రువాండా నరమేధం: ‘‘నేను తల్లినే... కానీ కొందరు పిల్లలకు తండ్రులు లేకుండా చేశా’’ - నిందితుల పశ్చాత్తాపం

ఫోర్చునేట్‌ ముకాంకురాంగా

ఫొటో సోర్స్, NATALIA OJEWSKA

1994లో జరిగిన రువాండా మారణ హోమంలో వేలమంది మహిళలు పాల్గొన్నారు. కానీ వారి గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు వారు తమ కుటుంబాలను కలిసే పరిస్థితి కూడా లేదు. జర్నలిస్ట్‌ నటాలియా ఒజ్యుస్కా జైళ్లలో ఉన్న ఈ నేరస్తులతో మాట్లాడారు.

ఉదయాన్నే అల్పాహారానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన ఫోర్చునేట్‌ ముకాంకురాంగా అనుకోకుండా హంతకురాలిగా మారారు. 1994 ఏప్రిల్‌ 10 ఆదివారం ఉదయం జరిగిన సంఘటనలను ముకాంకురాంగా గుర్తు తెచ్చుకున్నారు. నారింజ రంగు యూనిఫామ్‌ ధరించి జైలులో కూర్చున్న ఆమె ఆనాటి ఘటనలను వివరించారు.

మంచినీళ్ల కోసం బయలుదేరిన ముకాంకురాంగా, వీధిలో వెళుతుండగా ఇద్దరు వ్యక్తులను కొందరు రోడ్డు మీదే చితక బాదుతుండటం చూశారు. ''ఇద్దరు వ్యక్తులు కిందపడిపోయి ఉన్నారు. నేను ఒక పెద్ద కర్ర తీసుకున్నాను. 'టుట్సీలు చావాల్సిందే' అంటూ ఆ కర్రతో ఒకరి తర్వాత ఒకరిని కొట్టాను. వాళ్లను చంపిన వారిలో నేనొకదాన్ని'' అని వివరించారు 70 ఏళ్ల ముకాంకురాంగా.

వెంటాడి వేటాడారు

ఆ రోడ్డు మీద చనిపోయిన ఆ టుట్సీలు హత్యకు గురైన 8 లక్షల మందిలో ఇద్దరు మాత్రమే. హుటు తెగవారు వంద రోజుల్లో లక్షల మంది టుట్సీ తెగ వారిని చంపేశారు.

ఈ మారణహోమంలో పాల్గొన్న తర్వాత ఆమె ఇంటికి వచ్చేసరికి ఆమె ఏడుగురు పిల్లలు కనిపించారు. వాళ్లను చూసి ఆమె సిగ్గుతో తలదించుకున్నారు.

ఆనాటి జ్జాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ''నేనొక తల్లిని. కానీ కొందరు పిల్లల తండ్రులను నేను చంపేశాను'' అన్నారామె. కొద్ది రోజుల తర్వాత ఆ రోజు రోడ్డు మీద తాను చంపిన ఇద్దరు టూట్సీల పిల్లలు తన ఇంటికే వచ్చి తమను రక్షించాలని ఆమెను అడిగారు.

రువాండా మారణహోమం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 1994లో ఏప్రిల్‌ నుంచి జులై వరకు 100 రోజుల్లో దాదాపు 8,00,000 మంది రువాండా పౌరులను ఊచకోత కోశారు

అపరాధ వేదన

ఆమె ఒక్కక్షణం కూడా ఆలోచించలేదు. వారిద్దరినీ అటక మీదకు ఎక్కించి మారణహోమం నుంచి రక్షించారు. ''నేను ఆ పిల్లలను రక్షించినా, ఇద్దరిని చంపాను అన్న అపరాధ భావన మాత్రం నన్ను విడిచి పెట్టలేదు'' అన్నారు ముకాంకురాంగా.

