ఒక అఫ్గాన్ మహిళ కథ: ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’

వేలాది మంది ప్రజలు అఫ్గానిస్తాన్ నుంచి పారిపోవాలని చూస్తున్నారు.

ఫొటో సోర్స్, ANADOLU

ఫొటో క్యాప్షన్, వేలాది మంది ప్రజలు అఫ్గానిస్తాన్ నుంచి పారిపోవాలని చూస్తున్నారు
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ న్యూస్

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో అనేక మంది ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోయేందుకు పరుగులు పెట్టారు.

అఫ్గానిస్తాన్‌కు చెందిన "డి" అనే మహిళ కూడా తన కొడుకుతో కలిసి సూట్ కేసులో నగలు, వాచీలు, కొంత డబ్బు, హార్డ్ డ్రైవ్స్, పనికి సంబంధించిన పత్రాలు, సరిపడినన్ని బట్టలు పట్టుకుని బయలుదేరారు. చలి ప్రాంతాల్లో చిక్కుకుంటే చలి నుంచి కాపాడుకునేందుకు కొన్ని ఊలు దుస్తులు కూడా పెట్టుకున్నారు.

ఆమె కాబుల్ నివాసి కాదు. ఇప్పటికే ఆమె ఒక వారం రోజులుగా పరుగు పెడుతూనే ఉన్నారు.

తాలిబాన్లు ఆక్రమించిన సరిహద్దుల్లో ఉన్న నగరం నుంచి పారిపోయి ఆమె కాబుల్ వచ్చారు. ఆమె ఒక మహిళా హక్కుల ఉద్యమకారిణి. తాలిబాన్లు ఆమె నివాసం ఉండే పట్టణాన్ని ఆక్రమించిన తర్వాత ఆ ఊరిలో ఉండటం ఆమెకు సురక్షితంగా అనిపించలేదు.

తలకి స్కార్ఫ్ కప్పుకుని, ముఖానికి మాస్క్, చేతికి గ్లోవ్స్ వేసుకుని ఆమె కొడుకుతో పాటు ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు కాబుల్ లో ట్యాక్సీ కోసం వెతికారు. చివరకు ట్యాక్సీ దొరకక, మండే ఎండలో చేతిలో సూట్ కేసులు మోస్తూ ఒక గంట సేపు నడిచారు.

ఎయిర్ పోర్ట్ దగ్గరకు వెళ్లేసరికి అదంతా గందరగోళంతో నిండిన సుడిగుండంలా కనిపించింది. పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఎయిర్ పోర్ట్ గోడలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ, రోడ్ల పై పరుగులు తీస్తూ, ట్యాక్సీవేస్ దగ్గర చతికిలపడుతూ, ఆగిన విమానాల పైకి ఎక్కి కూర్చుంటూ కనిపించారు.

ఎలా అయినా స్వేచ్ఛను పొందాలనే ఆశతో కొంత మంది యువకులు కదులుతున్న అమెరికా వైమానిక దళ విమానాలకు వేలబడుతూ కనిపించారు.

సాయంత్రం అయ్యేవరకూ డి తన కొడుకుతో కలిసి విమానం దొరుకుతుందేమోనని ఎదురు చూశారు. ఎటువంటి లాభం లేకపోవడంతో, ఇద్దరూ వెనుతిరిగారు. అయితే, వారికి ఎదురుగా అదే సమయంలో కొన్ని వేల మంది ఎయిర్ పోర్టులోకి రావడం మొదలయింది.

ఎటుచూసినా గుంపుల కొలదీ జనమే. ఆ గుంపుల్లో వారు చిక్కుకున్నారు. ఆ గుంపులో ఎవరో వారి సంచులను కూడా దొంగలించారు.

"మా కళ్ళ ముందే వాటిని లాగేసుకుంటుంటే మేము నిస్సహాయంగా ఉండిపోయాం" అని డి కాబూల్ నుంచి ఫోన్ లో నాకు చెప్పారు. ఆమె గొంతు వణుకుతోంది.

"వాళ్ళు మా సంచులు పట్టుకుని పారిపోయారు. మేము అన్నిటినీ తిరిగి కోల్పోయాం" అని ఆమె అన్నారు.

