నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు.. సరికొత్త దారిలో కాఫీ వ్యాపారం

నమ్రత ఆస్థానా, మ్యాట్ చిత్తరంజన్

ఫొటో సోర్స్, Blue Tokai

ఫొటో క్యాప్షన్, నమ్రత ఆస్థానా, మ్యాట్ చిత్తరంజన్
    • రచయిత, ఆండ్రూ క్లారెన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణాది నుంచి ఉత్తరాది వచ్చిన చాలా మంది కాఫీ ప్రియులు అతి సాధారణమైన సమస్యనొకటి ఎదుర్కొంటూ ఉంటారు. కాఫీ ప్రియులంతా పొద్దున్న లేవగానే తాగే ఫిల్టర్ కాఫీ కరువును ఎదుర్కొంటూ ఉంటారు.

ఇలాంటి సమస్యనే చెన్నై నుంచి దిల్లీకి వచ్చిన మ్యాట్ చిత్తరంజన్, నమ్రత ఆస్థానా ఎదుర్కొన్నారు. వారు 2012లో చెన్నై నుంచి దిల్లీకి వచ్చారు.

చిత్తరంజన్ శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గర్లోనే తాజాగా గ్రైండ్ చేసిన కాఫీ గింజల పొడితో చేసిన సువాసన భరితమైన కాఫీ తాగేవారు. కానీ, దేశ రాజధాని దిల్లీలో మాత్రం తాజా కాఫీ తాగే పరిస్థితి ఆయనకు కనిపించలేదు.

అంతకు ఏడాది ముందు ముంబయిలో తొలి స్టార్ బక్స్ కాఫీ అవుట్‌లెట్ ప్రారంభమైంది. అక్కడ కాఫీ ప్రియులు లైన్లు కట్టారు.

దిల్లీలోని ఒక సూపర్ మార్కెట్‌లో దొరికిన కాఫీ పొడి కొన్ని నెలల క్రితమే గ్రైండ్ చేసి ప్యాక్ చేసినట్లు, దాని తాజాదనం కోల్పోయినట్లు అనిపించింది. దీంతో వాళ్లు ఒక అవకాశాన్ని చూశారు.

భారతదేశంలో లభించే అత్యుత్తమ కాఫీ పొడి చాలా వరకు ఎగుమతి అవుతోందని చిత్తరంజన్ దంపతులు అర్ధం చేసుకున్నారు.

"మేము కాఫీ ఎస్టేట్‌లకు కాల్స్ చేసి అపాయింట్‌మెంట్లు తీసుకున్నాం. వాళ్ళు ఎగుమతి చేసే కాఫీ గింజలను మాకు అమ్మమని అడిగాం" అని చిత్తరంజన్ చెప్పారు.

2013 ప్రారంభంలో దంపతులిద్దరూ కలిసి బ్లూ టోకాయ్ కాఫీ రోస్టర్స్ అనే బ్రాండ్ మొదలుపెట్టారు. చిత్తరంజన్ కాఫీ బీన్స్ గ్రైండ్ చేస్తే, ఆస్తానా వాటిని ఆన్‌లైన్‌లో అమ్మేందుకు ప్యాకేజింగ్ చేసేవారు.

ప్రస్తుతం ఈ బ్రాండ్ అర్బన్ మిల్లీనియల్స్ ఇష్టంగా తాగే బ్రాండ్‌గా మారింది. భారతదేశంలో ఈ బ్రాండ్ కి 50 అవుట్ లెట్లు ఉన్నాయి. వారికిప్పుడు కొన్ని వేల మంది కస్టమర్లున్నారు.

ఇప్పటి వరకు 1000 టన్నులకు పైగా కాఫీని రోస్ట్ చేసి, సుమారు 30 లక్షల కప్పుల కాఫీని అమ్మారు. అత్యుత్తమ ఎగుమతి రకపు కాఫీని తమకు అమ్మమని కాఫీ వారు ఇకపై ఉత్పత్తిదారులను బతిమాలే పని లేదు.

కాఫీ బీన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాఫీ బీన్స్

తాజాగా లభించే కాఫీ కోసం డబ్బులను ఖర్చు పెట్టేందుకు ఇష్టపడే వినియోగదారులు దేశంలో ఉన్నారని ఆ దంపతులు గ్రహించారు.

భారతదేశంలోని స్పెషాలిటీ కాఫీ మార్కెట్ లో కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత బ్లూ టోకాయ్‌దేనని రెండవ తరానికి చెందిన కాఫీ ఎగుమతి వ్యాపారి రోహన్ కురియన్ చెప్పారు.

"కాఫీ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చని ఈ బ్రాండ్ ను చూసాక చాలా మందికి అర్ధమయింది" అని అన్నారు.

