అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?

ముగ్గురు కొడుకులను కోల్పోయిన వృద్ధురాలు
    • రచయిత, యోగిత లిమాయె
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

నేను అఫ్గానిస్తాన్ వెళ్లిన ప్రతిసారీ నాకు సాదర స్వాగతం లభిస్తుంది. నేను భారతీయురాలినని తెలియగానే వారు దిల్లీకి వచ్చిన సందర్భాలు, దిల్లీ ఎంత బాగుంటుందన్న సంగతులు నాకు చెబుతుంటారు.

సరోజినీ నగర్, లజపత్‌నగర్ మార్కెట్లలో వారు కొన్న వస్తువుల గురించి నాతో చెబుతారు. వచ్చీరాని హిందీలో నాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. వాళ్ల ఫేవరెట్ బాలీవుడ్ నటులెవరో కూడా వివరిస్తుంటారు.

ఇటీవల నేను అఫ్గానిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ వ్యక్తి నాతో ''భారత్ అఫ్గానిస్తాన్‌కు నిజమైన మిత్ర దేశం'' అని అన్నారు.

అఫ్గాన్ కాకుండా ఏ ఇతర దేశంతో ఇండియా క్రికెట్ ఆడినా వారు ఇండియాకే మద్దతివ్వడం నేను చూశాను.

అయితే, వీటన్నిటికీ విరుద్ధంగా అఫ్గాన్ నుంచి పనిచేసే మిలిటెంట్ల నుంచి భారతీయులకు ముప్పు ఉందంటూ తరచూ భద్రత, నిఘా వర్గాలు హెచ్చరిస్తుంటాయి.

గతంలో అఫ్గాన్ ఆసుపత్రులలో పనిచేసిన భారతీయ వైద్యులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇలాంటి దాడులలో భారతీయ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్‌లు చంపడం ఆ దేశం నుంచి రిపోర్టింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో క్రూరంగా గుర్తుచేసింది.

సిద్దిఖీ చనిపోవడానికి పదిహేను రోజుల ముందు మేం దిల్లీ నుంచి కాబూల్‌కు ఒకే విమానంలో వెళ్లాం.

విమానం దిగిన తరువాత బ్యాగులు వచ్చేలోగా మేం మాట్లాడుకున్నప్పుడు అఫ్గానిస్తన్ అంటే ఎంత ఇష్టమో ఆయన చెప్పుకొచ్చాడు.

అక్కడ ఉండాల్సిన కాలంలో చేయాల్సిన పనుల గురించీ మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఎవరి దారిన వారు సాగిపోవడానికి ముందు 'జాగ్రత్తగా ఉండండి' అంటూ ఒకరికొకరం చెప్పుకొన్నాం.

దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో సిద్దిఖీ, ఉత్తరాన ఉన్న కుందుజ్ నగరంలో నేను తాలిబన్‌ల ముట్టడిలో చిక్కుకున్నాం.

తాలిబన్‌లు

సిద్దికీ మరణవార్త కలచివేసింది. జీర్ణించుకోలేకపోయాను. అయితే, ఆ షాక్ నుంచి కోలుకున్నాక సిద్దిఖీకి నిజమైన నివాళి అంటే అఫ్గాన్ నుంచి నిర్భయంగా, సురక్షితంగా మా పని మేం కొనసాగించడం, అక్కడి ప్రజల గొంతును ప్రజలకు వినిపించడమేనని అనుకున్నాను.

దశాబ్దాలుగా అఫ్గాన్ ప్రజలు హింస నీడలోనే బతుకుతున్నారు. కానీ, ఇప్పుడు వారు పూర్తిగా విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నారు.

విదేశీ సేనలు అఫ్గాన్ వీడి వెళ్లిన తరువాత తాలిబన్‌లు ఆ దేశంలోని సగానికిపైగా ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని వారాల కిందట నేను ఉన్న కుందుజ్ నగరం ఇప్పుడు తాలిబన్‌ల అధీనంలోకి వచ్చింది. అక్కడి విమానాశ్రయం తప్ప మిగతా ప్రాంతాన్నంతటినీ తాలిబన్ వర్గాలే నియంత్రిస్తున్నాయి.

