పాకిస్తాన్ వద్ద అత్యాధునిక చైనీస్ ఫైటర్ జెట్లు ఉన్నా.. అమెరికా యుద్ధ విమానాలను ఎందుకు కోరుకుంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా హసన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎఫ్-16 ఫైటర్ జెట్‌లకు అవసరమైన విడిభాగాలు, సాంకేతిక సహకారం పాకిస్తాన్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
యూఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) అమెరికా కాంగ్రెస్ (చట్టసభ)కు పంపిన లేఖ ప్రకారం, ఈ ప్రతిపాదిత ఒప్పందం విలువ 686 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 6,214 కోట్ల రూపాయలు).
పాకిస్తాన్ వద్దనున్న ఎఫ్-16 యుద్ధ విమానాల ఆధునికీకరణ, నిర్వహణ లోపాలను పరిష్కరించడమే ఈ ఒప్పందం లక్ష్యమని డీఎస్‌సీఏ పేర్కొంది.
ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాల్లో అమెరికాతో పాకిస్తాన్ భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ఒప్పందం ద్వారా అవకాశం లభిస్తుందని తెలిపింది.
ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్‌కు లింక్-16 సిస్టమ్ కమ్యూనికేషన్/డేటా షేరింగ్ నెట్‌వర్క్‌లు, క్రిప్టోగ్రాఫిక్ ఎక్విప్‌మెంట్, ఏవియానిక్స్ అప్‌డేట్‌లు, శిక్షణ, సమగ్ర లాజిస్టిక్ మద్దతును అమెరికా అందిస్తుందని డిసెంబర్ 8న కాంగ్రెస్‌కు పంపిన ఈ లేఖలో డీఎస్‌సీఏ వెల్లడించింది.
ఈ ఒప్పందం ఫలితంగా పాకిస్తాన్ తన ఎఫ్-16, బ్లాక్-52, అప్‌గ్రేడ్ చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఆధునికీకరించడం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను కొనసాగించగలుగుతుందని అమెరికా రక్షణ సంస్థ పేర్కొంది.

ఈ లేఖ ప్రకారం, పాకిస్తాన్ ఎఫ్ -16 యుద్ధ విమానాలను 2040 వరకూ నిర్వహణలో ఉంచడానికి ఉపయోగపడుతుందని డీఎస్‌సీఏ ఆ లేఖలో స్పష్టం చేసింది.
దీనిపై స్పందించిన పాకిస్తాన్, ఎఫ్-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు అమెరికా ఆమోదం తెలపడం ఇరుదేశాల మధ్య సాధారణ రక్షణ సహకారంలో భాగమేనని పేర్కొంది.
డిసెంబర్ 11న విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఎఫ్-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు సంబంధించిన 686 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా ఆమోదముద్ర వేయడాన్ని స్వాగతించారు. ఇది ఇరుదేశాల రక్షణ సహకారానికి నిదర్శనమన్నారు.
అమెరికాతో సంబంధాలను పెంపొందించుకోవడానికి పాకిస్తాన్ ఆసక్తిగా ఉందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ కోరుతున్న ఆధునికీకరణ ఏమిటి?
ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్ నాలుగు దశాబ్దాలుగా వినియోగిస్తోంది. గగనతల రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నాయి.
పాకిస్తాన్ వైమానిక దళం రక్షణ కోణంలో ఎఫ్-16 యుద్ధ విమానాలకు అత్యంత ప్రాధాన్యం ఉందని రక్షణరంగ విశ్లేషకుడు ముహమ్మద్ అలీ చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ఎఫ్-16 విమానాల రాడార్ వ్యవస్థను మరింత సమర్థవంతం చేసేందుకు పాకిస్తాన్ దానిని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటోందని, తద్వారా ఉగ్రవాదుల స్థావరాలను కచ్చితంగా టార్గెట్ చేసే సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు.
మోర్ అడ్వాన్స్‌డ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ 'ఏఎంఆర్ఏఏఎం' మోడ్రన్ వెర్షన్‌ను ఈ యుద్ధ విమానంలో జోడించాలని, ఏవియానిక్స్ సూట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని పాకిస్తాన్ ఆశిస్తోందని ముహమ్మద్ అలీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నా...
పాకిస్తాన్ వైమానిక దళం వద్ద ప్రస్తుతం అత్యంత ఆధునికమైన చైనా యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నా ఎఫ్-16 యుద్ధ విమానాల ప్రాధాన్యం ఇంకా కొనసాగుతోంది.
పాకిస్తాన్ వద్ధ ప్రస్తుతం మూడు దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం సహా కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆ దేశాలు చైనా, అమెరికా, ఫ్రాన్స్.
