ఆహారం: 64 వంటకాలతో శాకాహార విందు.. ప్రపంచంలోనే అతి పెద్ద భోజనం

కేరళ భోజనం

కేరళలోని పట్టణంతిట్ట జిల్లాలో అరన్ముల పార్థసారథి ఆలయంలో జరిగే ఉత్సవంలో ప్రతీయేటా కృష్ణాష్టమిరోజు 64 పదార్థాలతో కూడిన భోజనం వడ్డిస్తారు.

కేరళలోని పంపా నదీ తీరంలో ఉన్న అనేక దేవాలయాల్లో అరన్ముల పార్థసారథి ఆలయం ప్రత్యేకమైనది.

కేరళ పండుగ

వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వారులు తమ పాశురాలలో వర్ణించిన 108 విష్ణురూపాలనుగుణంగా 108 వైష్ణవాలయాలు ఉన్నాయి. వీటిని దివ్య దేశాలు అంటారు. వీటిల్లో అరన్ముల పార్థసారథి ఆలయం ఒకటి. దీన్ని అర్జునుడు నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది.

ప్రతీ ఏటా ఇక్కడ 'అరన్ముల వల్ల సద్య' అని పిలిచే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది జూలై నెలాఖరున ప్రారంభయి రెండు నెలలు కొనసాగుతుంది.

కేరళ భోజనం

ఈ ఉత్సవంలో భాగంగా ప్రతీరోజూ భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సద్య అంటే భోజనం. ఈ భోజనంలో రోజూ 10 నుంచీ 20 ఆహార పదార్థాలను వడ్డిస్తారు. అయితే ఈ ఉత్సవంలో ముఖ్య దినాల్లో 50 నుంచీ 64 పదార్థాలను వడ్డిస్తారు.

అతి ముఖ్యమైన కృష్ణాష్టమి రోజు 64 పదార్థాలతో కూడిన భోజనాన్ని వడ్డిస్తారు.

కేరళ భోజనం

అరన్ముల వల్ల సద్య.. భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా అతి పెద్ద శాకాహార విందుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఇందులో వడ్డించే పదార్థాలన్నీ కృష్ణునికి ప్రియమైనవిగా భావిస్తారు.

భారతీయ శాకాహార భోజనం

మామిడి ఆవకాయతో మొదలుకొని పప్పు, సాంబార్, కూరలు (తోరన్), పెరుగు పచ్చడి (కాలన్), అప్పడాలు, బనానా చిప్స్, పాయసం, అరటిపండుతో సహా 64 పదార్థాలు వడ్డిస్తారు.

ఈ భోజనంతో పాటూ పలురకాల ఆయుర్వేద మూలికలతో తయారుచేసిన నీళ్లు (వెల్లం) అందిస్తారు. ఆలయంలో ఉన్న అన్నదాన ప్రదేశంలో సాంప్రదాయ పద్ధతిలో అరిటాకుల్లో సద్య వడ్డిస్తారు.

కేరళ పండుగ

ఈ అరన్ముల వల్ల సద్య ఎలా ఆరంభమయ్యిందనేదానికి ఒక పురాణ కథ చెబుతారు.

పూర్వం కృష్ణ భక్తుడైన ఒక బ్రాహ్మణుడు...కేరళలో ఓణం ఉత్సవాల చివరి రోజు జరిపే తిరువోణ సద్యకు కావలసిన మొత్తం ఆహారాన్ని అందిస్తానని మాటిచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం ఆహారాన్ని తిరువోణ తోణి అని పిలిచే పడవలో తరలిస్తుండగా దుండగులు దాడి చేశారు.

కేరళ బోటు

వెంటనే స్థానికులు అనేక పడవల్లో వచ్చి దుండగుల దాడిని తిప్పికొట్టి తిరువోణ తోణిని కాపాడారు. ఈ విజయాన్ని పుస్కరించుకుని అరన్ముల వల్ల సద్య ఉత్సవం ప్రారంభమయ్యిందని చెబుతారు. దీనితోపాటుగా ప్రతీ ఏటా నిర్వహించే ''అరన్ముల వల్లంకలి' (స్నేక్ బోట్ రేస్) కూడా ఆరంభమయ్యింది.

వల్లంకలిలో పాల్గొనే 52 బృందాలకు ప్రతీరోజూ బోటు ప్రాక్టీస్ అనంతరం ప్రత్యేకంగా పంబానది తీరాన సద్య వడ్డిస్తారు. వీరికి మటుకు ప్రత్యేకంగా వెన్న, తేనె లాంటి పదార్థాలను కూడా సద్యలో వడ్డిస్తారు.

కేరళ బోటు

అరన్ముల వల్ల సద్యలో ప్రతీ భోజన పంక్తిలోనూ కనీసం 250మందికి వడ్డిస్తారు. గత ఏడాది 450 కన్నా ఎక్కువసార్లు సద్య వడ్డించారని గణాంకాలు తెలిపాయి.

2016లో ఈ ఉత్సవంలో 5 లక్షల మంది పాల్గొన్నారని, కృష్ణాష్టమి రోజు మాత్రమే లక్ష మందికి సద్య వడ్డించారని అంచనా.

కేరళ భోజనం

అయితే, ఈ సంవత్సరం కోవిడ్-19 కారణంగా అరన్ముల వల్ల సద్య ఉత్సవాన్ని రద్దు చేశారు.

కేరళ సంస్కృతిలో ఒక భాగమైన ఈ ఉత్సవాన్ని వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)