నరేంద్ర గిరి: అఖాడా అధిపతి ఆత్మహత్య కేసులో అంతుచిక్కని ఐదు అంశాలు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు, బాఘంబరి మఠం మహంత్ నరేంద్ర గిరికి బుధవారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్‌లో అంత్యక్రియలు జరిగాయి.
నిరంజని అఖాడాతో సంబంధం ఉన్న మహంత్ నరేంద్రగిరి సెప్టెంబర్ 20న ప్రయాగరాజ్‌లోని బాఘంబరి మఠంలో ఆత్మహత్య చేసుకున్నారు.
కానీ ఆయన అనుచరులు కొందరు దీనిని ఆత్మహత్య అనడాన్ని ఒప్పుకోవడం లేదు. ఆయన రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ కూడా నకిలీదని వాదిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తు కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం 18 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనితో పాటు, సీబీఐ విచారణకు కూడా సిఫార్సు చేసింది.
ఈ వ్యవహారం సున్నితమైనది కావడంతో పోలీసులు కూడా ఆచితూచి ప్రకటనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు మహంత్ నరేంద్ర గిరి శిష్యుడు ఆనంద్ గిరిని అరెస్టు చేశారు.
ఆనంద్‌గిరిపై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.
మహంత్ నరేంద్ర గిరి రాసిన సూసైడ్ నోట్‌లో ఆనంద్ గిరి ప్రస్తావన ఉందని ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు.
ఈ కేసులో నరేంద్ర గిరి గన్‌మెన్ అజయ్ సింగ్, ఆద్య తివారీ, సందీప్ తివారీ సహా మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమాచారం తెర పైకి వస్తుండటంతో ఈ కేసులో గందరగోళం ఏర్పడుతోంది.

ఫొటో సోర్స్, TWITTER/YOGI ADITYANATH
సందేహం 1 - సూసైడ్ నోట్ నిజమేనా?
ఈ కేసులో నరేంద్రగిరి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్‌పై అనేక సందేహాలున్నాయి.
ఇది నిజమైనదో కాదో తెలియాలంటే ఫొరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. ఈ లేఖను ఫొరెన్సిక్ పరీక్షకు పంపినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు.
అయితే ఇది సూసైడ్ నోటా లేక వీలునామా అన్న సందేహం కూడా వినిపిస్తోంది.
ఇదొక విచిత్రమైన కేసని గత కొన్నేళ్లుగా క్రైమ్ వార్తలు కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రతీబన్ త్రిపాఠి వ్యాఖ్యానించారు.
''ఈ సూసైడ్ నోట్ మీద రెండు తేదీలున్నాయి. మొదటి భాగం సెప్టెంబర్ 13న బ్లాక్‌పెన్నుతో రాసి ఉంది. రెండో భాగం 20వ తేదీన బ్లూ పెన్‌తో రాసి ఉంది. ఒక సూసైడ్ నోట్‌ను ఇంత వివరంగా రాయడం ఆశ్చర్యకరం. అది సూసైడ్‌లా కాకుండా వీలునామాలా ఉంది. ప్రతి పేజీలో ఆయన సంతకం చేశారు. తనను ఎక్కడ ఖననం చేయాలో కూడా సూచించారు'' అని త్రిపాఠీ అన్నారు.
నరేంద్ర గిరి రాసిన నోట్ 8 పేజీలు ఉంది.

ఫొటో సోర్స్, SANJAY KANOJIA/AFP VIA GETTY IMAGES
సందేహం 2 - ఎఫ్‌ఐఆర్‌లో సూసైడ్ నోట్ ఎందుకు ప్రస్తావించలేదు?
ప్రయాగ్‌రాజ్‌లోని జార్జ్‌టౌన్ ప్రాంతంలో బాఘంబరి మఠం నిర్వాహకుడు అమర్ గిరి ద్వారా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో నరేంద్ర గిరి శిష్యుడు ఆనంద్ గిరిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ ఈ ఎఫ్ఐఆర్‌లో సూసైడ్ నోట్ ప్రస్తావన లేదు.
ఈ సూసైడ్ నోట్‌లో ఆనంద్ గిరితో పాటు, ఆద్య తివారీ, సందీప్ తివారీ పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఆ పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొనలేదు.
