‘ఆపరేషన్ సిందూర్’లో 6 పాకిస్తాన్ విమానాలను కూల్చేశాం: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

Indian Air Force Chief Air Chief Marshal (ACM) Amar Preet Singh

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌తో ఈ ఏడాది మే నెలలో జరిగిన సైనిక ఘర్షణలో ఆ దేశానికి చెందిన ఐదు ఫైటర్ జెట్‌లు, మరో పెద్ద విమానాన్ని కూల్చివేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి వివరాలు వెల్లడించారు.

ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత.. మే మొదటివారంలో ఒక రాత్రి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు భారత్ తెలిపింది. ఈ ఆపరేషన్‌కు 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘భూమిపై నుంచే దాడి చేశాం’

తరువాత కొద్దిరోజుల పాటు భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగాయి.

ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే మెమొరియల్ లెక్చర్ సందర్భంగా బెంగళూరులో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం కనీసం ఐదు పాకిస్తానీ యుద్ధ విమానాలను, పాకిస్తాన్‌కు చెందిన మరో పెద్ద విమానాన్ని ధ్వంసం చేసిందని స్పష్టం చేశారు.

ఆ పెద్ద విమానం ఈఎల్ఐఎన్‌టీ కానీ... ఏఈడబ్ల్యూ అండ్ సీ కానీ కావొచ్చని ఆయన చెప్పారు.

సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానిపై భూతలం పైనుంచే దాడి చేసినట్లు ఆయన చెప్పారు. భూఉపరితలం నుంచి గగనతలంలోకి ఇప్పటివరకూ జరిపిన అతిపెద్ద దాడి ఇదేనన్నారు.

AP Singh

ఫొటో సోర్స్, ANI

‘‘ఇది హైటెక్ యుద్ధం’’

భారత్, పాక్ మధ్య ఈ సైనిక సంఘర్షణను 'హైటెక్ యుద్ధం'గా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు.

"ఇది హైటెక్ యుద్ధం కంటే కూడా ఎక్కువేనని చెప్పగలను. సుమారు 80-90 గంటల పాటు కొనసాగిన యుద్ధంలో మేం వారి వైమానిక రక్షణ వ్యవస్థకు భారీగా నష్టం కలిగించాం" అని ఆయన చెప్పారు.

'మన దాడి కొనసాగితే మరిన్ని నష్టాలు తప్పవని వారికి స్పష్టంగా అర్థమైంది. అందుకే వారు ముందుకొచ్చి చర్చలకు సిద్ధమని మన డీజీఎంవోకు సందేశం పంపించారు. దీనికి ఉన్నత స్థాయిలో అంగీకరించారు' అని ఏపీ సింగ్ చెప్పారు.

మే 7 నుంచి 10 నడుమ, భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ సమయంలో పలు రకాల వాదనలు వినిపించాయి.

మే 31న, పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ సమయంలో భారత యుద్ధ విమానాలను కూల్చివేశారా? వంటి ప్రశ్నలకు భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ సమాధానమిచ్చారు.

విమానాలను కూల్చివేశామన్న పాకిస్తాన్ వాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు.

భారత్, పాకిస్తాన్ ఘర్షణ సమయంలో 'ఐదు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు' అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత నెలలో పేర్కొన్నారు.

అయితే, ఏ దేశానికి చెందిన ఎన్ని యుద్ధ విమానాలు కూల్చివేతకు గురయ్యాయనే వివరాలు ట్రంప్ వెల్లడించలేదు.

అంతకుముందు, పాకిస్తాన్ కూడా భారత్‌కు చెందిన 'ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు' చెప్పింది. అయితే, ఆ వాదనలను భారత్ తిరస్కరిస్తూ వస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)