రువాండా నరమేధం-1994 : వంద రోజుల్లో ఎనిమిది లక్షల మంది ఊచకోత

పుర్రె

ఫొటో సోర్స్, ALEX MAJOLI / MAGNUM PHOTOS

తూర్పు ఆఫ్రికాలోని రువాండాలో 1994లో కేవలం వంద రోజుల్లో సుమారు ఎనిమిది లక్షల మందిని 'హూటూ' జాతికి చెందిన అతివాదులు చంపేశారు. ఎనిమిది లక్షల మంది అంటే అప్పటి రువాండా జనాభాలో ఇంచుమించు పది శాతం. నాటి ఊచకోతకు ఇప్పుడు పాతికేళ్లు.

హూటూ అతివాదులు మైనారిటీలైన టుట్సీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ మారణకాండ సాగించారు. జాతితో నిమిత్తం లేకుండా రాజకీయ ప్రత్యర్థులనూ లక్ష్యంగా చేసుకున్నారు. చనిపోయినవారిలో అత్యధికులు టుట్సీలు, ఉదారవాద హూటూలు.

చనిపోయవారి చిత్రాలు

ఫొటో సోర్స్, EPA

రువాండాలో దాదాపు 85 శాతం మంది హూటూలు.. కానీ సుదీర్ఘకాలంపాటు మైనారిటీలైన టుట్సీలే ఆధిపత్యం సాగించారు.

1959లో టుట్సీ రాచరిక పాలన అంతమైంది. వేల మంది టుట్సీలు రువాండా నుంచి పారిపోయారు. ఉగాండా, ఇతర ఇరుగుపొరుగు దేశాలకు చేరుకున్నారు.

రువాండాను వీడిన కొందరు టుట్సీలు ఒక తిరుగుబాటు గ్రూపును ఏర్పాటు చేశారు. అదే- రువాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్(‌ఆర్‌పీఎఫ్).

ఆర్‌పీఎఫ్ 1990లో రువాండాపై దాడికి దిగింది. ఆర్‌పీఎఫ్, వైరి పక్షాల మధ్య 1993 వరకు పోరాటం కొనసాగింది.

1993లో శాంతి ఒప్పందం కుదిరింది.

1994 ఏప్రిల్ 6న రువాండా అధ్యక్షుడు జువెనల్ హబ్యారిమానా, పొరుగుదేశం బురుండి అధ్యక్షుడు సైప్రీన్ నటార్యమిరా ఇద్దరూ వెళ్తున్న విమానం కూల్చివేతకు గురైంది. వీరిద్దరూ హూటూలు. వీరిద్దరితోపాటు విమానంలోని అందరూ చనిపోయారు.

విమానాన్ని ఆర్‌పీఎఫ్ వారే కూల్చేశారని హూటూ అతివాదులు ఆరోపించారు. వెంటనే టుట్సీలను లక్ష్యంగా చేసుకొని జాతిహననానికి తెగబడ్డారు.

1994లో రువాండాలోని ఒక ప్రాంతంలో ఇళ్లపై 'హూటూ' అని రాసుకొన్న స్థానికులు. తమ ఇళ్లు లూటీ కాకుండా చూసుకొనేందుకు ఇలా చేశారు.

ఫొటో సోర్స్, Gilles Peress / Magnum Photos

ఫొటో క్యాప్షన్, 1994లో రువాండాలోని ఒక ప్రాంతంలో ఇళ్లపై 'హూటూ' అని రాసుకొన్న స్థానికులు. తమ ఇళ్లు లూటీ కాకుండా చూసుకొనేందుకు ఇలా చేశారు.

టుట్సీల ఊచకోతకు సాకు కోసం విమానాన్ని హూటూ వర్గంవారే కూల్చేశారని ఆర్‌పీఎఫ్ ఆరోపించింది.

హూటూలు పక్కా పథకం ప్రకారం మారణహోమాన్ని సాగించారు. ప్రభుత్వ వ్యతిరేకుల జాబితాను హూటూ నాయకులు మిలీషియా సభ్యులకు అందించారు. వారు జాబితాలో ఉన్న వ్యక్తులను కుటుంబ సభ్యులతో సహా చంపేశారు.

ఇరుగుపొరుగు వారే ఒకరినొకరు చంపుకొన్నారు. కొందరు పురుషులు టుట్సీ వర్గానికి చెందిన తమ భార్యలను చంపేశారు. ''మిమ్మల్ని చంపకపోతే మిలీషియా సభ్యులు మమ్మల్ని చంపేస్తారు'' అంటూ వారి ప్రాణాలు తీశారు.

అప్పట్లో గుర్తింపు కార్డులపై వ్యక్తుల జాతి వివరాలు కూడా ఉండేవి.

