రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది?

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

భారత కరెన్సీ నోట్లపై హిందూ దేవత లక్ష్మీ దేవి బొమ్మను ముద్రించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి కేంద్ర ప్రభుత్వానికి ఓ సూచన చేశారు.

మధ్యప్రదేశ్‌లో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేసినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండటం గురించి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. ''మీరు ప్రధాని మోదీనే ఈ విషయం అడగాలి. గణేశుడు విఘ్నాలను దూరం చేస్తాడు. కరెన్సీ పరిస్థితి మెరుగుపడాలంటే నోట్లపై లక్ష్మీ దేవీ బొమ్మను ముద్రించాలని నేను సలహా ఇస్తా. దీనికి ఎవరి నుంచీ అభ్యంతరాలు ఉండవు'' అని సుబ్రమణ్యం స్వామి అన్నట్లు పీటీఐ పేర్కొంది.

ఆయన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశం గురించి చర్చ జరిగింది.

''ఇండోనేసియా ఆర్థికవ్యవస్థను గణేశుడు ఆదుకుంటున్నప్పుడు, భారత్‌లో ఇది ప్రయత్నించవచ్చు. ఇండోనేసియాలో సుబ్రమణ్యం స్వామి లాంటి ఆర్థికవేత్తలు లేరు. మనకు ఉన్నారు కదా'' అని ఆర్‌బీ రావు అనే పేరుతో ఒకరు ట్వీట్ చేశారు.

అమెరికా కరెన్సీపై లక్ష్మీ దేవీ బొమ్మ లేకున్నా, ఎందుకంత బలంగా ఉందని మరొక వ్యక్తి సందేహం వ్యక్తం చేశారు.

ఇండోనేసియా కరెన్సీ

ఇంతకీ భారత కరెన్సీ నోట్లపై ఎవరి బొమ్మలు ఉండాలి? అది నిర్ణయించేదెవరు?

గాంధీ కంటే ముందు కరెన్సీపై ఎవరి బొమ్మ ఉండేది?గాంధీ బొమ్మను మొదటగా ఏ నోటుపై ముద్రించారు?

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులకు ఉన్నట్లే భారత్‌లో కరెన్సీ ముద్రించే అధికారం ఒక్క భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ)కు మాత్రమే ఉంది.

1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా మారింది.

అప్పటి నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంకు కరెన్సీ ముద్రిస్తూ ఉంది.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, RBI

ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం 1949లో భారత ప్రభుత్వం మొదటి సారి రూపాయి నోటు ఎలా ఉండలన్న డిజైన్‌ను రూపొందించింది.

బ్రిటన్ రాజుకు బదులుగా మహాత్మ గాంధీ బొమ్మను కరెన్సీపై ముద్రించాలని మొదట అనుకున్నారు. ఇందుకోసం డిజైన్లు కూడా రూపొందించారు. కానీ, దీనిపై ఏకాభిప్రాయం కుదర్లేదు. చివరికి అశోక స్తంభం ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకుమించి పెద్దగా కరెన్సీ డిజైన్‌లో పెద్ద తేడాలు ఏవీ రాలేదు.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, RBI

1950లో గణతంత్ర భారత్‌లో తొలిసారి రూ.2, రూ.5, రూ.10, రూ.100 నోట్లను తీసుకువచ్చారు.

వాటి డిజైన్ల మధ్య తేడాలు లేవు గానీ, రంగులు భిన్నంగా ఉన్నాయి. రూ.10 నోటు వెనుకవైపు పడవల బొమ్మలను అలాగే ఉంచారు.

1953లో తెచ్చిన నోట్లలో హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయిని బహువచనంలో ఏమనాలన్న చర్చ కూడా అప్పుడు జరిగింది. హిందీలో ఏకవచనంలో రూపయా, బహువచనంలో రూపయేగా అనాలని నిర్ణయించారు.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, RBI

1954లో రూ.1000, రూ.2000, రూ.10,000 నోట్లను తిరిగి తీసుకువచ్చారు. 1978లో మళ్లీ వీటిని రద్దు చేశారు.

రూ.2, రూ.5 నోట్లపై సింహాలు, జింక వంటి వాటిని ముద్రించారు. 1975 నుంచి రూ.100 నోట్లపై వ్యవసాయ స్వయంసమృద్ధి, తేయాకు తోటల్లో ఆకులను తెంపడం వంటి వాటికి సంబంధించిన ఫొటోలు కనిపిస్తున్నాయి.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, RBI

1969లో మహాత్మ గాంధీ 100వ జయంతి సందర్భంగా తొలిసారి కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ బొమ్మను ముద్రించారు. సేవాగ్రామ్ ఆశ్రమం ముందు మహాత్మ గాంధీ కూర్చొని ఉన్న చిత్రాన్ని అచ్చువేశారు.

1972లో రిజర్వు బ్యంకు తొలిసారి రూ.20 నోటును ముద్రించింది. ఆ తర్వాత 1975లో రూ.50 నోటును తీసుకువచ్చింది.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, RBI

1980ల్లో కొత్త సిరీస్ నోట్లు వచ్చాయి. సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు వాటిపై కనిపించాయి.

రూ.2 నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం , రూ.1 నోటుపై చమురు బావి, రూ.5 నోటుపై ట్రాక్టర్‌తో పొలం దున్నతున్న రైతు, రూ.10 నోటుపై కోణార్క్ మందిరం చక్రం, నెమలి, శాలిమార్ గార్డెన్ ఫొటోలు ముద్రించారు.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, RBI

దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో 1987 అక్టోబర్‌లో తొలిసారిగా రిజర్వు బ్యాంకు రూ.500 నోటును ముద్రించింది. దీనిపై గాంధీ బొమ్మను, వాటర్ మార్క్‌లో అశోక స్తంభాన్ని ముద్రించింది.

1996లో కొత్త భద్రత ప్రమాణాలతో మహాత్మ గాంధీ సిరీస్ నోట్ల ముద్రణ మొదలైంది. వాటర్‌మార్క్‌ను కూడా మార్చారు. అంధులు కూడా గుర్తించేలా, వాటిని రూపొందించారు.

2000 అక్టోబర్ 9న రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు జారీ చేసింది.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

భారత కరెన్సీ చరిత్రలో రెండో అతిపెద్ద సంస్కరణ 2016లో జరిగింది. ఆ ఏడాది నవంబర్ 8న మహాత్మ గాంధీ సిరీస్‌లోని రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తర్వాత కొత్తగా రూ.2000 నోటును తెచ్చారు. దీనిపైనా మహాత్మ గాంధీ బొమ్మను కొనసాగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)