ఆంధ్రప్రదేశ్: స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు తలలు పగలగొట్టుకునే వరకు ఎందుకెళ్లాయి?

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో ఘర్షణలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో ఘర్షణలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా చాలా చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

చాలా ప్రాంతాల్లో రాళ్లు రువ్వుకున్నారు. బాహాబాహీకి దిగారు. కొందరికి తలలు పగిలాయి. పోలీసులు లాఠీఛార్జి చేశారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి ఉండే ఈ ఎన్నికల్లో పట్టు కోసం ఇన్ని గొడవలు జరగడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పట్టు కోసం కొందరు నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించారని కొందరు, పాఠశాలల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులపై పెత్తనం కోసమేనంటూ మరికొందరు భావిస్తున్నారు.

ప్రస్తుతం నాడు- నేడు పేరుతో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చిస్తున్న పెద్ద మొత్తం నిధులను పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో ఆ నిధుల వినియోగం విషయంలో ఆధిపత్యం కోసం ఈసారి పేరేంట్స్ కమిటీ ఎన్నికల్లో హింస జరిగిందని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ పాఠాశాల

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM

పేరెంట్స్ కమిటీలు ఎలా వచ్చాయి..

మండల, జిల్లా పరిషత్ స్కూళ్లతోపాటూ ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీతోపాటు హైస్కూళ్లలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఉచిత, నిర్బంధ విద్య నిబంధనలు - 2010, 2013 నాటి జీవో ఎంఎస్ నెం.43ని అనుసరించి ఈ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.

ఈ ఎన్నికల కోసం సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ విడుదలయ్యింది. 22న ఇవి జరిగాయి. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ నుంచి ఎవరో ఒకరికి ఓటు హక్కు ఉంటుందని నిర్ణయించారు. అన్ని క్లాసులకు ప్రాతినిధ్యం ఉండేలా ప్రాథమిక పాఠశాలల్లో ఆరుగురు, ఇతర స్కూళ్లలో ఆరు లేదా అంతకుమించి సభ్యులను ఎన్నుకోడానికి కమిటీ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అవసరమైతే వీఆర్వోలు, ఎంపీడీవోలు, ఎంఈవోల సహకారం కూడా తీసుకోవచ్చని తెలిపారు.

సభ్యులతో పాటూ స్థానిక వార్డు సభ్యులు, కౌన్సిలర్ లేదా కార్పోరేటర్‌కి కూడా ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుందని నిబంధనల్లో ఉంది. హెడ్మాస్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. టీచర్లలో మరొకరికి కమిటీలో చోటు ఉంటుంది. అంగన్ వాడీ వర్కర్, ఏఎన్ఎం, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి కూడా కమిటీలో చోటు ఉంటుంది. స్థానికంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, విద్యావేత్త కోటాలో ఒకరికి కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం ఉంటుంది.

ప్రత్యక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకున్న తర్వాత వారంతా కలిసి కమిటీ చైర్ పర్సన్‌ని ఎన్నుకుంటారు. రెండేళ్ల పదవీకాలానికి ఈ ఎన్నిక జరుగుతుంది. ఈలోపు వారి పిల్లలు పాఠశాల వదిలి వెళ్తే వారి పదవీకాలం ముగుస్తుంది.

ఏపీ ప్రభుత్వ పాఠశాల

కమిటీ విధులు ఏమిటి

ఈ పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు ఆయా స్కూళ్లలో కొత్త విద్యార్థులను చేర్పించడానికి సహకరించాలి.

తమ ప్రాంతాల్లో పాఠశాల వాతావరణం ప్రశాంతంగా ఉండేలా అవసరమైన సహకారం అందించాలి. ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి.

