గోంగూరకు రుచి ఇచ్చే పచ్చిమిర్చి తెలుగు నేలది కాదా... సమోసాలో బంగాళాదుంప ఏ దేశం నుంచి వచ్చింది?

మిర్చి భారత్ కు చెందిన పంట కాదు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మిర్చి భారత్ కు చెందిన పంట కాదు
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేడి వేడి అన్నంతో బంగాళ దుంపల వేపుడు, చాయ్‌తో ఆలూ సమోసా, పంజాబీ ధాబాలో వేడి వేడి ఆలూ కుల్చా, స్నేహితులతో కాలక్షేపం చేస్తూ తినే పావ్ భాజీ, ఆలూ చాట్, మసాలా దోశ, వడా పావ్, పూరీ కూర, చిన్నా,పెద్దా ఇష్టంగా తినే ఆలూ చిప్స్, ఇంకా ఎన్నో కూరల్లో, భారతీయుల వంటకాల్లో ప్రధానంగా కనిపించే, వినిపించే కాయగూర బంగాళాదుంప.

బంగాళాదుంపలతో పాటు టమాటా , పచ్చిమిర్చి, కేబేజీ, కాలిఫ్లవర్ లాంటి భారతీయ వంటకాల్లో మమేకమైపోయిన ఎన్నో ఆహార పదార్ధాలు, ఆపిల్ లాంటి పండ్లు భారతదేశానికి చెందినవి కాదంటే నమ్ముతారా?

ఇవే కాదు, విదేశాల నుంచి వచ్చి భారతీయ వంటల్లో కలిసిపోయి కొత్త రూపాన్ని సంతరించుకున్న కూరగాయలు చాలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న ఆహార సరఫరాల్లో 68.7%, ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో69.3 శాతం విదేశీ కాయగూరలేనని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.

వీటి చరిత్ర ఏంటి? ఇవి భారతదేశానికి ఎలా వచ్చాయి?

బంగాళాదుంప

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బంగాళాదుంప

బంగాళాదుంప ఎక్కడి నుంచి వచ్చింది?

బంగాళాదుంప దక్షిణ అమెరికాలోని 15వ శతాబ్ధం నుంచి పండిస్తున్న పంట అని చెబుతారు. 1537లో ఆండెస్ లోని ఒక గ్రామంలో స్పానిష్ ప్రజలు తొలిసారిగా బంగాళా దుంపను చూసినట్లు చెబుతారు.

కూరగాయల రాజుగా పేర్కొనే బంగాళాదుంపను తొలిసారిగా యూరోపియన్లు కేనరీ ఐలాండ్స్ లో 1567లో గుర్తించారు. దీనిని యూరోప్ లో 1580 - 1585 మధ్యలో ప్రవేశపెట్టినట్లు చరిత్ర చెబుతోందని దియా కోహ్లీ అనే రచయత ఒక ట్రావెల్ బ్లాగ్ లో పేర్కొన్నారు.

బంగాళాదుంప దక్షిణ అమెరికాలో పుట్టి యూరప్ కు పయనమై, 17వ శతాబ్దం నాటికి పోర్చుగల్ నావికుల ద్వారా భారతదేశానికి చేరింది.

అది మొదట్లో మలబార్ తీరానికే పరిమితమయింది. కానీ, బ్రిటిష్ పాలకులు ఉత్తరాదిలో కూడా దీని సాగును మొదలుపెట్టడంతో, దేశ వ్యాప్తంగా విస్తరించింది. 19వ శతాబ్దం మొదలయ్యే నాటికి పశ్చిమ బెంగాల్ లో దీనిని పండించడం పెరిగింది.

అయితే, పోర్చుగల్ నావికులు తొలుత భారతదేశానికి తీసుకుని వచ్చింది తీపి దుంపలని వీర్ సంఘ్వీ అనే విలేఖరి తన ఫుడ్ బ్లాగ్ లో పేర్కొన్నారు.

బంగాళాదుంప బెంగాలీ వంటకాల స్వరూపాన్నే మార్చేసిందని 'ది పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బెంగాలీ క్విజిన్" అనే వ్యాసంలో టేలర్ సేన్ ప్రస్తావించారు.

హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెంట్ గా (1797-1805) పని చేసిన జేమ్స్ కిర్క్ పాట్రిక్ కూడా బంగాళాదుంపలు భారతదేశంలో దొరకకపోవడంతో, వాటిని ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకోవడం గురించి వైట్ ముఘల్స్ పుస్తకంలో రచయత విలియం డార్లిమ్పిల్ ప్రస్తావించారు.

అంతర్జాతీయ వాణిజ్యం వల్ల, పాలకుల అవసరాల కొలదీ ఆహార పంటలను పండించడం విస్తృతం అయిందని విజయవాడకు చెందిన ఫుడ్ హిస్టోరియన్, డాక్టర్ పూర్ణ చందు చెప్పారు. ఆయన ఆయుర్వేద వైద్యులు కూడా. కృష్ణదేవరాయల కాలంలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్యంతో చాలా రకాల పంటలు, సుగంధ ద్రవ్యాలు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు వివరించారు.

15వ శతాబ్దం తర్వాత వచ్చిన పంటల వివరాలేవీ ఆయుర్వేద గ్రంధాల్లో నమోదు కాలేదని అంటారు.

బంగాళాదుంప చిప్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగాళాదుంప చిప్స్

చరిత్రలో బంగాళాదుంప?

15వ శతాబ్ధానికి చెందిన నిమత్ నామాలో కూడా ఖిల్జీ పాలకులకు ప్రీతి పాత్రమైన సమోసాల్లో బంగాళాదుంప లేదని తెలుస్తోంది.

నవాబ్ వాజిద్ అలీ షాను కల్‌కతాకు (ప్రస్తుత కోల్‌కతా) పంపినప్పుడు అవాధీ బిరియాని స్వరూపం కూడా రూపాంతరం చెందింది.

ఆయన ఆస్థాన వంటవాళ్లు మాంసం లోటును పూరించడం కోసం బంగాళాదుంపను వాడటం మొదలుపెట్టారు. ఇదే నేటి కోల్‌కతా తరహా బిరియానీకి మూలం అయిందని గోయ అనే జర్నల్లో ప్రచురించారు.

బెంగాలీ, ఒడియా, ఉత్తరాదిలో చాలా చోట్ల బంగాళాదుంప ప్రధాన ఆహారంగా కనిపిస్తుంది. ఆఖరుకు బిరియాని, చికెన్, మటన్, చేపల కూరల్లో కూడా బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో బంగాళాదుంప వాడతారు.

ప్రస్తుతం దీనిని దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో పండిస్తున్నారు. ఇది భారతదేశంలో వరి, గోధుమ, జొన్న తర్వాత అత్యధికంగా పండించే నాలుగవ పంట. ప్రపంచంలో చైనా, భారతదేశం, పోలండ్, అమెరికాలో అత్యధికంగా పండిస్తున్నారు.

1970లో 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్న బంగాళా దుంప 2003 నాటికి 25 మిలియన్ టన్నులకు చేరినట్లు ప్రభుత్వ వెబ్ సైట్ అగ్మార్క్ తెలుపుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు బంగాళాదుంపను ఆహారంలో వినియోగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

భారతదేశంలో కనీసం 100 కు పైగా వంటకాలు బంగాళాదుంపతో చేస్తారని ఫుడ్ నిపుణులు చెబుతున్నారు.

1995లో స్పేస్ షటిల్ కొలంబియాలో కూడా బంగాళా దుంప పండుతుందో లేదోనని నాసా, చైనా కూడా పరీక్షించి చూశారు. భూమికి అవతలమొదటిసారి పండించిన కూరగాయ కూడా ఇదేనని నాసా పేర్కొంది.

ఇది భూమి లోపల పండే పంట కావడంతో జైనులు మాత్రం దీనిని తినరు.

టమాటా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, టమాటా

టమాటా కూడా అంతే

భారతదేశంలోనే కాదు, తెలుగు వంటల్లో కూడా విరివిగా వాడే టమాటాలు భారతీయ పంట కాదంటే నమ్ముతారా? టమాటా చారు, పప్పుచారు, సాంబార్, కూరలు, ఆఖరికి టిఫిన్లలోకి పచ్చళ్లకు కూడా వాడే టమాటా అమెరికా నుంచి మన దేశానికి చేరింది.

ఈ పంట యూరోప్ వరకు పయనించి తిరిగి 1781 నాటికి అమెరికా చేరుకుంది. ఇది 20వ శతాబ్ధం మొదట్లోనే ప్రాచుర్యం పొందింది. టమాటా యూరోప్ నుంచి ఫిలిప్పీన్స్ మీదుగా ఆసియాలోకి ప్రవేశించిందని ఫుడ్ నిపుణులు చెబుతారు.

