Kazakhstan unrest:: భద్రతా బలగాల కాల్పుల్లో పదుల సంఖ్యలో నిరసనకారులు మృతి

కజకిస్తాన్ సంక్షోభం Kazakhstan unrest:

ఫొటో సోర్స్, Reuters

కజకిస్తాన్‌లోని అల్మాటిలో ఎల్‌పీజి ధరలను రెట్టింపు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.

ప్రజల్లో నెలకొన్న రాజకీయ అసంతృప్తి కూడా నెమ్మదిగా ఈ నిరసనల్లోకి చేరింది.

నిరసనకారులను అణచివేసేందుకు కొన్ని డజన్ల మంది ప్రభుత్వ వ్యతిరేక అల్లరి మూకలను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

నిరసనకారులు నగరంలో పోలీస్ స్టేషన్లను అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో భద్రతా దళాలు ఈ చర్యలు తీసుకోవలసి వచ్చినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.

ఈ ఘర్షణల్లో 12 మంది భద్రతా సిబ్బంది మరణించగా, 353 మంది గాయాల పాలయ్యారు.

కజక్ అధ్యక్షుని అభ్యర్ధన మేరకు రష్యా తమ సేనలను కూడా పంపిస్తోంది. రష్యా, బెలారస్, తజికిస్తాన్, కిరిగిస్తాన్, ఆర్మేనియాతో పాటు కజకిస్తాన్ కూడా కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజషన్ లో సభ్య దేశంగా ఉంది.

దేశంలో శాంతిని నెలకొల్పేందుకు రష్యా పారా సైనికులను పంపిస్తున్నట్లు సిఎస్‌టిఓ ధృవీకరించింది.

కొన్ని సేనలు ఇప్పటికే బయలుదేరాయి. రష్యా సైనికులు మిలిటరీ విమానాన్ని ఎక్కుతున్నట్లు రష్యా మీడియా విడుదల చేసిన ఫుటేజీలో కనిపిస్తోంది.

ఈ సంక్షోభం వెనుక శిక్షణ పొందిన విదేశీ తీవ్రవాద సంస్థలు ఉన్నాయని కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ టోకాయేవ్ ఆరోపించారు.

దేశమంతటా అత్యవసర పరిస్థితితో పాటు కర్ఫ్యూ, భారీ సమావేశాలపై నిషేధాన్ని విధించారు.

ఈ నిరసనలను అణచివేసేందుకు సిఎస్‌టిఓ చైర్మన్‌ను సహాయం కోరినట్లు టోకాయేవ్ తెలిపారు. శాంతి దళాలను నిర్దిష్ట కాల పరిమితి మేరకు పంపించనున్నట్లు సిఎస్‌టిఓ చైర్మన్, ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్ ధృవీకరించారు.

Presentational grey line

కజికిస్తాన్

ఎక్కడుంది? కజకిస్తాన్ ఉత్తరం వైపు రష్యాతో, తూర్పు వైపున చైనాతో సరిహద్దు కలిగి ఉంది. ఇది పరిమాణంలో పశ్చిమ యూరోప్ మాదిరిగా విస్తరించి ఉంది.

ఎందుకు ముఖ్యం? ఈ దేశంలో విస్తారమైన ఖనిజ సంపద ఉంది. ప్రపంచంలో ఉన్న ఇంధన వనరుల్లో 3% ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమైన బొగ్గు, ఇంధన రంగాలకు నెలవు కజకిస్తాన్. ముఖ్యంగా ఇది ముస్లిం రిపబ్లిక్ దేశం. రష్యన్లు మైనారిటీలో ఉన్నారు.

వార్తల్లో ఎందుకుంది? ఇంధన ధరలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను లేవనెత్తాయి. దీంతో, ప్రభుత్వంలో అత్యున్నత అధికారులు పదవులకు రాజీనామా చేయవలసి వచ్చింది. నిరసనకారులను దారుణంగా అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Presentational grey line

1991లో కజికిస్తాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించినప్పటి నుంచి దేశానికి అధ్యక్షత వహిస్తున్న వ్యక్తుల్లో టోకాయేవ్ రెండవ వారు.

2019లో ఆయన ఎన్నిక ప్రజాస్వామ్య ప్రమాణాలను పాటించలేదని అంటూ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరోప్ (ఓఎస్‌సిఈ) ఖండించింది.

