CUCET 2022: సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తెలుగు విద్యార్థులకు లాభమా నష్టమా?

దిల్లీ యూనివర్శిటీ

ఫొటో సోర్స్, du.ac.in

ఫొటో క్యాప్షన్, దిల్లీ యూనివర్శిటీ
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకి చెందిన అలతి ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డులో ఎంపీసీ గ్రూపు చదివారు. ఆమెకి ఇంటర్మీడియేట్‌లో 87% మార్కులొచ్చాయి. 2018లో ఇంటర్ పాస్ అయ్యారు.

ఆమె దిల్లీలో హ్యుమానిటీస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరాలని అనుకున్నారు. కానీ, ఆమెకు దిల్లీ కాలేజీల్లో సీటు వస్తుందో లేదోననే భయం ఉండేది.

దిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ - బీఏ కోర్సుల్లో సీటు దొరకాలంటే 12వ తరగతిలో కనీసం 99శాతం మార్కులు ఉండాలి. ఇదే ఆమె భయానికి కారణం.

ఆమె దిల్లీ యూనివర్సిటీ కాలేజీలకు అప్లై చేశారు. చివరకు ఆమెకు నాల్గవ కట్ అవుట్‌లో దౌలత్ రామ్ కాలేజీలో బీఏ ఇంగ్లీష్ హానర్స్‌లో సీటు వచ్చింది.

"సీటు వచ్చేవరకూ ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలియక చాలా ఒత్తిడికి గురయ్యాను" అని అలతి బీబీసీకి చెప్పారు.

అలతి

ఫొటో సోర్స్, Alati Y

ఫొటో క్యాప్షన్, అలతి

దేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలన్నిటికీ ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని సోమవారం యూజీసీ ప్రకటించింది.

అంటే దేశంలో ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు ఒకే కామన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరీక్షను జులై మొదటి వారంలో నిర్వహిస్తామని యూజీసీ చైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీలు కూడా సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్‌లో ఒకటి, తెలంగాణలో మూడు సెంట్రల్ యూనివర్సిటీలున్నాయి.

సీట్లు ఎలా వస్తాయి?

ఎంట్రన్స్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల్లో సీట్లు వస్తాయి. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్కులకు ప్రాధాన్యత ఉండదని జగదీశ్ కుమార్ చెప్పారు.

అయితే, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు అర్హత కోసం మార్కులను పరిగణించవచ్చని తెలిపారు.

వివిధ రాష్ట్రాల్లో ఉన్న బోర్డులు 12వ తరగతిలో మార్కులు ఇచ్చే పద్ధతి వేర్వేరుగా ఉంటుంది. కొన్ని బోర్డులు పేపర్లు దిద్దే పద్ధతి సులభంగా ఉంటే కొన్ని చోట్ల చాలా కష్టతరంగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితిని అలతి కూడా ఎదుర్కొన్నారు. ఆమెకు ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్‌లో రెండు పేపర్లు ఉంటే దిల్లీలోని ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్కలా స్కోర్ చూసేవారని చెప్పారు.

"కొన్ని కాలేజీలలో స్కోర్ కోసం ఒక పేపర్ మార్కులను మాత్రమే పరిగణించేవారు" అని చెప్పారు.

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత ఎన్‌టిఏ ఇచ్చిన స్కోర్ ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. కామన్ కౌన్సెలింగ్ ఉండదు.

అమ్మాయి కాలేజీ స్టూడెంట్

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు విద్యార్థులకు ఎంత వరకు ప్రయోజనం?

ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తెలుగు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చదని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్‌కి చెందిన ఎన్ నారాయణ అన్నారు.

"నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో పని చేసే టీచర్లలో 90% మంది ఉత్తరాది వారే ఉండటం గమనించాలి" అని అన్నారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వల్ల కూడా ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని వల్ల ఏదో ఒక వర్గమే అధిక సీట్లను పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌కు అంతమంది వైద్య విద్యార్థులు ఎందుకు వెళ్లారు?

ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేశ్ పట్నాయక్ కూడా నారాయణ అభిప్రాయంతో ఏకీభవించారు.