ఫ్రెంచ్ మిరాజ్ యుద్ధ విమానాలు, అమెరికా తయారీ ఎఫ్-16, సి-130 యుద్ధ విమానాలు, టి-37 ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, చైనా తయారీ జే-10సి, జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్ విమానాలను పాకిస్తాన్ ఉపయోగిస్తోంది.
200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం గురితప్పకుండా ఛేదించగల సామర్థ్యం ఉన్న పీఎల్-15 క్షిపణులను ప్రయోగించగల చైనా తయారీ జే-10సి, జేఎఫ్-17 యుద్ధ విమానాలు అత్యంత ఆధునికమైన, సమర్థవంతమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదని ముహమ్మద్ అలీ అన్నారు.
అలాగే, పాకిస్తాన్ వైమానిక దళంలోని విజయవంతమైన, ఆధునికమైన యుద్ధ విమానం ఎఫ్-16 అని ఆయన చెప్పారు. దీన్ని గత 40 ఏళ్లుగా నైపుణ్యంతో ఉపయోగిస్తోందని అన్నారు.
"ఎఫ్-16 అత్యంత ఆధారపడదగినది, మిగతా వాటితో పోలిస్తే వ్యయం తక్కువ, సమర్థవంతమైనవి, శిక్షణ - నిర్వహణ సులభం, ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల కంటే చౌక" అని అలీ చెప్పారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఎఫ్-16 కీలక పాత్ర పోషించింది. గత 25 ఏళ్లలో 80 శాతం ఆపరేషన్లను అత్యంత కచ్చితత్వంతో ఛేదించడానికి పాకిస్తాన్ ఈ విమానాలను ఉపయోగించింది.
ఎఫ్-16లు పాకిస్తాన్‌లో అడుగుపెట్టిందెప్పుడు?
1972లో, తేలికపాటి యుద్ధ విమానాల అవసరం ఏర్పడింది. దీంతో జనరల్ డైనమిక్స్ అనే అమెరికా కంపెనీ ఎఫ్-16 విమానాలను రూపొందించింది. ఈ విమానం పేరు 'ఫైటింగ్ ఫాల్కన్' లేదా 'ఎఫ్-16'.
ఇవి సింగిల్ సీటు, సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాలు. ధ్వని కంటే రెట్టింపు వేగంతో ప్రయాణించగలవు. వివిధ రకాల క్షిపణులు, బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం వీటికుంది.
జనరల్ డైనమిక్స్ తర్వాత లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్‌లో భాగమైంది.
ఈ కంపెనీలో రూపొందించిన మొదటి బ్యాచ్ యుద్ధ విమానాలు 1978లో అమెరికా వైమానిక దళానికి అందాయి.
తర్వాత అమెరికా ఈ ఎఫ్-16 విమానాలను పాకిస్తాన్‌తో పాటు, బహ్రెయిన్, బెల్జియం, ఈజిప్ట్, తైవాన్, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు సరఫరా చేసింది.
పాకిస్తాన్ తన రక్షణ కోసం అమెరికా నుంచి వివిధ రకాల ఆయుధాలు, సైనిక పరికరాలను కొనుగోలు చేస్తోంది, వాటిలో ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. వీటిని ఉగ్రవాదంపై పోరులో ఉపయోగించడమే కాకుండా, దాని తూర్పు సరిహద్దు భద్రత కోసం కూడా అమెరికాపై ఆధారపడుతోంది.
1981లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌లో జోక్యం చేసుకున్నప్పుడు పాకిస్తాన్, అమెరికాలో F-16 తయారీ కార్యక్రమం ప్రారంభమైంది.
ఆ సమయంలో, సోవియట్, అఫ్గానిస్తాన్ యుద్ధవిమానాలకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు వీలుగా ఎఫ్-16లను పాకిస్తాన్‌కు విక్రయించడానికి అమెరికా ఆసక్తి చూపించింది.
సోవియట్ యూనియన్, అఫ్గానిస్తాన్ యుద్ధ విమానాలు సరిహద్దును దాటి ముజాహిదీన్ శిక్షణా శిబిరాలపై దాడులు చేశాయి.
1986-1990 మధ్యకాలంలో, పాకిస్తాన్ ఎఫ్-16 విమానాలు కనీసం పది అఫ్గానిస్తాన్, రష్యా విమానాలు, హెలికాప్టర్లు, రవాణా విమానాలను కూల్చివేశాయి.
అయితే, 1990లో పాకిస్తాన్ అణు కార్యక్రమంపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, 28 ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించడానికి నిరాకరించింది. వీటి కోసం పాకిస్తాన్ చెల్లించిన 658 మిలియన్ డాలర్లను తిరిగి ఇచ్చేసింది.