అయితే, ప్రస్తుతం వీధుల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు గత పాలకుడైన నూర్ సుల్తాన్ నజర్‌బయేవ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

ఆయన పదవి నుంచి వైదొలగినప్పటి నుంచి శక్తివంతమైన జాతీయ భద్రతలో ఉన్నారు. పెరుగుతున్న నిరసనలను కొంత వరకు చల్లార్చేందుకు బుధవారం ఆయనను పదవి నుంచి తొలగించారు. ప్రభుత్వంలో సభ్యులందరూ రాజీనామా చేశారు.

నిరసనకారుల నినాదాల్లో నజర్‌బయేవ్ పేరు కూడా వినిపించింది. మరో వైపు టాల్దీ కోర్ గాన్ లో ఉన్న ఆయన కాంస్య విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నాలు జరిగినట్లు ఒక వీడియో షేర్ అయింది.

దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్ ఆగిపోయింది.

గురువారం ప్రభుత్వ కార్య నిర్వాహక భవనాల్లో తీవ్రవాదులను అణచివేసే కార్యకలాపాలు కొనసాగుతున్నందున ప్రజలను తాత్కాలికంగా ఇళ్ల దగ్గరే ఉండమని అల్మాటి పోలీస్ ప్రతినిధి సల్తనాట్ అజిర్‌బెక్ ప్రకటించారు.

నగరంలో ఉన్న పోలీసు భవనాలపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కొన్ని డజన్ల మంది నిరసనకారులను హతమార్చినట్లు తెలిపారు. కొంత మంది నిరసనకారులు ఆయుధాలను దొంగిలించారని చెప్పారు.

ఈ అల్లర్లలో సుమారు 1000 మంది గాయాలపాలయ్యారు. అందులో 400 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా, 62 మంది ఐసీయూలో ఉన్నారు.

అల్మాటీలో ఉన్న మేయర్ ఆఫీసును నిరసనకారులు చుట్టుముట్టడంతో అక్కడ తుపాకీ పేలుళ్లు జరిగినట్లు ఆ భవనం నుంచి వస్తున్న పొగ ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

కజకిస్తాన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న నిరసనకారులను పోలీసులు తరిమేశారు.

అక్‌టోబ్‌లో నిరసనకారులను తరిమి కొట్టేందుకు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.

కొన్ని చోట్ల భద్రతా దళాలు కూడా నిరసనకారులతో జత కలిసినట్లు కథనాలు వచ్చాయి.

line

ఈ నిరసనలు ఒక్క ఇంధనం కోసం మాత్రమే కాదు

ఓల్గా ఇవ్షినా, బీబీసీ రష్యా

నిరసనలు అత్యంత వేగంగా హింసాత్మకంగా మారిన తీరు కజకిస్తాన్, చుట్టు పక్కల ప్రాంతాల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఈ నిరసనలు కేవలం ఇంధన ధరల గురించి మాత్రమే తలెత్తలేదని సూచించాయి.

2019 వరకు ఈ దేశానికి నూర్ సుల్తాన్ నజర్ బయేవ్ అధ్యక్షుడిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం, రాజధాని పేరును ఆయన పేరు మీద మార్చడం లాంటి పనులతో ఆయన పాలనలో వ్యక్తిస్వామ్యం ఎక్కువగా రాజ్యమేలింది.

ఆయన పదవి నుంచి వైదొలగినప్పటికీ, ఆయనకు సన్నిహితులనే ఆయన పదవిలో కూర్చోబెట్టారు.

కజకిస్తాన్‌లో ధీటైన రాజకీయ ప్రతిపక్షం లేకపోవడంతో ఎన్నికల్లో పాలక పార్టీ దాదాపు నూరు శాతం వోటింగ్‌తో విజయం సాధిస్తోంది.

కజక్ దేశ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని కొంత మంది విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రజాస్వామ్య ఎన్నికలు లేని దేశంలో ఇటువంటి నిరసనలు తలెత్తడం ఆశ్చర్యకరం కాదని అంటున్నారు.

ప్రజల గొంతు వినిపించేందుకు వీధుల్లోకి వెళ్ళడమొక్కటే మార్గం.

వారు లేవనెత్తుతున్న అంశాలు, ఫిర్యాదులు ఒక్క ఇంధనం కోసం మాత్రం కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

line

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)