తాలిబాన్‌లోని బలమైన నాయకులు ఎవరు? వారి పాత్ర ఏంటి?

ఫొటో సోర్స్, AFGHAN ISLAMIC PRESS
ఎవరూ ఊహించనంత వేగంగా తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు త్వరలోనే తమ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
అయితే, తాలిబాన్‌లో ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయి? తాలిబాన్‌లో ఉన్న బలమైన నాయకులు ఎవరు? ప్రస్తుతం వారు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఇవన్నీ చాలామంది తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు.
హీబాతుల్లా అఖండ్ జాదా
కాందహార్ నుంచి వచ్చిన హీబాతుల్లా అఖండ్ జాదా తాలిబాన్ అగ్రనాయకుల్లో ఒకరు. ఇస్లాంలో పండితుడు. తాలిబాన్ దిశను మార్చి, ప్రస్తుతం ఉన్న స్థితికి తీసుకురావడానికి ఆయనే కారణమని చెబుతారు.
తాలిబాన్ల కంచుకోట అయిన కాందహార్ ఆయన జన్మస్థలం కావడం, తాలిబాన్‌పై పట్టు సాధించడానికి ఆయనకు ఉపయోగపడిందని అంటారు.
1980లలో సోవియట్ యూనియన్‌పై అఫ్గానిస్తాన్ చేసిన తిరుగుబాటు యుద్ధంలో హిబాతుల్లా కమాండర్‌గా పనిచేశారు. కానీ, సైనిక కమాండర్‌గా కన్నా మత పండితుడిగా ఆయనకు ఎక్కువ పేరు ఉంది.
తాలిబాన్ సుప్రీం కమాండర్ కాక మునుపే హిబాతుల్లా తాలిబాన్ అగ్ర నాయకుల్లో ఒకరిగా, దళానికి మతపరమైన ఆదేశాలు ఇచ్చేవారు.
నేరస్థులను, అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నవారిని చంపేయాలని, దొంగతనాలకు పాల్పడేవారి చేతులు నరికేయాలని ఆదేశాలిచ్చేవారు.
తాలిబాన్ మాజీ చీఫ్ అఖ్తర్ మొహమ్మద్ మన్సూర్‌కు హిబాతుల్లా డిప్యుటీగా కూడా వ్యవహరించారు. 2016 మేలో అమెరికా డ్రోన్ దాడిలో మన్సూర్ మరణించారు. మన్సూర్ తన వీలునామాలో హిబాతుల్లాను తన వారసుడిగా ప్రకటించారు.
పాకిస్తాన్‌లోని క్వెట్టాలో హిబాతుల్లా కలిసిన తాలిబాన్ అగ్రశ్రేణి నాయకులే ఆయనను తాలిబాన్‌కు అధిపతిగా చేశారని అంటారు. వీలునామా పత్రంలో హిబాతుల్లా నియామకాన్ని చట్టబద్ధం చేయాలని రాసి ఉంచినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఆయన ఎంపిక ఏకగ్రీవంగా జరిగిందని తాలిబాన్ పేర్కొంది.
సుమారు అరవై ఏళ్ల హిబాతుల్లా తన జీవితంలో అధిక భాగం అఫ్గానిస్తాన్‌లోనే గడిపారు. క్వెట్టాలోని తాలిబాన్ల షూరాతో కూడా ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి.
హిబతుల్లా అంటే "అల్లా ఇచ్చిన బహుమతి" అని అర్థం. ఆయన నూర్జాయ్ వంశానికి చెందినవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్
1994లో తాలిబాన్‌ను సంఘటితపరచిన నలుగురిలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఒకరు. అప్పటి నుంచీ ఆయన తాలిబాన్ కమాండర్‌గా, వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వచ్చారు.
2001లో అమెరికా దళాలు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లను తుడిచిపెట్టినప్పుడు, నాటో దళాలకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వం వహించారు.
అనంతరం, 2010 ఫిబ్రవరిలో అమెరికా, పాకిస్తాన్ సంయుక్తంగా చేపట్టిన ఒక ఆపరేషన్‌లో భాగంగా కరాచీలో ఆయనను అరెస్ట్ చేశారు.
