మియన్మార్ సైనిక ప్రభుత్వాన్ని ధిక్కరిస్తోన్న నర్సులు, వైద్యులు... రహస్యంగా ప్రజలకు వైద్య సేవలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జొనాథన్ హెడ్
- హోదా, బీబీసీ కరెస్పాండెంట్
మియన్మార్‌లోని సైనిక పాలనను వైద్యులు, నర్సులు వ్యతిరేకిస్తున్నారు. జుంటా లెజిటిమసీ (బలవంతంగా అధికారం చేపట్టి దేశాన్ని పాలించే సైనిక సమూహం)ని సవాలు చేస్తూ జాతీయ ఐక్యతా ప్రభుత్వానికి (ఎన్‌యూజీ) మద్దతు ఇస్తున్నట్లు పలువురు వైద్య సిబ్బంది బీబీసీతో చెప్పారు. వీరంతా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రులకు బదులుగా రహస్యంగా ఇతర చోట్ల వైద్యసేవలు అందిస్తున్నారు.
ఇంటర్వ్యూ ఇచ్చిన వారి భద్రత కోసం చాలామంది పేర్లను మార్చాం.
మియన్మార్‌లో ఫిబ్రవరి 1న జరిగిన తిరుగుబాటుకు వ్యవస్థీకృత ప్రతిఘటనగా ప్రభుత్వ ఆసుపత్రులను బాయ్‌కాట్ చేస్తున్నట్లు హెల్త్ కేర్ వర్కర్లు ప్రకటించారు. వీధుల్లో నిరసనలకు ఆరోగ్య కార్యకర్తలే మొదట నాయకత్వం వహించారు. దీన్నే 'తెల్ల కోటు విప్లవం'గా పిలిచారు.
జుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెల్త్ కేర్ వర్కర్లు చేస్తోన్న పోరాటంతో మియన్మార్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలావరకు అండర్ గ్రౌండ్‌కే పరిమితమైంది.
తాము ఉద్యోగాలను, ఆసుపత్రులను, రోగులను విడిచిపెట్టామని అనేక ప్రాంతాలకు చెందిన 70 శాతం కంటే ఎక్కువ మంది హెల్త్ వర్కర్లు నమ్ముతున్నారు. ఇది చాలా కష్టమైన నైతిక నిర్ణయమని మెడికల్ జర్నల్ లాన్సెట్‌కు పంపిన లేఖలో ఒక సీనియర్ అధికారి అన్నారు.
''రోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వడం వైద్యులుగా మా బాధ్యత. కానీ చట్టవిరుద్ధమైన, అప్రజాస్వామికమైన, అణచివేతతో కూడిన సైనిక వ్యవస్థలో మేం మా బాధ్యతను ఎలా నేరవేర్చగలం?''
''యాభై సంవత్సరాల మునుపటి సైనిక పాలన, ఆరోగ్య వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో విఫలమైంది. దానికి బదులుగా పేదరికం, అసమానతలు పెంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణను కుదేలు చేసింది. మళ్లీ అలాంటి పరిస్థితులకు వెళ్లలేం'' అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
''వారంతా సీడీఎం (సివిల్ డిస్‌ఒబిడియెంట్ మూమెంట్)ను ఎంచుకున్నారు'' అని యాంగాన్ నర్సింగ్ యూనివర్సిటీ టీచర్ గ్రేస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
''ప్రతీరోజూ రాత్రి 8 గంటలకు మేం దరువు వేస్తూ పాఠశాల ముందు విప్లవ గీతాలు పాడాం. మేం చాలా కోపంగా ఉన్నాం. వారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, మా నేతను ఎలా అరెస్ట్ చేస్తారు?''
ఉద్యోగాలను వదిలిపెట్టిన వేలాదిమంది ఆరోగ్య సిబ్బందిలో గ్రేస్ కూడా ఒకరు. ఆమె ఉద్యోగంతో పాటు వసతిని కూడా కోల్పోయారు. గాయపడిన వారికి సహాయం చేసేందుకు ఆమె నిరసనకారులతో చేరారు.
''ఎవరైనా కాల్పులు జరిపితే మేం అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తాం. గాయపడిన వారిని సురక్షిత ప్రదేశాలకు ఎలా తరలించాలనేదే మా ఆందోళన''
''చిన్న గాయాలైతే వారికి అంబులెన్స్‌లోనే చికిత్స అందిస్తాం. కానీ బుల్లెట్ గాయాల పాలైన వారిని దేవాలయాలు, మఠాల కాంపౌండ్‌లలో మేం ఏర్పాటు చేసుకున్న క్లినిక్‌ల వద్దకు తీసుకెళ్లడానికి సురక్షితమైన మార్గాలను కనుగొనాల్సి ఉంటుంది'' అని గ్రేస్ చెప్పారు.