మేం అక్కడ ఉన్న రోజుల్లో ప్రతి రోజూ రాత్రి మోర్టార్లు, తూటాల శబ్దం అనేక గంటల పాటు వినిపిస్తుండేది. అలాంటి శబ్దాలు వినిపించగానే మేం కంగారుపడేవాళ్లం కానీ అక్కడి ప్రజలు మాత్రం ఏళ్లుగా అలవాటుపడిపోవడంతో పెద్దగా స్పందించేవారు కాదు.

అఫ్గాన్‌లోని మిగతా ప్రాంతాలలో హింసకు భయపడి 35 వేల మందికిపైగా ప్రజలు పారిపోయి వచ్చి కుందుజ్ నగరంలో ఆశ్రయం పొందారు. దుమ్ముతో నిండిన పొలాల్లో పాత బట్టలు, వెదురు కర్రలతో తాత్కాలికంగా నిర్మించుకున్న చిన్నచిన్న గుడారాలే వారి ఆవాసాలు. అక్కడ ఉండే వందల మందికి ఒకట్రెండు కుళాయిల నుంచి వచ్చే నీరే ఆధారం. వారి వద్ద ఉన్న ఆహారం కూడా అంతంత మాత్రమే.

నా జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఇంతకుముందెన్నడూ చూడలేదు.

గ్రీస్, బంగ్లాదేశ్‌లోనూ శరణార్థి శిబిరాలను చూశాను కానీ, అక్కడ మానవతా సంస్థలు ఆహారం, మందులు సరిపడా పంపిణీ చేస్తుండేవారు.

కుందుజ్‌లోని ఇలాంటి శిబిరాల్లో ఆహారం పంపిణీ చేయడాన్ని నాలుగు రోజుల్లో ఒకసారి మాత్రమే చూశాను.

ఐరాస.. సేవ్ ద చిల్డ్రన్, ఎంఎస్ఎఫ్ వంటి ఎన్జీవోలు అందించే సహాయం కంటే అక్కడి ప్రజల అవసరాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

తమ గోడు వెళ్లబోసుకుంటున్న అఫ్గాన్ మహిళలు
ఫొటో క్యాప్షన్, తమ గోడు చెప్పుకొంటున్న అఫ్గాన్ మహిళలు

అఫ్గానిస్తాన్‌లో 1.8 కోట్ల మంది ప్రాణ రక్షణకు అవసరమైన అత్యవసర మానవతా సహాయం అందించడానికి అవసరమైన నిధులలో 40 శాతమే తమకు అందిందని ఐరాస తెలిపింది.

మేం కుందుజ్ శిబిరానికి వెళ్లేటప్పటికి అక్కడ నా చుట్టూ ప్రజలున్నారు. వారిలో చాలామంది మహిళలు. ఓ మహిళ నా చేయి పట్టుకుని తన భర్త, ముగ్గురు పిల్లలు చనిపోయారని నాతో చెప్పారు.

మరో మహిళ బాగా నలిగిపోయిన ఓ కాగితాన్ని నా చేతిలో పెట్టారు. అది హతమైన ఆమె కుమారుడి జాతీయ గుర్తింపు పత్రం.

వీడియో క్యాప్షన్, నా ముగ్గురు కొడుకుల్ని చంపారు, ఇక నేను బతకలేను

ఆమె పేరు బెనాఫ్షా. తనకు 77 ఏళ్లని ఆమె నాతో చెప్పారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన తరువాత ఆమె ముగ్గురు కొడుకులు యుద్ధంలో చనిపోయారని తెలుసుకున్నాను. ''నేను చనిపోయినా బాగుండేది. ఈ బాధతో బతకలేకపోతున్నాను'' అంటూ బాధపడ్డారామె.

అఫ్గాన్ దళాలు, తాలిబన్‌ల మధ్య కాల్పులలో తమవారు ఎలా చనిపోయారనే వేదనాభరితమైన గాథలను ఒకరి తరువాత ఒకరు చెప్పుకొచ్చారు.

