మృతదేహాలతో పాటు బంగారు కళాకృతుల్ని పాతిపెట్టిన ఈ సమాధుల చరిత్ర ఏంటి?

సాకా మృతదేహాల గుట్ట

ఫొటో సోర్స్, Yevgeniy Domashev

ఫొటో క్యాప్షన్, సాకా మృతదేహాల గుట్ట

యూకేలో మొట్టమొదటిసారి ప్రాచీన సంచార యోధులకు చెందిన ఆశ్చర్యకరమైన కజకిస్తాన్‌‌ బంగారు కళాకృతులను ప్రదర్శించనున్నారు.

ఇటీవల ఇందులోని చాలా కళాకృతులు, తూర్పు కజకిస్తాన్‌లో సాకా జాతి మృత దేహాలను ఖననం చేసిన గుట్టల దగ్గర లభించాయి.

ప్రాచీన సంస్కృతిలో భాగమైన వీరి గురించి మధ్య ఆసియా దేశం వారికి తప్ప మిగిలిన వారెవరికీ తెలియదు.

సాకా జాతి ప్రజల నమ్మకాలు, సంస్కృతి గురించి ఎటువంటి లిఖితపూర్వకమైన చరిత్ర అందుబాటులో లేదు. కానీ, అధునాతన పురావస్తు శాస్త్ర మెళకువలు వారి రహస్యాలను నెమ్మదిగా బయటపెడుతున్నాయి.

సాకాలు ఎవరని తెలుసుకునేందుకు, కేంబ్రిడ్జ్‌లోని ఫిట్జ్‌విలియం మ్యూజియంలో ఉన్న కళాకృతుల గురించి బీబీసీ మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

సాకా విలుకాని ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Fitzwilliam Museum

ఫొటో క్యాప్షన్, సాకా విలుకాని ప్రతీకాత్మక చిత్రం

2018లో ఒక స్మశానాల గుట్టలో దొరికిన, టీనేజీ ఆర్చర్‌ను పూడ్చిపెట్టిన సమాధి పునర్నిర్మాణాన్ని కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు.

ఈ 16 సంవత్సరాల బాలునికి కొన్ని వేల బంగారు పూసలతో అల్లిన బూట్లను తొడిగి, శవం చుట్టూ బంగారు కళాకృతులను పేర్చి మృతదేహాన్ని అతి జాగ్రత్తగా ఖననం చేశారు. ఆ బాలుని దగ్గర ఒక పదునైన ఖడ్గం కూడా పెట్టారు. కానీ, ఖననానికి ముందే ఆ ఖడ్గాన్ని కావాలనే విరిచేసినట్లు తెలుస్తోంది.

"ఆ బాలున్ని ఒక యోధుడిలా పూడ్చిపెట్టారు. ఆయన అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్నారు" అని ఈ ప్రదర్శన క్యూరేటర్ డాక్టర్ రెబెక్కా రాబర్ట్స్ అన్నారు.

ఆ బాలుడిని ఖననం చేసిన విధానం పూర్తిగా సాకా పద్ధతిలో ఉంది. శవాలను పూడ్చిపెట్టే గోతుల్లో నిపుణులైన కళాకారులు తయారు చేసిన ప్రత్యేకమైన బంగారు కళాకృతులను కూడా పక్కన పెట్టడం వీరి పద్ధతి.

బంగారు లేడి

ఫొటో సోర్స్, Fitzwilliam Museum

ఫొటో క్యాప్షన్, బంగారు లేడి

సాకాలు ఎవరు?

సాకా సంస్కృతి క్రీస్తు పూర్వం 900 నుంచి 200 మధ్యలో నల్ల సముద్రం నుంచి సైబీరియా వరకూ యూరేషియా ప్రాంతంలో విరివిగా ఉండేది. కానీ, 18వ శతాబ్దంలో ఈ శవాల గుట్టలను దోపిడీ జరిగి, కొన్ని వందల బంగారు కళాకృతులు లభించే వరకూ వీరి గురించి సమాచారం తెలియలేదు.

అప్పటి వరకు కేవలం వారు ధైర్యవంతులైన యోధులని, అనాగరికులని.. కేవలం గ్రీకులు, పర్షియన్లు రాసిన రాతల ద్వారానే తెలిసేది.

