చైనా మీద భారత్ విరుచుకుపడిన 1967 నాథూలా యుద్ధం గురించి తెలుసా

1967లో ఒకరికొకరు ఎదురెదురుగా తలపడ్డ భారత, చైనా సైనికులు

ఫొటో సోర్స్, DEFENSE PUBLICATION

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ - చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినపుడు.. 1962లో ఏం జరిగిందో గుర్తుచేసుకోండి అంటూ చైనీయులు మాట్లాడుతుంటారు.

కానీ ఆ తర్వాత ఐదేళ్లకు అంటే 1967లో నాథూలాలో ఏం జరిగిందో మాత్రం చైనా ప్రభుత్వ మీడియా ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఆ ఉదంతంలో చైనాకు చెందిన 300 మందికి పైగా సైనికులు మరణించగా, భారతదేశం 65 మంది సైనికులను కోల్పోయింది.

1962 యుద్ధం తరువాత, భారత్‌, చైనాలు రెండు తమ రాయబారులను వెనక్కి పిలిపించాయి. రెండు దేశాల రాజధానులలో ఒక బృందం మాత్రం ఉంటుంది.

అయతే తమ దేశంలో పని చేస్తున్న భారత్‌ బృందంలోని కొందరు గూఢచర్యానికి పాల్పడుతున్నారని చైనా ఆరోపించింది. వారిని తమ దేశం నుంచి పంపించి వేసింది.

చైనా అంతటితో ఆగలేదు. పోలీసులు, భద్రతా దళాలతో భారత రాయబార కార్యాలయాన్ని అన్నివైపుల నుంచి చుట్టుముట్టింది. బయటి నుంచి లోపలికి, లోపలి నుంచి బయటకు ఎవరినీ వెళ్లకుండా కట్టడి చేసింది.

భారత్‌ కూడా తక్కువేమీ తినలేదు. చైనాకు దీటుగా వ్యవహరించింది. ఈ యాక్షన్‌ 1967 జూలై 3న ప్రారంభమైంది. ఆగస్టులో ఇరు దేశాలు రాయబార కార్యాలయాల ముట్టడిని ఆపేయాలని పరస్పరం అంగీకరించాయి. అదే సమయంలో చైనా వింత ఆరోపణ చేసింది. భారత సైనికులు తమ గొర్రెల మందను ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది.

ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనసంఘ్ దీనిని ఒక వింతగా ప్రకటించింది. దీనికి అంతే వింత పద్ధతిలో నిరసన తెలపాలని నిర్ణయించుకుంది. మాజీ ప్రధాని, అప్పటి జనసంఘ్‌ పార్టీ ఎంపీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంలోకి గొర్రెల మందను తోలుకెళ్లారు.

నాథూలా

ఫొటో సోర్స్, Getty Images

నాథులాను ఖాళీ చేయాలని అల్టిమేటం

అంతకు ముందు, 1965లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారతదేశం ఆధిపత్యం చేయడం మొదలు పెట్టినప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ రహస్యంగా చైనా వెళ్లి భారత్‌పై సైనిక పరంగా ఒత్తిడి పెంచాలని, తద్వారా తనపై ఒత్తిడి తగ్గేలా చేయాలని చైనాను అభ్యర్ధించారు.

''యాదృచ్ఛిక్కంగా అప్పుడు నేను సిక్కింలో ఉన్నాను'' అని ''లీడర్‌షిప్‌ ఇన్‌ ఇండియన్‌ ఆర్మీ'' పుస్తక రచయిత మేజర్ జనరల్‌ వి.కె.సింగ్‌ చెప్పారు.

సిక్కిం సరిహద్దులోని నాథులా, జెలెప్‌లా సరిహద్దు పోస్టులను ఖాళీ చేయడంలో పాకిస్థాన్‌కు సహాయం చేయడానికి చైనా భారత్‌కు అల్టిమేటం ఇచ్చింది.

"ఆ సమయంలో మా ప్రధాన రక్షణ శ్రేణులన్నీ చుంగుపై ఉన్నాయి. సైనిక దళాల ప్రధాన కార్యాలయ అధిపతి జనరల్ బెవూర్ ఈ పోస్టులను ఖాళీ చేయాలని జనరల్ సాగత్ సింగ్‌ను ఆదేశించారు. కానీ దానిని ఖాళీ చేయడం చాలా తెలివి తక్కువ పని అని జనరల్ సాగత్ స్పష్టం చేశారు. నాథులా చాలా ఎత్తులో ఉంటుంది, సుగార్‌ సెక్టార్‌లో జరుగుతున్న ప్రతి విషయాన్ని అక్కడి నుండి పర్యవేక్షించవచ్చు'' అని సింగ్‌ తెలిపారు.

