కరోనావైరస్ వ్యాక్సిన్: భారత ‘వ్యాక్సిన్ కింగ్’ పూనావాలా ఆస్తి నాలుగు నెలల్లో 25 శాతం వృద్ధి

సైరస్ పూనావాలా

ఫొటో సోర్స్, Getty Images

కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ కుదేలై, దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా.. వ్యాక్సిన్‌ కింగ్‌గా పేరున్న డాక్టర్‌ సైరస్‌ ఎస్‌ పూనావాలా వంటి కుబేరులకు మాత్రం ఈ సంక్షోభ కాలం బాగా కలిసివచ్చిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ అయిన పూనావాలా ఆస్తి.. మే 31తో ముగిసిన నాలుగు నెలల్లో 25 శాతం పెరిగిందని హురున్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 86వ స్థానానికి ఎగబాకారు. ఫిబ్రవరిలో విడుదల చేసిన 'గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2020'తో పోలిస్తే నాలుగు నెలల్లో పూనావాలా ర్యాంక్ ఏకంగా 57 స్థానాలు మెరుగుపడిందని హురున్‌ తెలిపింది.

పుణెలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థ. వ్యాక్సిన్ల తయారీ, సరఫరా సామర్థ్యం సంపద పెరుగుదలకు దోహదపడిందని హురున్‌ పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ 100 కోట్ల డోసుల ఉత్పత్తి కోసం ఈమధ్యనే ఆస్ట్రాజెనెకాతో సీరమ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌లో ఇప్పటికీ ముకేశే నెంబర్‌ వన్‌: దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఇప్పటికీ ముకేశ్‌ అంబానీదే అగ్రస్థానం. కరోనా దెబ్బకు శరవేగంగా పతనమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ఆస్తి మళ్లీ అంతే వేగంతో పెరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడంతో రిలయన్స్‌ షేరు భారీగా పతనమైంది. ఫలితంగా అంబానీ ఆస్తి కూడా భారీగానే ఆవిరైంది.

అయితే, జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి గ్లోబల్‌ దిగ్గజాల పెట్టుబడులు, రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ రిలయన్స్‌కు బాగా కలిసివచ్చింది. దాంతో అంబానీ సంపద నేలను తాకిన బంతిలా రివ్వున ఎగిసింది. ఏప్రిల్‌, మే నెలల్లో 1,800 కోట్ల డాలర్ల మేర పుంజుకుంది. ఈ కష్టకాలంలో అంబానీ నెట్‌వర్త్‌ 'వీ'(ఆంగ్ల అక్షరం) షేప్‌ రికవరీని చూసిందని హురున్‌ పేర్కొంది. మే చివరి నాటికి ముకేశ్‌ ఆస్తి.. ప్రీ-కొవిడ్‌ స్థాయితో పోలిస్తే 1 శా తం తక్కువే. అయినప్పటికీ హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో ఆయన 8వ స్థానానికి ఎగబాకారు. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే మెట్టు పైకెక్కారు.

  • ప్రపంచ టాప్‌-10 కుబేరుల్లో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడు ముకేశ్‌ అంబానీ. టాప్‌-100లోని ఇతర భారతీయ ధనవంతులతో పోలిస్తే అంబానీ ఆస్తి తరుగుదల చాలా తక్కువే.
  • హురున్‌ గ్లోబల్‌ టాప్‌-100 రిచ్‌ లిస్ట్‌లో నలుగురు భారతీయులకు (ముకేశ్‌ అంబానీ, సైరస్‌ పూనా వాలా, గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌) చోటు దక్కింది.
  • హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ చైర్మన్‌ శివ్‌ నాడార్‌ సంపద 6 శాతం మేర తగ్గి 1,600 కోట్ల డాలర్లకు పడిపోయింది. దాంతో ఆయన గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో ఆయన 72వ స్థానానికి పడిపోయారు. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే ర్యాంకింగ్‌ 4 స్థానాలు దిగజారింది.
  • అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సంపద 18 శాతం క్షీణించి 1,400 డాలర్లకు పడిపోయింది. రిచ్‌ లిస్ట్‌ ర్యాంకింగ్‌లో 27 స్థానాలు జారి 95వ స్థానానికి పరిమితమయ్యారు.
కేసీఆర్

ఫొటో సోర్స్, @Telangana CMO

పీవీకి భారతరత్న ఇవ్వాలి.. ప్రధాని వద్దకు నేనే వెళ్లి విన్నవిస్తా: కేసీఆర్

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. భారతరత్న పురస్కారానికి పీవీ సంపూర్ణ అర్హుడని, దీని కోసం డిమాండు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కేసీఆర్ చెప్పారు. ప్రధాని వద్దకు తానే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తానన్నారు.

పార్లమెంటులోనూ పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్నారు. రాష్ట్ర శాసనసభలోనూ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగరలతో పాటు దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామన్నారు. ఆయన పేరిట స్మారక పురస్కారాలను అందజేస్తామన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల ప్రకారం నిధులు ఇస్తామన్నారు.

ఉత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వీణాదేవి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

డార్క్ వెబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

భీమవరంలో డ్రగ్స్‌ కలకలం.. ఆరుగురు అరెస్ట్‌

భీమవరంలో డ్రగ్స్‌ సరఫరా ముఠా గుట్ట రట్టయిందని.. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్టు భీమవరం పోలీసులు తెలిపారని 'సాక్షి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం భీమవరానికి చెందిన ఊర యువకుడు డ్రగ్స్ కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. నెర్లాండ్స్ నుంచి డ్రగ్స్ పార్సిల్ వస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పార్శిల్‌పై ఉన్న అడ్రస్ ఆధారంగా భీమవరానికి చెందిన‌ ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

అతన్ని విచారించగా.. భీమవరంలో డ్రగ్స్‌, గంజాయిని పలువురికి సరఫరా చేసే మరో యువకుడి ఆచూకీ దొరికింది. అతడు ఇచ్చిన వివరాలతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న‌ మరో ఇద్దరు యువకులను, కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను భీమవరం పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను మీడియా ముందు మంగళవారం ప్రవేశపెట్టిన నర్సాపురం డీఎస్పీ నాగేశ్వరరావు.. పూర్తి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. మరి కొందరిని అదుపులోకి తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)