పాఠశాల అభివృద్ధి కోసం వచ్చే నిధులను పర్యవేక్షించాలి. ముఖ్యంగా నాడు- నేడు లాంటి నిధులు నేరుగా తల్లిదండ్రుల కమిటీకే వస్తున్నాయి. గతంలో సర్వశిక్ష అభియాన్ నిధులను కూడా వారి ద్వారానే ఖర్చు చేసేవారు. అలా స్కూళ్లలో స్థానికుల భాగస్వామ్యం పెంచడం, నాణ్యతగా పనులు జరుగుతాయనే ఉద్దేశంతో ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే కొన్ని చోట్ల ఈ కమిటీలకు చైర్ పర్సన్‌గా ఎన్నికయిన వారి పెత్తనం వల్ల అసలు ఉద్దేశం ప్రశ్నార్థకంగా మారింది.

నిధులు సద్వినియోగం కావాలనేది ప్రభుత్వం ఉద్దేశం అయినా, అది ఎంతమేరకు జరుగుతోందనేది ప్రశ్నార్థకంగా మారిందని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో టీచరుగా పనిచేస్తున్న ఎం. వెంకటేశ్వర రావు అన్నారు.

"స్కూల్ పేరెంట్స్ కమిటీలో రాజకీయ నేతల పాత్ర పెరిగింది. స్థానికంగా తమ హవా చాటుకోవడానికి కొందరు నేతలు వారి అనుచరులతో ఈ కమిటీలను నింపేస్తున్నారు. నిధులను తమకు అనువుగా మలచుకుంటున్నారు.

ఫలితంగా పాఠశాలల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులు కొన్ని చోట్ల పక్కదారి పడుతున్నాయి. చాలా చోట్ల టీచర్లకు ఇవి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఈ కమిటీ పెద్దలు నేరుగా పాఠశాలలో తమ పెత్తనమే ఉండాలనే తరహాలో వ్యవహరిస్తున్నారు. స్కూల్ భవనాల నిర్మాణం విషయంలో హెచ్‌ఎంలను వేధిస్తున్నారు. కొందరు టీచర్లు మనకెందుకు తలనొప్పి అని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా పోతోంది" అని అన్నారు.

తమ పాఠశాలలో నాడు-నేడు పనుల్లో రాజకీయ నేతల జోక్యం మూలంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వెంకటేశ్వరరావు బీబీసీతో అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో ఘర్షణలు

ఫొటో సోర్స్, UGC

గతంలోనూ జరిగాయి..కానీ ఈసారి హింస

విద్యా కమిటీల ఎన్నికల్లో గతంలో కూడా చాలా చోట్ల గందరగోళం కనిపించింది. చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. కానీ ఈసారి కొన్ని చోట్ల అవి శృతిమించాయి. అధికార, విపక్ష నేతల మధ్యనే కాకుండా, పాలక వైసీపీలో వివిధ వర్గాల మధ్య కూడా పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. ఫలితంగా ఈ గొడవలు తలలు పగిలేవరకు, పోలీస్ కేసులు పెట్టేవరకు వెళ్లాయి.

పాఠశాలల్లో రాజకీయ జోక్యం ఉంటే ఇలాంటి సమస్యలు తప్పవని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో తమ బలం చాటుకోవడానికి వైసీపీ, టీడీపీ నేతలు నేరుగా ఈ ఎన్నికలను వాడుకోవడం సరికాదని విద్యావేత్త, ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు అంటున్నారు.

"జాతీయ విద్యాహక్కు చట్టంలో భాగంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు వచ్చాయి. వాటిని రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలి. కానీ ఏపీలో పార్టీలు వాటిని కూడా బలప్రదర్శనకు వేదికగా మార్చుకున్నాయి. పెత్తనం కోసం పోటీ పడుతున్నాయి. నాడు- నేడు నిధులు లేనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. రాజకీయంగా తమ బలాన్ని చాటుకోవడానికి ఈ ఎన్నికలు ఆధారం కావడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. పాఠశాలల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు చేసిన ప్రయత్నంలో ఈ కమిటీలు వస్తే, వాటిని ఇలా దుర్వినియోగం చేయడం బాధాకరం" అని అన్నారాయన.

కమిటీ ఎన్నికల్లో పోలీసులు

ఫొటో సోర్స్, UGC

వివాదాలతో కొన్ని చోట్ల వాయిదా

ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు జరపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

కానీ బుధవారం జరిగిన ఎన్నికల్లో దాదాపు 95 శాతం కమిటీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు మినహా మిగిలిన 46,609 స్కూళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 44,237 చోట్ల మాత్రమే ఎన్నికలు పూర్తయ్యాయి. 2,372 చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. వీటిలో ఎక్కువగా స్థానికంగా గొడవలు రావడమే కారణంగా కనిపిస్తోంది.

శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశంతోపాటూ రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఆయా కమిటీల ఎన్నికలు కూడా త్వరలో పూర్తి చేస్తామని ఏపీ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

అవినీతికి అడ్డాగా మార్చేస్తున్నారు - జవహర్

నాడు-నేడు పథకం కింద రూ. 3600 కోట్లకు పైగా వెచ్చించామని ప్రభుత్వం చెబుతున్నా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, నాసిరకం మెటీరియల్ సరఫరా చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసిన టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు.

"స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించిన తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం స్కూల్లో కూడా తాత్కాలికంగా బెంచీలు ఏర్పాటు చేసి, ఆయన వెళ్లిపోయాక వాటిని తరలించేశారు. ఇదంతా నాడు-నేడు పథకంలో జరుగుతున్న అవినీతికి నిదర్శనం. చాలా స్కూళ్లలో పై పై రంగులు వేసి హంగులు చూపిస్తూ, నిధులు స్వాహా చేస్తున్నారు. కొన్ని చోట్ల అడ్డుకున్న టీచర్లను వేధించిన ఘటనలు కూడా ఉన్నాయి. వైసీపీ నేతలు ఈ ఎన్నికల్లో దాడులు చేయడానికి కారణం ఆ నిధుల్లో పెత్తనం కోసమే. నాడు-నేడు అవినీతి త్వరలో బయటడుతుంది" ఆయన బీబీసీతో అన్నారు.

ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ఫొటో సోర్స్, FB/Audimulapu Suresh

ఫొటో క్యాప్షన్, ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అత్యధిక స్కూళ్లలో ఏకగ్రీవాలే

మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

"ప్రభుత్వ విద్యారంగం బాగుపడుతుంటే వారికి గిట్టడం లేదు. కార్పోరేట్ స్కూళ్లను కూడా వదిలి ఇప్పుడు పిల్లలు సర్కారీ బడులకు వస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యం. కానీ టీడీపీ నేతలు మాత్రం అంగీకరించరు. నాడు-నేడు పనులతో పాఠశాల విద్యారంగం రూపు రేఖలే మారిపోతుంటే నిరాధార ఆరోపణలతో మభ్యపెట్టాలనే ప్రయత్నం మంచిది కాదు" అన్నారు మంత్రి.

"రాష్ట్రంలో పేరెంట్స్ కమిటీలను 19వేలకు పైగా స్కూళ్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కొన్ని చోట్ల చెదరుమదురు ఘటనలు జరిగినా 95 శాతం ఎన్నికలు పూర్తి కావడం విశేషమే. ప్రభుత్వ విద్యారంగం పటిష్టతకు ఆయా కమిటీల భాగస్వామ్యం తోడ్పడుతుంది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

సీఎంతో విద్యా శాఖ మంత్రి

ఫొటో సోర్స్, FB/Audimulapu Suresh

రాజకీయ జోక్యం నివారించాలి

రాజకీయాల్లో అన్ని పదవుల్లోనూ తమ మనుషులు ఉండాలని ఆశించడం నేరం కాదు. కానీ విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం వల్ల పాఠశాల వాతావరణం దెబ్బతింటుందని, పిల్లలపై ఆ ప్రభావం పడుతుందని విద్యావేత్త ఎస్ రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

"పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో కొట్టుకుంటుంటే విద్యార్థులపై అది మానసికంగా దుష్ప్రభావాలకు కారణమవుతుంది. మంచి ఉద్దేశంతో అందరి భాగస్వామ్యం కోసం ఈ కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది దెబ్బతింటే అందరికీ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా పాలకపక్షం దీనిని గమనించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వారు మొదట దూరంగా ఉంటే, మిగతా పార్టీలు కూడా అలాగే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీలతో సంబంధం లేని ఈ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి రావడం మంచిది కాదు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)