ఎ68: కదులుతున్న అతిపెద్ద హిమఖండం, చివరికి ఏమవుతుంది

హిమఖండం కదులుతోంది
    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎ68 అనే ఒక భారీ హిమఖండం (ఐస్‌బర్గ్) అంటార్కిటికా ఖండం నుంచి విడిపోయి రెండేళ్లవుతోంది.

ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ హిమఖండం వెడ్డెల్ సముద్ర జలాల్లో తిరుగుతోందని, ఇప్పుడు ఈ మంచుఖండం ద్వీపకల్పం మీదుగా ఉత్తరంగా కదులుతోందని ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి.

కాసేపు ఇది సముద్రతీరంలోని తక్కువ లోతు నీటిలో చిక్కుకున్న ఒక 160 కిలోమీటర్ల పొడవున్న మంచుగడ్డలా కనిపించింది. ఎ68 ప్రపంచంలోనే అతిపెద్ద 'మంచు ద్వీపం'గా మారే ప్రమాదం ఉంది.

కానీ ఇది తర్వాత వేగం అందుకుంది.

"ఒక ట్రిలియన్ టన్నుల బరువున్న వస్తువు లాంటి ఎ68 హిమఖండం చాలా చురుగ్గా వెళ్తున్నట్టు కనిపిస్తోంది" అని ప్రొఫెసర్ అడ్రియన్ లుక్‌మన్ అన్నారు.

160 కిలోమీటర్ల పొడవున్న ఇది 200 మీటర్ల మందమే ఉంది. ఇప్పటివరకూ దీని ప్రయాణంలో దీనికి ఎక్కువగా నష్టం జరగకపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.

హిమఖండం కదులుతోంది

2017 జులైలో 'లార్సెన్ సి' అనే ఐస్ షెల్ఫ్ అంచు నుంచి ఎ68 విడిపోయింది.

స్వాన్‌సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ లుక్‌మన్ అప్పటి నుంచి యూరప్‌కు చెందిన సెంటినెల్-1 ఉపగ్రహాలను ఉపయోగించి దానిని గమనిస్తున్నారు.

ప్రతి కొన్ని రోజులకొకసారి రెండు ఉపగ్రహాలు దానిమీదుగా ప్రయాణిస్తుంటాయి. దాని వివరాలు రికార్డు చేస్తాయి.

రాడార్ సెన్సర్లున్న ఈ ఉపగ్రహాలు వాతావరణం సరిగా లేకున్నా, వెలుతురు లేకపోయినా సరే భూమి ఉపరితలాన్ని చూడగలిగేలా ఉంటాయి.

ప్రస్తుతం అంటార్కిటికాలో చలికాలం చీకట్లు కమ్ముకుని ఉన్నాయి.

హిమఖండం కదులుతోంది

కొన్ని పెద్ద పెద్ద మంచు ముక్కలు విడిపోయినా, ఎ68 ఇప్పటికీ చాలా విశాలంగా కనిపిస్తోంది.

ఈ హిమఖండం విడిపోగానే దాన్నుంచి ఇంకొక భాగం విరిగి పడింది. అది కూడా ఎ68బి అని పేరు పెట్టేంత పెద్దదిగా ఉంది.

వీడియో క్యాప్షన్, అంటార్కిటికా స‌ముద్రం అడుగున ర‌హ‌స్యాలు ఇవే

సుమారు 13 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పున్న ఎ68బి అనే ఈ చిన్న హిమఖండం ఇప్పుడు ద్వీపకల్పానికి ఉత్తరంగా దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వెడ్డెల్ సీ సెక్టార్‌ దగ్గర విడిపోయే ఎక్కువ హిమఖండాల్లాగే ఎ68ఎ, బి చివరికి అంటార్కిటికా పరిధిలోని ప్రవాహంలోకి వెళ్తాయి.

హిమఖండం కదులుతోంది

ఫొటో సోర్స్, BAS/P.BUCKTROUT

ఫొటో క్యాప్షన్, భారీ హిమఖండాలు దక్షిణ జార్జియా దగ్గర కరిగిపోతుంటాయి

అవి వాటిని దక్షిణ అట్లాంటిక్‌లో 'ఐస్‌బర్గ్ ఆల్లీ' అనే మార్గంలోకి నెట్టేస్తాయి.

ఎ68 చివరికి దక్షిణ జార్జియా దగ్గర ఆగిపోయి, తన ఐస్‌బర్గ్ స్మశానంలో కరిగిపోతుందా? వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)