'నేను అధ్యక్షుడిని.. నన్ను కిడ్నాప్ చేశారు', న్యూయార్క్ కోర్టులో నికోలస్ మదురో ఏం చెప్పారు?

నికోలస్ మదురో, వెనెజ్వెలా, అమరికా, న్యూయార్క్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, మెడిలైన్ హాల్పెర్ట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వెనెజ్వెలా నాయకుడు నికోలస్ మదురో మొదటిసారి న్యూయార్క్ సిటీ కోర్టు రూమ్‌ లోపల అడుగుపెట్టేముందు ఆయన కాళ్లకు వేసిన సంకెళ్ల గొలుసుల శబ్దం వినిపించింది.

అక్కడ కిక్కిరిసి ఉన్న రిపోర్టర్లకు, ప్రజలకు తనను ''కిడ్నాప్ చేశారని'' ఆయన చెప్పారు.

ఆయన కోర్టుహాల్‌లో ప్రవేశించిన కొన్నినిమిషాలకు విచారణ ప్రారంభించడానికి వీలుగా తన గుర్తింపును ధ్రువీకరించాలని మదురోను జడ్జి ఆల్విన్ హెల్లర్‌స్టెయిన్ కోరారు.

''సర్, నేను నికోలస్ మదురోని. రిపబ్లిక్ వెనెజ్వెలా అధ్యక్షుడిని. జనవరి 3న నన్ను కిడ్నాప్ చేసిన దగ్గరి నుంచి ఇక్కడ ఉంచారు'' అని కోర్టుకు ఆయన ప్రశాంతంగా స్పానిష్‌లో చెప్పారు.

మదురో చెప్పిన విషయాన్ని అనువాదకుడు కోర్టుకు వివరించారు. ''వెనెజ్వెలాలోని కారకస్‌లో నా ఇంట్లో నన్ను బంధించారు'' అని మదురో తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నికోలస్ మదురో, వెనెజ్వెలా, అమరికా, న్యూయార్క్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ కోర్టులో మదురోపై విచారణ జరిగింది.

విచారణకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకున్న మదురో

92 ఏళ్ల న్యాయమూర్తి వెంటనే కల్పించుకుని ''ఈ విషయాలన్నింటికీ సరైన సమయం, స్థలం ఉంటాయి'' అని మదురోతో చెప్పారు.

సోమవారం(డిసెంబరు 5)మధ్యాహ్నం 40 నిమిషాలపాటు నాటకీయంగా సాగిన విచారణలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ డ్రగ్స్, ఆయుధాల ఆరోపణల్లో తాము నిర్దోషులమని చెప్పారు.

''నేను నిర్దోషిని. నేనొక మంచి మనిషిని'' అని మదురో చెప్పారు. ''తనకు అసలేమీ తెలియదు'' అని మదురో భార్య అన్నారు.

అమెరికన్ దళాలు వెనెజ్వెలాలో అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించి, వెనెజ్వెలా మిలటరీ స్థావరాలపై దాడులు జరిపి.. 63 ఏళ్ల నికోలస్ మదురోను, ఆయన భార్యను వారి ఇంట్లోనే అదుపులోకి తీసుకుని న్యూయార్క్ జైలుకు తరలించింది.

బ్లూ, ఆరెంజ్ జైలు యూనిఫాం, ఖాకీ ప్యాంట్లు వేసుకున్న నికోలస్ మదురో, ఆయన భార్యకు విచారణ సమయంలో స్పానిష్ ట్రాన్స్‌లేషన్ వినేందుకు వీలుగా హెడ్‌ఫోన్లు పెట్టారు. వారిద్దరి మధ్య ఒక న్యాయవాది కూర్చున్నారు. పసుపురంగులో ఉన్న లీగల్ ప్యాడ్‌పై మదురో జాగ్రత్తగా కొన్న విషయాలు నోట్ చేసుకున్నారు. ఆ ప్యాడ్‌ను తన వద్ద ఉంచుకుంటానని జడ్జిని కోరి ఆ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు.