భారత్కు ఎలా వచ్చింది?

16వ శతాబ్దంలో పోర్చుగీస్ ద్వారా టమాటా భారత్ లోకి ప్రవేశించింది. అయితే, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ పంట 18వ శతాబ్ధంలో బ్రిటిష్ వారి రాకతో మరింత ఎక్కువగా పండించేందుకు ప్రోత్సహించారు. వీటిని పండించేందుకు భారత్ లో వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇది విస్తరించింది. ఉత్తరాఖండ్ ఈ పంటకు కేంద్రంగా మారింది.

"విదేశీయులు ఈ పంటలను తేవడంతో జాతీయవాద భావనలతో బంగాళాదుంపలు, టమాటాలు లాంటి కాయగూరలను తినవద్దని, విదేశీ ఆహారం అని చెబుతూ ఉండేవారని, కాలక్రమేణా వాటి ప్రయోజనాలను అర్ధం చేసుకోవడంతో ఇవన్నీ మార్కెట్లో విలీనమైపోయాయి" అని డాక్టర్ పూర్ణ చందు అంటారు.

మొదట్లో దేశంలో పండించే పంట కాస్త పులుపుగా ఉండేదని వీర్ సంఘ్వి తన వ్యాసాల్లో పేర్కొన్నారు.

టమాటా భారతీయ వంటకాల స్వరూపాన్నే మార్చేసింది. పనీర్, చికెన్ బటర్ మసాలా లాంటి మరెన్నో కూరల గ్రేవీలకు ప్రధానంగా టమాటాను వాడుతారు. అలా ఇది భారతీయ వంటకాల్లో ముఖ్యమైన కూరగాయగా మారిపోయింది.

అయితే, భారతదేశంలో దొరికే టమాటాలు మేలైనవి కావని వీర్ సంఘ్వీ అంటారు. అందుకే, విదేశాలకు వెళ్లిన ప్రతి సారి అక్కడ నుంచి టొమాటోలు తెచ్చుకుంటూ ఉంటానని ఆయన తన బ్లాగ్ లో రాశారు.

గోంగూర

ఫొటో సోర్స్, fb/Vani Murthy

ఫొటో క్యాప్షన్, గోంగూర

పచ్చిమిర్చి రాకతోనే ఆంధ్రుల గోంగూర పచ్చడి

అల్పాహారంలో ఉప్మా పోపు నుంచి పండుగ వంటలైన పులిహోర వరకు పచ్చిమిర్చి లేనిదే చాలా ఇళ్లల్లో వంట పూర్తి కాదు. భారతీయ వంటిళ్లల్లో కచ్చితంగా ఉండే పదార్ధాల్లో మిర్చి ఒకటి.

తెలుగు రాష్ట్రాల్లో అయితే, వంకాయ పచ్చిమిర్చి కారం, పచ్చిమిర్చి పచ్చడి, పచ్చిమిర్చి బజ్జీలు బాగా ప్రసిద్ధి.

మిర్చి గురించి వివరాలను "చిల్లీస్ - ది ప్రైమ్ స్పైస్ - ఏ హిస్టరీ" అనే అధ్యయన పత్రంలో డాక్టర్ ఇందు మెహతా అధ్యయన పత్రాన్ని ప్రచురించారు.

మిర్చి క్రీస్తు పూర్వం 7500లో లాటిన్ అమెరికా ప్రాంతంలోని న్యూ మెక్సికోలో పుట్టింది. గౌటేమాలలో క్రీస్తు పూర్వం 5000 ప్రాంతంలో పెరులో స్థానికులు మిర్చిని పండించినట్లు ఇందు మెహతా రాసిన అధ్యయనంలో తెలిపారు.

దీనిని ప్రధానంగా ప్రధాన పంటలను పక్షులు తినకుండా వాటిని కాపాడుకునేందుకు పెంచేవారని అంటారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్-WHO ఆహార చిట్కాలు

కొలంబస్ 1493లో తనతో పాటు పచ్చిమిర్చి విత్తనాలను స్పెయిన్ కు తీసుకుని వెళ్లారు. అక్కడ నుంచి మిర్చి యూరోప్ కు, ఆసియాకు విస్తరించింది. 16వ శతాబ్దం నుంచి దక్షిణ ఆసియాలో ఈ పంట పండించడం తీవ్రంగా పెరిగింది.

ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో పచ్చిమిర్చిని అధికంగా పండిస్తారు. ఈ మిర్చిని వాస్కోడగామా భారత్ కు తీసుకుని రాక ముందు భారతీయ వంటల్లో మిరియాలను మాత్రమే వాడేవారు.

జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ అనే వర్తకుడు పలావులో మిరియాలను విరివిగా వాడేవారని రాసుకున్నారు.

1590లో రచించిన ఐనీ అక్బరీ గ్రంథంలో అక్బర్ కొలువులో వండే 50 వంటకాల్లో కారం కోసం మిరియాలనే వాడినట్లు ప్రస్తావన ఉంది. ప్రస్తుతం మిరియాలను విదేశీయులు ఎక్కువగా వాడుతుంటే, భారతీయులు మిర్చిని ఎక్కువగా వాడుతున్నారని డాక్టర్ పూర్ణచందు అంటారు.

ఇవి ఎక్కడైనా పండించగల్గడంతో దేశ వ్యాప్తంగా పండించడం మొదలయిందని పాండే సింగ్ రాయ్ అనే రచయత రాసినట్లు "చిల్లీస్ - ది ప్రైమ్ స్పైస్ - ఏ హిస్టరీ" అనే అధ్యయన పత్రంలో డాక్టర్ ఇందు మెహతా పేర్కొన్నారు.

ప్రస్తుతం మిర్చిని అత్యధికంగా ఉత్పత్తి, వినియోగిస్తున్న దేశాల్లో భారతదేశం ప్రధానంగా ఉంది. దేశంలో పండిస్తున్న మొత్తం మిర్చిలో 30% ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రాంతంలో పండుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 400కు పైగా మిర్చి రకాలున్నాయి.

ఆంధ్రమాత అని వర్ణించే గోంగూర పచ్చడి మిర్చి రాకతోనే పుట్టిందని అంతకు పూర్వం చరిత్రను పరిశీలిస్తే, కేవలం గోంగూర పూల ప్రస్తావన కనిపిస్తుంది తప్ప పచ్చడి, కూరల రూపంలో కనిపించదని పూర్ణచందు చెప్పారు. కాలక్రమేణా గోంగూర లేకపోతే ఆంధ్ర వంటకాలు లేవన్నట్లు ప్రచారం జరిగిందని అంటారు.

11 -12వ శతాబ్ధంలో మరకం అనే ధాన్యం కొలిచే పాత్రకు గోంగూర పూలతో పూజ చేసినట్లు పాల్కుర్కి సోమనాధుడు తన రచనల్లో రాసినట్లు వివరించారు.

క్యాబేజీ

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన క్యాబేజీ

క్యాబేజి తొలి సారి ఇంగ్లాండ్ లో 14వ శతాబ్ధంలో పండించడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి ఇది ఆసియా, అమెరికాకు వెళ్ళిం దని ప్లాంటియా.కామ్ అనే వెబ్ సైటు పేర్కొంది.

14 నుంచి 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వర్తకులు దీనిని భారతదేశానికి తెచ్చారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

1541-42 మధ్యలో ఫ్రెంచ్ అన్వేషకుడు జాక్స్ కార్టియర్ అమెరికాకు తీసుకుని వెళ్ళాడు. దీంట్లో విటమిన్-సి అధికంగా ఉండటంతో సుదీర్ఘ నౌకా ప్రయాణాల్లో దీనిని పట్టుకుని వెళ్లేవారు.

నావికులకు తగిలిన గాయాలకు చికిత్స చేసేందుకు గాంగ్రీన్ లోనూ వీటిని 1769లో కెప్టెన్ కుక్ నౌకలో వాడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం, చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంలో కేబేజీ పండిస్తున్నారు. దీనిని కూరల్లో, సలాడ్ లలో, శాండ్విచ్ తయారీలో అనేక రకాలుగా వాడతారు.

గ్రీసు వారు, రోమన్లు దీనిని నల్ల సముద్ర ప్రాంతానికి తీసుకుని వచ్చారని అంటారు. అక్కడ బానిసలు 9వ శతాబ్దంలోనే దీనిని పండించేవారని చెబుతారు.

