అఫ్గానిస్తాన్‌ యుద్ధంలో అమెరికా ఎంత డబ్బు ఖర్చు చేసింది

అఫ్గాన్లోని అమెరికా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2001 నుంచి అఫ్గానిస్తాన్‌లో ఉంటున్న అమెరికా బలగాలు

అఫ్గానిస్తాన్‌‌లో 20 ఏళ్ల పాటు ఉంది అమెరికా సైన్యం.

9/11 దాడులతో సంబంధం ఉన్న ఒసామా బిన్ లాడెన్, ఇతర అల్‌ఖైదా నాయకులకు తాలిబాన్లు ఆశ్రయం కల్పించారంటూ వారిని తరిమికొట్టడానికి 2001 అక్టోబర్‌లో అఫ్గాన్‌లో అడుగుపెట్టింది అమెరికా.

అప్పటి నుంచి తాలిబాన్లను అణచివేయడానికి అమెరికా బిలియన్ల కొద్ది డాలర్లను కుమ్మరించింది. అఫ్గాన్‌లో అమెరికా సైనికుల సంఖ్యను పెంచుతూ వచ్చింది. 2011లో అఫ్గాన్‌లో అమెరికా సైనికుల సంఖ్య లక్షా పది వేలకు చేరుకుంది.

అఫ్గాన్‌లో సైనిక కార్యకలాపాల కోసం గడచిన 20ఏళ్లలో అమెరికా ఎంత ఖర్చు చేసింది? నాటో కూటమి ఎంత వెచ్చించిందో ఓసారి చూద్దాం.

అమెరికా బలగాలు

గమనిక: ఈ అధికారిక డేటాలో స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్, ఇతర తాత్కాలిక దళాల సమాచారం ఉండకపోవచ్చు.

ఇతర దేశాలకు చెందిన సైనికులు కూడా అఫ్గాన్‌లో ఉన్నారు. కానీ విదేశీ బలగాల్లో అమెరికా సైనికుల సంఖ్యే ఎక్కువ.

నాటో అధికారికంగా డిసెంబర్ 2014లోనే తన పోరాటాన్ని ముగించింది.

కానీ అఫ్గాన్ దళాలకు శిక్షణ ఇవ్వడానికి, తీవ్రవాదులను అణిచివేయడంలో సాయం చేయడానికి 13వేల మంది సైనికులను అక్కడే ఉంచింది.

వీడియో క్యాప్షన్, కాబుల్: బస్సులో సీట్ల కోసం తన్నుకున్నట్లు విమానంలో సీట్ల కోసం తోపులాటలు

ఎంత డబ్బు ఖర్చు చేశారు?

అఫ్గానిస్తాన్‌లో ఎక్కువ ఖర్చు చేసింది అమెరికానే.

2010 నుంచి 2012 మధ్య ఒక లక్ష కంటే ఎక్కువ మంది అమెరికన్ సైనికులు అఫ్గాన్‌లో ఉన్నప్పుడు, ఏడాదికి 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు అయినట్లు అమెరికా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ఆ తర్వాత అమెరికా సైన్యం తిరుగుబాటుదారుల అణిచివేత కార్యకలాపాలపై కాకుండా, అఫ్గాన్ దళాలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టడంతో ఖర్చులు తగ్గాయి.

పెంటగాన్‌కు చెందిన సీనియర్ అధికారి 2018లో అమెరికన్ కాంగ్రెస్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ ఏడాదిలో అఫ్గాన్‌లో అమెరికా చేసిన ఖర్చు 45 బిలియన్ డాలర్లు.

అమెరికా రక్షణ శాఖ ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో మొత్తం సైనిక వ్యయం (అక్టోబర్ 2001 నుంచి సెప్టెంబర్ 2019 వరకు) 778 బిలియన్ డాలర్లు.

వీటికి అదనంగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ - యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్‌ఏఐడీ) ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు పునర్నిర్మాణ ప్రాజెక్టులకు 44 బిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి.

మొత్తం కలిపితే 2001 నుంచి 2019 మధ్య అధికారిక సమాచారం ప్రకారం చేసిన ఖర్చు 822 బిలియన్ డాలర్లు.

అయితే పాకిస్తాన్‌లో చేసిన ఖర్చుకు దీనికి సంబంధం లేదు. ఈ డబ్బును అఫ్గాన్ సంబంధిత కార్యకలాపాలకు మాత్రమే అమెరికా ఉపయోగించింది.

