పాకిస్తాన్‌: భారీ ఎత్తున యుద్ధ విమానాలను ఎందుకు కొంటోంది?

పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆయుధాలు కొనే దేశాల టాప్‌-10 జాబితాలో పాకిస్తాన్‌ రెండో స్థానంలో ఉంది.
    • రచయిత, ఒమర్ ఫరూక్
    • హోదా, రక్షణ రంగ విశ్లేషకుడు, ఇస్లామాబాద్

2016 నుంచి 2020 మధ్య కాలంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం 5 దేశాలతో 8 భారీ ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకుందని స్వీడన్‌కు చెందిన 'స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌' (sipri-సిప్రి) వెల్లడించింది.

ఎయిర్‌ఫోర్స్‌, నేవీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్‌ ఈ ఒప్పందాలు చేసుకుందని 'సిప్రి' తన నివేదికలో పేర్కొంది. ఈ అగ్రిమెంట్ల తర్వాత ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలలో ఒకటిగా పాకిస్తాన్‌ ఆవిర్భవించింది.

ఇప్పటి వరకు పాకిస్తాన్‌ ఆయుధాల విషయంలో చైనా మీద ఎక్కువగా ఆధారపడింది. జేఎఫ్‌-17 ఫైటర్‌ జెట్లను ఆ దేశం నుంచి కొనుగోలు చేయడమే కాకుండా, జేఎఫ్‌-17 థండర్‌, ఎఫ్‌సీ-1 రకం జెట్‌లను చైనా లైసెన్స్‌తో సొంతంగా తయారు చేసుకుంటోంది.

ఇప్పటి వరకు ఇలాంటి 50 ఫైటర్‌ జెట్లను పాకిస్తాన్‌ తయారు చేసుకుంది.

చైనా లైసెన్స్‌తోనే టైప్‌-041/యువాన్‌ జలాంతర్గాములు, టైప్-054ఎ యుద్ధనౌకలను కూడా తయారు చేస్తోంది. వీటికి సంబంధించిన పరికరాలు, విడి భాగాలు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.

టర్కీ నుంచి మిల్‌జెమ్‌ యుద్ధ నౌకలను కొనుగోలు చేయడమే కాక, సొంతంగా అనేక వార్‌షిప్‌లను తయారు చేసుకుంటోంది పాకిస్తాన్‌.

పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ ఐదు దేశాల నుంచి 8 భారీ ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకుంది

ఆయుధ కర్మాగారాలు అప్‌గ్రేడ్‌

స్థానికంగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి కరాచీ డాక్‌ యార్డ్‌లోని పాకిస్తాన్‌ మిలిటరీ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌, కమ్రాలోని ఎరోనాటికల్‌ కాంప్లెక్స్‌లు కొన్నేళ్ల కిందటే అప్‌గ్రేడ్‌ అయ్యాయి.

మరోవైపు పాకిస్తాన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో కూడా చిన్నచిన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారవుతుంటుంది.

పాకిస్తాన్‌ ఫైటర్‌ జెట్, ఫైటర్‌ హెలికాప్టర్లు, జలాంతర్గాములు, యుద్ధనౌకల విడి భాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుని వాటిని స్థానికంగా తయారు చేసుకుంటుంది.

ఈజిప్ట్‌ తయారీ మిరాజ్‌-5 ఫైటర్‌ జెట్లను దిగుమతి చేసుకున్న పాకిస్తాన్‌, ఇప్పటికే ఫ్రాన్స్‌ తయరీ ఫైటర్‌ జెట్‌లను ఉపయోగిస్తోంది.

ఇటలీ నుండి ఏడబ్ల్యూ139, ఎంఐ35ఎం హెలికాప్టర్లను కూడా దిగుమతి చేసుకుంది. అలాగే రష్యా నుండి ఒక కార్గో షిప్‌ను కూడా దిగుమతి చేసుకుంటోంది పాకిస్తాన్‌.

ఇటు చైనా నుంచి మూడు రకాల సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణులను కూడా పాకిస్తాన్‌ కొనుక్కుందని 'సిప్రి' నివేదిక వెల్లడించింది.

2018లో టీ-129 రకం 30 యుద్ధ విమానాలను 1.5 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను వెచ్చించి టర్కీ నుంచి కొనుగోలు చేసింది. అయితే అమెరికా ఆంక్షలతో ఈ ఆర్డర్‌ను తరువాత రద్దు చేసింది.

అదే సమయంలో నేవీ కోసం తుపాకులు, మందుగుండు సామాగ్రి, యాంటీ షిప్‌ మిసైళ్లు, సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైళ్లను కొనుగోలు చేసింది పాకిస్తాన్‌.

పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్నిదేశాలతో రాజకీయ సంబంధాల కోసం కూడా ఆయుధాలు ఉపయోగపడతాయని ఆ దేశ రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు

ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల జాబితాలో పాకిస్తాన్ ఎలా చేరింది?

'సిప్రి' నివేదిక ప్రకారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలలో పాకిస్తాన్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కొనుగోళ్లలో 2.7శాతం వాటాతో అత్యధిక మొత్తంలో ఆయుధాలు కొనే ప్రపంచ దేశాల టాప్‌-10 జాబితాలో పాకిస్తాన్‌ రెండో స్థానంలో ఉంది.

