అఫ్గాన్‌ నుంచి వచ్చిన రూ.9 వేల కోట్ల హెరాయిన్‌కూ, విజయవాడకూ ఏంటి లింకు?

ముంద్ర పోర్టు, గుజరాత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముంద్ర పోర్టు, గుజరాత్ (పాత చిత్రం)
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఈనెల 15న గుజరాత్‌‌లో పట్టుబడిన హెరాయిన్ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశమయ్యింది. అప్గానిస్తాన్ నుంచి టాల్కమ్‌ పౌడర్ ముసుగులో రవాణా చేస్తున్న రెండు కంటైనర్ల హెరాయిన్‌ని గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీలలో ఇదంతా పట్టుబడింది. దాని విలువ సుమారుగా రూ. 9 వేల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.

అప్గానిస్తాన్‌లోని కాందహార్‌కి చెందిన హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి దీనిని దిగుమతి చేసుకున్నారు. ఆశీ ట్రేడింగ్ ఫరమ్స్ అనే సంస్థ పేరుతో ఇది భారతదేశంలోకి వచ్చింది. చెన్నైకి చెందిన ఆ సంస్థ తన అడ్రస్‌గా విజయవాడ సత్యన్నారాయణపురంలోని ఓ భవనాన్ని పేర్కొనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

జీఎస్టీ సర్టిఫికెట్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా పరిశీలిస్తే అక్కడ ఓ భవనం మాత్రమే ఉంది. దాంతో ఆ హెరాయిన్ విజయవాడకే తరలిస్తున్నారనే రీతిలో ప్రచారం సాగింది.

అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు, నల్లమందు

ఫొటో సోర్స్, AFP

దీనిపై ఏపీ డీజీపీ కార్యాలయం స్పందించింది. గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌కి ఏపీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పింది.

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన మాచవరం సుధాకర్ అనే వ్యక్తి తన భార్య తల్లి గోవిందరాజు తారక పేరుతో విజయవాడ గడియారపు వీధిలో ఉన్న భవనాన్ని చూపించి జీఎస్టీ సర్టిఫికెట్ తీసుకున్నారు.

గత ఏడాది ఆగస్టులో ఆ సర్టిఫికెట్ పొందారు. దాంతో పాటు ఎగుమతులు, దిగుమతులు చేసేందుకు కూడా అదే అడ్రస్‌తో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ లైసెన్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి తీసుకున్నారు. కానీ సుధాకర్ త పాటుగా ఆయన భార్య వైశాలి కూడా చాలాకాలంగా చెన్నైలో ఉంటూ విజయవాడ అడ్రస్‌తో తీసుకున్న సర్టిఫికెట్ల ఆధారంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.

గుజరాత్ కి చేరుకున్న హెరాయిన్‌ని అక్కడి నుంచి ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

దానికి సంబంధించిన ఆధారాలను ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై కేంద్రాలలో నిర్వహించిన సోదాలలో అధికారులు కనుగొన్నారు. కానీ ఏపీకే ఈ హెరాయిన్ ఎగుమతి చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని డీజీపీ కార్యాలయ పీఆర్వో పేర్కొన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న ఈ కేసులో సమాచారం అందగానే విజయవాడలోని ఇంటిని గుర్తించి, విచారణ చేశామని తెలిపారు. కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)