వీరిని తొలి ప్రాచీన సంచార యోధులని చెప్పవచ్చు. తర్వాత వీరినే సిథియన్స్ అని పిలిచేవారు.

"మనం వారందరినీ కలిపి సాకాలుగా పరిగణిస్తున్నాం. కానీ, ఆ సమూహాలు విడి విడిగా తమను తాము ఎలా పిలుచుకునేవారో మనకి తెలియదు" అని డాక్టర్ రాబర్ట్స్ అన్నారు.

ప్రాచీన గ్రీకు రచయత హెరోడోటస్ (క్రీస్తు పూర్వం 484 - 420) రచనల్లో వీరి గురించి కొంత సమాచారం దొరుకుతుంది.

ఒక పర్యాటకుడు ఈ జాతి వారు నివసించే స్టెప్పీ వరకు వెళ్లి అక్కడ ఒంటి కన్నుతో ఉన్న మనుషులను చూసినట్లు ఆయన వర్ణించారు.

వారి భూభాగం అవతల సగం పక్షిలా, సగం క్షీరదాలను తలపించేలా ఉన్న గరుడ పక్షి బంగారాన్ని కాపలా కాస్తూ ఉండేది అని ఆయన రచనల్లో వర్ణించారు.

"ఒకవేళ తూర్పు కజకిస్తాన్‌‌ కు చెందిన సాకాలు తమని తాము గరుడపక్షులుగా భావించేవారేమోననే అనుమానం కూడా చరిత్రకారులకు ఉండేది" అని డాక్టర్ రాబర్ట్స్ చెప్పారు.

"ఈ అద్భుతమైన జీవులు, క్షీరదాలు, పక్షి కలిపిన రూపు రేఖలతోనే ఉంటాయి. ఇవి సాకా లుచిత్రించిన కళాత్మక చిత్రాలకు భిన్నంగా అయితే లేవు" అని డాక్టర్ రాబర్ట్స్ చెప్పారు.

పర్షియాకు చెందిన వారు మాత్రం సాకా, సిథియా అని రెండు రకాలుగా చెబుతూ ఉండేవారు. కానీ, వారి మధ్య ఉండే వ్యత్యాసాలను కూడా రాస్తూ ఉండేవారు.

"సాకాలు మొనదేలి ఉండే టోపీలను ధరించేవారని, హావ్ మా అనే మొక్క నుంచి తీసిన పానీయాన్ని తాగేవారని చెప్పారు. ఈ పానీయం ఉత్తేజాన్ని కలిగించేది. ఈ మొక్కను దైవికమైన మొక్కగా పర్షియన్లు భావిస్తారు.

సాకా సంస్కృతిని గుర్తించేందుకు మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. మొదటిది వాళ్ళు ఎక్కువగా సంచరిస్తూ, అత్యంత నైపుణ్యంతో గుర్రపు స్వారీ చేసేవారు.

గుర్రం వెనుక నుంచే విసిరే విధంగా చిన్న బాణాన్ని వాడేవారు. ఒక ప్రత్యేకమైన జంతు కళను కూడా రూపొందించారు.

కానీ, సాకాలు తమ గురించి ఎలా భావించేవారో తెలుసుకోవాలంటే, వారు వదిలిపెట్టిన విశేషాలను విశ్లేషణ చేయడమొక్కటే మార్గం.

బంగారం

ఫొటో సోర్స్, Fitzwilliam Museum

ఫొటో క్యాప్షన్, బంగారం

దోపిడీలు, వాతావరణ మార్పుల వల్ల వీరి సంస్కృతి ముప్పును ఎదుర్కొంటోంది.

అయిదు సంవత్సరాల క్రితం తూర్పు కజకిస్తాన్ భారీ పురావస్తు పరిశోధన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కొన్ని డజన్ల కొత్త పురావస్తు ప్రాంతాలను కనిపెట్టి వాటి పై అధ్యయనం మొదలుపెట్టారు.

దీంతో పాటు, కజకిస్తాన్‌లోని పరిశోధనకారులు ఇటీవల పురావస్తు శాస్త్రంలో కొత్త తరహా పరిశోధనను మొదలుపెట్టారు.

