మద్యపానం: ''రోజుకు ఒక్క పెగ్ తాగినా గుండెపోటు ముప్పు తీవ్రతరం''

ఫొటో సోర్స్, Getty Images
రోజూ స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్తరు స్థాయి వరకు మద్యం తాగినా రక్తపోటు పెరుగుతుందని, గుండెపోటు ముప్పు పెరిగే ఆస్కారముందని ఆరోగ్య పత్రిక 'ద లాన్సెట్'లో వెలువడిన ఒక అధ్యయనం తెలిపింది.
ఇదో విస్తృతమైన అధ్యయనమని బ్రిటన్, చైనా పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా ఐదు లక్షల మంది చైనీయులపై పదేళ్లపాటు పరిశీలన జరిపినట్లు చెప్పారు.
ఈ అధ్యయన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తిస్తాయని వారు స్పష్టం చేశారు. ఆరోగ్యంపై మద్యం నేరుగా చూపే ప్రతికూల ప్రభావానికి ఇవే ఆధారాలని తెలిపారు.
మద్యం తాగడాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచించారు.
అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరమని, అది గుండెపోటు ముప్పును పెంచుతుందని చాలా మందికి తెలుసు. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యానికి మంచిదేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరికొన్ని అధ్యయనాలు మద్యపానమే మంచిది కాదని పేర్కొంటున్నాయి. మద్యపానానికి సురక్షితమైన స్థాయి అంటూ ఉండదని స్పష్టం చేస్తున్నాయి.
తాజా అధ్యయనాన్ని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం, చైనీస్ వైద్యశాస్త్రాల అకాడమీ పరిశోధకులు నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యయనంలో తేలిన ప్రధానాంశాలు:
1. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతుంది.
2. రోజుకు నాలుగు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 35 శాతం పెరుగుతుంది.
ఈ అధ్యయనం ప్రకారం ఒక పెగ్గు(స్పిరిట్స్), సీసా బీరు, చిన్న గ్లాసంత వైన్ దాదాపు ఒకే ప్రభావాన్ని చూపుతాయి. ఈ మూడు రకాల మద్యాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు.
అధ్యయనం ప్రకారం రోజుకు సగం సీసా వైన్ తాగితే గుండెపోటు ముప్పు 38 శాతం పెరుగుతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్‌హాల్టర్ చెప్పారు.
స్వల్పంగా లేదా ఓ మోస్తరుగా మద్యం తీసుకుంటే గుండెపోటు ముప్పు తగ్గుతుందనే దాఖలాలేవీ లేవని అధ్యయనం స్పష్టం చేసింది. గుండెపోటుకు సంబంధించి మద్యం ప్రభావాలపై పూర్తి స్పష్టత రాలేదని, వీటిని గుర్తించేందుకు రానున్న సంవత్సరాల్లో మరింత డేటాను సేకరించాల్సి ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మితంగా తీసుకుంటే వైన్, బీరు మంచి ప్రభావాన్ని చూపుతాయనేది రుజువు కాలేదని అధ్యయనాన్ని రాసిన ప్రొఫెసర్ రిచర్డ్ పెటో తెలిపారు.
రిచర్డ్ పెటో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వైద్య గణాంకాలు, సాంక్రమిక వ్యాధుల విజ్ఞాన విభాగానికి చెందిన ప్రొఫెసర్.
మద్యపానం ప్రభావాలపై అధ్యయనానికి తూర్పు ఆసియా దేశాలు అనువైనవి.
చైనీస్ మూలాలున్న చాలా మంది ప్రజల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు వారిని మద్యపానానికి దూరంగా ఉంచుతాయి. మద్యం తాగితే వారిపై ప్రతికూల ప్రభావం సత్వరం కనిపిస్తుంది. వారికి అస్వస్థతగా అనిపిస్తుంది.
చైనాలో ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి మద్యపానం అలవాటు ఉండదు. మహిళల్లో అతి కొద్ది మందే మద్యం తాగుతారు.

పైన చెప్పుకొన్న జన్యువులు పశ్చిమ దేశాల ప్రజల్లో ఉండవు. చైనీయులపై జరిపిన అధ్యయనం లాంటిదే వీరిపై జరపడం సాధ్యం కాదు.
ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ బర్గెస్ అభిప్రాయపడ్డారు. ఇది చైనీయులపై మాత్రమే జరిపిన అధ్యయనమని చెప్పారు.
ఇది స్పిరిట్స్, బీర్ తీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, వైన్‌పై దృష్టి కేంద్రీకరించలేదని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- Fact Check: వయనాడ్‌లో రాహుల్ గాంధీ నిజంగానే పాక్ జెండాను ఎగరేశారా....
- పిండి పదార్థాలు తక్కువ తింటే ఆయుష్షు తగ్గుతుంది
- పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ: 'మేం ఎవరికీ మద్దతు ఇవ్వం... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
- ఏపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసిన భారత ఎన్నికల కమిషన్
- ఈమెకు నెల రోజుల్లో రెండు కాన్పులు, ముగ్గురు పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