టుట్సీలను చంపారన్న ఆరోపణలు ఎదుర్కొన్న 96,000 మంది మహిళల్లో ముకాంకురాంగా ఒకరు. ఈ మహిళా హంతకుల్లో ముకాంకురాంగా లాంటి వాళ్లు కొందరు పెద్దవాళ్లను చంపితే, కొందరు పిల్లలను హత్య చేశారు. మరికొందరు హత్యలు, అత్యాచారాలు చేయడానికి మగవాళ్లను ప్రోత్సహించారు.

1994 ఏప్రిల్‌ 6న రువాండా ప్రెసిండెంట్‌ హుటూ తెగకు చెందిన జువెనల్‌ హబ్యరిమనా ప్రయాణిస్తున్న విమానాన్ని రాజధాని కిగాలీ సమీపంలో కూల్చేశారు. అయితే ఈ పని ఎవరు చేశారన్నది తేలకుండానే టుట్సీలపై అనుమానం వ్యక్తం చేశారు హుటూలు.

దశాబ్దాలుగా టుట్సీ తెగ మీద నింపుకున్న ద్వేషాన్ని హుటు అతివాదులు బైటపెట్టుకున్నారు. ఒక పద్దతి ప్రకారం టుట్సీలను చంపడం మొదలుపెట్టారు. మారణహోమం సృష్టించారు.

రువాండాలో మహిళల సంప్రదాయ వైఖరికి భిన్నంగా అక్కడ మహిళలు ఈ మారణహోమంలో పాల్గొన్నారు.

''తన పిల్లలను ఎంతగానో ప్రేమించే ఒక తల్లి తన పక్కింట్లో ఉన్నవారి పిల్లలను ఎలా చంపగలుగుతుందో అర్ధం చేసుకోవడం కష్టం'' అన్నారు 'నెవర్‌ ఎగైన్‌' పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న రెజీన్‌ అబాన్యూజ్‌. ఆమె సంస్థ ఈ ప్రాంతంలో శాంతి సౌభ్రాతృత్వాల కోసం కృషి చేస్తున్నారు.

జైలులో మహిళలకు తమ నేరాన్ని అంగీకరించడానికి, బాధితులను కలవడానికి అవకాశమిచ్చారు

ఫొటో సోర్స్, NATALIA OJEWSKA

ఫొటో క్యాప్షన్, జైలులో మహిళలకు తమ నేరాన్ని అంగీకరించడానికి, బాధితులను కలవడానికి అవకాశమిచ్చారు

అక్కడ హింస మొదలయ్యాక వేలాది మంది మహిళలు కూడా అందులో పాలుపంచుకున్నారు. మగవారికి సహకరించారు.

మగవాళ్ల ఆధిపత్యం సాగే రువాండా రాజకీయాలలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేసిన పాలైన్‌ న్యారమసుహుకో ఆ దేశంలో శక్తివంతమైన మహిళగా నిలిచారు. కానీ ఆమె కూడా ఈ మారణహోమాన్ని ఎగదోయడంలో, ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు.

2011లో ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్ ఫర్‌ రువాండా ఆమెను ఈ మారణహోమంలో దోషిగా ప్రకటించింది. ప్రపంచంలో రేప్‌ ఆరోపణలతో జైలుశిక్ష అనుభవించిన తొలి మహిళ ఆమే.

టుట్సీ తెగలకు చెందిన మహిళలపై అత్యాచారం చేయాల్సిందిగా తాను ఆదేశించినట్లు న్యారమసుహుకో అంగీకరించారు.

ఆమె అధికారంలో ఉన్న సమయంలో సాధారణ రువాండా మహిళలు కూడా తమ భర్తలను హింసకు ప్రోత్సహించేవారు. తమ పొరుగు టుట్సీలను చంపడానికి ఎలాంటి వస్తువునైనా ఆయుధంగా వాడటానికి సిద్ధంగా ఉండేవారు.

