చైనా ముస్లింలు: షింజియాంగ్‌లో ముస్లింల కుటుంబాలను వేరు చేయడం లేదని చైనా ఖండన

పశ్చిమ షింజియాంగ్‌లోని ముస్లిం పిల్లలను ఒక పద్ధతి ప్రకారం తల్లిదండ్రులకు వేరు చేస్తున్నారనే విషయాన్ని బ్రిటన్‌లోని చైనా రాయబారి ఖండించారు.
వీగర్ మైనారిటీ పిల్లల తల్లిదండ్రులిద్దరినీ నిర్బంధ కేంద్రాల్లో లేదా జైళ్లలో ఉంచుతున్నారని బీబీసీ ఒక పరిశోధనలో గుర్తించింది.
అదే సమయంలో వీగర్ పిల్లల కోసం చైనా భారీగా బోర్డింగ్ స్కూళ్లు కూడా నిర్మిస్తోంది. ముస్లిం సమాజాలకు చెందిన పిల్లలను ఒంటరి చేయడానికే చైనా ఈ ప్రయత్నం చేస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
అయితే, చైనా రాయబారి లూ జియావోమింగ్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు.

అసలు చేయడం లేదు...
"మేం తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడం లేదు, అలా అసలు చేయలేదు" అని ఆయన బీబీసీ ఆండ్రూ మార్ కార్యక్రమంలో చెప్పారు.
"పిల్లల ఆచూకీ తెలియని వారు ఎవరైనా ఉంటే, వారి పేర్లు మాకివ్వండి, ఆ పిల్లలను గుర్తించే ప్రయత్నం చేస్తాం" అన్నారు.
ఒక్క షింజియాంగ్‌లోనే 400 మంది పిల్లలు నిర్బంధం లాంటి పరిస్థితిలో ఉన్న తమ తల్లిదండ్రులిద్దరికీ దూరమయ్యారని బీబీసీ సేకరించిన ఆధారాలు చూపిస్తున్నాయి.
బీబీసీ పరిశోధన ఏం చెబుతోంది...
పశ్చిమ చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో ముస్లిం పిల్లలను ప్రభుత్వం కావాలనే వారి కుటుంబానికి, మతానికి, భాషకు, సంస్కృతికి దూరం చేస్తున్నట్లు ఒక తాజా పరిశోధనలో బయటపడింది.
చైనాలోని లక్షల మంది పెద్దవారిని కూడా వారి కుటుంబాల నుంచి దూరం చేసి నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు. చైనా వాటిని మళ్లీ చదువు చెప్పే స్కూళ్లుగా చెబుతోంది.
అదే ప్రాంతంలో చైనా వేగంగా బోర్డింగ్ స్కూళ్లను కూడా నిర్మిస్తోంది.
ఈ పరిశోధనలో వెల్లడైన పత్రాలు, విదేశాల్లోని బాధితుల బంధువుల ఇంటర్వ్యూల ఆధారంగా బీబీసీ ఇప్పటివరకూ దీని గురించి లభించని కీలక ఆధారాలు సేకరించింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
చైనాలో షింజియాంగ్ ప్రాంతంలో పిల్లల పట్ల ఏమేం జరుగుతోందో ఈ ఆధారాలు బయటపెట్టాయి.
ఈ రికార్డుల ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరినీ అదుపులోకి తీసుకోవడంతో ఒకే పట్టణంలోని 4 వందల మందికి పైగా పిల్లలు కుటుంబానికి దూరమయ్యారు. వారి తల్లిదండ్రులు నిర్బంధ కేంద్రాల్లో లేదా జైళ్లలో ఉన్నారు.
ఈ పిల్లలకు కేంద్రీకృత సంరక్షణ అవసరం ఉందని ఒక అధికారిక అంచనా.

మూలాలకు దూరం చేసే ప్రయత్నం
షింజియాంగ్‌లో పెద్దవారి గుర్తింపు మార్చడంతోపాటు, పిల్లలను వారి మూలాల నుంచే వేరు చేయడానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఈ ఆధారాలతో బయటపడింది.