నాటో దళాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చిన నాటో దళాలు

2019లో బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ రెండు దేశాల్లో అమెరికా చేసిన ఖర్చు సుమారు 978 బిలియన్ల డాలర్లు. (వారి అంచనాల్లో 2020 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు కూడా ఉన్నాయి)

అకౌంటింగ్ పద్ధతులు ప్రభుత్వ విభాగాల మధ్య మారుతుంటాయి. కాబట్టి మొత్తం వ్యయాన్ని అంచనా వేయడం కష్టమని అధ్యయనం పేర్కొంది. అవి కాలక్రమేణా మారుతుండటంతో మొత్తంగా అంచనాల్లో వ్యత్యాసం ఉంటుందని తెలిపింది.

అమెరికా తర్వాత బ్రిటన్, జర్మనీ దేశాలు అఫ్గానిస్తాన్‌లో అత్యధిక సంఖ్యలో సైనికులను మోహరించాయి. యుద్ధ సమయంలో యూకే, జర్మనీ వరుసగా 30 బిలియన్ డాలర్లు, 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.

అనంతర కాలంలో దాదాపుగా సైనిక దళాలన్నీ వెనుదిరిగాయి. అయితే 2024 వరకు అఫ్గానిస్తాన్ దళాలకు నిధులు సమకూర్చడానికి అమెరికా, నాటోలు 4 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చాయి.

ఈ ఏడాదికిగానూ ఇప్పటివరకు నాటో అఫ్గానిస్తాన్‌కు 72 మిలియన్ డాలర్ల విలువైన సామగ్రిని పంపింది.

అమెరికా బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో పునర్నిర్మాణ కార్యక్రమాలకు అమెరికా సహాయం

ఈ డబ్బు దేనికి ఖర్చు చేశారు?

అఫ్గానిస్తాన్‌లో అమెరికా చేసిన ఖర్చులో ఎక్కువ భాగం తిరుగుబాటు కార్యకలాపాల అణచివేత, బలగాలకు అవసరమయ్యే ఆహారం, దుస్తులు, వైద్యం, సైనికులకు ప్రత్యేక వేతనం, ఇతర ప్రయోజనాలు వంటివాటికి వెళ్తుండేది.

అధికారిక డేటా ప్రకారం 2002 నుంచి అఫ్గానిస్తాన్‌లో పునర్నిర్మాణ కార్యకలాపాలకు అమెరికా సుమారు 143.27 బిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది.

ఇందులో సగానికి పైగా (88.32 బిలియన్ డాలర్లు) అఫ్గాన్ సైన్యం, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి ఖర్చు చేశారు.

వీడియో క్యాప్షన్, తాలిబన్ల అధీనంలోని ప్రాంతం నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

పరిపాలన, అభివృద్ధికి దాదాపు 36 బిలియన్ల డాలర్లు కేటాయించారు. అయితే డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణ, మానవతా సాయానికి తక్కువ నిధులు కేటాయించారు.

కొన్నేళ్లుగా ఈ డబ్బులో కొంతభాగం అవినీతి, ఇతర కారణాల వల్ల దుర్వినియోగమవుతూ వస్తోంది.

2009 మే నుంచి 2019 డిసెంబర్ 31 వరకు సుమారు 19 బిలియన్ డాలర్లు ఇలా దుర్వినియోగం అయినట్టు అఫ్గానిస్తాన్‌లో పునర్నిర్మాణ ప్రయత్నాలను పర్యవేక్షించే వాచ్‌ డాగ్ 2020 అక్టోబర్‌లో అమెరికా కాంగ్రెస్‌‌కు ఇచ్చిన నివేదికలో తెలిపింది.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రాణ నష్టం సంగతేంటి?

2001లో తాలిబాన్లకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, మిత్ర పక్షాలకు చెందిన 3500 మంది సైనికులు చనిపోయారు.

వీరిలో 2300 మంది అమెరికా సైనికులు కాగా, 450 మంది బ్రిటన్ సైనికులు. అమెరికాకు చెందిన 20వేల 660మంది సైనికులు గాయపడ్డారు.

అయితే, అఫ్గాన్ భద్రతా దళాలు, ప్రజల ప్రాణనష్టంతో పోల్చితే అమెరికాకు కలిగిన ప్రాణ నష్టం చాలా తక్కువనే చెప్పాలి.

అఫ్గాన్ బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఐదేళ్ల క్రితం తాను అధ్యక్షుడు అయిన నాటి నుంచి 45వేల మందికి పైగా అఫ్గాన్ సైనికులు చనిపోయారని 2019లో ఆ దేశాధ్యక్షుడు ఘనీ చెప్పారు.

యుద్ధం ప్రారంభమైన 2001 అక్టోబర్ నుంచి అఫ్గాన్ సైనికులు 64,100 కంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారని 2019లో బ్రౌన్ యూనివర్సిటీ అంచనా వేసింది.

సైనికులు

ఇవి కూడా చదవండి:

వీడియో క్యాప్షన్, నా ముగ్గురు కొడుకుల్ని చంపారు, ఇక నేను బతకలేను

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)