పాకిస్తాన్ వెళ్లి, ఇస్లాంలోకి మారి అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకున్న భారతీయ మహిళ పరిస్థితేంటి? ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు?

ఫొటో సోర్స్, Ahmad Pasha
- రచయిత, ఎహ్‌తెషాం షమీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
టూరిస్టు వీసాపై పాకిస్తాన్ వెళ్లి, అక్కడి స్థానికుడైన నాసిర్‌హుస్సేన్‌ను పెళ్లి చేసుకున్న భారతీయ మహిళ సరబ్‌జీత్ కౌర్‌ను, ఆమెభర్త నాసిర్ హుస్సేన్‌ను నిర్బంధంలోకి తీసుకున్నట్టు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల మంత్రి సర్దార్ రమేశ్ సింగ్ అరోరా ధ్రువీకరించారు.
వాఘా సరిహద్దు గుండా 48 ఏళ్ల సరబ్‌జీత్ కౌర్‌ను గురువారం భారత్‌కు తిప్పి పంపవచ్చని, ఆమె పాకిస్తానీ భర్తపై చర్యలు తీసుకునే అవకాశముందని సర్దార్ రమేశ్ సింగ్ చెప్పారు.
సిక్కయాత్రికులతో కలిసి గత ఏడాది నవంబర్ 4న సరబ్‌జీత్ పాకిస్తాన్ వెళ్లారు. ఆమె వీసా గడువు నవంబర్ 13తో ముగిసినా ఆమె భారత్‌కు తిరిగిరాలేదు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, షేఖ్‌పురా ప్రాంతానికి చెందిన నాసిర్ హుస్సేన్‌ను సరబ్‌జీత్ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె పాకిస్తాన్‌లోనే ఉన్నారు.

నన్‌కానా సాహిబ్ పరిధిలోనిపహ్రేవాలీ గ్రామంలో సరబ్‌జీత్, నాసిర్ హుస్సేన్ ఉన్నట్టు జనవరి 4వతేదీన సమాచారం అందడంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకున్నాయని రమేశ్ సింగ్ అరోరా బీబీసీ ఉర్దూకు చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా సరబ్‌జీత్‌తో పాటు ఆమె పాకిస్తానీ భర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు. వారిని నన్‌కానా సాహిబ్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారు సదర్ పోలీసుస్టేషన్ కస్టడీలో ఉన్నారు.
పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా ఈ కేసు దర్యాప్తు జరిపారని రమేశ్ సింగ్ అరోరా చెప్పారు.
టిక్‌టాక్ ద్వారా సరబ్‌జీత్, నాసిర్ హుస్సేన్‌కు 2016లో పరిచయమైనట్టు దర్యాప్తులో తేలింది. వీసా కోసం వారిద్దరూ అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ న్యాయపరమైన కారణాలతో వారికి వీసా మంజూరు కాలేదని ఏజెన్సీలు గుర్తించాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
‘‘అరెస్టు కాదు..దేశ బహిష్కరణ’’
సరబ్‌జీత్ కౌర్‌ను అధికారికంగా అరెస్టు చేయలేదని, కానీ వీసా నిబంధనలను ఉల్లంఘించి, నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం దేశంలో ఉన్నందుకు ఆమెపై చర్యలు తీసుకున్నామని బీబీసీ ప్రతినిధి షుమిలా ఖాన్‌తో మంత్రి రమేశ్ సింగ్ చెప్పారు.
"ఆమె మతపరమైన వీసాపై వచ్చారు. వీసా నిబంధనల ప్రకారమే ఆమె ఈ దేశంలో ఉండాలి.ఈ విషయంలో నా వైఖరి మొదటి రోజునుంచి స్పష్టంగా ఉంది" అన్నారు.
పాకిస్తాన్ చట్టం ప్రకారం వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయినవారిని దేశ బహిష్కరణ చేస్తామని ఆయన అన్నారు. ఈ కేసులోనూ అలాంటి చర్యే తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
సరబ్‌జీత్ కౌర్‌ను మతపరమైన ప్రదేశాలను పర్యవేక్షించే, యాత్రికుల విషయాలను సమన్వయం చేసే ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుకి అప్పగించి, దేశం నుంచి పంపించివేసే ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి రమేశ్ సింగ్ తెలిపారు.
దీనిపై ప్రభుత్వం పాకిస్తాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ వద్ద ఆందోళన వ్యక్తంచేసిందని, భవిష్యత్తులో సందర్శకుల కోసం వీసా నియమాలను ఖచ్చితంగా పాటించాలని కోరిందని మంత్రి చెప్పారు.
"యాత్రికులు తమ తీర్థయాత్ర నిర్దేశించిన ఉద్దేశాన్ని పాటించకపోతే, అది మొత్తం ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. నన్‌కానా సాహిబ్ వంటి ప్రదేశాలు మతపరంగా ఎంతో ముఖ్యమైనవి. ఇలాంటి చోట ఏ రకమైన దుర్వినియోగం అయినా అధికారులకు మాత్రమే కాకుండా నిజమైన యాత్రికులకు కూడా సమస్యలను సృష్టిస్తుంది" అని ఆయన అన్నారు.