మహిళా నేరస్తుల కోసం ప్రత్యేకమైన పునరావాస కేంద్రాలు లేవు. సంప్రదాయ మహిళల ఆలోచనలతో వారు తాము చేసింది తప్పు అని తెలుసుకునే అవకాశం కలగడం లేదు.

మార్త ముకముషింజిమనా

ఫొటో సోర్స్, NATALIA OJEWSKA

ఫొటో క్యాప్షన్, మార్త ముకముషింజిమనా తాను కేవలం ఆదేశాలను పాటించానని చెప్తున్నారు

ఒక మారణహోమం - రెండు కోణాలు

మార్త ముకముషింజిమనాకు ఐదుగురు సంతానం. ఆమె తాను చేసిన నేరాలను 15 సంవత్సరాల పాటు దాచింది. 2009లో స్వయంగా కోర్టుకు వెళ్లి తన నేరం అంగీకరించే దాకా ఆమెను అపరాధ భావన వదల్లేదు.

ఒక తల్లిగా తాము గతంలో చేసిన పనులకు సిగ్గుపడుతున్నామని చాలామంది మహిళలు అభిప్రాయపడ్డారు. సంరక్షులుగా తాము విఫలమయ్యామని వారు చెబుతున్నారు.

''కాలమే వీరిలో మార్పు తెచ్చింది. వారు తమ గురించి తాము చెప్పుకోడానికి తగిన సమయం ఇచ్చాం. తర్వాత వారు నేరాన్ని అంగీకరించారు'' అని రువాండా తూర్పు ప్రాంతంలోని ఎన్‌గోమా మహిళా జైల్‌ డైరక్టర్‌ గ్రేస్‌ ఎన్‌డవాన్యీ అన్నారు.

''మా ఇల్లు మెయిన్‌ రోడ్డుకు దగ్గర్లోనే ఉంటుంది. నేను రోడ్డు మీద పెద్ద గోల విన్నాను. మా పక్క వీధిలోని టుట్సీలను అందరూ చుట్టుముట్టి చర్చికి పట్టుకెళ్లారు'' అని మార్త ముకముషింజిమనా జైలు గదిలో ఏడుస్తూ చెప్పారు.

వేలమంది టుట్సీలను న్యామషెకె పెరిష్‌ క్యాథలిక్‌ చర్చిలో కుక్కారు. ప్రాణాలు నిలుపుకోడానికి వారం రోజుల పాటు వారు అష్టకష్టాలు పడ్డారు. అక్కడి నుంచి బతికి బైటపడ్డ వాళ్లలో 53 ఏళ్ల స్టానిస్లస్‌ కయిటెరా ఒకరు. గ్రెనేడ్‌ పేలుడులో ఆయన చేతికి పెద్ద గాయం అయ్యింది.

''నాకు బాగా గుర్తు. అక్కడి మహిళలు మా మీద విసరడానికి రాళ్లు ఏరుకొచ్చి మగవాళ్లకు ఇచ్చేవాళ్లు. మగవాళ్ల రాళ్లు విసిరేవాళ్లు, తుపాకులు, గ్రెనెడ్‌లు పేల్చేవాళ్లు. ఇంట్లో పెట్టి తలుపులేసి పెట్రోలు పోసి తగలబెట్టేవాళ్లు'' అని కయిటెరా వివరించారు.

''వాళ్లంతా చర్చి చుట్టు ముట్టి కర్రలతో మమ్మల్ని కొట్టి చంపడం మొదలు పెట్టారు'' అని చెప్పారు కయిటెరా. శవాల మధ్య దాక్కుని ఆ మారణ హోమం నుంచి ఆయన తప్పించుకోగలిగారు.