"ఇందులో ప్రో టియోమిక్స్ అనే విధానం కూడా ఉంటుంది. దీని ద్వారా వివిధ వస్తువుల నుంచి ప్రోటీన్ కణాలను కూడా సేకరించగలరు" అని ఇజ్రాయెల్ సంస్థకు చెందిన స్పెక్ట్రోఫోన్‌కు చెందిన జిల్బర్‌స్టీన్ చెప్పారు.

బంగారు ఖడ్గం

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, బంగారు ఖడ్గం

దంతాలు, ఎముకలు, ఇతర జీవ పదార్ధాలు, ఇటీవల వెలికి తీసిన బంగారు కళాకృతులను జిల్బర్‌స్టీన్, ఇటలీకి చెందిన మరొక ప్రొఫెసర్ పీర్ జియోర్జియో రిగెట్టీతో కలిసి విశ్లేషించారు.

వారు సాకాల ఆచార వ్యవహారాల్లో కొన్ని రకాల మూలికలను, పాలను తోడు పెట్టేందుకు వాడే ప్రత్యేకమైన మైక్రో బై యోమ్ (జన్యు పదార్ధాలతో కలిపి)తో పాటు వారు తిన్న జంతువులు, మొక్కల జాడలను కూడా కనిపెట్టారు. తేనెను కాల్సైట్ రాయి మిశ్రమంతో కలిపి దంతాలలో ఫిల్లింగ్‌గా వాడేవారని తెలుసుకున్నారు.

సాకాలు వివిధ ఆచార వ్యవహారాల్లో ఉపయోగించినట్లుగా భావిస్తోన్న దీపాల పై ఉన్న పొగ గురించి పరిశోధన చేశారు.

కజకిస్తాన్‌లో సాధారణంగా కనిపించే మొక్క‘ స్వీట్ వార్మ్‌వుడ్ ’ జాడలు కనిపెట్టారు. దీనిని చాలా కాలంగా జ్వరాలకు చికిత్సగా వాడుతున్నారు.

లేడి శిల్పాలు

ఫొటో సోర్స్, The Fitzwilliam Museum

ఫొటో క్యాప్షన్, లేడి శిల్పాలు

ఒక మహిళ సమాధి దగ్గర లభించిన యాంటీ సెప్టిక్ గా పని చేసే ఫెర్న్ వృక్ష జాడలు, నొప్పిని తగ్గించే గంజాయి లాంటి మొక్కలు, తలకు ధరించిన బ్యాండు లాంటి ఆభరణాన్ని బట్టీ ఆమె బహుశా మతాధికారి కానీ, మూలికా వైద్యురాలు కానీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. "దీనిని బట్టీ చూస్తే సాకాలకు వన వృక్షాల గురించి మంచి జ్ఞానం ఉన్నట్లు అర్ధమవుతోంది" అని డాక్టర్ రాబర్ట్స్ అన్నారు.

"వారి ఎముకల డీఎన్‌ఏ విశ్లేషణ చూస్తుంటే, వారంతా ఒకే జాతి కాదని, ఒకరితో ఒకరు విభిన్నంగా ఉండే చిన్న చిన్న కుటుంబాలని తెలుస్తోంది" అని జిల్బర్‌స్టీన్ చెప్పారు.

"అలెగ్జాండర్ ది గ్రేట్ (క్రీస్తు పూర్వం 356 - 323) ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత, వలసదారులతో కలిసిన ప్రజలతో ఈ ప్రాంతం ఉండేది".

తలకు ధరించిన ఆభరణాలు

ఫొటో సోర్స్, Fitzwilliam Museum

ఫొటో క్యాప్షన్, తలకు ధరించిన ఆభరణాలు

"టీనేజీ బాలుని సమాధి వీరి మతం, ప్రపంచాన్ని పరిశీలించే దృక్కోణం, సాకా ప్రజల అంతిమ సంస్కార విధానాల గురించి శాస్త్రవేత్తలు తెలుసుకునేందుకు కొత్త అవకాశాలను కలుగచేస్తుంది" అని తూర్పు కజకిస్తాన్ ప్రాంతం గవర్నర్ డేనియల్ ఆఖ్ మెటోవ్ అన్నారు.

మరో వైపు పురావస్తు శాఖ కొత్త విషయాలను కనిపెట్టే పనిలో ఉండగా, సాకా ప్రజలకు సంబంధించిన రహస్యాలు మరింత బయటపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)