ఆ తర్వాత థర్డ్ వేవ్ కాఫీ, స్లీపీ ఔల్ లాంటి బ్రాండులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. కానీ, ఈ పరిశ్రమ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని విశ్లేషకులు అంటున్నారు.

"ఇలాంటి 1000 కేఫెలు ఉన్నా కూడా, మన పక్కనే ఉండే కాఫీ కేఫె కోసమే చూస్తాం" అని టెక్నోపాక్ అడ్వైజర్స్‌లో కన్సల్టెంట్‌గా పని చేస్తున్న అరవింద్ సింఘాల్ అన్నారు.

దేశంలో సుమారు 2 డజన్ల కాఫీ స్టార్ట్ అప్స్ ఉన్నాయి. కానీ, అవన్నీ ప్రధాన మార్కెట్ స్రవంతిలోకి అడుగుపెట్టలేదు.

1991లో భారతదేశంలో ఆర్ధిక సంస్కరణలు మొదలయ్యే సమయానికి, కాఫీ ఉత్పత్తిదారులు కాఫీ గింజలను కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు అమ్మేవారు. ఆ సంస్థ కాఫీని వేలంలో కొనుగాలుదారులకు అమ్మేది.

కానీ, 1991 తర్వాత కాఫీ ఉత్పత్తిదారులే సొంతంగా తమ కాఫీని అమ్ముకునే పరిస్థితి రావడంతో, వారే సొంతంగా విదేశాలకు వెళ్లడం మొదలుపెట్టారు.

"భారతదేశంలో పండించే కాఫీ నాణ్యతను పెంచే విధానాల గురించి నేర్చుకోవడం మొదలుపెట్టారు" అని కురియన్ చెప్పారు.

కర్నాటకలోని చిక్మగళూరులో వారికి 80 సంవత్సరాల పురాతనమైన కాఫీ ఎస్టేట్ ఉంది.

కాఫీ గింజల ఉత్పత్తి పెరిగింది, కానీ, అందులో చాలా వరకూ ఎగుమతి అయిపోతుంది.

1993లో భారతదేశం 60 కేజీలతో కూడిన 21లక్షల కాఫీ బ్యాగులను ఎగుమతి చేసింది. 2010నాటికి వీటి ఎగుమతి 60 కేజీలతో కూడిన 46లక్షల సంచులకు చేరింది.

కాఫీ తోటలు

ఫొటో సోర్స్, Blue Tokai

ఫొటో క్యాప్షన్, కాఫీ తోటలు

కాఫీ మార్కెట్ ప్రపంచానికి తెరుచుకోవడంతో, వీజీ సిద్ధార్థ లాంటి వ్యాపారస్థులు కెఫే కాఫీ డే లాంటి కాఫీ చెయిన్ లను ప్రారంభించారు. దీంతో, వేలాది మంది భారతీయులు కేపూచినో కాఫీ రుచిని ఆస్వాదించడం మొదలుపెట్టారు.

1996లో బెంగళూరులో మొదలుపెట్టిన సీసీడీ విద్యార్థులను, కార్పొరేట్ ఉద్యోగులను బాగా ఆకర్షించింది.

2011నాటికి సీసీడీ కెఫేలు 1000కి పెరిగాయి. ఇదొక కొత్త కాఫీ సంస్కృతికి దారి తీసింది.

ఒక సంవత్సరం తర్వాత దేశంలోకి స్టార్ బక్స్ ప్రవేశించింది. ఆ తర్వాత నెమ్మదిగా కోస్తా కాఫీ వచ్చింది.

భారతీయులు మంచి కాఫీ కోసం ఎంత ధరైనా చెల్లించడానికి సిద్ధమయ్యారు.

కానీ, కాఫీ ఔట్లెట్ల సంఖ్య ఎంత పెరిగినా కూడా, భారతీయులు కాఫీ తాగే అలవాట్లలో పెద్దగా మార్పు రాలేదు. చాలా మంది కాఫీ డికాక్షన్, పాలు, పంచదారతో కలిపి తయారు చేసే ఫిల్టర్ కాఫీనే ఇష్టపడతారు.

బ్లూ టోకాయ్ అమ్మే కేపుచినో రకం ఈ రుచికి కాస్త దగ్గరగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, 14 ఏళ్లుగా రెండుపూటలా ఇంటి వద్దకే భోజనం.. ఆకలి అంటే అన్నం వండి క్యారేజ్ పంపిస్తారు..

భారతీయులు పాలతో చేసే తీపి ఇన్స్టంట్ కాఫీని కూడా ఇష్టపడతారు. ఆ అభిరుచే అర్మాన్ సూద్, అజయ్ థన్డి, అశ్వజీత్ సింగ్ కి స్ఫూర్తిని కలిగించింది. 2016లో స్లీపీ ఔల్ ను మొదలుపెట్టారు.

