అఫ్గానిస్తాన్‌లో భారీగా బంగారం, తాలిబాన్ల పాలనలో ఈ నిధి ఎవరికి దక్కనుంది?

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలెక్సీ కల్మికోవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా అఫ్గాన్‌లోని సహజ వనరులపై ఉంది.

ఆ దేశంలో బంగారం, రాగి, లిథియం ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటి విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండవచ్చని ఒక అంచనా.

అయితే ప్రస్తుతం అఫ్గానిస్తాన్ తాలిబాన్ల హస్తగతం అయిన తరువాత ఈ సంపదపై ఎవరికి హక్కులు ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎన్నో ఏళ్లుగా యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న ఈ దేశంలో తాలిబాన్లు మళ్లీ పట్టు సాధించారు. ఇక్కడ ఉన్న సహజ సంపద, మానవ వనరులు, భౌగోళిక స్థితిని వారు సద్వినియోగం చేసుకోగలుగుతారా?

అఫ్గాన్ కొండలు, లోయల్లో రాగి, బాక్సైట్, ఇనుము లాంటి లోహాలతో పాటు ఎంతో విలువైన బంగారం, పాలరాయి వంటి ఖనిజ సంపద కూడా నిక్షిప్తమై ఉందని సోవియట్, అమెరికన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఆ దేశం వీటిని బయటకు తవ్వి తీసి, వినియోగించుకోనప్పటికీ, వీటి నుంచి వచ్చే సంపాదన అఫ్గాన్ ప్రజల జీవితాలను మార్చగలదు.

భారతదేశం, బ్రిటన్, కెనడా, చైనాల పెట్టుబడిదారులు అఫ్గానిస్తాన్‌తో పలు ఒప్పందాలపై సంతకాలు చేశారుగానీ ఇంతవరకు ఎవరూ మైనింగ్ ప్రారంభించలేదు.

ప్రపంచ బ్యాంకు ప్రకారం వాణిజ్యానికి అనువైన దేశాల ర్యాంకింగ్‌లో 190 దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్ 173వ స్థానంలో ఉంది.

అఫ్గానిస్తాన్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి

మ్యాపులు ఉన్నాయిగానీ...

మైనింగ్‌కు అనువైన సైట్‌ల గురించి సమాచారం చాలాకాలంగా అందుబాటులో ఉంది. 1960లలో ఈ సమాచారాన్ని సోవియట్ యూనియన్ నుంచి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సేకరించారు.

ఈ ఫైళ్లపై, మ్యాపులపై దుమ్ము పేరుకుపోయిందిగానీ గనుల తవ్వకాలు ప్రారంభం కాలేదు. కర్మాగారాలు కట్టలేదు.

రాగి, ఇనుమును భూమి నుంచి తీయలేకపోయారు. అందుకని గుర్తుగా ఆ కొండలకు ఎరుపు, ఆకుపచ్చ రంగులు వేసి ఉంచేశారు.

చేతి పద్ధతుల ద్వారా లాపిస్ లాజులి, పచ్చలు, మాణిక్యాలను మాత్రం తవ్వి తీసేవారు. అయితే, ఇవన్నీ కూడా అక్రమ తవ్వకాలే. వీటిని పాకిస్తాన్‌కు అక్రమ రవాణా చేసేవారు.

అఫ్గానిస్తాన్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి

ఫొటో సోర్స్, AFP

నల్లమందు మీద ఆధారపడిన ఆర్థికవ్యవస్థ

ఖనిజాల కన్నా నల్లమందు (ఓపియం)పై అఫ్గాన్ ఆర్థికవ్యవస్థ ఎక్కువగా ఆధారపడింది.

నల్లమందు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి ఆ దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాలలో సుమారు 10 శాతం ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అఫ్గానిస్తాన్ ఇతర ఎగుమతులకన్నా నల్లమందు ఎగుమతి రెండు రెట్లు ఎక్కువ.

సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఈ దేశం, ప్రపంచ మార్కెట్‌కు రాగి, లిథియం సరఫరా చేయలేదుగానీ ముడి నల్లమందు, హెరాయిల్‌లను 85 శాతం సరఫరా చేసింది.

గత ఇరవై సంవత్సరాలలో ఇక్కడ తిష్ట వేసిన అమెరికన్ దళాలు మైనింగ్ పరిశ్రమ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాయి.

పాత దస్తావేజుల నుంచి సోవియట్ మ్యాప్‌ల దుమ్ము దులిపి, వాటి ఆధారంగా సొంతంగా మ్యాపులు తయారుచేసే ప్రయత్నాలు చేశాయి.

ఒక దశాబ్ద కాలంలో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే 40 టెరాబైట్ల డేటాను సేకరించింది. దానిని జాగ్రత్తగా కాపాడేందుకు అఫ్గాన్లకు శిక్షణ ఇచ్చింది.

హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్‌ను ఉపయోగించి దాదాపు 100% పరిశోధనలు చేసిన మొదటి దేశంగా అఫ్గానిస్తాన్ నిలిచింది. ఈ పద్ధతిని ఉపయోగించి అమెరికన్లు 60 అత్యాధునిక మ్యాపులను తయారుచేశారు.

ఈ మ్యాపులను ఉపయోగించి వనరులను అంచనా వేయగలం. కానీ, వాణిజ్య ఉత్పత్తికి అనువుగా వాటిని సిద్ధం చేయలేం.

అఫ్గానిస్తాన్‌లో మూడు ట్రిలియన్ డాలర్ల విలువైన లిథియం, ఇతర అరుదైన లోహాల నిల్వలు ఉన్నాయని ఒక అంచనా. వీటిని వెలికి తీయడానికి డబ్బు, సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అవసరం. అఫ్గానిస్తాన్ వద్ద అవి లేవు.

అఫ్గాన్

ఫొటో సోర్స్, AFP

మైనింగ్‌పై భారత్, చైనాల ఆసక్తి

అమెరికా దళాలు ఉన్నప్పుడు అఫ్గానిస్తాన్‌లోకి విదేశీ నిధులు రావడం పెరిగింది. అనేక దేశాల నుంచి అఫ్గానిస్తాన్ ఆర్థిక సహాయం పొందింది. రోడ్లు, విద్యుత్, వ్యవసాయం, మానవ వనరుల అభివృద్ధికి తగినంత డబ్బు లభించింది.

ఆరోగ్యం, విద్య, సమానత్వం సాధించే దిశగా కృషి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఐదు బిలియన్ డాలర్ల మొత్తాన్ని కూడా ఇచ్చింది.

అయితే, మైనింగ్ అభివృద్ధికి కూడా అఫ్గాన్ ప్రభుత్వం విదేశాలను సహాయం కోరింది. పలు విదేశీ పెట్టుబడిదారులు ఇందులో ఆసక్తి చూపించారు కూడా.

పొరుగు దేశాలైన భారత్, చైనాలు ఆర్థిక కోణాల కన్నా రాజకీయపరంగా అఫ్గానిస్తాన్‌లో మైనింగ్‌పై ఎక్కువ ఆసక్తి కనబరిచాయి.

భారతదేశం 11 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడింది. ఇప్పటికే మూడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది కూడా. కానీ ఇప్పుడు అవి వెనక్కి మరలుతున్నాయి.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో పలు భారతీయ కంపెనీలు అక్కడ మెటలర్జీ ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి. అయితే, మొదట ఇనుప ఖనిజం నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. తరువాత భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

ఇప్పుడు అఫ్గాన్‌లో అధికారం మారిపోయింది. చైనాతో తాలిబాన్లకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ, అక్కడ అంతర్యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తే చైనా భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాకపోవచ్చు.

2008లో కాబుల్ సమీపంలోని మెస్ ఐనాక్ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ డిపాజిట్‌ నిర్మించడానికి చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని ఒక సంస్థకు అనుమతి లభించింది.

యునెస్కో చారిత్రక వారసత్వ సంపద జాబితాలో చేర్చిన ఈ బౌద్ధ స్మారక చిహ్నం దిగువన 11 టన్నుల రాగి ఖనిజం ఉన్నట్లు అంచనా. కానీ, 12 సంవత్సరాల తరువాత కూడా ఆ స్మారక చిహ్నం చెక్కుచెదరకుండా ఉంది. దాని కింద రాగి కూడా అలాగే ఉంది.

2016లో అఫ్గానిస్తాన్‌లో భవిష్యత్తు గనులను తమ ఆధీనంలోని తీసుకుంటున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. అప్పట్లో ఆ దేశంలో ఉన్న అమెరికా అధికారులు దీన్ని ఖండించారు.

రెండేళ్ల క్రితం, ప్రాథమిక స్థాయిలో ఉన్న ఒక గనిపై తాలిబాన్లు దాడి చేసి చైనా నియమించిన ఎనిమిది మంది అఫ్గాన్ కార్మికులను చంపేశారు.

AFP

ఫొటో సోర్స్, AFP

చైనా మళ్లీ మైనింగ్ పనులు ప్రారంభిస్తుందా?

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా చైనా ప్రాజెక్టుల పనులన్నీ నిలిపివేసినట్లు ఆ దేశ అధికారి తెలిపారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

అమూ దరియా బేసిన్ ప్రాంతంలో చైనా చమురు ఉత్పాదక సంస్థ సీఎన్‌పీసీ చమురు ఉత్పత్తిని నిలిపివేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా మెటలర్జికల్ గ్రూప్, ఐనాక్ కాపర్ డిపాజిట్ జియాన్సీ కాపర్ కోతో కలిసి తిరిగి పని ప్రారంభించాలని ఆలోచిస్తోంది. అయితే దీనికి రెండు షరతులు ఉన్నాయి.

"అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలి. తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ఇవే ఆ రెండు షరతులు" అని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది.

అఫ్గానిస్తాన్‌పై చైనా ఆశ వదులుకోలేదు. కానీ, తొందరపడడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)