లోక్‌సభ ఎన్నికలు 2019: ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ విజయవంతమా కాదా: రియాలిటీ చెక్

- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
మాటలు: దేశవ్యాప్తంగా లక్షల గ్రామీణ కుటుంబాలకు వంట గ్యాస్(ఎల్‌పీజీ) అందించే బృహత్తర పథకం బాగా విజయవంతమైందని, అధిక కాలుష్యానికి కారణమయ్యే ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం సరైన ప్రణాళికలేని, లోపభూయిష్ట పథకమని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
వాస్తవాలు: ఈ పథకం వల్ల వంట గ్యాస్ వాడే కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది.
అయితే గ్యాస్ అయిపోయిన తర్వాత సిలిండర్లను తిరిగి నింపుకోవడం ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల.. సంప్రదాయ ఇంధన వనరులు ఉచితంగా దొరుకుతున్నచోట కొన్ని కుటుంబాలు ఎల్‌పీజీ వాడకాన్ని కొనసాగించడంలేదని బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.
శుద్ధ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2016లో 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పేరుతో ఒక పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. కిరోసిన్, కలప, పేడ లాంటి జీవ ఇంధనాలను వంటకు ఉపయోగించడం వల్ల వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా పేద మహిళల జీవితాలను మెరుగుపరచాలన్నది ఈ పథకం లక్ష్యమని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామీణ ప్రాంతాల్లో అధికారికంగా దారిద్య్ర నిర్మూలనకు దిగువన ఉన్న కుటుంబాలను ఈ పథకం మొదట్లో లక్ష్యంగా చేసుకుంది. నిరుడు డిసెంబరులో దేశవ్యాప్తంగా ఉన్న పేద కుటుంబాలకు దీన్ని విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ''అసాధారణ విజయ గాథ''గా చెబుతోంది. దీనివల్ల ప్రయోజనం పొందుతున్నవారిలో అత్యధికులు మహిళలేనని పేర్కొంటోంది.
కానీ, ఇదో లోపభూయిష్ట పథకమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దేశంలో 10 కోట్లకు పైగా కుటుంబాలు నేటికీ ఎల్‌పీజీకి బదులుగా కిరోసిన్ వాడుతున్నాయని చెబుతోంది.

ఫొటో సోర్స్, Twitter
విధివిధానాలు
అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీదారులు ఉచితంగా కనెక్షన్ ఇస్తారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని పంపిణీదారులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. కనెక్షన్ తీసుకున్న తర్వాత వడ్డీలేని ప్రభుత్వ రుణం సాయంతో మొదటి సిలిండర్‌ను లబ్ధిదారు కొనుక్కోవచ్చు. రాయితీ ధరకే అయినప్పటికీ ఆ తర్వాతి సిలిండర్లు అన్నింటికీ లబ్ధిదారే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
2014 మేలో బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు మునుపటి ప్రభుత్వాలు వివిధ పథకాల కింద దేశంలో 13 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్‌లు ఇచ్చాయి.
అధికారిక గణాంకాల ప్రకారం- 8 కోట్ల పేద కుటుంబాలకు కొత్తగా కనెక్షన్ ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 2019 జనవరి 9 నాటికి 6.4 కోట్ల కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్న గడువైన 2019 మే. ఆలోగా మిగతా కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వడం సాధ్యమే.

