నాడు పనామా పాలకుడు నోరీగా, నేడు వెనెజ్వెలా అధ్యక్షుడు మదురో..వారి దేశాలలోనే వారిని అమెరికా ఎలా బంధించింది?

నికోలస్ మదురో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నికోలస్ మదురో

వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, ఇకపై ఆ దేశంమీద ఎలాంటి అదనపు చర్యలు తీసుకునే అవకాశంలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అభిప్రాయపడుతున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ మైక్ లీ తెలిపారు.

రూబియోతో ఫోన్ సంభాషణ అనంతరం సెనేటర్ లీ మాట్లాడుతూ మదురోను అమెరికాలో క్రిమినల్ కేసులపై విచారణ ఎదుర్కొనేందుకు అరెస్ట్ చేసినట్లు ధృవీకరించారు.

"మదురో ప్రస్తుతం అమెరికా అదుపులో ఉన్న నేపథ్యంలో, వెనెజ్వెలాపై ఇక ఎలాంటి సైనిక లేదా ఇతర చర్యలు అవసరం లేదని విదేశాంగ మంత్రి రూబియో భావిస్తున్నారు" అని లీ చెప్పారు.

మదురో అరెస్టు సమయంలో అమెరికా చేసిన దాడులు కేవలం అరెస్ట్ వారెంట్‌ను అమలు చేస్తున్న అధికారుల భద్రత కోసమేనని లీ వివరించారు.

అంతకుముందు, మైక్ లీ 'ఎక్స్' వేదికగా అమెరికా చర్యను ప్రశ్నించారు.

''యుద్ధ ప్రకటన లేదా సైనిక బలగాల వినియోగానికి కాంగ్రెస్ నుంచి అధికారిక అనుమతి లేని పక్షంలో, ఈ చర్యను రాజ్యాంగబద్ధంగా ఎలా సమర్థిస్తారో తెలుకోవాలని కోరుకుంటున్నాను'' అని రాశారు.

న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో నికోలస్ మదురో, ఆయన భార్యపై నేరారోపణ పత్రం దాఖలైందని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రకటించారు.

ఉగ్రవాద చర్యలకు మద్దతుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడటం, అమెరికాలోకి భారీగా కొకైన్ అక్రమ తరలింపునకు పన్నాగం తదితర ఆరోపణలు అందులో ఉన్నాయి.

''వారు త్వరలోనే అమెరికా గడ్డపై, అమెరికా కోర్టుల్లో అమెరికా న్యాయవ్యవస్థ ఆగ్రహాన్ని ఎదుర్కోబోతున్నారు'' అని పామ్ బోండీ వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వెనెజ్వెలాలో అమెరికా దాడులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, వెనెజ్వెలాలో అమెరికా దాడులు

గతంలో నోరీగా మాదిరిగానే...

అమెరికా తన డెల్టా ఫోర్స్ బలగాలను వెనెజ్వెలా రాజధాని నడిబొడ్డుకు పంపి, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బంధించి తీసుకురావడం నిజమైతే, ఇది గతంలో ఎన్నడూ చూడని అత్యంత సాహసోపేతమైన చర్య అని బీబీసీ వరల్డ్ అఫైర్స్ కరస్పాండెంట్ జో ఇన్‌వుడ్ పేర్కొన్నారు.

నికోలస్ మదురో మాదిరిగానే, 1989లో పనామా పాలకుడు మాన్యుయెల్ నోరీగానూ అమెరికా బంధించింది. వీరిద్దరి మధ్య కొన్ని కీలక సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ వివాదాస్పదమైన ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అమెరికా వీరిద్దరిపైనా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు చేసింది. ఈ రెండు ఆపరేషన్లకు ముందే అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరించింది.

అయితే, పనామాలో నోరీగా అరెస్టు అనేది ఒక చిన్నస్థాయి యుద్ధం తర్వాత జరిగింది. ఆయన 11 రోజుల పాటు వాటికన్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. అప్పుడు 'సైకలాజికల్ వార్‌ఫేర్' తంత్రంతో అమెరికా ఆయన లొంగిపోయేలా చేసింది. తర్వాత అమెరికాకు తరలించి, మాదక ద్రవ్యాల కేసుల్లో శిక్ష విధించారు.

కానీ మదురోను అదుపులోకి తీసుకున్న ఆపరేషన్ వివరాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, పదాతి దళాలను ఉపయోగించకుండానే అమెరికా ఇంతటి క్లిష్టమైన ఆపరేషన్ ఎలా పూర్తి చేసిందనేది ఆశ్చర్యకరం.

మదురో భవిష్యత్తు ఏమవుతుందో ఇంకా స్పష్టత లేదు కానీ, ఆయన కూడా అమెరికా జైలులోనే తన జీవితాన్ని ముగించే అవకాశం ఉందని జో ఇన్‌వుడ్ అభిప్రాయపడ్డారు.

వెనెజ్వెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్, అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్టాడో కాబెల్లో, రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెనెజ్వెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్, అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్టాడో కాబెల్లో, రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో

వెనెజ్వెలాలో ఏమవుతుంది?