నాసిర్ హుస్సేన్‌కు సంబంధించి ప్రస్తుతం పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని ఆయన అన్నారు. నాసిర్ ను ప్రశ్నిస్తున్నామని, తదుపరి చర్యలు దర్యాప్తు ఫలితంపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.
నాసిర్ మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు అధికారులు తెలిపారు.
"ప్రస్తుతం మా దృష్టి సరబ్‌జీత్ కౌర్ బహిష్కరణను పూర్తి చేయడంపై ఉంది" అని రమేశ్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC
‘సరబ్‌జీత్‌ను భారత్‌కు పంపించాలి’
సరబ్‌జీత్ కౌర్‌ను భారత్‌కు తిరిగి పంపించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ మానవ హక్కుల మాజీ పార్లమెంటరీ కార్యదర్శి దాస్ మహీందర్ పాల్ సింగ్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయవాది అలీ చంగేజీ సంధు ద్వారా ఈ పిటిషన్ దాఖలైంది
ఆమె బహిష్కరణ వార్తలపై మహీందర్ పాల్ సింగ్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. "తన ఇష్టానుసారం వివాహం చేసుకోవాలనేది సరబ్‌జీత్ కౌర్ వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆమె మతపరమైన వీసాను దుర్వినియోగం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసింది" అన్నారు.
"వారి వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికి ఉంది, కానీ మతపరమైన వీసాను ఈ ప్రయోజనం కోసం ఉపయోగించకూడదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Police
ఈ కేసులో అసలేం జరిగింది?
నాసిర్ హుస్సేన్ 2025 నవంబర్ 4న నన్‌కానా సాహిబ్‌లోని గురుద్వారా జన్మస్థాన్‌కు వచ్చారు. అక్కడి నుంచి సరబ్‌జీత్ కౌర్‌తో కలిసి తన పూర్వీకుల ప్రాంతమైన షేఖ్‌పురా జిల్లా ఫారూకాబాద్‌కు వెళ్లారని రమేశ్ ఆరోరా చెప్పారు.
దర్యాప్తు అనంతరం, సరబ్‌జీత్ కౌర్‌ను ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుకు అప్పగించాలని నిర్ణయించినట్టు రమేశ్ సింగ్ అరోరా చెప్పారు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం ఈ బోర్టు ఆమెను భారత్‌కు పంపే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
నాసిర్ హుస్సేన్‌పై విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయిస్తామని చెప్పారు.
నవంబర్‌లో సరబ్‌జీత్ కౌర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన లాహోర్ హైకోర్టు, ఆమెను వేధించవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే నవంబర్ 8న పంజాబ్ పోలీసులు సరబ్‌జీత్ , నాసిర్ ఇంటిపై దాడి చేసి వివాహాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె లాయర్ అహ్మద్ హసన్ పాషా ఆ రోపించారు.
సరబ్‌జీత్, నాసిర్ వివాహ జీవితంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని న్యాయమూర్తి పోలీసులను కోరారు. విచారణానంతరం జస్టిస్ ఫారూక్ హైదర్, వేధింపులు ఆపాలని పోలీసులను ఆదేశిస్తూ పంజాబ్ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు భారతీయ మహిళను, ఆమె పాకిస్తానీ భర్తను వేధించలేదని బీబీసీ ఉర్దూతో షేఖ్‌పురా పోలీసు ప్రతినిధి రాణా యూనస్ చెప్పారు.
ఈ విషయంలో వస్తున్న ఆరోపణలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, వాటితో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.
ఇరుదేశాల అధికారుల ముందు వారి వాంగ్మూలాలను నమోదు చేయడానికి వారిద్దరినీ నవంబర్ 15న తన వద్దకు పిలిచానని, కానీ వారు రాలేదని, తర్వాత నాసిర్ హుస్సేన్ ఫోన్ కూడా స్విచాఫ్ వచ్చిందని వారి న్యాయవాది తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సరబ్‌జీత్ కౌర్ నవంబరు 4న సిక్కు యాత్రికులతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లారు. మరుసటి రోజు ఆమె బాబా గురునానక్ జయంతి సందర్భంగా నాన్‌కానా సాహెబ్‌ను దర్శించాల్సి ఉంది. కానీ, నవంబరు 7న షేఖ్‌పురా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు తాను స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారి నాసిర్ హుస్సేన్ అనే పాకిస్తానీ పౌరుడిని వివాహం చేసుకున్నట్టు వాంగ్మూలం ఇచ్చారు.
షేఖ్‌పురా యూనియన్ కౌన్సిల్‌లో ఈ వివాహం రిజిస్టర్ అయిందని ఆమె న్యాయవాది అహ్మద్ హసన్ పాషా తెలిపారు.
