RBI: రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా? ఆర్‌బీఐ ఏం చెప్తోంది?

రూ. 2000 నోటు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హరికృష్ణ పులుగు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన తర్వాత మళ్లీ అలాంటి పరిణామాలు జరగబోతున్నాయంటూ పలుమార్లు ఊహాగానాలు, వదంతులు వినిపించాయి, వినిపిస్తూనే ఉన్నాయి.

కొంత కాలంగా రూ. 2000 నోటు క్రమంగా ఏటీఎంల నుంచి కనుమరుగు అవుతుండటంతో ప్రభుత్వం నుంచి మళ్లీ ఏదో పెద్ద ప్రకటన వస్తుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ నోటు రద్దు గురించి చెప్పకపోయినా, ముద్రణను ఆపేసినట్లు సమాచార హక్కు పిటిషన్‌కు స్పందనగా ఆర్‌బీఐ వెల్లడించింది.

పెద్దనోటుకు ఏమయ్యింది?

"మూడేళ్ల కిందట ఏటీఎం నుంచి రూ.రెండు వేలకు మించి డబ్బులు తీసుకుంటే రూ. 2000 నోటు కచ్చితంగా కనిపించేది. కానీ ఆర్నెల్లుగా ఆ నోటు రాకపోవడంతో నాలో అనుమానం పెరిగింది" అని సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ బీబీసీకి చెప్పారు.

ఆ నోటు అదృశ్యంపై ఆర్‌బీఐ నుంచి సమాచార హక్కు చట్టం కింద ఆయన వివరణ కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సుధీర్‌, కొన్నేళ్లు అమెరికాలో ఉండి వచ్చారు.

ఆర్‌బీఐ
ఫొటో క్యాప్షన్, సమాచార హక్కు కింద ఆర్‌బీఐ 2016 నుంచి ముద్రించిన కరెన్సీ నోట్ల వివరాలను వెల్లడించింది

ఆర్‌బీఐ ఏం చెప్పింది?

ఇటీవల కాలంలో ఏటీఎంల నుంచి రూ. 2000 నోటు రావడం లేదని, అసలు అది చెలామణిలో ఉందా, ముద్రణ చేస్తున్నారా లేదా అని సుధీర్‌ తన పిటిషన్‌లో ఆర్‌బీఐని కోరారు.

"ఈ నోట్‌ను మళ్లీ రద్దు చేస్తారేమో అన్నదే నా సందేహం, దాన్ని తెలుసుకునేందుకే పిటిషన్‌ వేశా" అని సుధీర్‌ వెల్లడించారు.

‘బ్లాక్‌మనీ భయంతో రెండువేల నోట్‌ను చెలామణిలో లేకుండా చేస్తున్నారా?’ అని తన పిటిషన్‌లో ఆర్‌బీఐని కోరారు సుధీర్‌. దీనిపై వివరణ ఇచ్చిన ఆర్‌బీఐ రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు తెలిపే గణాంకాలను సుధీర్‌కు పంపింది.

2016-17 సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ముద్రించిన ఆర్‌బీఐ.. 2019-20 సంవత్సరంలో మాత్రం ఒక్క కొత్త నోటును కూడా ముద్రించలేదని ఆ గణాంకాలు చెప్తున్నాయి.

జలగం సుధీర్

ఫొటో సోర్స్, Sudhir Jalagam

ఫొటో క్యాప్షన్, ఏటీఎంలలో రెండు వేల నోటు ఎందుకు కనిపించడం లేదనే అనుమానంతో సమాచార హక్కు కింద వివరాలు కోరినట్లు జలగం సుధీర్ తెలిపారు

మరి రూ. 2,000 నోటు ఎటు వెళ్తోంది?

దేశంలో రూ. 2 వేల నోట్లు సర్క్యులేషన్‌కు సరిపడా ఉన్నాయని, అందుకే ఆ నోటు ముద్రణను ఆపేశామని అప్పటి కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ గత ఏడాది జనవరి 4న ప్రకటించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

"సరిపడా సర్క్యులేషన్‌లో ఉంటే ఏటీఎంలలో రెండు వేల నోటు ఎందుకు కనిపించడం లేదు. అదే నా అనుమానం'' అని సుధీర్‌ అన్నారు.

గతంతో పోలిస్తే రెండు వేల నోటు ఈ మధ్య కనిపించడం తగ్గిందని హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్‌ పరికరాల సర్వీస్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ బీబీసీతో వెల్లడించారు.

"బిజినెస్‌ కోసం పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేస్తుంటాం. ఏటీఎంలలో ఎక్కువగా ఇప్పుడు రూ. 500, రూ. 100 నోట్లే కనిపిస్తున్నాయి. కస్టమర్లు కూడా పెద్ద నోటు తీసుకురావడం లేదు'' అని శ్రీనివాస్‌ వెల్లడించారు.

రూ. 2000 నోటు

ఫొటో సోర్స్, AFP

ఏటీఎంలలో లేదా?

గత ఆరు నెలలుగా ఏటీఎంలలో రూ. 2,000 నోటు పెట్టడంలేదని ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకులో పని చేస్తున్న సీనియర్‌ అధికారి సందీప్‌ బీబీసీతో చెప్పారు.

గతంలో రూ. 2,000 నోటు ఉంచడానికి ఉపయోగించే స్లాట్‌ (క్యాసెట్‌ అంటారు) కూడా ఇప్పుడు లేదని, దాని స్థానంలో కొత్త రూ. 100 నోటు, రూ. 500 నోట్ల క్యాసెట్‌లు అమర్చారని ఆయన వెల్లడించారు.