13వ శతాబ్ధం నుంచే దీనికి రాతపూర్వక చరిత్ర లభిస్తోంది. 1570లో యూరోప్ లో తొలి సారి రెడ్ క్యాబేజి కనిపించింది.

కానీ, 5వ శతాబ్ధం వరకు చైనా సాహిత్యంలో క్యాబేజి ప్రస్తావన లేదు.

గత 150 సంవత్సరాల నుంచి భారతదేశంలో కాలీఫ్లవర్ పండిస్తున్నారు. 1822లో షా రన్ పూర్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధిగా ఉన్న డాక్టర్ జెమ్సన్ దీనిని భారతదేశానికి తీసుకుని వచ్చారు.

ఇది చలికాలంలో ఎక్కువగా పండుతుంది.

చాలా మంది ఇష్టంగా తినే గోబీ మంచూరియన్ 70వ దశకం మధ్యలో ముంబయిలో నెల్సన్ వాంగ్ అనే రెస్టారంట్ యజమాని తయారు చేసినట్లు వీర్ సంఘ్వీ పేర్కొన్నారు.

యాపిల్ కూడా విదేశాల నుంచే...

ఫొటో సోర్స్, Getty Images

యాపిల్ కూడా విదేశాల నుంచే...

యాపిల్ విషయానికొస్తే, కశ్మీర్ , సిమ్లా యాపిళ్లు స్వదేశీ పంటలు కావు. దీనికొక పెద్ద కథే ఉంది.

1865లో బ్రిటిష్ పాలకులు హిమాచల్ ప్రదేశ్ లోని కులులో దీనిని పండించడం మొదలుపెట్టారు.

1917లో రుచికరమైన యాపిల్ రకాలను సిమ్లాలో పండించడం మొదలుపెట్టారు.

అయితే, కశ్మీర్ కు చెందిన అంబ్రీ అనే రకం మాత్రం స్వదేశీ యాపిల్ అని చెబుతారు.

అయితే, భారతదేశంలో ప్రస్తుతం తింటున్న తీపి యాపిళ్ళను 21 సంవత్సరాల సామ్యూల్ ఎవాన్స్ స్టోక్స్ మొదటిసారి భారత్ కు తీసుకుని వచ్చినట్లు రస్కిన్ బాండ్ రచించిన "మసూరి & లాండోర్: డేస్ ఆఫ్ వైన్ అండ్ రోజెస్" అనే పుస్తకంలో పేర్కొన్నారు.

"ఆయన స్థానిక పహారీ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆయన భారతీయ స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొని జైలు పాలయ్యారు. ఆయన కంటే ముందు ఆర్ సి స్కాట్ అనే బ్రిటిష్ సైన్యాధికారి యాపిళ్ళను తెచ్చారు. కానీ, అవి పుల్లగా ఉండటంతో అంతగా ప్రాచుర్యం పొందలేదు".

"1916లో శామ్యూల్ ఇవాన్స్ అమెరికా నుంచి తీపి యాపిల్ మొక్కలను తెచ్చి థానేదార్ లో నాటారు. వాటిని మొదటి సారి 1926లో అమ్మారు. ఆ తర్వాత వాటి డిమాండ్ తీవ్రంగా పెరిగింది".

ప్రస్తుతానికి అత్యధికంగా దేశంలో పండిస్తున్న యాపిల్ రకాలు ఇవేనని అంటారు.

"విదేశీ ఆహారం స్వదేశీ ఆహారంగా మారడం రాత్రికి రాత్రి జరిగిన విషయం కాదు. ఆరోగ్యానికి మేలు చేసే ఏ ఆహారమైనా తినేందుకు అభ్యంతరమెందుకు?" అని డాక్టర్ పూర్ణచందు అంటారు.

"ఏ ఆహారం మనది అనే విషయాన్ని పక్కన పెడితే, వంటకాలు అనేక రూపాంతరాలు చెందుతాయి. కొత్త వంటలను సృష్టిస్తారు. కొన్ని బాగుంటాయి. కొన్ని బాగుండవు. కానీ, ప్రతీ వంటకానికి ఒక ప్రత్యేక మార్కెట్ ఉంటుంది. కాలం మారుతున్న కొలదీ అది తమ ప్రాంతానికి చెందిందే అనే ప్రామాణికత లభిస్తుంది" అని వీర్ సంఘ్వీ అంటారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)