షేఖ్‌పురా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు సమర్పించిన పత్రాల ప్రకారం, సరబ్‌జీత్ కౌర్, ఖారీ రిజ్వాన్ భట్టీ సమక్షంలో ఇస్లాం మతంలోకి మారి 'నూర్' అనే పేరు పెట్టుకున్నారు.
ఇస్లాంలోకి మారినట్టు ధ్రువీకరణ పత్రం నవంబర్ 5న జారీ అయింది.
కోర్టుకు సమర్పించిన వివాహ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. నాసిర్ హుస్సేన్ వయస్సు 43 ఏళ్లు. ఆయన కట్నంగా పది వేల రూపాయలు తీసుకున్నారు.
నాసిర్ హుస్సేన్‌కు ఇప్పటికే వివాహం అయిందని, అయితే రెండో పెళ్లికి అనుమతి తీసుకోవల్సిన అవసరం కూడా లేదని ఆ పత్రంలో ఉంది.
సరబ్‌జీత్ కౌర్ తరఫున మరో ఫిర్యాదు కూడా కోర్టులో దాఖలైంది. ఇందులో పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని, తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 200 కింద దాఖలైన ఈ ఫిర్యాదులో
"నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాను. నా తల్లిదండ్రుల ఇంటి నుంచి మూడు దుస్తులు మాత్రమే తీసుకొచ్చాను. ఇంకేమీ తీసుకురాలేదు" అని సరబ్‌జీత్ చెప్పారు.
"నా పెళ్లిపై పోలీసులు చాలా కోపంగా ఉన్నారు. నవంబరు 5న రాత్రి 9 గంటలకు, పోలీసు అధికారులు బలవంతంగా మా ఇంట్లోకి ప్రవేశించి నన్ను వారితో రమ్మని అడిగారు. నేను నిరాకరించడంతో వారికి కోపమొచ్చింది. నేను పెద్దగా అరవడం మొదలుపెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చారు'' అని సరబ్‌జీత్ తెలిపారు.
తనకు, తన భర్తకు పోలీసు రక్షణ కల్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, PRADEEP SHARMA/BBC
'తొమ్మిదేళ్ల పరిచయం'
సరబ్‌జీత్ భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. ఆమెది కపుర్తలా జిల్లా. 2,000 మంది సిక్కు యాత్రికుల బృందంలో ఒకరిగా ఆమె పాకిస్తాన్ వెళ్లారు. యాత్రికులందరూ 10 రోజుల తర్వాత నవంబరు 13న భారత్‌కు తిరిగి వచ్చారు. కానీ, సరబ్‌జీత్ కౌర్ వారి వెంటలేరు.
సమాచారం అందిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని కపుర్తలా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధీరేంద్ర వర్మ నవంబర్‌లో బీబీసీతో చెప్పారు. సరబ్‌జీత్ ఇస్లాం మతంలోకి మారడం, పెళ్లి చేసుకోవడంపై తమకు సమాచారం లేదన్నారు.
మీడియాలో అలాంటి కథనాలు వస్తున్నాయని, కానీ పోలీసుల వద్ద దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేదా సమాచారం లేదని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత, ఇక నుంచి ఒంటరి మహిళలను యాత్రికుల గుంపులతో కలిపి పంపకూడదని కమిటీ నిర్ణయించిందని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కార్యదర్శి ప్రతాప్ సింగ్ బీబీసీతో చెప్పారు.
భారత్‌లో వస్తోన్న మీడియా రిపోర్టుల ప్రకారం, సరబ్‌జీత్ విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఆమె మాజీ భర్త దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇంగ్లండ్‌లో ఉంటున్నారు.
గ్రామ సర్పంచ్ నుంచి దీనిపై తమకు సమాచారం అందిందని కపుర్తలా జిల్లాలోని తల్వండి చౌధరియాం గ్రామ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) నిర్మల్ సింగ్ చెప్పారు.
నాసిర్ హుస్సేన్ పాకిస్తాన్‌లో భూస్వామి అని న్యాయవాది అహ్మద్ హసన్ పాషా చెప్పారు. ఆయన బీబీసీకి ఒక వీడియోను షేర్ చేశారు. తాను విడాకులు తీసుకున్నానని, ఇస్లాం మతంలోకి మారి, నాసిర్ హుస్సేన్‌ను వివాహం చేసుకోవాలని తనంత తానుగా నిర్ణయించుకున్నానని సరబ్‌జీత్ ఆ వీడియోలో చెబుతున్నారు.
నాసిర్ హుస్సేన్ తనకు తొమ్మిదేళ్లుగా తెలుసని అందులో చెప్పారు.
సరబ్‌జీత్, నాసిర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసుకునేవారని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆరు నెలల కిందటే నిర్ణయించుకున్నారని లాయర్ అహ్మద్ హసన్ పాషా తెలిపారు.వారిద్దరూ న్యాయ సహాయం కోసం తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