"మనం దానిని ఖాళీ చేస్తే, అప్పుడు చైనీయులు ముందుకు వెళతారు. అప్పుడు సిక్కింలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు'' అని ఆయన అన్నారు. నాథులాను ఖాళీ చేయటం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకుందని మీరు ఇప్పటికే చెప్పారు. కాబట్టి నేను ఖాళీ చేయను'' అని జనరల్‌ సాగత్‌ తేల్చి చెప్పారు.

మరోవైపు జలేప్‌ను 27మౌంటైన్ డివిజన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. అక్కడి పోస్టులను ఖాళీ చేశారు. ఆ వెంటనే చైనా సైనికులు ముందుకు వచ్చి ఆ పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పటికీ చైనా నియంత్రణలో ఉంది. ఆ తర్వాత చైనీయులు 17 అస్సాం రైఫిల్స్ బెటాలియన్‌పై మెరుపు దాడి చేశారు. ఇందులో ఇద్దరు సైనికులు మరణించారు. దీంతో జనరల్‌ సాగత్‌ సింగ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

మాజీ మేజర్‌ జనరల్‌ వీకే సింగ్‌తో రేహాన్‌ ఫజల్‌
ఫొటో క్యాప్షన్, మాజీ మేజర్‌ జనరల్‌ వీకే సింగ్‌తో రేహాన్‌ ఫజల్‌

భారత్‌-చైనా సైనికుల బాహాబాహీ

ఆ సమయంలో నాథులాలో పోస్ట్ చేసిన మేజర్ జనరల్ షెరు తప్లియల్, సెప్టెంబర్ 22, 2014 నాటి 'ఇండియన్ డిఫెన్స్ రివ్యూ' సంచికలో ఇలా రాశారు:

"నాథూలాలోని రెండు సైన్యాలు పెట్రోలింగ్‌ ప్రారంభించిన రోజు అది. ఆ సమయంలో ఇరు సైన్యాలు నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. చైనా తరఫు నుంచి వాళ్ల పొలిటికల్‌ కమిషనర్‌ మాత్రమే వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడగలడు.

ఆయన టోపీ మీద ఎర్రటి సింబల్‌ ఉంది. ఇరుదేశాల సైనికులు ఒకరికి ఒకరు మీటరు దూరంలోనే ఉన్నారు. వారు 'నెహ్రూ స్టోన్‌' సమీపంలో ఉన్నారు.

1958లో జవహర్‌లాల్ నెహ్రూ ట్రెక్కింగ్ ద్వారా భూటాన్‌లోకి ప్రవేశించిన ప్రదేశం ఇది. కొద్ది రోజుల తరువాత భారతీయ, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. సెప్టెంబర్ 6, 1967న భారత దళాలు చైనా పొలిటికల్‌ కమిషనర్‌ను నెట్టేయడంతో అతని కళ్లజోడు పగిలిపోయింది'' అని పేర్కొన్నారు.

ఇక్కడి నుంచే నెహ్రూ ట్రెక్కింగ్‌ ద్వారా భూటాన్‌లోకి ప్రవేశించారు

ఫొటో సోర్స్, NEHRU MEMORIAL LIBRARY

ఫొటో క్యాప్షన్, ఇక్కడి నుంచే నెహ్రూ ట్రెక్కింగ్‌ ద్వారా భూటాన్‌లోకి ప్రవేశించారు

వైర్‌ ఫెన్సింగ్‌ నిర్మించాలని నిర్ణయం

ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించడానికి, భారత సైనిక అధికారులు నాథూలా నుండి సిబూలా వరకు భారత-చైనా సరిహద్దును గుర్తించడానికి వైర్‌తో కంచెను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 11న 70మంది ఫీల్డ్ కంపెనీ ఇంజనీర్లు, 18మంది రాజ్‌పుత్ రైఫిల్స్‌ సిబ్బంది ఫెన్సింగ్ ప్రారంభించగా, అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎదుర్కోడానికి 2 గ్రెనేడియర్స్, సిబూలాలోని ఆర్టిలరీ అబ్జర్వేషన్ పోస్ట్ అలర్ట్ చేశారు.

పని ప్రారంభమైన వెంటనే, చైనా పొలిటికల్‌ కమిషనర్ తన సైనికులతో పాటు 2 గ్రెనేడియర్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ సింగ్ తన కమాండో ప్లాటూన్‌తో నిలబడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. వైర్‌ ఫెన్సింగ్‌ వేయడం ఆపేయాలని కమిషనర్ రాయ్ సింగ్‌ను కోరారు.