అయితే, ఆద్య ప్రసాద్ తివారీ, ఆయన కుమారుడితో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సందేహం 3 - అసలు నరేంద్ర గిరి ఈ నోట్స్ రాయగలరా?
నరేంద్ర గిరి మరణం తర్వాత బయటపడిన సూసైడ్ నోట్‌పై ఆయన సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
''నరేంద్ర గిరి ఇంత పెద్ద నోట్ రాయలేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన అత్యంత సన్నిహితుడైన హరిగిరి కూడా రాయలేరు'' అని ప్రయాగరాజ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ త్రిలోక్ యాదవ్ అన్నారు.
నరేంద్ర గిరి పెద్దగా చదువుకోలేదని, అందుకే ఆయన సంతకం చేయడానికి కూడా సమయం తీసుకుంటారని చెబుతారు. అలాంటి వ్యక్తి ఇంత పెద్ద నోట్ ఎలా రాయగలరన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన సన్నిహితులు.
''ఇంత పెద్ద నోట్‌ను ఆయన చదవ లేరు కూడా. అలాంటి వ్యక్తి ఇంత పెద్ద నోట్ ఎలా రాస్తారు'' అని జర్నలిస్టు త్రిపాఠి ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ANANDGIRIYOGA
సందేహం 4 - బల్బీర్ గిరి మాట ఎందుకు మార్చారు?
బల్బీర్ గిరిని మహంత్‌ను చేయాలని సూసైడ్ నోట్‌లో నరేంద్ర గిరి విజ్ఞప్తి చేశారు.
''ఈ నోట్‌లో రాసిన అక్షరాలు గురుదేశ్ చేతి అక్షరాలు'' అని నరేంద్ర గిరి మరణం తర్వాత బల్బీర్ గిరి వ్యాఖ్యానించారు.
కానీ తర్వాత బల్బీర్ మాట మార్చారు. గతంలో తాను చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
తాను నరేంద్ర గిరి చేతి రాతను గుర్తించ లేకపోయానని ఓ వీడియోలో బల్బీర్ గిరి వ్యాఖ్యానించారు.
మరోవైపు నిరంజని అఖాడా కూడా ఈ సూసైడ్ నోట్ నకిలీదని ఆరోపించింది. ఇటు అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ కైలాశానంద్ గిరి కూడా ఈ సూసైడ్ నోట్ నకిలీదని అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ANANDGIRIYOGA
సందేహం 5: హరిద్వార్ నుంచి ఎవరు సమాచారం ఇచ్చారు?
వీడియో విడుదల చేయడం ద్వారా ఆనంద్ గిరి తనను అవమానిస్తారని నరేంద్ర గిరికి సమాచారం అందిందని, ఆ మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
అయితే హరిద్వార్ నుంచి నరేంద్ర గిరికి సమాచారం అందించిన వ్యక్తి ఎవరు? ఇప్పటి వరకు హరిద్వార్ లింక్‌ల గురించి ఎవరూ మాట్లాడ లేదని సీనియర్ జర్నలిస్ట్, నరేంద్ర గిరి గురించి బాగా తెలిసిన రవి ఉపాధ్యాయ్ అన్నారు.
''ఎవరో సమాచారం ఇచ్చారని చెప్పినప్పుడు, ఇచ్చింది ఎవరో ఎఫ్ఐఆర్‌లో ఎందుకు పేర్కొనలేదు'' అని ఉపాధ్యాయ్ ప్రశ్నించారు.
దీంతోపాటు బాఘంబరి మఠం భూ వివాదం, గెస్ట్‌హౌస్‌లో నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్నాక పోలీసులు లేకుండానే మృతదేహాన్ని ఎలా దించారు అన్న సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి.
(ఆత్మహత్య అనేది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, భారత ప్రభుత్వ జీవన్ సాథి హెల్ప్‌లైన్ 18002333330 నుంచి సహాయం తీసుకోవచ్చు. మీరు మీ స్నేహితులు, బంధువులతో కూడా ఈ విషయం మాట్లాడాలి.)
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు తలలు పగలగొట్టుకునే వరకు ఎందుకెళ్లాయి?
- ‘చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