1994లో హూటూ మిలీషియా సభ్యులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 1994లో హూటూ మిలీషియా సభ్యులు

హూటూలు రోడ్లపై అవరోధాలు పెట్టి మరీ టుట్సీలను గుర్తించి చంపేశారు.

మారణకాండలో ఎక్కువగా 'మాచెట్'(కత్తి) అనే ఆయుధాన్ని వాడారు.

రువాండాలో చాలా మంది ప్రజలు ఈ ఆయుధాన్ని ఇంట్లో పెట్టుకొనేవారు.

హూటూలు వేల మంది టుట్సీ మహిళలను నిర్బంధంలోకి తీసుకొని, వారిని లైంగిక బానిసలుగా మార్చుకున్నారు.

శవాలు

ఫొటో సోర్స్, GILLES PERESS / MAGNUM PHOTOS

రువాండాలో ప్రస్తుతం '1994 నరమేధం' సంతాప కార్యక్రమాలు జరుగుతున్నాయి. వంద రోజులపాటు ఇవి కొనసాగుతాయి.

రువాండా అధ్యక్షుడు, నాటి ఊచకోతను అంతమొందించిన రెబల్ దళం నాయకుడు పాల్ గామే ఈ సంతాప కార్యక్రమాలను ఏప్రిల్ 7 ఆదివారం దేశ రాజధాని కీగలిలో స్మారక చిహ్నం వద్ద జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

ఈ జ్యోతి 100 రోజులపాటు వెలుగుతూనే ఉంటుంది.

1994 మారణహోమానికి ముగింపు పలికినప్పటి నుంచి పాల్ గామేనే రువాండాకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనకు 61 ఏళ్లు.

స్మారక చిహ్నం వద్ద జ్యోతి వెలిగిస్తున్న రువాండా అధ్యక్షుడు పాల్ గామే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్మారక చిహ్నం వద్ద జ్యోతి వెలిగిస్తున్న రువాండా అధ్యక్షుడు పాల్ గామే

''1994లో ఆశనేదే లేదు. అంతటా అంధకారమే'' అని కీగలి జీనోసైడ్ మెమోరియల్ వద్ద తన ప్రసంగంలో అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. దేశం కాలక్రమంలో మళ్లీ ఒక కుటుంబంగా మారిందని చెప్పారు.

ఊచకోతలో చనిపోయినవారిలో రెండున్నర లక్షల మందికి పైగా ప్రజలను ఈ స్మారక చిహ్నం ఉన్న ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు.

సంతాప కార్యక్రమం

ఫొటో సోర్స్, AFP

ఎలా ముగిసింది?

రువాండాలో నరమేధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు నామమాత్రంగానే జరిగాయి. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలు , బెల్జియం బలగాలు ఆ సమయంలో రువాండాలో ఉన్నాయి. కానీ చర్యలు చేపట్టేందుకు యూఎన్ మిషన్‌కు అనుమతి ఇవ్వలేదు. తర్వాత బెల్జియం బలగాలతోపాటు ఐరాస శాంతి పరిరక్షణ దళాలను ఉపసంహరించుకున్నారు.

ఉగాండా మద్దతుతో ఆర్‌పీఎఫ్ రువాండాలో క్రమంగా బలం పుంజుకొంది. కీగలిలో తన బలాన్ని ప్రదర్శించింది. ఆర్‌పీఎఫ్ ధాటికి ఇరవై లక్షల మంది హూటూలు దేశం నుంచి పారిపోయారు. ఎక్కువ మంది కాంగోకు వెళ్లిపోయారు.

అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆర్‌పీఎఫ్ వేల మంది హూటూలను చంపేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఆర్‌పీఎఫ్ ఖండిస్తుంది.

100 రోజుల నరమేధం కేసుల్లో పదుల సంఖ్యలో హూటూలను టాంజానియాలోని 'ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ ఫర్ రువాండా' నేరస్థులుగా గుర్తించింది.

రువాండాలోని కమ్యూనిటీ కోర్టుల్లో లక్షల మంది విచారణను ఎదుర్కొన్నారు.

అధ్యక్షుడు పాల్ గామే

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడు పాల్ గామే

ఇప్పుడు ఎలా ఉంది?

1994 మారణహోమం తర్వాతి తరాలపై చాలా కాలం ప్రభావం చూపింది. రువాండాలో జాతి గురించి చర్చించడం ఇప్పుడు చట్టవిరుద్ధం.

నాటి మారణహోమం తదనంతర కాలంలో రువాండా ఆర్థికంగా క్రమంగా కోలుకొంది. అధ్యక్షుడు పాల్ గామే విధానాలు సత్వర ఆర్థిక వృద్ధికి, సాంకేతిక రంగంలో అభివృద్ధికి ఊతమిచ్చాయి.

2017లో జరిగిన ఎన్నికల్లో ఆయన మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన అసమ్మతిని సహించరనే విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)