అయితే చైనా నుండి అలాంటి అభ్యర్థనను అంగీకరించవద్దని ఆదేశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అకస్మాత్తుగా చైనా సైనికులు కాల్పులు ప్రారంభించారు.

జనరల్‌ సాగత్‌ సింగ్‌ (ముందు వరసలో)

ఫొటో సోర్స్, SAGAT SINGH FAMILY

ఫొటో క్యాప్షన్, జనరల్‌ సాగత్‌ సింగ్‌ (ముందు వరసలో)

ఫిరంగులతో చైనా సైన్యంపై కాల్పులు

జనరల్‌ సాగత్ సింగ్ జీవిత చరిత్ర రాసిన భారత సైన్యపు మాజీ మేజర్ జనరల్ రణధీర్ సింగ్ "జనరల్ సాగత్ సింగ్ లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ సింగ్ బంకర్లో ఉండగానే వైరింగ్‌పై నిఘా ఉంచాలని హెచ్చరించారు. కాని అతను దానిని ఓపెన్‌ చేసి ఉంచారు. కాల్పులు జరగ్గానే ఆయన లేచి నిలబడి తన సైనికుల మనోధైర్యాన్ని పెంచుతున్నారు.

ఉదయం 7.45 నిమిషాలకు అకస్మాత్తుగా ఒక విజిల్ వినిపించింది. చైనా సైన్యం భారత సైనికులపై కాల్పులు ప్రారంభించారు. రాయ్‌సింగ్‌కు మూడు బుల్లెట్లు తగిలాయి. వైద్యాధికారి ఆయన్ను సురక్షితమైన ప్రదేశానికి లాక్కెళ్లారు. అక్కడ నిలబడి పని చేస్తున్న భారతీయ సైనికులపై నిమిషాల్లో కాల్పులు జరిగాయి. చాలామంది భారతీయ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వైద్యం కోసం తీసుకురావడం కూడ ఇబ్బందిగా మారింది. ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.

సైనికులు బయటికి వచ్చారు. కానీ కవర్ చేయడానికి స్థలం లేదు. చైనావైపు నుంచి విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన సాగత్‌ సింగ్‌ ఫిరంగులతో కాల్పులు జరపాల్సిందిగా ఆదేశాలిచ్చారు. వాస్తవానికి ఆయనకు ఫిరంగితో కాల్పులు జరపమని చెప్పే అధికారం లేదు. ఒక్క ప్రధానమంత్రికే ఆ అధికారం ఉంటుంది. ఆర్మీ చీఫ్‌కు కూడా ఈ నిర్ణయం తీసుకునే హక్కు లేదు. పై నుండి ఎటువంటి ఆర్డర్ రాకపోయినా, చైనా నుంచి ఒత్తిడి పెరగడంతో జనరల్ సాగత్ సింగ్ ఫిరంగులతో కాల్పులు జరిపించారు. ఇది చైనాను బాగా దెబ్బతీసింది. వారి సైన్యంలో 300 మంది చనిపోయారు" అని రాశారు.

జవాన్లతో మాట్లాడుతున్న జనరల్‌ సాగత్‌ సింగ్‌

ఫొటో సోర్స్, SAGAT SINGH FAMILY

ఎత్తులో ఉండటంతో ప్రయోజనం

"గ్రెనేడియర్స్ వారి కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోవడం చూసి కోపంతో రగిలిపోయారు. వారు తమ బంకర్ల నుండి బయటకు వచ్చి కెప్టెన్‌ పి.ఎస్‌.డాగర్ నేతృత్వంలో, చైనా స్థావరాలపై దాడి చేశారు. ఈ చర్యలో కెప్టెన్ డాగర్, మేజర్ హర్భజన్ సింగ్ ఇద్దరూ మరణిచారు.

చైనా సైనికుల మెషిన్‌గన్‌లు చాలామంది భారతీయ సైనికులను చంపాయి.

ఈ ఘటన తర్వాత పూర్తిస్థాయి పోరాటం మొదలైంది. మూడు రోజులపాటు కొనసాగింది. జనరల్ సాగత్ సింగ్ దిగువ నుండి మీడియం-రేంజ్ ఫిరంగులను రప్పించారు. చైనా లక్ష్యాలపై భారీగా కాల్పులు ప్రారంభించారు.

భారతీయ సైనికులు అధికఎత్తులో ఉన్నారు. దీంతో వారు చైనా రహస్య స్థావరాలను స్పష్టంగా చూడగలిగారు. అందుకే వారి ఫిరంగి గుండ్లు లక్ష్యం మీద పడుతున్నాయి. ప్రతిస్పందనగా చైనీయులు కూడా కాల్పులు జరిపారు. వాళ్లు కింద నుంచి భారత సైనికులను చూడలేనందున వాళ్ల కాల్పులు నిరుపయోగంగా మిగిలిపోయాయి.