ఒక నగరంలోని ఆ ఒక్క శిబిరంలో ఉన్నవారికి సంబంధించినవారు ఎంతమంది మరణించారో లెక్క కట్టడమే కష్టం. అలాంటిది దేశవ్యాప్తంగా మరణించినవారి లెక్క ఊహకందదేమో.

కొన్ని రోజులుగా కుందుజ్ నగరంలోనూ యుద్ధం జరుగుతోంది. నేను కలిసినవారందరూ ఇప్పుడెలా ఉన్నారో, వారికేమైందో కనుక్కోవడం అసాధ్యం.

కుందుజ్ శిబిరంలో చిన్నారులు

తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్న జిల్లాల్లో మానవ హక్కులు, మహిళల హక్కుల ఉల్లంఘన గురించి అనేక నివేదికలు వెల్లడించాయి.

మహిళలు తమ కుటుంబంలో ఎవరో ఒక పురుషుడి తోడు లేకుండా బయటకు అడుగు పెట్టరాదని.. పదిహేనేళ్లు దాటిన ప్రతి అమ్మాయి తాలిబన్ ఫైటర్లను పెళ్లాడాలని తాలిబన్‌లు ఆదేశించినట్లు నేను విన్నాను.

ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ తాలిబన్‌లు ఖండిస్తున్నారు. మహిళల విద్యకు తాము వ్యతిరేకం కాదని, మహిళలు వారి హక్కులు అనుభవించవచ్చని చెబుతున్నారు.

కానీ తాలిబన్‌లు బయటకు చెప్పేదానికి, వారు చేసే పనులకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని అఫ్గానిస్తాన్‌కు చెందిన అనేక మంది చెబుతున్నారు.

''తాలిబన్‌లు కనుక మళ్లీ అధికారంలోకి వస్తే అఫ్గాన్ మహిళల పని అయిపోయినట్లే'' అని అక్కడి పార్లమెంటు సభ్యురాలు ఫర్జానా కొచాయ్ అన్నారు.

కాబూల్‌లో ఆమెను నేను కలుసుకున్నాను. అఫ్గాన్‌లోని ఒక గిరిజన తెగకు చెందిన ఆమె ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే 29 ఏళ్లకే పార్లమెంటు సభ్యురాలు కావడం మామూలు విషయం కాదు. ఆ విజయం ఆమెదే కాదు, అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కులు, ప్రజాస్వామ్య విజయం కూడా.

ఇప్పటికీ అఫ్గాన్ సమాజంలో అత్యధికం పితృస్వామ్యం, సంప్రదాయబద్ధమే. కానీ, ఇంతకుముందు మరింత దారుణ పరిస్థితులుండేవి.

కుందుజ్ శిబిరంలో వృద్ధుడు

తాలిబన్‌ల పాలనలో మహిళలు చదువుకోవడానికి కానీ పనిచేయడానికి కానీ వెళ్లేందుకు అనుమతి లేదు. కుటుంబసభ్యులలోని పురుషుల తోడు లేకుండా బయటకు అడుగుపెట్టడానికి కూడా తాలిబన్ పాలనలో అనుమతి ఉండేది కాదు.

ప్రస్తుతం మహిళలు అక్కడి ప్రభుత్వంలో, న్యాయవ్యవస్థలో, పోలీసు శాఖలో, మీడియాలో కీలక స్థానాలలో ఉన్నారు. అఫ్గాన్ పార్లమెంటులో మహిళల శాతం భారత్ కంటే ఎక్కువ.

విదేశీ దళాలు వెళ్లిపోవడంపై ఫర్జానాను అభిప్రాయం కోరాను. అందుకు ఆమె.. ''వారు బాధ్యతారహితంగా వెళ్లిపోతున్నారు. 20 ఏళ్ల తరువాత వారు తాలిబన్‌లతో ఒప్పందం కుదుర్చుకుని మీకిష్టమైనట్లు చేసుకోండంటూ వెళ్లిపోయారు. ఇది అంతర్జాతీయ సమాజ వైఫల్యం'' అన్నారు.

'అఫ్గాన్ మహిళలకే కాదు ప్రజలందరికీ అది చీకటి రోజు.. ఇక మాకు స్వరం, స్వేచ్ఛ, జీవితం ఏవీ ఉండవు' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)