ఆమె విషాదంలో మునిగిపోయారు.

"నాకు గుర్తున్నంత వరకూ నా బాల్యం, నా యవ్వనానికి సంబంధించిన వస్తువులన్నీ దోచుకున్నారు. నా కుటుంబం, నా పని మాత్రమే నన్ను రక్షించాయి" అని అన్నారు.

ఎయిర్ పోర్టు వరకు కూడా చేరలేని జనసందోహం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఎయిర్ పోర్టు వరకు కూడా చేరలేని జనసందోహం

గత రెండు దశాబ్దాలుగా డి అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కులకు సంబంధించిన గ్రూపులను నిర్వహిస్తున్నారు. ఈ బృందాల ద్వారా ఆమె బాలికలకు చదువు నేర్పించడం మాత్రమే కాకుండా, మహిళలకు ఆశ్రయం కల్పించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

అయితే, ఇప్పుడు తనపై ప్రతీకారం తీర్చుకుంటారేమోనని ఆమె భయపడుతున్నారు. ఆమె సహాయం చేసిన కొంత మంది మహిళల తండ్రులు, భర్తలు, సోదరులు, మేనమామలు, చిన్నాన్న పెదనాన్నలు, వివాహం చేసుకోబోయే వారు జైలుకు వెళ్లారు.

కాబుల్‌ను స్వాధీనపర్చుకునే క్రమంలో తాలిబాన్లు చాలా మందిని జైళ్ల నుంచి విడుదల చేశారు. అందులో చాలా మంది ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండవచ్చని చెప్పారు. .

"వాళ్ళు కచ్చితంగా నా కోసం వెతుకుతూ వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. "నేనప్పటకి ఆ ఊరి నుంచి బయటపడకపోయి ఉంటే నాకేమి జరిగి ఉండేదో నాకు తెలియదు" అని ఆమె అన్నారు.

తాలిబాన్లు ఆమె నగరానికి రాక ముందే, డి ఆమె కొడుకుతో కలిసి ఊరు విడిచిపెట్టారు.

వారిద్దరూ రెండు వేర్వేరు విమానాల్లో కాబుల్ కి ప్రయాణమయ్యారు.

ఆమె భర్త రెండు రోజుల పాటు ప్రయాణం చేసి రోడ్డు మార్గం ద్వారా కాబుల్ చేరారు.

ఆమె ఇంటి దగ్గర ఉండే గార్డ్ తో డి ఫోన్ లో మాట్లాడారు. ఆమె అపార్ట్మెంట్ దగ్గరకు ఎవరో వచ్చి వెళ్లారని ఆ గార్డ్ చెప్పారు.

"తాలిబాన్లు మా ఊరిని ఆక్రమించిన మొదటి రోజు రాత్రే మా కోసం వెతుక్కుంటూ వచ్చి తలుపు కొట్టారు. అయితే, గార్డ్ తలుపు తీయడానికి అంగీకరించలేదు" అని చెప్పారు. .

గార్డును కాల్చి పడేసి అపార్ట్మెంట్ వెతుకుదామని వాళ్ళు అనుకుంటున్న మాటలు గార్డు చెవిలో పడ్డాయి. అయినా వారు అలాంటి పనికి పాల్పడకుండానే వెనుతిరిగినట్లు గార్డు తనతో చెప్పినట్లు డి తెలిపారు.

"ఆ మరుసటి రోజు ఉదయమే వాళ్ళు తిరిగి వచ్చి, గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు.

వాళ్ళు అనేక ప్రశ్నలను ఆయనను సంధించారు. డి, ఆమె కుటుంబం ఎక్కడున్నారు? వారి కార్లు ఎక్కడున్నాయి?" అని గార్డును అడిగినట్లు చెప్పారు.

"ఆ రోజు నుంచీ ప్రతీ రోజూ వాళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్లు తెలిసింది. మా ఇంటిని చిందరవందర చేసి దోచుకున్నారు" అని డి చెప్పారు.

"వాళ్లెవరో నాకు తెలియదు. వాళ్లంతా ముఖానికి స్కార్ఫ్ లు ధరించి ఉన్నారు. వారి వెనుక స్థానిక తాలిబాన్లు ఉన్నట్లుగా తెలిసింది" అని చెప్పారు.