ఫొటో సోర్స్, Getty Images
రెట్టింపైన రీఫిల్ ధర
2016లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు దిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ నింపడానికయ్యే వ్యయం రూ.466. ఇప్పుడు అది రెట్టింపై దాదాపు రూ.820కు పెరిగింది. రీఫిల్ వ్యయం పెరుగుదలపై పార్లమెంటులోనూ ఎంపీలు ప్రస్తావించారు.
ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకున్న తర్వాత ఎన్ని కుటుంబాలు సిలిండర్లను రీఫిల్ చేయించుకొంటున్నాయో చెప్పాలని జర్నలిస్టు నితిన్ సేథి సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని కోరారు.
''ఉచితంగా కనెక్షన్ పొందిన కుటుంబాల్లో ఎక్కువ మంది మొదటి సిలిండర్ అయిపోయాక రీఫిల్ చేయించుకోవడం లేదు. అందుకు అయ్యే వ్యయాన్ని వాళ్లు భరించలేకపోవడమే దీనికి కారణం. వాళ్లు తిరిగి సంప్రదాయ ఇంధనాలైన పిడకలు, వంట చెరకు వైపు మరలుతున్నారు'' అని నితిన్ చెప్పారు.
ఇదే అంశంపై 2018 నవంబరులో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ- కొత్త కనెక్షన్ తీసుకున్నవారిలో 80% మంది ఇప్పటికే నాలుగుసార్లు రీఫిల్ చేయించుకున్నారన్నారు. సిలిండర్లను రీఫిల్ చేయించుకోని వారిలో 20 శాతం మందికి కారణం ఒక్కటేనని, అదేమిటంటే వారు కలప తేలిగ్గా లభించే అటవీ ప్రాంతాలకు దగ్గర్లో నివసిస్తుండటమేనని చెప్పారు.
కొత్త కనెక్షన్ తీసుకున్నవారు ఏడాదికి సగటున మూడుసార్లు రీఫిల్ చేయించుకున్నారని, దేశవ్యాప్త సగటు సంవత్సరానికి ఏడు సిలిండర్లుగా ఉందని ఎల్‌పీజీ సిలిండర్లను పెద్దయెత్తున పంపిణీ చేసే సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2018 డిసెంబరులో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
సంప్రదాయ వనరులూ కారణమే
ఎల్‌పీజీ వినియోగం ఎక్కువగా పెరగకపోవడానికి వంటకు అవసరమైన సంప్రదాయ వనరులు సులభంగా లభిస్తుండటం ఒక కారణమని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
2016లో ఈ పథకాన్ని ప్రారంభించిన కొద్ది నెలల తరువాత ఫైనాన్షియల్ అనలిటిక్స్ ఏజెన్సీ 'క్రిసిల్', ప్రజలు ఎందుకు పెద్దసంఖ్యలో ఎల్‌పీజీకి మారడం లేదనే అంశాన్ని పరిశీలించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం- గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాల్లో సగటున 35 శాతం కుటుంబాలు ఇతర ఇంధనాలను ఉచితంగా సేకరించుకొంటున్నాయి. వీరిలో మూడో వంతుకు పైగా కుటుంబాలు వంటకు కలపను ఉచితంగా తెచ్చుకుంటున్నాయి. దాదాపు మూడింట రెండొంతుల కుటుంబాలు ఉచితంగా పిడకలు సిద్ధం చేసుకొంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సిలిండర్ కోసం ఎక్కువ సమయం వేచివుండటం, వ్యయం అధికంగా ఉండటం పేదలను ఎల్‌పీజీకి దూరం చేస్తోందని క్రిసిల్ నివేదిక వివరించింది.
ఎల్‌పీజీ వాడకాన్ని మొదలుపెట్టిన ప్రజలు తర్వాత చౌక లేదా ఉచిత ఇంధనానికి మారిపోవడం, లేదా రెండింటినీ ఉపయోగించడం సాధ్యమేనని స్పష్టమవుతోంది.

ఏటా తగ్గుతున్న కిరోసిన్ వాడకం
గత ఐదేళ్ళుగా కిరోసిన్ వాడకం ఏటా తగ్గుతూ వస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ తగ్గుదల సంవత్సరానికి సగటున 8.1 శాతంగా ఉంది.
కిరోసిన్ కొనుగోలుకు ఇచ్చే రాయితీని ప్రభుత్వం దశలవారీగా ఎత్తేస్తుండటం ఈ తగ్గుదలకు కొంత వరకు కారణం.
గ్రామీణ ప్రాంతాల్లో వంటకు, వెలుతురుకు రెండింటికీ కిరోసిన్ వాడుతున్నారు. కొన్నిసార్లు విద్యుత్తు పరికరాల 'పవరింగ్' కోసం వాడుతున్నారు.
2016లో క్రిసిల్ సర్వే చేసిన కుటుంబాల్లో సుమారు 70 శాతం కుటుంబాలు వంటకు కిరోసిన్‌నే ఉపయోగిస్తున్నాయి.
10 కోట్ల కుటుంబాలు ఇప్పటికీ కిరోసిన్తోనే వంట చేస్తున్నాయన్న కాంగ్రెస్ వాదనలో నిజముందా, లేదా అనేది నిర్ధరించేందుకు అవసరమైన తాజా సమాచారం అందుబాటులో లేదు.

ఇవి కూడా చదవండి:
- భారత్ నిజంగానే జైషే మొహమ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసిందా... ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
- భారత యుద్ధ విమానాలను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయింది
- అభినందన్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి డాన్స్ చేయడం నిజమేనా...
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- #WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









