్తున్న టోపీలను ధరించిన విద్యార్ధుల ఫొటోలు ఫిలిప్పీన్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. వీటి గురించి దేశవ్యాప్తంగా సరదాగా చెప్పుకుంటున్నారు.
ఫిలిప్పీన్స్‌లోని లెగాజ్పి నగరానికి చెందిన ఒక కాలేజీలో పరీక్షల సందర్బంగా విద్యార్థులు ఇతరుల పేపర్‌లను చూడకుండా తలకు ఇలాంటి టోపీలు ధరించాలని కాలేజీ నిర్వాహకులు కోరారు.
అట్టలు, కోడిగుడ్డు ట్రేలు, ఇతర రీసైక్లింగ్ వస్తువులతో ఇంట్లో తయారుచేసిన ఈ టోపీలను ధరించడంపై చాలామంది రకరకాలు స్పందించారు.

ఫొటో సోర్స్, MARY JOY MANDANE-ORTIZ
తమ దగ్గర చదివే విద్యార్ధుల్లో నిజాయితీని పెంచడానికి ఈ సరదా మార్గాన్ని ఎంచుకున్నట్లు బికోల్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మేరీ జాయ్ మండేన్-ఓర్టిజ్ అన్నారు.
''ఈ ఆలోచన చాలా ప్రభావవంతంగా ఉంది'' అని ఆమె అన్నారు.
అక్టోబర్ మూడో వారంలో కాలేజీలో వందల మంది విద్యార్థులు హాజరైన మిడ్ టర్మ్ పరీక్షలలో ఈ విధానాన్ని అమలు చేశారు.
పేపర్లతో సాదాసీదా డిజైన్లతో ఇలాంటి క్యాప్‌లు తయారు చేసుకుని తీసుకురావాల్సిందిగా తాము విద్యార్ధులను కోరామని ప్రొఫెసర్ మండేన్-ఓర్టిజ్ అన్నారు.

ఫొటో సోర్స్, MARY JOY MANDANE-ORTIZ
అంతకు కొన్నేళ్ల కిందట థాయ్‌లాండ్‌లో నిర్వహించిన ఇలాంటి ప్రయోగాల నుంచి తాను ప్రేరణ పొందినట్లు ఆమె వెల్లడించారు.
2013లో, బ్యాంకాక్‌లోని యూనివర్సిటీ విద్యార్థులు ఇయర్ ఫ్లాప్(చెవుల వరకు కప్పి ఉంచే టోపీ)లు ధరించి పరీక్ష పత్రాలు తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. విద్యార్ధులు చూపు పక్కకు తిప్పకుండా చెవుల దగ్గర పేపర్‌లను అడ్డంగా పెట్టినట్లు ఈ ఫొటోలో కనిపిస్తుంది.
‘‘మా కాబోయే ఇంజినీర్లు ఈ ఆలోచనను ఒప్పుకున్నారు. అనుసరించడానికి సిద్ధపడ్డారు. ఏదైనా పనికిరాని వస్తువుతో కేవలం అయిదు నిమిషాల సమయంలో ఇలాంటి క్యాప్‌లను తయారు చేసుకోవచ్చు'' అని ప్రొఫెసర్ మండేన్-ఓర్టిజ్ అన్నారు.
మరికొందరు దీన్ని మరింత సింపుల్‌గా మార్చడానికి టోపీలు, హెల్మెట్‌లు, హాలోవీన్ మాస్క్‌ల లాంటివి వాడారని ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, MARY JOY MANDANE-ORTIZ
విద్యార్ధులు ఇలా మాస్కులు, తలపాగలు, టోపీలు ధరించిన ఫొటోలు ప్రొఫెసర్ మండేన్-ఓర్టిజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా వైరల్ అయ్యాయి. చాలామంది వీటిని లైక్ చేశారు.
ఫిలిప్పీన్ మీడియా అవుట్‌లెట్‌లలో విస్తృతమైన కవరేజి లభించింది.
దీంతో దేశంలోని చాలా స్కూళ్లు, కాలేజీలకు ఇది ప్రేరణగా నిలిచింది.
తమ దగ్గర చదువుకుంటున్న పిల్లలు ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలను ప్రదర్శించారని, కఠిన పరీక్షా పరిస్థితులు ఉంటాయని తెలిసి మరింత కష్టపడి చదివారని ప్రొఫెసర్ మండేన్-ఓర్టిజ్ అన్నారు.
చాలామంది వేగంగా కూడా పరీక్ష రాయడం పూర్తి చేశారని, ఈ సంవత్సరం ఒక్కరు కూడా కాపీ కొడుతూ పట్టుబడలేదని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
- రిషి సునక్: బ్రిటన్ ప్రధాని రేసులో నంబర్ వన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













