అఫ్గానిస్తాన్: పాకిస్తాన్‌తో సరిహద్దులను మూసేసిన తాలిబాన్లు, భారత్‌లో డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగే అవకాశం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాబుల్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం, భారత్-అఫ్గానిస్తాన్‌ల వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనావేశారు.
ఇప్పుడు అదే జరుగుతోంది. సరిహద్దుల వెంబడి వాణిజ్యాన్ని తాలిబాన్లు నిలిపివేశారని భారత్ వెల్లడించింది.
భారత్-అఫ్గాన్‌ల మధ్య వాణిజ్యంలో పాకిస్తాన్ భూభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాక్ రహదారుల మీదుగా భారత్, అఫ్గాన్‌ల వాణిజ్య వాహనాలు తిరుగుతుంటాయి. ఇప్పుడు ఈ రహదారులను తాలిబాన్లు మూసివేశారు.
‘‘ప్రస్తుతం వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో లక్షల డాలర్ల విలువైన ఎగుమతులు, దిగుమతులు మధ్యలోనే నిలిచిపోయాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈవో) తెలిపింది.
‘‘పాక్‌తో సరిహద్దులను తాలిబాన్లు మూసివేశారు. మనం అఫ్గాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు అక్కడి చెక్‌పోస్టుల గుండా పాక్‌లోకి వెళ్లి, ఆ తర్వాత భారత్‌లోకి వస్తాయి. ప్రస్తుతం ఈ మార్గాలను మూసివేశారు. దీంతో సరిహద్దుల వెంబడి వాణిజ్యం నిలిచిపోయింది. ఎగుమతిదారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వారు గందరగోళంలో పడిపోయారు’’ అని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ బీబీసీతో చెప్పారు.
‘‘ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. మేం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గాన్‌లో ఎగుమతుల వాటా..
అఫ్గాన్ జీడీపీలో ఎగుమతుల వాటా 20 శాతం వరకు ఉంటుంది. అంటే జీడీపీలో ఐదో వంతుకు ఎగుమతులే ఆధారం.
కార్పెట్లు, రగ్గులను అఫ్గాన్ ప్రధానంగా ఎగుమతి చేస్తుంది. ఎగుమతుల్లో 45 శాతం వాటా వీటిదే. ఆ తర్వాత స్థానంలో డ్రై ఫ్రూట్స్ (31 శాతం), ఔషధ వన మూలికలు (12 శాతం) ఉంటాయి.
అఫ్గాన్ నుంచి వచ్చే ఎగుమతుల్లో 48 శాతం పాకిస్తాన్‌కే వెళ్తాయి. ఆ తర్వాతి స్థానంలో భారత్ (19 శాతం), రష్యా (9 శాతం) ఉన్నాయి. ఇరాన్, ఇరాక్, టర్కీలకు కూడా వస్తు, సామగ్రిని అఫ్గాన్ ఎగుమతి చేస్తుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ద్వైపాక్షిక వాణిజ్యం..
గత 20ఏళ్లలో అఫ్గాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా భారత్ మారింది. డ్యాంలు, స్కూళ్లు, రోడ్ల నిర్మాణం కోసం లక్షల్లో భారత్ ఖర్చుపెట్టింది.
అఫ్గాన్ పార్లమెంటు భవనం కూడా భారత్ కట్టి ఇచ్చిందే.
అఫ్గాన్ ఎగుమతుల విషయంలో పాక్ తర్వాతి స్థానం భారత్‌దే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్-అఫ్గాన్‌ల మధ్య వాణిజ్యం 1.4 బిలియన్ డాలర్లు. అంటే రూ.10,387 కోట్లు. 2019-20లో ఇది 1.5 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే రూ.11,131 కోట్లు.
2020-21లో అఫ్గాన్‌కు రూ.6,129 కోట్ల విలువైన ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. రూ.3,783 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ.7,410 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. రూ.3,936 కోట్ల విలువైన వస్తువలను దిగుమతి చేసుకుంది.
2001లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గద్దె దించిన అనంతరం, విదేశీ వాణిజ్యానికి అఫ్గాన్ ప్రాధాన్యాన్ని ఇస్తూ వచ్చింది.
గత 20ఏళ్లుగా అంతర్జాతీయ నిధులపై అఫ్గాన్ ఎక్కువగా ఆధారపడుతూ వస్తోంది. అఫ్గాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో భారత్ కూడా ఒకటి.
అఫ్గాన్‌లోని చాలా ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టింది. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలు కూడా బలపడ్డాయి.
2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో భారత్ నుంచి అఫ్గాన్‌కు ఎగుమతులు 89 శాతం పెరిగాయి. మరోవైపు భారత్‌కు దిగుమతులు కూడా 72 శాతం పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఏం కొంటోంది?