నేషనల్ యూనిటి గవర్నమెంట్ (ఎన్‌యూజీ) ఆధ్వర్యంలో ఏప్రిల్‌లో ఈ షాడో హెల్త్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
వాస్తవానికైతే, ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా చారిటీ క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తోన్న వేలాదిమంది వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. తమ గుర్తింపు బయటకు రాకుండా వీరంతా కమ్యూనికేషన్ కోసం ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వాడుతున్నారు.
తక్కువ సిబ్బందితో నడుస్తోన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించని వైద్యాన్ని వీరు అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్ జా వీయ్ సో, ఒక ఆర్థోపెడిక్ సర్జన్. కరోనా సమయంలో ఎన్‌యూజీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.
ఉప ఆరోగ్య మంత్రిగా కొనసాగాలంటూ సైనిక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆయన తిరస్కరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సైనిక అధికారులు ఆయనపై దేశద్రోహం కింద అభియోగాలు మోపారు.
వాలంటీర్లకు మద్దతుగా నిలిచేందుకు విదేశాలలో నివసిస్తోన్న వారి నుంచి ఎన్‌యూజీ డబ్బును సేకరిస్తోంది. అజ్ఞాతంలో ఉన్న వైద్యుల నుంచి ఆన్‌లైన్‌లో వైద్య సలహాలను పొందేందుకు రోగుల కోసం ఫేస్‌బుక్ పేజీని ఏర్పాటు చేసింది. దీన్ని 'టెలీమెడిసిన్'గా పిలుస్తారు.
''మా దగ్గర తగినంత డబ్బు లేదు. కానీ మాకు స్థానిక ప్రజలు, విదేశాల్లో నివసిస్తోన్న వారి నుంచి మద్దతు లభిస్తోంది. అది సరిపోదు. కానీ వైద్య సేవలు అందించడానికి మేం వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాం'' అని గుర్తు తెలియని ప్రదేశం నుంచి మాట్లాడిన జా చెప్పారు.
ప్రమాదకరమైన పని
సైన్యాన్ని ధిక్కరిస్తూ అజ్ఞాతంలో పనిచేయడం చాలా ప్రమాదకరమైన పని.
ప్రపంచవ్యాప్తంగా, జులై నాటికి హెల్త్ వర్కర్లపై నమోదైన 500 దాడుల్లో సగభాగం మియన్మార్‌లోనే జరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది.
డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్న కాల వ్యవధిలోనే, మియన్మార్‌లో 25 మంది మెడికల్ వర్కర్లను చంపేశారని, 190 మందిని అరెస్ట్ చేశారని, 55 ఆసుపత్రులను సైన్యం ఆక్రమించిందని మాంచెస్టర్ యూనివర్సిటీ నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మాండలేలోని ఒక ప్రవేట్ ఆసుప్రతిలో ల్యూక్, ఐసీయూ నర్స్‌గా విధులు నిర్వహించారు. సైనిక తిరుగుబాటు తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టినట్లు ఆయన చెప్పారు.
ఆసుపత్రి యాజమాన్యానికి, సైన్యంతో సన్నిహిత సంబంధాలు ఉన్నందునే తన ఉద్యోగాన్ని వదిలి నిరసన బాట పట్టినట్టు ఆయన చెప్పారు.
''ఏప్రిల్ 5న నన్ను అరెస్ట్ చేసి మిలటరీ కమాండ్ స్థావరమైన మాండలే ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. మాకు ఎలాంటి హాని తలపెట్టబోమని వాగ్ధానం చేసి అక్కడికి తీసుకెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక మమ్మల్ని ప్రశ్నించడం, కొట్టడం ప్రారంభించారు''
''ఆ తర్వాత ఓబో జైలుకు పంపించారు. 50 మందిని ఒకే రూమ్‌లో ఉంచారు. మేమంతా ఒకే టాయ్‌లెట్‌ను వాడుకోవాల్సి వచ్చింది. అది వేసవి కావడంతో చాలా ఉక్కగా ఉండేది. తాగడానికి సరిపడా మంచి నీరు కూడా దొరకలేదు'' అని ఆయన తెలిపారు.
ల్యూక్‌ను 87 రోజుల పాటు జైలులో ఉంచారు. ఆ తర్వాత క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు. ఒక షిప్పింగ్ కంటైనర్‌లో తలదాచుకుంటోన్న ల్యూక్ ప్రస్తుతం మాండలేలోని ఒక మొబైల్ ఆపరేటింగ్ థియేటర్‌లో పనిచేస్తున్నారు.
