ఈ పుర్రె మన చరిత్రను తిరగరాస్తుందా? అపిడిమా పరిశోధన ఏం చెబుతోంది?

మానవ జాతి చరిత్రను తిరగరాయగల పరిశోధన ఇది. రెండు లక్షల పది వేల ఏళ్లనాటి ఒక మానవ పుర్రెను ఆఫ్రికా వెలుపల పరిశోధకులు కనుగొన్నారు.
ఇప్పటివరకూ హోమోసెపియన్స్ ఆఫ్రికా నుంచి మొదట ఐరోపాకు వచ్చినట్లు చరిత్ర ఉంది. ఐరోపాలోని గ్రీస్‌లో గుర్తించిన ఈ పుర్రె ఈ చరిత్రను తిరగరాస్తుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
మానవుని పరిణామ క్రమం మొదటగా ఆఫ్రికాలో ప్రారంభమైంది. ఐరోపా, ఆసియాల్లో నియాన్‌డెర్తాల్స్, డెనిసోవన్స్ లాంటి మానవ జాతులు అంతరించిపోయాయి. మనం ఇప్పటివరకు చదువుకున్నదాని ప్రకారం- మన పూర్వీకులు ఆఫ్రికా ఖండం నుంచి క్రమంగా ప్రపంచంలో విస్తరించారు.
దక్షిణ గ్రీస్‌లోని అపిడిమాలో కనుగొన్ని మానవ పుర్రె ఈ భావనను మార్చేలా కనిపిస్తోంది.
రెండు లక్షల సంవత్సరాల క్రితం ఐరోపాలో నియాన్‌డెర్తాల్స్ మాత్రమే ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు.
ఆధునిక మానవుడు (ప్రస్తుతమున్న మన జాతి మానవుడు) దాదాపుగా 40 వేల ఏళ్ల క్రితం వరకు ఆఫ్రికాలోనే ఉన్నట్లు ఆధారాలున్నాయి.
ఇప్పుడు గ్రీస్‌లో కనుగొన్న పుర్రె ఇప్పటిదాకా ఉన్న వాదనను తుడిచిపెట్టేలా ఉంది.
ఈ పుర్రె నియాన్‌డెర్తాల్ పుర్రె మాదిరి చదునుగా, పొడవుగా లేదు. ఇది మన తల మాదిరి వృత్తాకారంలో ఉంది.
విశ్లేషణ ప్రకారం లక్ష సంవత్సరాలపాటు ఈ రెండు జాతుల మధ్య సంబంధాలు ఉండి ఉండొచ్చు.
ఇతర జాతులు లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేలకు వేల సంవత్సరాలపాటు మన పూర్వీకులు ఆఫ్రికా ఖండాన్ని విడిచి రాలేదనే వాదన ఉంది. తాజా అన్వేషణ ఈ వాదనలపై శాస్త్రవేత్తలను పునరాలోచనలో పడేస్తోంది.
'నేచురల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియం'కు చెందిన ప్రొఫెసర్ క్రిస్ స్ట్రింగర్ మాట్లాడుతూ- "రెండు లక్షల ఏళ్ల కంటే ముందు ఆధునిక మానవులు ఆఫ్రికా ఖండం దాటి విస్తరించడానికి ఎలాంటి అడ్డంకులూ లేవు. అంటే దానర్థం ఇప్పటివరకూ సుదూర తూర్పు ప్రాంతాల్లో మనకు లభించిన ఆధారాలపైనా ప్రభావం పడుతుంది. చైనాలో లక్షా ముప్పై ఏళ్ల క్రితం ఆధునిక మానవ శిలాజాలు ఉన్నట్లు కొన్ని ఆధారాలున్నాయి. ఈ విషయంపై నాకు ఇప్పటివరకు సందేహాలుండేవి. కానీ ఇప్పుడు అపిడిమా పుర్రె వల్ల హోమోసెపియన్స్‌విగా చెబుతున్న పురాతన చైనా ఆధారాల పట్ల నేను మరింత సానుకూల దృక్పథంతో ఆలోచించాల్సి ఉంది" అని చెప్పారు.
ఆఫ్రికా ఖండాన్ని ఆధునిక మానవులు విడిచి బయటకు రావడమనే అంశంపై ఇప్పటిదాకా మనకున్న అవగాహనను బహుశా అపిడిమా అన్వేషణ పూర్తిగా మార్చేస్తుంది.
ఒకరకంగా చూస్తే ఆధునిక మానవుడు ఐరోపాలో నియాన్‌డెర్తాల్స్ ఉన్న కాలంలో కొద్దికాలంపాటు కాకుండా వేల సంవత్సరాలపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర మానవ జాతులతోపాటు కలిసి జీవించి ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్: హిమాలయాల్లో ఎనిమిది మంది పర్వతారోహకుల ప్రాణాలు తీసిన మంచు తుపాను
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- 64 ఏళ్ల మిస్టరీని సోషల్ మీడియా సాయంతో ఛేదించిన ఇటలీ అధికారులు
- 'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- లింగమనేని గెస్ట్ హౌజ్ గురించి చంద్రబాబు, లింగమనేని రమేశ్ 2016లో ఏమన్నారు....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