నికోలస్ మదురో, వెనెజ్వెలా, అమరికా, న్యూయార్క్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వారిని కోర్టుకు తీసుకెళ్లడానికి, తిరిగి జైలుకు తరలించడానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉపయోగించారు.

'నేను అధ్యక్షుడిని, యుద్ధఖైదీని'

మదురో ఫెడరల్ కోర్టు రూమ్‌లోకి ప్రవేశించిన తర్వాత, వెనక్కి తిరిగి అక్కడ ఉన్న వారిని చూస్తూ తల ఊపుతూ అభివాదం చేశారు.

విచారణ జరిగినంతసేపు ఆయన ప్రశాంతంగా కనిపించారు. ఎలాంటి భావాలు వ్యక్తం చేయలేదు. చివర్లో కోర్టు హాల్లోని ప్రేక్షకుల్లో నుంచి ఓ వ్యక్తి.. మదురో తాను చేసిన నేరాలకు ''మూల్యం చెల్లించక తప్పదు'' అంటూ అనూహ్యంగా కేకలు వేసినప్పుడు కూడా మదురో అలాగే ఉన్నారు.

''నేను అధ్యక్షుడిని. యుద్ధ ఖైదీని'' అని స్పానిష్‌లో ఆ వ్యక్తిని ఉద్దేశించి అరిచి చెప్పారు. తడి కన్నులతో ఉన్న ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లారు.

కోర్టులో ఉన్నవారికి కూడా ఈ విచారణ భావోద్వేగాన్ని కలిగించింది. మదురో అరెస్టు సమయంలో అమెరికా నిర్వహించిన మిస్సైల్ దాడుల్లో కరాకస్‌లోని ఫ్యూర్ట్ టియూనా దగ్గరున్న తన ఇల్లు దెబ్బంతిందని వెనెజ్వెలాకు చెందిన రిపోర్టర్ మైబోర్ట్ పెటిట్ చెప్పారు. మదురో పాలనా సమయంలో మైబోర్ట్ రిపోర్టింగ్ చేశారు.

నికోలస్ మదురో, వెనెజ్వెలా, అమరికా, న్యూయార్క్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నికోలస్ మదురో మద్దతుదారుల ఆందోళనలు

తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా

తమ మాజీ నాయకుడిని అమరికన్ మార్షల్స్ జైలు దుస్తుల్లో కోర్టుకు తీసుకురావడం తనకు అసాధారణంగా అనిపించిందని ఆమె చెప్పారు.

మదురో భార్య ఫ్లోరెస్ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆమె కంటి దగ్గర, నుదుటి దగ్గర గాయాలకు బ్యాండేజ్‌లున్నాయి. అరెస్టు సమయంలో ఆమెకు గాయాలయ్యాయని న్యాయవాదులు చెప్పారు.

ఆమె తన జుట్టును వెనక్కి లాగి హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటూ, నెమ్మదిగా మాట్లాడారు. ఎముకలకు గాయాలవ్వడం లేదా విరగడం లాంటివేమైనా జరిగాయేమో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయడంతో పాటు ఆమెకు సరైన చికిత్స అందించాలని లాయర్లు కోరారు.

విచారణ సమయంలో మదురో, ఆయన భార్య బెయిల్ కావాలని కోరలేదు. వాళ్లు ఫెడరల్ కస్టడీలోనే ఉంటారు కాబట్టి, తర్వాత బెయిల్ కోరే అవకాశముంది.

మదురోపై అమెరికా నార్కో-టెర్రిరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషీన్ గన్లు, విధ్వంసక ఆయుధాలు కలిగి ఉండడం, వాటి కోసం కుట్ర పన్నడం వంటి ఆరోపణలు చేసింది.

మదురోపై, ఆయన భార్య, కొడుకు, ఇంకా అనేక మందిపై అభియోగాలున్నాయి. కేసు విచారణ మార్చి 17కు వాయిదా పడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)