షింజియాంగ్‌లో ఉంటున్న విదేశీ జర్నలిస్టులపై 24 గంటల నిఘా ఉంటుంది. అక్కడ వారిని నీడలా వెంటాడుతారు. దాంతో షింజియాంగ్ ప్రాంతంలో ఉన్న వారితో మాట్లాడ్డం చాలా కష్టం. అందుకే బీబీసీ టర్కీలో ఉంటున్న షింజియాంగ్ ప్రజలతో మాట్లాడింది.
చాలా మంది తమ బాధలు చెప్పుకోడానికి ఇస్తాంబుల్‌లోని ఒక పెద్ద హాల్లో గుమిగూడారు. వారిలో చాలా మంది చేతుల్లో వారి పిల్లల ఫొటోలున్నాయి. వాళ్లంతా ఇప్పుడు షింజియాంగ్‌లో కనిపించడం లేదు.
మూడేళ్ల కూతురి ఫొటో చూపించిన ఒక తల్లి "ఇప్పుడు పాపను ఎవరు చూసుకుంటున్నారో తెలీడం లేదు. నాకు ఇప్పుడు తనతో ఎలాంటి కాంటాక్ట్ లేదు" అన్నారు.

ఒక్కొక్కరిది ఒక్కో విషాదం
వారిలో 54 మందిని విడివిడిగా ఇంటర్వ్యూ చేసినప్పుడు వారి దగ్గర బాధాకరమైన ఆధారాలు లభించాయి. షింజియాంగ్‌లో కనిపించకుండాపోయిన 90 మందికి పైగా పిల్లల కథలను వారి సంరక్షకులు, తాత-బామ్మలు చెప్పుకొచ్చారు.
వీరంతా షింజియాంగ్‌లోని వీగర్ సమాజానికి చెందినవారు. వీరు చైనాలోని ప్రముఖ నస్లీయ్ ముస్లిం సమాజానికి చెందినవారు, దీనికి టర్కీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
వీళ్లలో వేల మంది విద్య లేదా వ్యాపారాల కోసం, బంధువులను కలవడానికి, చైనాలో కాలరాస్తున్న మతపరమైన హక్కులు కాపాడుకోవాలని టర్కీ వచ్చారు.
కానీ గత మూడేళ్లుగా వీరిలో చాలా మంది టర్కీలోనే చిక్కుకుపోయారు. కారణం, షింజియాంగ్‌లో వేలమంది వీగర్ ముస్లింలను చైనా అదుపులోకి తీసుకోవడం ప్రారంభించింది. వీగర్ ముస్లింలు, మైనారిటీ సమాజాలకు చెందిన వేల మందిని భారీ నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు.
కానీ, హింసాత్మక మత చాందస వాదం నుంచి బయటపడేలా వీగర్ ముస్లింలకు శిక్షణ ఇస్తున్నామని చైనా అధికారులు చెబుతున్నారు. చైనా నిర్బంధ కేంద్రాలను వారు పునర్‌శిక్షణ స్కూళ్లుగా వర్ణిస్తున్నారు.
కానీ ఈ లక్షల మందిలో చాలా మందిని కేవలం వారి మతపరమైన గుర్తింపు వల్లే అదుపులోకి తీసుకున్నారు. నమాజు చేసినందుకు, బుర్ఖా వేసుకున్నందుకు లేదా టర్కీలో ఇతరులతో సంబంధాలు ఉన్నందుకు చాలా మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు.
టర్కీలో ఉంటున్న వీగర్ ముస్లింలు చైనా తిరిగిరావడం అంటే, కచ్చితంగా నిర్బంధంలోకి వెళ్లడమే. ఇప్పుడు వారికి తమ వారితో ఫోన్లో మాట్లాడ్డం కూడా కష్టమైపోయింది. విదేశాల్లో ఉన్న వారు షింజియాంగ్‌లోని బంధువులను కాంటాక్ట్ కావడం కూడా ప్రమాదంగా మారింది.

బయటపెట్టిన ఆధారాలు
చైనాలో తన భార్య నిర్బంధ కేంద్రంలో ఉందని, తన ఎనిమిది మంది పిల్లల్లో కొందరు ఇప్పుడు చైనా ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారని టర్కీలోని ఒక తండ్రి చెప్పారు.
"నా పిల్లలను కూడా విద్యా క్యాంపుల్లో ఉంచారేమోనని నాకు అనిపిస్తోంది" అన్నారు.