పాకిస్తాన్‌ కొనే ఆయుధాలలో చైనా నుంచి 74%, రష్యా నుంచి 6.6%, ఇటలీ నుంచి 5.9% ఉన్నాయి.

పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌ కొనే ఆయుధాలతో 49శాతం రష్యా నుంచే వస్తాయి

ఇండియాకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

భారతదేశం 49% ఆయుధాలను రష్యా నుంచి, 18% ఫ్రాన్స్ నుంచి, 13% ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేస్తోంది. 2016-2020 మధ్య పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశపు ఆయుధ కొనుగోళ్ల ఖర్చు 33% తక్కువగా ఉంది.

అదే సమయంలో అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్ల విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

గత దశాబ్దపు మొదటి ఐదేళ్లలో భారత్‌కు ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలలో అమెరికా రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇటీవలి కాలంలో ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ ఎక్కువగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది.

మరోవైపు ఇజ్రాయెల్‌ కంటే 82% ఎక్కువ ఆయుధాలను భారత్ కొనుగోలు చేసింది.

పాకిస్తాన్‌ ఇటీవల కుదుర్చుకున్న భారీ ఆయుధ ఒప్పందాలన్నీ 2028 నాటికి పూర్తవుతాయని, వీటిలో 50 యుద్ధ విమానాలు, 8 జలాంతర్గాములు, చైనా, టర్కీల నుంచి నాలుగేసి యుద్ధనౌకలు కూడా ఉన్నాయని 'సిప్రి' రిపోర్ట్‌ పేర్కొంది.

ఆయుధాల కొనుగోళ్లలో టాప్‌-10 దేశాలలో పాకిస్తాన్‌ చోటు దక్కించుకుందని 'సిప్రి'లో రీసెర్చర్‌గా పని చేస్తున్న సైమన్‌ వీస్మన్‌ తెలిపారు.

పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఆయుధ కొనుగోళ్ల నివేదికపై పాకిస్తాన్‌ స్పందన ఏంటి?

'సిప్రి' రూపోందించిన నివేదికపై పాకిస్తాన్‌ ఇంకా అధికారికంగా స్పందించ లేదు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నివేదికపై పాక్‌ రాజకీయ నాయకత్వం అసంతృప్తిగా ఉంది.

"ఇది ఒక నకిలీ రిపోర్ట్‌. ఈ జాబితాలో ప్రధానంగా కనిపిస్తున్న టి-129 ఫైటర్ హెలికాప్టర్‌ ఒప్పందం అమెరికా కారణంగా రద్దయింది. మిగిలిన బాంబులు, క్షిపణులు, మందుగుండు సామగ్రి ఖర్చు పెద్ద విషయం కాదు" అని పాకిస్తాన్‌ మాజీ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ షాజాద్‌ చౌదరి అన్నారు.

ఆయుధాల కొనుగోలు ఖర్చులను పాకిస్తాన్‌ మీడియా ఎప్పుడూ ప్రచురించదు. ప్రచురించినా అది చాలా అరుదు. ఆ దేశ ప్రభుత్వం కూడా ఆయుధ కొనుగోళ్ల ఖర్చులను ఎప్పుడూ బయటపెట్టదని సైమన్‌ వీస్మన్‌ బీబీసీతో అన్నారు.

"సోమవారం విడుదలైన 'సిప్రి' నివేదిక పాకిస్తాన్‌ కొనుగోలు చేసే ఆయుధాల వివరాలను అందించింది. కేవలం వీటికయ్యే ఖర్చులే కాక, సైనికంగా వాటి ప్రయోజనాల గురించి కూడా వివరించింది" అని వీస్మన్‌ అన్నారు.

రాబోయే ప్రమాదాలను అంచనా వేస్తూ అందుకు తగినట్లు ఆయుధాల కొనుగోళ్లను పాకిస్తాన్‌ గత 70 సంవత్సరాలుగా జరుపుతోందని మాజీ ఎయిర్‌ వైస్‌మార్షల్‌ షాజాద్‌ చౌదరి అన్నారు.

"మేము భారత్‌తో నాలుగు యుద్ధాలు చేశాం. ప్రమాదాన్ని పసిగట్టే మా విధానం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ఏ మాత్రం మారదు" అన్నారాయన.

"ఈ కొనుగోళ్లన్నీ బాహ్య శత్రువులను, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని చేసినవే. అంతర్గత శత్రువులకు చాలా తక్కువ ప్రాధాన్యమిచ్చారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని పాకిస్తాన్‌ సీనియర్‌ మిలిటరీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంటులో చర్చించరాదని పాకిస్తాన్‌లో ఒక నియమం ఉంది.

"మా దేశంలో అన్ని నిర్ణయాలు సంప్రదాయ విధానంలోనే తీసుకుంటాం. వారు ప్రతి చిన్న విషయం గురించి ఆలోచిస్తారు. అందువల్ల ఆయుధాల జాబితా పెరుగుతుంటుంది" అని ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌ రిటైర్డ్‌ జనరల్‌ అసద్‌ దురానీ అన్నారు.

"కొన్ని దేశాలతో రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక్కోసారి ఆయుధాలు కొనాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ ఆయుధాల నిజమైన భద్రతా అవసరాలకు కూడా ఉపయోగపడతాయి" అన్నారు దురానీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)