ఇన్స్టంట్ కాఫీని ఇష్టపడే వారి కోసం తమ బ్రాండ్‌ను ఆన్‌లైన్‌లో అందించాలని అనుకున్నారు.

"భారతదేశంలో ఫ్రెంచ్ ప్రెస్ లేదా ఏరో ప్రెస్ ద్వారా కాఫీని మరిగించేందుకు సిద్ధంగా లేరు. వారికి కాస్త సరళంగా దొరికే కాఫీ కావాలి" అని వారన్నారు.

వారు తమ ప్రొడక్ట్ అమ్మేందుకు ఎస్టేట్ పేర్లు, ఆకర్షించే ప్రకటనల కంటే కూడా సౌకర్యం మీద దృష్టి పెట్టారు.

కోల్డ్ బ్రూ కాఫీ ప్యాకెట్లు హిట్ అయిన తర్వాత హాట్ బ్రూ సాచెట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఇవి టీ బ్యాగ్‌ల మాదిరిగా వేడి నీటిలో డిప్ చేసుకుని తాగవచ్చు.

వారి బ్రాండ్‌ను ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2000 స్టోర్లలో అమ్ముతారు.

అర్మాన్ సూద్, అజయ్ థన్డి, అశ్వజీత్ సింగ్

ఫొటో సోర్స్, Sleepy Owl

ఫొటో క్యాప్షన్, అర్మాన్ సూద్, అజయ్ థన్డి, అశ్వజీత్ సింగ్

ప్రత్యేక తరహా కాఫీకి పెరిగిన డిమాండ్

కాఫీకి దేశంలో డిమాండ్ పెరగడంతో కాఫీ ఉత్పత్తిదారుల పరిస్థితి కూడా మారింది.

2012లో కురియన్ కాఫీ గింజలను కేవలం స్వీడన్, నార్వే, యూఎస్‌కు మాత్రమే ఎగుమతి చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆయన ఎగుమతి రకం అరబికా గింజలను బ్లూ టోకాయ్‌కి అమ్ముతున్నారు.

"చిత్తరంజన్ దంపతులు, ఒకే కాఫీ తోటలో పండే ప్రత్యేకమైన కాఫీని అమ్మాలనే విషయంపై దృష్టి పెట్టారు. కాఫీని అత్యధిక ధరకు అమ్మడంలో ఉన్న ముప్పును తీసుకున్నారు. కానీ, ఆయన దృష్టి అంతా మంచి కాఫీ గురించి తెలిసిన ప్రత్యేకమైన మార్కెట్ పైనే ఉంది" అని కురియన్ అన్నారు.

అయితే, ఈ విషయంతో ఇతర కాఫీ ఉత్పత్తిదారులు ఏకీభవించలేదు. నాణ్యమైన, అధిక ధరతో కూడిన కాఫీని ధరల విషయంలో సున్నితంగా ఉండే భారతీయ మార్కెట్‌లో హిట్ అవ్వదని అభిప్రాయపడ్డారు.

రోహన్ కురియన్

ఫొటో సోర్స్, Rohan Kuriyan

ఫొటో క్యాప్షన్, రోహన్ కురియన్

"నేను మీకు కాఫీ అమ్ముతాను, కానీ దానిని చికరీతో కలిపి తక్కువ ధరకు అమ్మండి. లేదా మీరు వ్యాపారంలో విఫలమైపోతారు" అని ఒక కాఫీ ఉత్పత్తిదారుడు తనని హెచ్చరించిన విషయాన్ని చిత్తరంజన్ గుర్తు చేసుకున్నారు.

కానీ, చిత్తరంజన్ పందెంలో గెలిచారు.

ఆయనను మరికొంత మంది అనుసరించడం మొదలుపెట్టారు.

"పచ్చి కాఫీ బీన్లను సేకరించి సొంతంగా రోస్ట్ చేసుకోవడం ద్వారా వినియోగదారులకు తాజా కాఫీని అందించగలం" అని థర్డ్ వేవ్ కాఫీ సహవ్యవస్థాపకులు ఆయుష్ భత్వాల్ చెప్పారు.

ప్రస్తుతం కాఫీ ప్రియులు తాము తాగే కాఫీ బీన్స్ పండే ప్రదేశం, సేకరించే పద్ధతి , రోస్ట్ చేసే విధానం గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

"మా కాఫీ షాపుల్లో అమ్మే కాఫీని కాఫీ తోటల పేరుతో అమ్మడాన్ని చూసి కాఫీ ఉత్పత్తిదారులు గర్వంగా భావిస్తున్నారు" అని భత్వాల్ అన్నారు.

"కాఫీ ప్రస్తుతం లావాదేవీలతో కూడిన సామాజిక పానీయానికి మించిన స్థాయిని దాటింది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, అరకు కాఫీకి వందేళ్లు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)