''జైలులో ఉన్నప్పుడు నేను కొందరికి బుల్లెట్ గాయాలు చూశాను. వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స చేయలేదు. ఆ గాయాల కారణంగానే కొంతమంది చనిపోయారు''
''ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన పరికరాలు ఉన్నాయి. కానీ సుశిక్షితులైన నర్సులు, నిపుణులు లేరు. అత్యవసర వైద్యం అందించాల్సిన రోగులకు వారు చికిత్స చేయట్లేదు. వారి కంటే మా ఆరోగ్య వ్యవస్థే మెరుగ్గా ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా వద్దే వారికంటే ఎక్కువ సంఖ్యలో మంచి ఆరోగ్య నిపుణులు ఉన్నారు. కానీ మేం బహిరంగంగా పనిచేయలేం. అదే మా పెద్ద సమస్య'' అని ఆయన చెప్పారు.
సైనిక దాడుల నుంచి తప్పించుకోవడానికి యాంగాన్, మాండలే ప్రాంతాల్లో కోవిడ్ నిర్ధరణ కేంద్రాల ముసుగులో చారిటీ క్లినిక్‌లను నడుపుతున్నామని కొంతమంది నర్సులు చెప్పారు.
పని చేయడానికి వెళ్లే సమయంలో వారు యూనిఫామ్‌లు కాకుండా సాధారణ దుస్తులు ధరిస్తారు. ఒకవేళ వారు సైనికులకు దొరికిపోతే వెంటనే మొబైల్‌లను బయటే విడిచిపెడతారు. సైనికులకు దొరక్కుండా ఉండేందుకు వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మిలటరీ ట్రాప్‌లో చిక్కి చాలా మంది వైద్యులు అరెస్ట్ అయ్యారు.
''రోగులు తమ ఇంటికి రావాలని కోరినప్పుడు మేం చాలా అప్రమత్తంగా ఉండాలి. రోగి నిజంగా అనారోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో ఉన్న మా వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతాం. దాన్ని నిర్ధారించుకునేందుకు కనీసం ఒక రోజైనా వేచి చూస్తాం'' అని యాంగాన్‌కు చెందిన నర్స్ ఎన్వే వో చెప్పారు.
గత ఐదు నెలలుగా యాంగాన్‌లోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదని మరో నర్స్ చెప్పారు. భద్రతా బలగాలకు భయపడుతూ జీవిస్తున్నానని ఆమె అన్నారు.
కోవిడ్‌తో పోరాటం
టెలీమెడిసిన్ ఆధారంగా, కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిన జులై, ఆగస్టు నెలల్లో రోగులకు చికిత్స అందించేందుకు ఆరోగ్య వ్యవస్థల వాలంటీర్లు చాలా ఇబ్బంది పడ్డారు.
తిరుగుబాటుకు ముందే మియన్మార్‌లో వ్యాక్సీన్ కార్యక్రమం ప్రారంభమైంది. కానీ అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకోవడంతో ఈ కార్యక్రమం ఆగిపోయింది. వాక్సీన్ వితరణ కార్యక్రమం బాధ్యతలు తీసుకున్న డాక్టర్‌ను కూడా సైన్యం అరెస్ట్ చేసి నిర్బంధించింది.
వాక్సీన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని జుంటా ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ శిక్షణ పొందిన సిబ్బంది కొరత, వ్యాక్సీన్ల కొరత, మిలిటరీ నిర్వహించే ఆరోగ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం లేకపోవడం వల్ల టీకా కార్యక్రమం కుంటుపడింది. ఎన్‌యూజీ జూలైలో సొంత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
''ఇది హృదయ విదారకం. నేను మామూలుగా రాత్రి 2 గంటల వరకు పని చేస్తుండేదాన్ని. 'మా అమ్మ చనిపోతారు. మా నాన్నకు బాగాలేదు. దయచేసి స్పందించండి' అంటూ రోగుల నుంచి వచ్చే సందేశాలకు స్పందిస్తూ వారికి సహాయపడేదాన్ని'' అని నర్సింగ్ బోధకురాలు ఎంఐ ఏప్రిల్ చెప్పారు.
టెలీమెడిసిన్ ద్వారా వైద్యం అందిస్తోన్న తన విద్యార్థులకు ఆమె సహాయపడుతున్నారు.