2012 వరకు ముల్లా బరాదర్ గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు.
అప్పట్లో, శాంతి చర్చలను ప్రోత్సహించడానికి ఖైదీలను విడుదల చేయాలని అఫ్గాన్ ప్రభుత్వం కోరింది. ఆ జాబితాలో ముల్లా బరాదర్ పేరు ప్రముఖంగా ఉంది.
2013 సెప్టెంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది. అయితే, ఆ తరువాత ఆయన పాకిస్తాన్‌లోనే ఉన్నారా లేక ఇంకెక్కడికైనా తరలివెళ్లారా అనేది స్పష్టంగా తెలీదు.
ముల్లా బరాదర్, తాలిబాన్ నాయకుడైన ముల్లా మొహమ్మద్ ఒమర్‌కు విశ్వాసపాత్రుడైన సైనికుడు, డిప్యుటీ కూడా.
ముల్లా ఒమర్ డిప్యుటీగా తాలిబాన్ కోసం నిధులు సేకరించేవారు. రోజువారీ కార్యక్రమాల బాధ్యత తీసుకునేవారు.
ముల్లా బరాదర్‌ను అరెస్ట్ చేసినప్పుడు, తాలిబాన్ అగ్ర నాయకత్వంలో ఆయన రెండవ స్థానంలో ఉండేవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బరాదర్ లాంటి నాయకుడు తాలిబాన్లను శాంతి చర్చల దిశగా ప్రోత్సహించగలరని అఫ్గానిస్తాన్ ఉన్నత స్థాయి అధికారులు విశ్వసించేవారు.
2018లో అమెరికాతో చర్చలు జరిపేందుకు తాలిబాన్ కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు ముల్లా బరాదర్‌ను రాజకీయ పార్టీ అధిపతిగా నియమించారు. ఆయన ఎల్లప్పుడూ అమెరికాతో చర్చలను ప్రోత్సహించేవారు.
అఫ్గానిస్తాన్‌లో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ ముల్లా బరాదర్ ముఖ్య పాత్ర పోషించారు. హెరాత్, కాబుల్ ప్రాంతాల్లో చురుకుగా ఉండేవారు.
తాలిబాన్లు అధికారం కోల్పోయినప్పుడు ఆయన డిప్యుటీ రక్షణ మంత్రిగా ఉండేవారు.
ఐక్యరాజ్య సమితి ముల్లా బరాదర్‌పై కూడా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ ప్రయాణాలను, ఆయుధాల కొనుగోలును నిషేధించింది.
ముల్లా బరాదర్ 2009లో న్యూస్‌వీక్ పత్రికకు ఈ మెయిల్ ద్వారా తన సందేశాన్ని పంపారు.
అఫ్గానిస్తాన్‌లో విస్తరిస్తున్న అమెరికా దళాలను ఉద్దేశిస్తూ, తాలిబాన్లు అమెరికాకు భారీ నష్టాన్ని చేకూర్చాలని భావిస్తున్నట్లు తెలిపారు.
శత్రువులను తమ గడ్డపై నుంచి తరిమికొట్టేవరకు జిహాద్ కొనసాగుతుందని అన్నారు.
ఇంటర్ పోల్ ప్రకారం, ముల్లా బరాదర్ 1968లో ఉరుజ్‌గాన్ ప్రావిన్స్, దేహరావుడ్ జిల్లాలోని వీట్‌మాక్ గ్రామంలో జన్మించారు.
ఆయన దురానీ వంశానికి చెందినవారని అంటారు. అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా దురానీ.

మొహమ్మద్ యాకూబ్
తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడే మొహమ్మద్ యాకూబ్.
ఆయన వయసు 30 కన్నా తక్కువ ఉంటుందని, ప్రస్తుతం తాలిబాన్ సైనిక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారని సమాచారం.