కానీ, 2001లో పరిస్థితి మారిపోయింది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్-ఖైదా ఉగ్రవాద దాడి తర్వాత 'ఉగ్రవాదంపై యుద్ధం' ప్రారంభమైంది. దాదాపు 1.4 బిలియన్ డాలర్ల విలువైన 18 అత్యాధునిక బ్లాక్ 52 ఎఫ్-16 విమానాలను పాకిస్తాన్‌కు అందించడానికి అమెరికా అంగీకరించింది.
దీనితో, పాకిస్తాన్‌కు టార్గెటింగ్ పాడ్‌లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పాడ్‌లు మాత్రమే కాకుండా, 52 పాత మోడల్ F-16 విమానాలకు అప్‌గ్రేడ్ కిట్‌లను కూడా అమెరికా అందించింది. ఈ పరికరాలను అందుకున్న తర్వాత ఎఫ్-16 విమానాలు బ్లాక్ 52 విమానాలతో పోల్చదగినవిగా మారాయి.
2011లో ఎఫ్-16లతో పాటు సి-130, టి-37, టి-33 విమానాల విడిభాగాల కోసం 62 మిలియన్ల డాలర్ల ఒప్పందం జరిగింది.
ఆ తర్వాత 2016లో, పాకిస్తాన్‌తో దాదాపు 700 మిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంపై అమెరికా సంతకం చేసింది. దీని కింద 8 ఎఫ్-16 బ్లాక్ 52 విమానాలను విక్రయించింది.
ఆ తర్వాత 2019లో, పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఎఫ్-16 ప్రాజెక్టులో సాంకేతిక సహాయం అందించడానికి సాంకేతిక భద్రతా బృందం కోసం 120 మిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని అమెరికా ఆమోదించింది.
ఆపై 2022 సెప్టెంబర్‌లో, పాకిస్తాన్ ఎఫ్-16 విమానాల నిర్వహణ కోసం, పరికరాలు, సేవలు అందించడానికి 450 మిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని అమెరికా రక్షణ శాఖ ఆమోదించింది.

ఫొటో సోర్స్, EPA/OLIVIER HOSLET
పాకిస్తాన్ వద్ద ఉన్న ఎఫ్-16 విమానాలు ఎన్ని?
ఫారిన్ పాలసీ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ 2020 నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వద్ద మొత్తం 85 ఎఫ్-16 విమానాలు ఉన్నాయి.
వీటిలో 66 పాత బ్లాక్ 15 విమానాలు, 19 కొత్త బ్లాక్ 52 విమానాలు. ఈ విమానాలు అమెరికా సాంకేతిక భద్రతా బృందం పర్యవేక్షణలో ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ ఇప్పటివరకు విమానాల నిర్వహణ కోసం మూడు బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది.
సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా, భారతదేశంతో ఘర్షణల్లో, గగనతలాన్ని రక్షించడంలో, ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యంలో ఎఫ్-16 ముఖ్యమైన పాత్ర పోషించిందని ముహమ్మద్ అలీ చెప్పారు.
2006లో, పాకిస్తాన్‌కు కొత్త మోడల్ ఎఫ్-16 విమానాలను అందజేసిన సమయంలో.. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం పాకిస్తాన్‌కు ఈ విమానాలు అవసరమని అమెరికన్ కాంగ్రెస్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉపయోగిస్తుందా?
ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు రక్షణ అవసరాల కోసమే ఇచ్చామని, వాటిని స్వీయ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించుకోగలదని అమెరికా చెబుతోంది. ఈ విమానాలను యుద్ధ ప్రయోజనాల కోసం లేదా మరే ఇతర దేశంపై దాడి చేయడానికి ఉపయోగించలేమని అమెరికా పదే పదే చెబుతోంది.
బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, అమెరికా తయారు చేసిన విమానాన్ని ఉపయోగిస్తే, అది అమెరికా, పాకిస్తాన్ మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. అటువంటి ఒప్పందాలకు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
అయితే, ఈ అభిప్రాయం సరైనది కాదని అలీ అంటున్నారు. పాకిస్తాన్ వైమానిక దళం మొదటి బాధ్యత దేశాన్ని రక్షించుకోవడం అని చెప్పారు.
2019లో ఆపరేషన్ స్విఫ్ట్ రిటాలియేషన్ సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళం ఎఫ్-16 సాయంతో భారత పైలట్ అభినందన్ మిగ్-21 విమానాన్ని కూడా టార్గెట్ చేసిందని అలీ ప్రస్తావించారు.
పాకిస్తాన్ మాజీ రక్షణ కార్యదర్శి, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నయీమ్ లోధి బీబీసీతో మాట్లాడుతూ, అమెరికా, పాకిస్తాన్ మధ్య ఎలాంటి పరిమితులు లేదా పరిమితులు ఉన్న రక్షణ ఒప్పందాన్ని తాను చూడలేదని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