నేరస్తులను మళ్లీ సమాజంలో మమేకం చేయడమే లక్ష్యం

ఫొటో సోర్స్, NATALIA OJEWSKA

ఫొటో క్యాప్షన్, నేరస్తులను మళ్లీ సమాజంలో మమేకం చేయడమే లక్ష్యం

తనకు వచ్చే ఆదేశాలతో తాను ఒత్తిడికి గురయ్యేదానినని ముకముషింజిమనా అన్నారు. ''పాపను వీపుకు తగిలించుకుని రాళ్లు ఏరిపెట్టే గ్రూపులో చేరేదాన్ని. మేం ఏరిన రాళ్లు విసిరి చర్చిలో ఉన్నవారిని మగవాళ్లు చంపడానికి ప్రయత్నించారు'' అని ముకముషింజిమనా చెప్పారు. అప్పటికి ఆమె పాపకు జన్మనిచ్చి రెండు వారాలైంది.

2009లో ఆమె జైలుకు వెళ్లినప్పుడు ఆమె ఐదుగురు పిల్లల బాధ్యత తీసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.

''అప్పటి మారణహోమం మానవత్వానికే మచ్చ. ఇది బాధితుల గౌరవాన్నే కాదు, నిందితుల గౌరవాన్ని కూడా మంటగలిపింది. వారంతా ఇప్పుడు దాని నుంచి బైటపడుతుండటం శుభపరిణామం'' అని రువాండా నేషనల్ యూనిటీ అండ్‌ రీకాన్సిలియేషన్‌ కమిషన్‌ ఎగ్జిక్యుటివ్ సెక్రటరీగా పని చేస్తున్న ఫిదేలే ఎండయిసబా అన్నారు.

వాస్తవాలు ఒప్పుకుని శిక్షలు అనుభవించిన అనేకమంది మహిళా ఖైదీలతో వారి బాధితుల కుటుంబాలకు లేఖలు రాయిస్తున్నారు అధికారులు. తద్వారా తమపై వారిలో నమ్మకాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఒకసారి జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి తమ మగవారిని కలవడానికి ఈ నేరస్తులైన హుటు మహిళలు చాలా ఇబ్బంది పడతారు. వీరిలో కొందరి భర్తలు వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి ఆస్థిలో భాగం కల్పించలేమని తేల్చి చెప్పారు. వారి తెగ సంఘాలు వారిని దగ్గరికి రానీయవు. బంధువుల నుంచి కూడా వారు వెలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇతర తెగల వాళ్లను ద్వేషించడం మంచిది కాదు అని వారిని ఒప్పించడానికి చాలా కాలం పట్టింది. ''తాము చేసింది తప్పని ఒప్పుకోడానికి చాలామంది సిద్దంగా లేరు. వారిలో అతివాదులున్నారు. కానీ వారి సంఖ్య తగ్గుతోంది'' అని ఎండయిసబా పేర్కొన్నారు.

కన్నీళ్లను ఆపుకోలేక పోయా

2007లో విచారణ మొదలైన తర్వాత నాలుగేళ్లకు ఫోర్చునేట్ ముకాంకురాంగా ఒక్కరే ధైర్యం చేసి నేరాన్ని అంగీకరించారు. తనను క్షమించమని తన చేతిలో చనిపోయిన వ్యక్తి కొడుకును అడగడానికి చాలా ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పారు.

''నేను ఊహించినదానికి భిన్నంగా అతను నన్ను కలవడానికి వచ్చాడు. కన్నీళ్లను ఆపుకోలేక అతన్ని హత్తుకున్నాను'' అని చెప్పారామె.

తన బంధు మిత్రులతో మళ్లీ సత్సంబంధాలు నెరపగలుగుతానని భవిష్యత్తుపై ఆశతో ఉన్నారు ముకాంకురాంగా.

''నేను ఇంటికి వెళ్లాక నేను ప్రశాంతంగా బతుకుతాను. ఇతరుల పట్ల మరింత ప్రేమతో ఉంటాను. నేను చేసిన నేరానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఒక తల్లిగా నేను జైలులో గడిపే పరిస్థితి రాకూడదు'' అని అన్నారు ముకాంకురాంగా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)