తాలిబాన్లు ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కొకుండానే కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తాలిబాన్లు ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కొకుండానే కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు.

అఫ్గాన్ యుద్ధం, హింస నేపథ్యంలో డి సాహసోపేతంగా జీవిస్తున్నారని చెప్పవచ్చు. ఆమె స్కూలులో చదువుతున్న సమయంలో సోవియట్ సేనలు, ముజాహిదీన్ ల మధ్య జరిగిన యుద్ధంలో పాఠశాలపై జరిగిన రాకెట్ దాడుల నుంచి ఆమె బయటపడ్డారు.

తలకి స్కార్ఫ్ వేసుకోవడం నిరాకరించిన స్కూల్ హెడ్ మిస్ట్రెస్‌ను హత్య చేశారని ఆమె చెప్పారు.

కమ్యూనిస్ట్ భావజాలాన్ని సమర్ధించినందుకు మరో టీచర్‌ను కూడా చంపేశారని చెప్పారు.

స్కూలు చదువు ముగిసిన తర్వాత ఆమె కాబుల్‌కి వెళ్లారు.

1990లలో పౌర యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమెకు వివాహమైంది. ఆమె విద్యాభ్యాసం పూర్తయింది.

పిల్లలు పుట్టారు. యుద్ధం అన్ని ప్రాంతాలను కబళిస్తుండటంతో, ఆమె ఎప్పటికప్పుడు తన ఇళ్లను మారుస్తూనే ఉండేవారు.

"పిక్నిక్ చేసుకునేవాళ్ళలా మేము తిరుగుతూనే ఉన్నాం. మా చుట్టుపక్కల పోరాటం మొదలయ్యే సమయానికి మేము మా బెడ్డింగ్ తీసుకోవడం.. మరో చోటుకు వెళ్లడం.. ఇదే మా పని" అని చెప్పారు.

1996లో తాలిబాన్లు నగరాన్ని స్వాధీనపర్చుకునే సమయానికి డి తన ఉద్యోగాన్ని కోల్పోయారు.

దాంతో, కాబుల్‌లో ఉన్న అపార్ట్మెంట్ కి తిరిగి వచ్చారు. ఆమె తాలిబాన్లు బాలికల విద్య పై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పిల్లలకు అక్కడ నుంచే చదువు చెప్పడం మొదలుపెట్టారు. ఆ అపార్టుమెంట్లో అవసరం వస్తే టీచింగ్ మెటీరియల్ ను కాల్చి పడేయడానికి ఒక ఓవెన్ ఉండేది.

2001లో కొత్త రకమైన యుద్ధం మొదలయింది. కానీ, తాలిబాన్ల నిష్క్రమణతో తిరిగి విద్యను నేర్పించే అవకాశం కలిగింది. దాంతో, ఆమె అఫ్గానిస్తాన్ లోని బాలికలు, మహిళల సంక్షేమం కోసం పని చేయడం మొదలుపెట్టారు. "అదేమీ అంత సులభంగా జరగలేదు" అని ఆమె అన్నారు.

"నా జీవితమంతా పోరాడుతూనే ఉన్నాను. నేను జీవితంలో ఎప్పుడూ సంతోషంగా గడపలేదు. మీరు అఫ్గానిస్తాన్‌లో మహిళల కోసం పని చేస్తుంటే.. శత్రువులను పోగు చేసుకుంటున్నట్లే. అలాగే, చాలా మంది పురుషులకు లక్ష్యంగా కూడా మారతారు" అని చెప్పారు.

2001 తర్వాత బాలబాలికలు పక్కపక్కనే కూర్చుని చదువుకునేవారు. ఇప్పుడు బాలికల విద్య పట్ల చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2001 తర్వాత బాలబాలికలు పక్కపక్కనే కూర్చుని చదువుకునేవారు. ఇప్పుడు బాలికల విద్య పట్ల చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

తాలిబాన్లు రెండు వారాల క్రితం ఆమె సొంత ఊరును స్వాధీన పరుచుకున్న వెంటనే, ఆమె వారి లక్ష్యంగా మారుతారని భయపడ్డారు. ఆమె చేస్తున్న పని వల్ల ఆమె ముగ్గురు కొడుకులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కిడ్నాప్ చేస్తామనే బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు.

