సిలికాన్ రబ్బర్ ప్రతిమ: చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం

వెంకట నాగమాధవి ప్రతిమ
    • రచయిత, రవిశంకర్ లింగుట్ల
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనిషి సజీవంగా ఉన్నట్లు కనిపించే ప్రతిమ ఇది. చనిపోయిన తన భార్యకు గుర్తుగా ఒక తెలుగు పారిశ్రామికవేత్త ఈ ప్రతిమను ఇంట్లో ఏర్పాటు చేయించారు. ఈ ప్రతిమతోనే ఆయన గృహప్రవేశం చేశారు.

మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భార్య వెంకట నాగ మాధవి ప్రతిమను శ్రీనివాస్ గుప్తా సిలికాన్ రబ్బర్‌తో తయారు చేయించారు.

ఒక మంచి ఇళ్లు కట్టుకోవాలని మాధవి తనతో ఎప్పుడూ చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆమె ప్రతిమతోనే గృహ ప్రవేశం చేశానని ఆయన బీబీసీతో చెప్పారు.

శ్రీనివాస్ గుప్తా, వెంకట నాగ మాధవి దంపతులకు ఇద్దరు సంతానం. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. దాదాపు 32 ఏళ్ల క్రితం కర్నాటకలోని కొప్పల్‌ ప్రాంతంలో ఆయన కుటుంబం స్థిరపడింది.

వెంకట నాగమాధవి

"2017 జులై 5న మేం కొప్పల్ నుంచి తిరుమల వెళ్తుండగా, కోలార్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మా కారును ట్రక్కు ఢీకొట్టింది. అమ్మ చనిపోయారు. అప్పుడు అమ్మకు 45 ఏళ్లు" అని మాధవి-శ్రీనివాస్ దంపతుల పెద్ద కూతురు అనూష బీబీసీతో చెప్పారు.

శ్రీనివాస హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని అయిన శ్రీనివాస్- తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను సేకరించి, ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.

వెంకట నాగమాధవి ప్రతిమ

ఫొటో సోర్స్, Ani

అమ్మకు గుర్తుగా ఇంట్లో ప్రతిమ ఏర్పాటు చేసుకోవాలని నాన్న, అక్కాచెల్లెళ్లం ఇద్దరం అనుకున్నామని అనూష తెలిపారు. మహేశ్ రంగన్ననవర్ అనే ఆర్కిటెక్టు ఈ ప్రతిమ ఏర్పాటుకు సూచన చేశారని ఆమె చెప్పారు. బెంగళూరులో ఇలాంటి శిల్పాలు తయారు చేసే శ్రీధర్ మూర్తి బృందాన్ని సంప్రదించామన్నారు.

బెంగళూరు సిద్ధేశ్వర లే ఔట్‌లోని గొంబేమణి సంస్థలో శ్రీధర్ మూర్తి బృందం ఈ ప్రతిమను రూపొందించిందని ఆమె వివరించారు.

భార్య వెంకట నాగ మాధవితో శ్రీనివాస్ గుప్తా
ఫొటో క్యాప్షన్, భార్య వెంకట నాగ మాధవితో శ్రీనివాస్ గుప్తా (ఫైల్ ఫొటో)

"అమ్మ కలల ఇంట్లో అమ్మ ప్రతిమ"

ప్రతిమ తయారీకి దాదాపు ఒక సంవత్సరం పట్టిందని అనూష చెప్పారు.

కొప్పల్ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా దీనిని తయారు చేశారని తెలిపారు.

అమ్మ కలల ఇల్లు అయిన కొత్త ఇంట్లో ఈ ప్రతిమను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ ప్రతిమ దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు.

తల్లిదండ్రులు మాధవి, శ్రీనివాస్, చెల్లి సింధూషలత అనూష(మాధవి వెనుక ఉన్న అమ్మాయి)
ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రులు మాధవి, శ్రీనివాస్, చెల్లి సింధూషలతో అనూష (మాధవి వెనుక ఉన్న అమ్మాయి)

"మూడేళ్ల క్రితం ఇంటి ప్లాన్, ఇతరత్రా అన్నీ అమ్మే చూసుకున్నారు. కల నెరవేరేలోపు అమ్మ చనిపోయారు. కొత్త ఇంట్లో అమ్మ ప్రతిమ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం’’ అని ఆమె తెలిపారు.

ఈ నెల 8వ తేదీన గృహ ప్రవేశం రోజు తమ అమ్మ ప్రతిమను చూసి బంధువులు, ఆప్తులు ఆశ్చర్యపోయారని చెప్పారు. ‘‘వాళ్లు ఫొటోలు తీసుకొని వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు" అని ఆమె చెప్పారు.

ఈ విషయం తెలిసిన తర్వాత కొందరు ఇంటికి వచ్చి ప్రతిమను చూసి వెళ్తున్నారని, మరికొందరు తమ తండ్రికి ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారని తెలిపారు.

ప్రతిమ తయారీకి ఎంత ఖర్చయిందని బీబీసీ అడిగినపుడు.. "నా భార్య మాధవిపై నాకున్న ప్రేమకు నేను వెల కట్టలేను. ఇది అమూల్యం" అని శ్రీనివాస్ బదులిచ్చారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)