బీబీసీ కోసం చేసిన పరిశోధనలో ఈ పిల్లలకు, వీరిలాంటి కొన్ని వేల మంది పిల్లలకు ఏం జరుగుతోందో బయటపడింది.
షింజియాంగ్‌లో ముస్లింలను నిర్బంధంలో ఉంచిన విషయాన్ని జర్మన్ పరిశోధకుడు డాక్టర్ ఎడ్రియన్ జెంజ్ ప్రపంచం ముందుకు తీసుకొచ్చారని భావిస్తారు.
బయటపడిన ప్రభుత్వ రికార్డులతో జెంజ్ ఒక రిపోర్టు తయారు చేశారు. అది చైనా షింజియాంగ్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలను ఎంత వేగంగా విస్తరిస్తోందో చూపిస్తోంది,
ఇక్కడ స్కూల్ ప్రాంగణాలను విశాలంగా పెంచుతున్నారు. అక్కడ కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నారు. వాటి సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. చైనా ప్రభుత్వం పిల్లలను 24 గంటలు చూసుకునేలా తమ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది.

భారీగా స్కూళ్ల నిర్మాణం
అదే సమయంలో అక్కడ భారీ స్థాయిలో నిర్బంధ కేంద్రాలను కూడా నిర్మిస్తున్నారు. చైనా ఇవన్నీ వీగర్ ముస్లింలను దృష్టిలో ఉంచుకునే నిర్మిస్తోందని భావిస్తున్నారు.
కేవలం ఏడాదిలోనే అంటే 2017లో షింజియాంగ్‌లో కిండర్ గార్డెన్ స్కూళ్లలో చేర్చిన పిల్లల సంఖ్య 5 లక్షలకు పైగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వీరిలో 90 శాతానికి పైగా వీగర్, ఇతర ముస్లిం మైనారిటీ వర్గాల వారున్నారు.
ఫలితంగా ఒకప్పుడు షింజియాంగ్‌లో స్కూలుకు వెళ్లే శాతం చాలా తక్కువగా ఉంటే, ఇప్పుడు అది మొత్తం చైనాలోనే ఎక్కువ శాతంగా నిలిచింది.
కిండర్ గార్డెన్ స్కూళ్ల నిర్మాణం కోసం దక్షిణ షింజియాంగ్‌లోని అధికారులే 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. వీగర్ ముస్లింలు ఎక్కువగా దక్షిణ షింజియాంగ్‌లో ఉంటున్నారు.
కొత్తగా కట్టిన వాటిలో ఎక్కువగా హాస్టళ్లు నిర్మించడంపైనే దృష్టి పెట్టారని డాక్టర్ జెంజ్ తన అధ్యయనంలో చెప్పారు.
షింజియాంగ్‌లో విద్యా విస్తరణ
పెద్దవారిని భారీ స్థాయిలో ఎలా జైళ్లలో పెట్టారో అదే స్థాయిలో షింజియాంగ్‌లో విద్యాబోధనను కూడా విస్తరిస్తున్నారు. తల్లిదండ్రులు క్యాంపుల్లో ఉన్నా లేకపోయినా దాదాపు అక్కడ ఉన్న వీగర్, ఇతర మైనారిటీ పిల్లలపైనా ఈ ప్రభావం పడుతోంది.
అధికారులు గతేడాది ఏప్రిల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి 2 వేల మంది పిల్లలను తీసుకొచ్చి యెచెంగ్ కౌంటీ నంబర్ 4లోని బోర్డింగ్ మిడిల్ స్కూల్లో వేశారు.

ఫొటో సోర్స్, Google earth
యెచెంగ్ కౌంటీ మిడిల్ స్కూల్
పైనున్న ఫొటోలో షింజియాంగ్‌కు దక్షిణంగా ఉన్న యెచెంగ్ టౌన్‌లో రెండు కొత్త బోర్డింగ్ స్కూళ్లు నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్న ప్రాంతం కనిపిస్తుంది.
ఈ ఫొటోలో మీరు మధ్యలో క్రీడా మైదానానికి రెండు వైపులా రెండు మిడిల్ స్కూళ్లు కట్టి ఉండడం చూడచ్చు. ఈ స్కూళ్ల పరిమాణం మొత్తం దేశంలో ఉన్న స్కూళ్లతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటిని ఏడాది కంటే కాస్త ఎక్కువ టైం తీసుకుని నిర్మించారు.