"రెండు వేల నోటును రద్దు చేయడం అనేది ఉండకపోవచ్చు. కానీ సర్క్యులేషన్‌ తగ్గించడమన్నది వాస్తవం'' అని సందీప్‌ తెలిపారు.

మళ్లీ మళ్లీ వదంతులు

2016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్‌బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

రూ. 2,000 నోటు రద్దుపై గత మూడేళ్లుగా ఇలాంటి ఊహగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు అన్ని రూ. 2000 నోట్లను అత్యవసరంగా క్యాష్‌ చెస్ట్‌ (ఆర్‌బీఐ తరఫున బ్యాంకుల డబ్బును నిల్వ చేసే ప్రదేశం)కు తరలించాలని తన బ్రాంచ్‌లను ఆదేశించిందని, దీంతో ఆ నోటును రద్దు చేస్తున్నారని ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయని "బిజినెస్‌ ఇన్‌సైడర్‌ ఇండియా'' అనే వెబ్‌సైట్‌ ఫిబ్రవరి 10, 2020న ఒక కథనాన్ని ప్రచురించింది.

అయితే దీనికి నోట్ల రద్దు కారణం కాదని, రెండు వేల నోట్లను ఇకపై ఏటీఎంలలో లోడ్‌ చేయవద్దని బ్యాంకు అధికారులకు అందిన ఆదేశాలే దీనికి కారణమని ఈ వెబ్‌సైట్ తన కథనంలో బ్యాంకు సీనియర్‌ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.

థర్డ్‌ పార్టీ ఏటీఎం సర్వీస్‌ ప్రొవైడర్లకు కూడా రూ. 2,000 నోట్ల క్యాసెట్ స్థానంలో రూ.వంద నోట్ల క్యాసెట్‌లు అమర్చాలని ఆదేశాలొచ్చినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ పరిణామం, ఆర్నెల్ల నుంచి ఈ నోట్లు కనిపించడం లేదన్న పిటిషనర్‌ సుధీర్‌ వాదనతో సరి పోలింది.

రూ. 2000 నోటు

ఫొటో సోర్స్, AFP

చెలామణి ఆపడానికి కారణాలేంటి?

పెద్ద నోట్ల వల్ల బ్లాక్‌మనీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. దీంతోపాటు నకిలీ కరెన్సీకి పెరుగుతుందన్న ఆందోళన వినిపించింది.

"ఎక్కువ విలువ నోట్ల వల్ల డబ్బును దాచుకోవడం ముఖ్యంగా బ్లాక్‌కు మళ్లించడం సులభమవుతుంది. లాకర్లలో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవచ్చు. అలా చేయడం వల్ల మార్కెట్‌లో క్యాష్‌ ఫ్లో తగ్గిపోతుంది. దీన్ని అడ్డుకోడానికే ప్రభుత్వం రెండు వేల నోట్ల చెలామణినికి తగ్గించి ఉండొచ్చు'' అని బ్యాంకు అధికారి సందీప్‌ అభిప్రాయపడ్డారు.

ఆర్‌బీఐ నిర్ణయం వల్ల సహజంగానే పెద్ద నోట్లన్నీ ఆగిపోయి వాటి స్థానంలో చిన్ననోట్ల చెలామణి పెరుగుతుంది. దీనివల్ల బ్లాక్‌మనీతో పాటు, క్యాష్‌ఫ్లో సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు.

"వంద రూపాయల నకిలీ నోటు ముద్రణకు, రెండు వేల రూపాయల నోటు ముద్రణకు ఖర్చులో తేడా స్వల్పంగా ఉంటుంది. కానీ నోట్ల విలువలో భారీ తేడా ఉంటుంది. అలాంటప్పుడు దొంగ నోట్ల తయారీదారుల ఆప్షన్‌ సహజంగా పెద్ద నోటే అవుతుంది'' అని సందీప్‌ పేర్కొన్నారు.

ఆర్‌బీఐ ఇప్పుడేం చేస్తోంది?

రూ. 2000 నోట్ల స్థానంలో కొత్త రూ. 50, రూ. 200 నోట్ల ముద్రణను క్రమంగా పెంచినట్లు సమాచార హక్కు పిటిషనర్‌ సుధీర్‌కి ఇచ్చిన వివరణలోని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే రూ. 500 నోట్ల ముద్రణ 2016-17 నుంచి 2019-20 నాటికి దాదాపు రెట్టింపయ్యింది.

ఆర్‌బీఐ

ఒక్కో నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుంది?

ఒక్కో నోటుకు అయ్యే ఖర్చుపై పిటిషనర్ అడిగిన ప్రశ్నలకు ఆర్‌బీఐ సమాధానం ఇచ్చింది.

ఆర్‌బీఐ ఇచ్చిన గణాంకాలను బట్టి చూస్తే రూ. 200 నోటుకు ఎక్కువ ఖర్చు అవుతుందని తేలింది.

ఇక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల డినామినేషన్లను 2016-17 నుంచి 2019-20 వరకు ముద్రణను పూర్తిగా నిలిపేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. పాత రూ. 10, 20, 50 నోట్లను ముద్రణ తగ్గించిన ఆర్‌బీఐ వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రిస్తోంది.

మొత్తం మీద రూ. 2,000 రూపాయల నోటు రద్దు గురించి చెప్పకపోయినా, దాని ముద్రణను నిలిపేసినట్లు మాత్రం ఆర్‌బీఐ అధికారికంగా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)