''నేను నిస్సహాయంగా మారిపోయాను. ఎందుకంటే రోగులకు ఆక్సిజన్, మందులు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. ఆక్సిజన్ సరఫరా చేసే ప్రదేశాల్లో ప్రజలు బారులు తీరారు. కానీ సైన్యం వారిని అడ్డుకుంది'' అని చెప్పారు.
మియన్మార్‌లో జూలై, ఆగస్టు నెలల్లో డెల్టా వేరియంట్‌ను అందరూ నిర్లక్ష్యం చేశారు. అక్కడ జరిగిన ప్రాణనష్టం వాస్తవ గణాంకాలు తెలుసుకోవడం చాలా కష్టం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ప్రభుత్వ ఆసుపత్రులు చేర్చుకోలేదని నేను మాట్లాడిన నర్సులు, డాక్టర్లు చెప్పారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన వారిలో చాలామంది మరణించారని తెలిపారు.
సెప్టెంబర్ నాటికి కోవిడ్ కేసుల సంఖ్య చాలా తగ్గిపోయింది. కానీ పొరుగు దేశాల కంటే మియన్మార్‌లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటంతో భవిష్యత్‌లో ఇక్కడ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది.
''కరోనా విలయం సాగుతోన్న సమయంలో మేం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మందులు, సిలిండర్లు, ఇతర పరికరాలను పొందేందుకు చాలా ప్రయత్నించాం. ఇది చాలా కష్టమైన పరిస్థితి. కానీ 70 నుంచి 80 శాతం హెల్త్ కేర్ వర్కర్లు మాతో పనిచేస్తున్నారు'' అని జా వీయ్ సో చెప్పారు.
'మా భవిష్యత్‌ను కోల్పోయాం'
మియన్మార్‌లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంత పెద్ద పాత్ర ఎందుకు పోషిస్తున్నారని నేను ఆయనను అడిగాను. వృత్తిపరంగా అది వారి నైతిక బాధ్యత అని ఆయన చెప్పారు. మునుపటి సైనిక పాలనలో ఆరోగ్య వ్యవస్థ దారుణంగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రపంచంలో ఆరోగ్య రంగంపై అతి తక్కువ ఖర్చుపెట్టే దేశాల్లో మియన్మార్ ఒకటిగా ఉంది.
ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలో ఏర్పడిన పౌర ప్రభుత్వంతో ఆరోగ్య వ్యవస్థలో మార్పు వచ్చింది. మెరుగైన ఆరోగ్య వ్యవస్థ కోసం కొత్త సిబ్బందిని నియమించడానికి పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్లు చేపట్టారు.
''మీరు ఇతర దేశాలతో పోల్చి చూస్తే, మా జీతాలు అంత ఎక్కువగా ఏం ఉండవు. మలేషియా, సింగపూర్, బ్రూనై లాంటి దేశాలకు సులభంగా వెళ్లి ఎక్కువగా ఆర్జించవచ్చు. కానీ, కోవిడ్ వచ్చిన తర్వాత మేం దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశాం. మేం ఎన్నుకున్న ప్రభుత్వంతో ఏదో ఒక రోజు మాకు మంచి జరుగుతుందని ఆశించాం''
''అప్పుడే అకస్మాత్తుగా ఈ తిరుగుబాటు జరిగింది. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేం అంగీకరించలేకపోతున్నాం. తక్కువ జీతాలు ఉండి, సరైన సదుపాయాలు లేకపోయినా మేం ప్రజల కోసం పనిచేశాం''
''మాకు భవిష్యత్‌పై చాలా ఆశలు ఉండేవి. కానీ అకస్మాత్తుగా మేం ఆ భవిష్యత్‌ను కోల్పోయాం'' అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో నిరుద్యోగ సంక్షోభం పైకి కనిపిస్తున్న దాని కన్నా తీవ్రంగా ఉందా?
- బుల్లీబాయి, సుల్లీ డీల్స్ యాప్స్ కేసులను ముంబయి, దిల్లీ పోలీసులు ఎలా డీల్ చేశారు?
- ఉత్తర్‌ప్రదేశ్: ఇక్కడ అనాథ పశువులు కూడా ఓట్లు రాలుస్తాయా?
- ఎర్ర చందనం చెట్లు శేషాచలం అడవుల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటాయి, చిత్తూరు చందనానికి విదేశాల్లో ఎందుకంత గిరాకీ?
- ‘డబ్బులు అడిగితే ఇచ్చేవాడిని, కానీ నా భార్యను పంపించమన్నాడు... అందుకే’ -ప్రెస్ రివ్యూ
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
- కజకిస్తాన్ సంక్షోభం: భద్రతా బలగాల కాల్పుల్లో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