ఆమె ఇద్దరు కొడుకులను అంతకు ముందే అమెరికా పంపించేశారు. పెద్ద కొడుకు తండ్రిని చూసి పదేళ్లు అవుతోంది. చిన్న కొడుకు మూడేళ్ళుగా తండ్రిని చూడలేదు.

కాబుల్ ను తాలిబాన్లు స్వాధీనపర్చుకున్న వెంటనే, అఫ్గానిస్తాన్ లో ఉండిపోయిన ముగ్గురు కుటుంబ సభ్యులు భయాందోళనల్లో మునిగిపోయారు.

"నేను అలిసిపోయాను అమ్మా! " అని కొడుకు తనతో అన్నట్లు డి చెప్పారు.

‘‘నువ్వు చేస్తున్న పని వల్ల మనం ఇలా ఎన్నాళ్ళు పరుగు పెట్టాలి? ఎన్ని రోజులు రహస్యంగా బ్రతకాలి? నువ్వు చేసే పని కోసం మేమెందుకు మూల్యం చెల్లించాలి?" అని కొడుకు తనను అడిగినట్లు డి చెప్పారు.

ఎంత ఓదార్చినా తీరని విషాదంలో డి మునిగిపోయారు.

"నేను చేసే పని, నా కుటుంబమే నా ఆనందం. నా సంతోషాన్ని కూడా వాళ్ళు దోచుకున్నారు" అని ఆమె అన్నారు.

వారం చివరకు కాస్త ఆశ కనిపించింది. ఆమె కుటుంబానికి అమెరికాకు కానీ, యూరప్ కు కానీ టికెట్లు దొరకవచ్చనే కబురు తెలిసింది.

వారంతా తిరిగి ఎయిర్ పోర్టుకు వెళ్లి ఎదురు చూసారు. గత మూడు వారాల్లో వాళ్ళు ఎయిర్ పోర్టుకు రావడం ఇది మూడవ సారి.

ఈ సారి వాళ్ళతో పాటు విలువైన వస్తువులతో కూడిన మూడు చిన్న సంచులను మాత్రమే తీసుకుని వెళుతున్నారు.

"మేము పట్టుకుని వెళ్ళడానికి కూడా మా దగ్గర ఇంకేమీ లేదు" అని ఎయిర్ పోర్టు నుంచి మాట్లాడుతూ డి నాతో చెప్పారు.

"మేమెక్కడికి వెళితే అక్కడ బట్టలు కొనుక్కుంటాం" అని చెప్పారు.

ఆమె కొడుకు ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉన్నాడా అని అడిగాను. "లేడు" అని చెప్పారు.

"పరుగుపెట్టడం అనేది తనెప్పుడూ ఎంచుకోలేదు. మాకెప్పుడూ మనుగడ ప్రశ్నగానే ఉంది. నేను చేసే పనికి నా కుటుంబం మూల్యం చెల్లిస్తోంది" అని అన్నారు.

శుక్రవారం తిరిగి ఎయిర్ పోర్టుకు వెళుతున్నామని చెబుతూ డి ఆమె కొడుకును నిద్రలేపినప్పుడు, " నాకు నిద్రపోవాలని ఉంది. నాకు స్వేచ్ఛగా బ్రతకాలని ఉంది" అని అన్నాడని చెప్పారు.

నేను డి తో శుక్రవారం మాట్లాడాను. డి కొన్ని వేల మంది అఫ్ఘాన్ ప్రజలలాగే ఒక అనిశ్చితిలో ఉన్నారు.

ఆమె గమ్యమేమిటో తెలియదు. జీవితం అనిశ్చితంగా ఉంది. ఒక్కసారిగా అగాధంలోకి తోసేసినట్లుగా వారి జీవితం మారిపోయింది.

"ఇదింత త్వరగా జరుగుతుందని ఊహించలేదు. మేము ఈ మధ్యనే ఇంటికి రంగులు వేసుకున్నాం. వచ్చే సంవత్సరం శాంతియుత జీవితం గడుపుదామని ఆశించాం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)