భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్: 'గాల్వాన్‌లో కాల్పులు జరగలేదు... సైనికులు రాళ్ళు, కర్రలతో కొట్టుకుని చనిపోయారు'

భారత్-చైనా సరిహద్దుల్లో సైనికులు బాహాబాహీకి దిగి ప్రాణనష్టం జరగడంపై రెండు దేశాలూ ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి.
20 మంది భారత సైనికులు మరణించిన ఈ ఘటనలో అసలు కాల్పులు జరగలేదని, రెండు దేశాల సైనికులు సుదీర్ఘ సమయం బాహాబాహీకి దిగి నెట్టుకోవడం, ముష్ఠియుద్ధం చేయడం వల్ల తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్‌తో బీబీసీ హిందీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ మాట్లాడారు.
చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత తీవ్రం కావొచ్చని జనరల్ మాలిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘బలగాలు ఆగ్రహంతో రగులుతుంటాయి.. కాల్పులు జరిగే అవకాశం ఉంది’
‘‘సరిహద్దుల్లో ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులే ఉన్నాయి. రెండు వైపుల నుంచి కాల్పులు జరిగే అవకాశాలున్నాయి. మొన్నటి మరణాల తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి ఉండొచ్చు.. బలగాలు ఆగ్రహంతో రగిలిపోతుంటాయి ఇప్పుడు.
రెండు దేశాల నాయకత్వం, దౌత్యవేత్తలు చొరవ చూపి ఉద్రిక్తతలు సద్దుమణిగేలా చేయాల్సిన సమయం ఇదే. నేను గతంలో చెప్పినట్లు ఈ సమస్యకు సైనిక పరిష్కారం సాధ్యం కాదు’ అన్నారు జనరల్ మాలిక్.

ఫొటో సోర్స్, Getty Images
‘బాహాబాహీకి కూడా అనుమతించకూడదు’
‘‘కొన్ని తప్పులు జరిగాయి. చాలాకాలంగా భారత్ కాల్పులకు దిగడం లేదు. సైనిక చర్చలూ కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు మనం బాహాబాహీకి ఎందుకు అనుమతిస్తున్నాం?
మీరు గత నాలుగేళ్లుగా చూసుకుంటే సరిహద్దుల్లోని పలు చోట్ల ఇలాంటి బాహాబాహీలు జరిగాయి’’ అన్నారాయన.
1967లో ఇలా బాహాబాహీకి తలూపగా అది పెద్ద కొట్లాటగా మారి చివరకు నాలుగైదు రోజుల పాటు కాల్పులు జరిగే వరకు వెళ్లిందని జనరల్ మాలిక్ గుర్తుచేశారు.
అప్పుడు భారత్, చైనా రెండు బలగాలూ కాల్పులు జరిపాయని.. అలాంటి బాహాబాహీలకు ఏమాత్రం అనుమతించరాదని ఆయన అన్నారు.
బలగాలు శత్రు దేశపు బోర్డర్ పోస్టుకు సమీపంగా వెళ్తున్నప్పుడు తెల్లజెండా ఎగరేస్తూ వెళ్లాలని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘గాల్వాన్‌లో నిరాయుధ ఒప్పందం ఉన్నా చైనావాళ్లు కర్రగదలు, రాళ్లు తీసుకొచ్చారు’
నిరాయుధ భారత గస్తీ బలగాలు చైనా బలగాలను సమీపించినప్పుడు మాటామాటా పెరిగి ప్రాణాంతక కొట్లాటగా మారిందన్న వార్తలపై స్పందించిన జనరల్ మాలిక్ గాల్వన్ వ్యాలీలో రెండు దేశాల సైనికులు ఆయుధాలు పట్టడానికి వీల్లేదన్న ఒప్పందం ఉందన్నారు.
అయితే, తనకు అందిన సమాచారం ప్రకారం చైనా బలగాలు రాళ్లు, కర్ర గద(క్లబ్)లు తీసుకొచ్చారని అన్నారు.
మొత్తానికి రెండు వైపులా ప్రాణ నష్టం జరిగిందని.. ఇది తప్పని ఆయన అన్నారు.
అలాంటి సున్నిత పరిస్థితుల్లో వ్యవహరించే విషయంలో రెండు పక్షాలూ తప్పులు చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
‘చైనా భారీగా సైన్యాన్ని మోహరించవచ్చు’
ఉద్రిక్తతల నివారణ చర్యలు ఎందుకు సఫలం కావడం లేదన్న ప్రశ్నకు సమాధానంగా జనరల్ మాలిక్, ‘‘చైనాతో మన సంబంధాలు పూర్తిగా మలుపు తీసుకున్నాయి. మీడియాలో కానీ, బయట కానీ ప్రజలు 1962 యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. చైనా మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో వారితో చర్చలకు కానీ, రాయబారాలకు కానీ ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. భారత్ ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా సైన్యాన్ని పెంచే అవకాశం ఉంది’’ అన్నారాయన.
రెండు వైపులా సైనిక నష్టం జరిగినట్లు భారత్ చెబుతున్నప్పటికీ చైనా మాత్రం ఇంతవరకు తమ సైనికులెవరూ మరణించినట్లు ధ్రువీకరించలేదు.
ఇవి కూడా చదవండి:
- ‘‘నేను తల్లినే... కానీ కొందరు పిల్లల తల్లిదండ్రులను చంపేశాను’’
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- కరోనావైరస్తో తల్లి మృతి.. ఆస్పత్రిలో నానమ్మ అదృశ్యం... 8 రోజుల తర్వాత అదే ఆస్పత్రి టాయిలెట్లో విగతజీవిగా లభ్యం
- డెక్సామెథాసోన్: కరోనావైరస్కు మంచి మందు దొరికినట్లేనా?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