80 శాతం డ్రై ఫ్రూట్స్‌ను ఆసియా, ఐరోపా దేశాలే దిగుమతు చేసుకుంటున్నాయి.
2006 నుంచి 2016 మధ్య బాదం, వాల్‌నట్స్ దిగుమతులు రెట్టింపు అయ్యాయి.
ఆసియాలో చైనా, భారత్, వియత్నాంలు అతిపెద్ద డ్రై ఫ్రూట్స్ దిగుమతిదారులు.
డ్రై ఫ్రూట్స్‌ను అఫ్గాన్ భారీగా ఎగుమతి చేస్తోంది. ఇక్కడి నుంచి భారత్‌కు పెద్దయెత్తున డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి.
‘‘అఫ్గాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల్లో సగం వరకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కొన్ని తాజా పళ్లను కూడా మనం దిగుమతి చేసుకుంటాం. ఉల్లిపాయలను కూడా కొంటాం. అయితే సరిహద్దులను మూసి వేయడంతో ఈ ఉత్పత్తులను భారత్‌కు తీసుకురావడం కష్టం అవుతోంది’’ అని సహాయ్ అన్నారు.
అఫ్గాన్ నుంచి భారత్‌కు వచ్చే డ్రై ఫ్రూట్స్ జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. దీనిలో బాదం, వాల్‌నట్స్, ఫిగ్స్, అప్రికాట్స్ తదితర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి.
యాపిల్స్, చెర్రీస్, దానిమ్మ, పుచ్చకాయలు తదితర తాజా పళ్లను కూడా అఫ్గాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. కుంకుమ పువ్వు, జీలకర్ర, ఇంగువ తదితర ఉత్పత్తులు కూడా జాబితాలో ఉన్నాయి.
ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ నివేదిక ప్రకారం.. అఫ్గాన్ నుంచి భారీగా డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.
ఈ జాబితాలో అమెరికా, జర్మనీ, హాంకాంగ్ మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం భారత్‌దే.

ఫొటో సోర్స్, Reuters
భారత్ నుంచి అఫ్గాన్‌కు వెళ్లే ఉత్పత్తుల్లో ఔషధాలు, టీ, కాఫీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మిరియాలు, పత్తి కూడా భారత్ నుంచి అఫ్గాన్‌కు వెళ్తుంటాయి.
‘‘మన ఎగుమతులు చాలా వరకు ఇరాన్ గుండా అఫ్గాన్‌కు వెళ్తుంటాయి. కొన్ని ఉత్పత్తులు దుబాయ్ నుంచి కూడా వెళ్తాయి. వీటిని ఎగుమతిచేసేవారు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. వీటిని దిగుమతి చేసుకునే అఫ్గాన్ వ్యాపారవేత్తలు.. కాస్త వేచి చూడాలని అంటున్నారు’’ అని సహాయ్ వివరించారు.
వ్యాపారవేత్తలు క్రెడిట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించామని సహాయ్ చెప్పారు. దీని వల్ల రానున్న రోజుల్లో వారికి రక్షణ ఉంటుందని వివరించారు.
‘‘అఫ్గాన్‌కు ఉత్పత్తులను ఎగుమతి చేయాలనుకునే వారంతా క్రెడిట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే అఫ్గాన్‌లో నేటి పరిస్థితులు, ఆంక్షలతో ఎగుమతులు స్తంభించిపోయే అవకాశముంది. ప్రస్తుతానికి మేం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. అయితే, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి’’అని ఆయన అన్నారు.
‘‘భారత ఎగుమతుల్లో అఫ్గాన్‌కు వెళ్లేవి చాలా కొద్ది మొత్తంలో ఉండటంతో.. ఆ ప్రభావం మన మార్కెట్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఎగుమతిదారులపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన అన్నారు.
‘‘ఏదైనా దేశం నుంచి దిగుమతులు ఆగిపోయినప్పుడు, ఊహాగానాల నడుమ ధరలు పెరుగుతాయి. దీని వల్ల ప్రస్తుతం మన మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ ధర పెరిగే అవకాశముంది’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండర్ రాజశేఖర్ స్వానుభవం
- అఫ్గానిస్తాన్: కొత్త తాలిబాన్లు నిజంగానే మారారా? లేదా పీఆర్ టీమ్ సలహాతో మారినట్లు నటిస్తున్నారా?
- అఫ్గానిస్తాన్ శరణార్థులు రాకుండా సరిహద్దుల్లో కంచె వేసిన పాకిస్తాన్
- అష్రఫ్ ఘనీ: ‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’
- తాలిబాన్‌లోని బలమైన నాయకులు ఎవరు? వారి పాత్ర ఏంటి?
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