నాథూలా

ఫొటో సోర్స్, Getty Images

బ్లడీనోస్‌

"కాల్పుల విరమణ జరిగినప్పుడు, భారత్‌ తమ భూభాగాన్ని ఆక్రమించిందని చైనా ఆరోపించింది. ఒక విధంగా, వారు చెప్పింది నిజమే, ఎందుకంటే భారత సైనికులందరి మృతదేహాలు చైనా భూభాగంలో లభించాయి. వారు చైనా భూభాగం నుంచే దాడి చేశారు" అని జనరల్‌ వి.కె.సింగ్‌ చెప్పారు.

భారత సైన్యపు ప్రదర్శన ఉన్నత స్థాయి అధికారులకు పెద్దగా నచ్చలేదు. కొద్ది రోజుల్లోనే లెఫ్టినెంట్ జనరల్ సాగత్ సింగ్‌ను అక్కడి నుండి బదిలీ చేశారు. కానీ ఈ ఘర్షణ భారత సైనికులలో మానసిక స్థైర్యాన్నినింపింది

"1962 యుద్ధం తరువాత చైనా సైనికులు తాము సూపర్‌మెన్‌ అని, తమతో భారతీయులు పోటీ పడలేరని గర్వించేవారు. ఇప్పటికీ అదే గర్వం వారిలో కనిపిస్తుంది. కానీ చైనా సైన్యాన్ని ఎదుర్కోగలమని, అవసరమైతే చంపగలమని భారతీయ సైన్యం నిరూపించింది. చంపింది కూడా'' అని జనరల్ వీకే సింగ్‌ అన్నారు. రక్షణ విశ్లేషకులొకరు "చైనీయులకు ముక్కు పగిలిపోవడం ఇదే మొదటిసారి" అన్నారు.

నాథూలా

ఫొటో సోర్స్, Getty Images

1962 నాటి భయం

భారతదేశపు ప్రతిఘటన చైనాపై చాలా ప్రభావం చూపించింది. ఆ భయంతోనే చైనా అవసరమైతే తన వైమానిక దళాన్ని కూడా దించుతామని బెదిరించింది. కానీ ఈ బెదిరింపు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు.

ఇది మాత్రమే కాదు, 15 రోజుల తరువాత అంటే 1967 అక్టోబర్ 1న, సిక్కింలోని చోలాలో ప్రాంతంలో భారత చైనా సైనికుల మధ్య మరొక ఘర్షణ జరిగింది. ఇందులో కూడా భారత సైనికులు చైనాతో తీవ్రంగా పోరాడి వారి సైనికులను మూడు కిలోమీటర్ల దూరంలో 'కామ్ బ్యారక్స్' వరకు నెట్టారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 15, 1967న పోరాటం ఆగిపోయినప్పుడు, తూర్పు కమాండ్ చీఫ్ శామ్‌మానేక్ షా, జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా, జనరల్ సాగత్‌సింగ్‌లు హత్యకు గురైన భారత సైనికుల మృతదేహాలను స్వీకరించడానికి సరిహద్దుల వద్ద ఉన్నారు. నాలుగు సంవత్సరాల తరువాత 1971లో, ఈ ముగ్గురు వ్యక్తులు పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

స్టూడియోలో రేహాన్‌ ఫజల్‌తో ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ అసోసియేట్ ఎడిటర్‌ సుశాంత్‌ సింగ్‌
ఫొటో క్యాప్షన్, స్టూడియోలో రేహాన్‌ ఫజల్‌తో ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ అసోసియేట్ ఎడిటర్‌ సుశాంత్‌ సింగ్‌

"1962 యుద్ధంలో 740 మంది చైనా సైనికులు మరణించారు. ఈ యుద్ధం సుమారు ఒక నెల పాటు కొనసాగింది. లడఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు యుద్ధ క్షేత్రం విస్తరించింది. కానీ 1967లో మాత్రమే మూడు రోజుల్లో చైనీయులు 300 మంది సైనికులను కోల్పోవలసి వచ్చింది.

దానికన్నా ఇది చాలా పెద్దదని మా విశ్వాసం. ఈ యుద్ధం తరువాత 1962 యుద్ధ భయం చాలా వరకు పోయింది. చైనీయులు కూడా మనలాగే ఉన్నారని, వారిని కూడా ఓడించగలమని భారత సైనికులు మొదటిసారిగా భావించారు" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ అసోసియేట్ ఎడిటర్ సుశాంత్ సింగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)