ప్రభుత్వం మాత్రం ఈ స్కూల్ భవనాలు సామాజిక స్థిరత్వం, శాంతి ఏర్పాటు చేయడానికి సహకరిస్తాయని, ఈ స్కూల్ "తల్లిదండ్రుల పాత్రను పోషిస్తుందని" చెబుతోంది. జెంజ్ మాత్రం వీటిని నిర్మించిన ఉద్దేశం వేరే అంటున్నారు.
"బోర్డింగ్ స్కూల్ సాయంతో మైనారిటీ సమాజాల కోసం కల్చరల్ రీ-ఇంజనీరింగ్ వాతావరణం సృష్టిస్తారు" అన్నారు.
"క్యాంపుల్లాగే ఈ స్కూళ్లలో కూడా పరిసర ప్రాంతాల్లోని వీగర్ లేదా మిగతా స్థానిక భాషల అంతం చేసే ప్రచారం నిర్వహిస్తున్నారు" అని ఆయన తన పరిశోధనలో చెప్పారు.
"విద్యార్థులు లేదా టీచర్లు స్కూల్లో చైనా భాష కాకుంటా వేరే ఏదైనా భాష మాట్లాడితే, వారిని శిక్షించడానికి ప్రతి స్కూల్లో నిబంధనలు ఏర్పాటు చేశారు" అన్నారు.
షింజియాంగ్‌లో అన్ని స్కూళ్లలో విద్యాబోధన పూర్తిగా చైనా భాషలోనే సాగుతుందని చెప్పిన అధికారుల ప్రకటనకు ఇది అనుకూలంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బలమైన మానసిక కౌన్సిలింగ్ కేంద్రాలు
తల్లిదండ్రులకు దూరం చేయడం వల్లే ప్రభుత్వం చాలా మంది పిల్లల సంరక్షణ బాధ్యత చూసుకోవాల్సి వస్తోందనే విషయాన్ని బీబీసీతో మాట్లాడిన షింజియాంగ్ ప్రచార విభాగం సీనియర్ అధికారి షూ గిజియాంగ్ ఖండించారు.
ఆయన నవ్వుతూ "కుటుంబ సభ్యులందరినీ వొకేషనల్ ట్రైనింగ్ కోసం పంపింస్తే, అప్పుడు ఆ కుటుంబానికి కచ్చితంగా సమస్యే, కానీ నేను అలాంటి కేసేదీ చూళ్లేదు" అన్నారు.
కానీ నిర్బంధంలో ఉన్న వారి పిల్లలను భారీ స్థాయిలో బోర్డింగ్ స్కూళ్లలో వేస్తున్నట్టు జెంజ్ పరిశోధనలో ఒక కీలక ఆధారం బయటపెట్టింది.
వొకేషనల్ ట్రైనింగ్ లేదా జైలుకు వెళ్లిన వారి పిల్లల పరిస్థితిని ట్రాక్ చేయడానికి స్థానిక అధికారులు ఒక ప్రత్యేక ఫాం ఉపయోగిస్తారు. ఆ పిల్లలను ప్రభుత్వ సంరక్షణలో ఉంచాల్సిన అవసరం ఉందా, లేదా అని నిర్ణయిస్తారు.
జెంజ్‌కు అలాంటి ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ దొరికింది. అందులో 'ఆదుకోవాల్సిన గ్రూపుల'కు ఇచ్చే చాలా రకాల గ్రాంట్స్ గురించి ప్రస్తావించారు. వాటిలో భార్యభర్తలిద్దరూ వొకేషనల్ ట్రైనింగులో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి.
దానితోపాటు ఎడ్యుకేషనల్ బ్యూరో సూచనల్లో "క్యాంపుల్లో ఉంటున్న వారి పిల్లల అవసరాలను చూసుకోవడానికి కట్టుబడి ఉండాలని" చెప్పారు.
దీనిలోని ఒక పేరాలో "స్కూళ్లు బలమైన మానసిక కౌన్సిలింగ్ కేంద్రాలు కావాలి" అని ఉంది. ఈ వాక్యం క్యాంపుల్లోని తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారో, స్కూళ్లలో వారి పిల్లలకు కూడా అలాగే చేస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఆకాశానికెత్తేస్తున్న చైనా మీడియా
పిల్లలపై పడుతున్న ప్రభావాన్ని ఒక కీలక సామాజిక సమస్యగా చూడడమే ఈ నిర్బంధానికి కారణం. దీనిని ఎదుర్కోడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ అధికారులు దానిని చెప్పడం లేదు.