పనామాలో సైనిక పాలకుడు మాన్యుయెల్ నోరీగాను పదవీచ్యుతుడిని చేయడానికి జరిపిన సైనిక చర్య తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన ప్రత్యక్ష సైనిక జోక్యం ఇదేనని బీబీసీ సౌత్ అమెరికా ప్రతినిధి అయోన్ వెల్స్ పేర్కొన్నారు.

అమెరికా జోక్యాన్ని సమర్థించేవారు, నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా కొరీనా మచాదో లేదా 2024 ఎన్నికల అభ్యర్థి ఎడ్మండో గొంజాలెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వెనెజ్వెలా సైన్యం, సాయుధ పారామిలిటరీ దళాలు ఇప్పటివరకూ మదురోకు అత్యంత విధేయులుగా ఉన్నాయి.

అమెరికా దాడులను దురాక్రమణగా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో ఇప్పటికే అభివర్ణించారు.

సైన్యం కొత్త నాయకత్వానికి లోబడి పనిచేస్తుందా లేదా 'చివరి వరకూ పోరాడతాం' అని తిరుగుబాటు చేస్తుందా అన్నది అత్యంత కీలమని అయోన్ వెల్స్ అభిప్రాయపడ్డారు.

అయితే, మదురో అదృశ్యంతో దేశంలో అకస్మాత్తుగా 'అధికార శూన్యత' ఏర్పడింది. ఇది దేశాన్నిఅంతర్యుద్ధం వైపు నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మదురో దంపతులు బతికే ఉన్నారనే ఆధారం చూపించాలని వెనెజ్వెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఇప్పటికే డిమాండ్ చేశారు.

అయితే, మదురో అరెస్టు తర్వాతి పరిణామాల్లో వెనెజ్వెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్టాడో కాబెల్లో, రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో అత్యంత కీలకంగా మారారు.

వారు ముగ్గురూ టెలివిజన్ ముందుకొచ్చి, దేశం సురక్షితంగా ఉందని ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశ పగ్గాలు ఎవరు చేపట్టాలనేదీ ఈ ముగ్గురి మధ్యే నిర్ణయం జరగాల్సి ఉంది.

రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలే అధ్యక్ష పదవి చేపట్టాలి. కానీ, ఆమెకు సైనిక ర్యాంకుల్లో నేరుగా ప్రవేశం లేదు. ఆమెకు ఆర్థికం, పరిపాలన, దౌత్య వ్యవహారాలతో పాటు మదురో పార్టీ యంత్రాంగంపై మాత్రమే పట్టు ఉంది.

వ్లాదిమిర్ పాడ్రినో, డియోస్టాడో కాబెల్లోలకు ఇద్దరికీ సైన్యంతో బలమైన సంబంధాలు ఉన్నాయి.

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్
ఫొటో క్యాప్షన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్

ఇతర దేశాలు ఏమంటున్నాయి?

వెనెజ్వెలాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు ఎటువంటి సంబంధం లేదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో తాము ఏరకంగానూ భాగస్వాములం కామని ఆయన మీడియాకు వెల్లడించారు.

నికోలస్ మదురో అరెస్టుకు సంబంధించి తాను ఇంకా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో మాట్లాడలేదని చెప్పారు.

''మనం ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని విశ్వసిస్తాను'' అని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు.

వెనెజ్వెలాలో పరిణామాలతో పొరుగు దేశమైన కొలంబియా అత్యంత వేగంగా స్పందించింది.

జాతీయ భద్రతామండలి సమావేశం అనంతరం, వెనెజ్వెలా సరిహద్దు వెంబడి అదనంగా సైనిక, పౌర బలగాలను మోహరించాలని అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆదేశించారు. అమెరికా సైనికచర్యను ఖండించారు. లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై దాడి అని అభివర్ణించారు.

అమెరికన్ దేశాల కూటమి (ఓఏఎస్) తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించాలని పెట్రో కోరారు.ఈ దాడికి ఉన్న చట్టబద్ధతను తేల్చడానికి ఐక్యరాజ్య సమితి భద్రతామండలి వెంటనే సమావేశమవ్వాలని ఆయన 'ఎక్స్' వేదికగా పిలుపునిచ్చారు.

అమెరికా దాడుల నేపథ్యంలో వెనెజ్వెలా నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు కొలంబియాకు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. అందుకు అవసరమైన మానవతా సహాయ చర్యల కోసం సన్నాహాలు చేస్తోంది.

అమెరికా సైనిక దాడులపై చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ కూడా తీవ్రంగా స్పందించారు. ''వెనెజ్వెలాపై అమెరికా చేసిన నేరపూరిత దాడిని క్యూబా తీవ్రంగా ఖండిస్తోంది'' అని పేర్కొన్నారు.

పొరుగు దేశాలైన గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా తమ భద్రత, దౌత్యపరమైన వైఖరిని స్పష్టం చేశాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)