"ప్రతీ విశ్వవిద్యాలయానికీ ఒక స్వయంప్రతిపత్తి ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్శిటీలు సొంత చట్టాలతో ఏర్పడ్డాయి. అవి యూజీసీ చట్టాలతో వచ్చినవి కావు. వాటి అడ్మిషన్ల విషయంలో నిర్ణయం హక్కు వారికే ఉంటుంది. అడ్మిషన్ పరీక్షలను యూజీసీ టేకోవర్ చేయడం ఒక రకంగా వారి స్వయం ప్రతిపత్తిని నియంత్రించడమే" అని రమేశ్ పట్నాయక్ అన్నారు.

"ప్రతీ యూనివర్సిటీకి సొంత కోర్సులు ఉంటాయి. యూజీసీ ఉమ్మడి పరీక్ష పెడితే వారి వారి సొంత కోర్సులను ఆ ఉమ్మడి పరీక్షకు అనుగుణంగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీల ప్రత్యేకమైన కోర్సుల కోసం కాకుండా ఉమ్మడి పరీక్ష కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది" అని అన్నారు.

దీంతో ఆ పరీక్ష కోసం మిగిలిన వారంతా తమ తమ ఇంటర్, డిగ్రీ సిలబస్ కూడా మార్చాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. ఇదంతా తిరిగి విద్య కేంద్రీకరణ అవడానికి బాటలు వేస్తుంది" అని అన్నారు.

అలతి మాత్రం ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ కాలేజీలలో చేరాలనుకునే విద్యార్థులకు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.

"ఒక ఎంట్రన్స్ పరీక్షకు సిద్ధం అయితే, ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో చేరే అవకాశముంటుంది" అని అన్నారు.

"కాలేజీలు మార్కులను ఎలా పరిగణిస్తాయో అనే ఒత్తిడి తగ్గుతుంది" అని చెప్పారు.

పెన్ పేపర్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్ష ఎలా ఉంటుంది?

ఈ ఎంట్రన్స్ పరీక్ష 12వ తరగతి ఎన్‌సీఈఆర్‌‌టీ పుస్తకాల సిలబస్ ఆధారంగా ఉంటుందని తెలిపారు. అయితే, ప్రతీ తప్పు జవాబుకు ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది.

ఈ పరీక్షను మొత్తం 13 భాషల్లో రాయవచ్చు. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీస్, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లీష్‌లో రాయవచ్చు.

పరీక్ష రెండు విభాగాల్లో ఉంటుంది. ఒక విభాగంలో లాంగ్వేజ్‌తో పాటు విద్యార్థులు ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. రెండవ విభాగంలో విద్యార్థులు ఎంపిక చేసుకున్న మిగిలిన నాలుగు సబ్జెక్టులపైన ప్రశ్నలుంటాయి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కంప్యూటర్ ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

ఏప్రిల్ మొదటి వారంలో పరీక్షకు సంబంధించిన అప్లికేషన్ విండోను తెరుస్తారు.

విద్యార్థులు

రిజర్వేషన్లు వర్తిస్తాయా?

మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను అమలు చేయాలి.

అయితే, ఈ యూనివర్సిటీ యాజమాన్యాలు ఇప్పటి వరకు ఈ విధానాన్ని సమర్ధిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు.

యూజీసీ నిర్ణయం యూనివర్సిటీల్లో అమలులో ఉన్న రిజర్వడ్ సీట్ల కోటాపై ఎటువంటి ప్రభావం చూపించదు. కానీ, కామన్ టెస్ట్‌లో స్కోర్ సాధించిన వారికి సీట్లు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే, రిజర్వేషన్ ఉన్న వారు కూడా కచ్చితంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే.

యూనివర్సిటీల రిజర్వేషన్ విధానాలు, ఆర్డినెన్సుల్లో ఎటువంటి మార్పు ఉండదని యూజీసీ చైర్మన్ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ విద్యార్థులకు మాత్రం మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు లభిస్తాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వారికి వర్తించదు.

యూజీసీ నిర్ణయం ఒక వర్గం విద్యార్థులకే ఉపయోగపడుతుంది కానీ, మెజారిటీ విద్యార్థులకు ఉపయోగం ఉండదని రమేష్ పట్నాయక్ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, NATS స్కీమ్: ఉద్యోగం చేయకుండానే జాబ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ప్రభుత్వ పథకం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)