కొన్ని ప్రభుత్వ పత్రాలు సెర్చ్ ఇంజన్లలో దొరక్కుండా కావాలనే దాచిపెట్టాలని ప్రయత్నించారు. వొకేషనల్ ట్రైనింగ్ టర్మ్ స్థానంలో కొన్ని చిహ్నాలు ఉపయోగించారు.
కొన్ని కేసుల్లో పెద్దవారి నిర్బంధ కేంద్రాల దగ్గరే, కిండర్ గార్డెన్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. అక్కడ పర్యటించినపుడు చైనా ప్రభుత్వ మీడియా ఈ కిండర్ గార్డెన్ స్కూళ్లను ఆకాశానికెత్తేయడం కనిపించింది.
"ఈ బోర్డింగ్ స్కూళ్లు మైనారిటీ పిల్లలకు జీవితంలో మంచి అలవాట్లు నేర్పించడానికి తోడ్పడతాయని, ఇక్కడ వారు ఇంట్లో కంటే బాగా శుభ్రంగా ఉన్నారని, కొంతమంది పిల్లలు టీచర్లనే 'అమ్మా' అని పిలుస్తున్నారని" చెబుతున్నాయి.
"ఎలాంటి తల్లిదండ్రులను క్యాంపులకు తీసుకువస్తారు. వారి పిల్లలను ఏం చేస్తారు అని మేం ఒక అధికారిని అడిగాం.
ఆ మహిళా అధికారి మాతో "వాళ్లు బోర్డింగ్ స్కూళ్లలో ఉన్నారు. మేం వాళ్లు ఇక్కడ ఉండడానికి చోటిచ్చి, భోజనం, బట్టలు అందిస్తాం. వాళ్లను బాగా చూసుకోవాలని మా సీనియర్ అధికారులు మాకు చెప్పారు" అంది.
ఇస్తాంబుల్‌లో పెద్ద హాల్లో ముక్కలైన కుటుంబాల కథలు వెలుగులోకి వస్తున్నకొద్దీ, వారి మనసుల్లో గూడుకట్టుకున్న బాధ కూడా బయటపడింది.
ఒక తల్లి నాతో "వేల మంది చిన్నారులను అమ్మనాన్నలకు దూరం చేస్తున్నారు. మేం దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తూనే ఉన్నాం. ఈ నిజం ప్రపంచానికంతా తెలిసినా, ఎందుకు మౌనంగా ఉన్నారు" అని ప్రశ్నించారు.
షింజియాంగ్‌లో పిల్లలందరూ ఇప్పుడు ఆ స్కూళ్లలోనే ఉన్నారని పరిశోధనలో తేలింది. వాటిలో వారిని చాలా కఠినంగా విడివిడిగా ఉంచుతున్నారు.

స్కూళ్ల చుట్టూ విద్యుత్ కంచె
చాలా స్కూళ్లలో సర్వేలెన్స్ సిస్టమ్స్, అలారంలు ఉన్నాయి. ప్రహరీ గోడలకు 10 వేల ఓల్టుల కరెంటు తీగలు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని స్కూళ్లలో భద్రత కోసం ఖర్చు పెట్టే మొత్తం, మిగతా ఖర్చుల కంటే చాలా ఎక్కువ.
ఈ విధానం 2017లో జారీ అయ్యింది. అప్పటి నుంచి స్థానికులను నిర్బంధంలోకి తీసుకోవడం విపరీతంగా పెరిగింది.
ఇది ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చేపడుతున్న చర్యలా, వీగర్ తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవతంగా దూరం చేసి ఇక్కడకు తీసుకొస్తున్నారా అని జెంజ్ ప్రశ్నిస్తున్నారు.
"తల్లిదండ్రులు, పిల్లలను వేరు చేస్తున్న షింజియాంగ్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కొత్త తరాన్ని వారి మూలాలు, మత విశ్వాసాలు, సొంత భాషకు పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది" అంటారు జెంజ్.
నా దృష్టిలో "ఇది సాంస్కృతిక నరమేధానికి సంకేతం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- ఉదారవాదానికి కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది...
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