2016లో తాలిబాన్ నాయకుడు అఖ్తర్ మన్సూర్ మరణించిన తరువాత మొహమ్మద్ యాకూబ్‌ను తాలిబాన్ సుప్రీం కమాండర్‌గా నియమించాలని కొందరు మిలిటెంట్లు ఆకాంక్షించారు. కానీ వయసులో చిన్నవాడని, అనుభవం లేనివాడని భావించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.
యాకూబ్ అఫ్గానిస్తాన్‌లోనే నివసిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, fbi
సిరాజుద్దీన్ హక్కానీ
సిరాజుద్దీన్ హక్కానీ, తాలిబాన్ రెండవశ్రేణి అగ్రనాయకుల్లో ఒకరు.
తండ్రి జలాలుద్దీన్ హక్కానీ మరణం తరువాత, హక్కానీ నెట్‌వర్క్‌కు నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అఫ్గానిస్తాన్ సైన్యానికి, అమెరికా దళాలకు మధ్య జరిగిన అనేక యుద్ధాలకు ఈ బృందమే బాధ్యత వహిస్తుందని అంటారు.
ప్రస్తుతం, హక్కానీ నెట్‌వర్క్‌ను ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన తీవ్రవాద దళంగా పరిగణిస్తారు. అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కన్నా ఈ బృందమే బలమైనదని కొందరు అంటారు.
అమెరికా ఈ గ్రూపును తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది, పాకిస్తాన్, అఫ్గాన్ సరిహద్దుల్లో తాలిబాన్ల ఆర్థిక, సైనిక అవసరాలకు సహాయం అందిస్తుంది.
45 ఏళ్ల సిరాజుద్దీన్ హక్కానీ ఎక్కడి నుంచి వచ్చారన్నది స్పష్టంగా తెలీదు.
అబ్దుల్ హకీం
2020 సెప్టెంబర్‌లో దోహాలో చర్చలకు వెళ్లిన తాలిబాన్ బృందానికి అబ్దుల్ హకీం నాయకుడు.
ఆయనకు సుమారు 60 సంవత్సరాలు ఉంటాయని, క్వెట్టాలో ఓ మదరసా నడుపుతారని చెబుతారు. అక్కడి నుంచే తాలిబాన్ న్యాయవ్యవస్థను కూడా నడిపిస్తారని అంటారు.
అనేకమంది తాలిబాన్ అగ్ర నాయకులు క్వెట్టాలో ఆశ్రయం పొందుతున్నారని, అక్కడి నుంచే వారు పనిచేస్తుంటారని సమాచారం.
అయితే, క్వెట్టాలో తాలిబాన్ నాయకుల ఉనికిని పాకిస్తాన్ నిరాకరిస్తూ వచ్చింది.
హకీమ్, తాలిబాన్ మత పండితుల పరిషత్తుకు కూడా నాయకత్వం వహిస్తారు. ఆయన తాలిబాన్ అత్యున్నత కమాండర్ అని, హీబాతుల్లా అఖండ్ జాదాకు అత్యంత సన్నిహితుడని విశ్వసిస్తారు.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమిస్తోంటే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది? ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు?
- కాబుల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు: ఆ మరణాలకు కారణాలేమిటి?
- తాలిబాన్లు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు నజీబుల్లాను చంపి క్రేన్‌కు వేలాడదీశారు... ఆ రోజుల్లో అసలేం జరిగింది
- అఫ్గానిస్తాన్ యుద్ధంలో ఈ అమెరికా ఆయుధం రష్యాను ఎలా దెబ్బకొట్టింది
- అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?
- అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఏ దేశానికి పారిపోయారు?
- అఫ్గానిస్తాన్ యుద్ధంలో అమెరికా ఎంత డబ్బు ఖర్చు చేసింది
- తమ పాలనలో అఫ్గాన్ మహిళల జీవితం ఎలా ఉంటుందో చెప్పిన తాలిబాన్లు
- కాబుల్: బస్సులో సీట్ల కోసం తన్నుకున్నట్లు విమానంలో సీట్ల కోసం తోపులాటలు
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- ‘తాలిబాన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










