ఆర్థిక మందగమనం: ‘దేశంలో ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి.. విధానపరమైన నిర్ణయాలు అవసరం’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, బీబీసీ కోసం
భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో వస్తుసేవల వినియోగం తగ్గిపోతుండటం, దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు పెరుగుతుండటాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు అంటున్నారు.
ఉపాధి హామీ లాంటి తాత్కాలిక కార్యక్రమాలతోపాటు పెట్టుబడులపైనా భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
రెండేళ్లుగా భారత్‌లో నమోదవుతున్న గణాంకాలు ఆర్థికవ్యవస్థ పరిస్థితి దిగజారుతున్నట్లు సూచిస్తున్నాయని ఆయన బీబీసీతో అన్నారు. ఒకప్పుడు 9 శాతంగా ఉన్న భారత వార్షిక వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని గాడిలో పెట్టేందుకు విధానపరమైన నిర్ణయాలు అవసరమని ఆయన అన్నారు.
కౌశిక్ బసు గతంలో ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా, ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009 నుంచి 2012 వరకూ ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 2017 నుంచి ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''గ్రామీణ ప్రాంతాల్లో సగటు వినియోగం పెరగడం పోయి, మరింత పతనమవుతోంది. ఈ పతనం ఐదేళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సగటు వినియోగం 8.8 శాతం తక్కువగా ఉంది. పేదరికం రేటు కూడా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్ల గణాంకాలు చూస్తే, ఆందోళనకరంగా ఉన్నాయి. నిరుద్యోగ రేటు 45 ఏళ్లలో ఇప్పుడే అత్యధికంగా ఉంది'' అని కౌశిక్ బసూ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగానికి సంబంధించిన గణాంకాలపై మీడియా పెద్దగా దృష్టిపెట్టదని, కానీ భారత ఆర్థికవ్యవస్థలో వాటి పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.
''2005 నుంచి చైనాతో సమానంగా భారత్ ఏటా 9.5 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. కానీ, ఉద్యోగ కల్పన విషయంలో వృద్ధి అంత వేగంగా లేదు. ఉద్యోగావకాశాల సృష్టి లేకపోవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. దీనికి రాజకీయ పరిణామాలు కూడా ఉంటాయని నేను అంచనా వేశా. గత రెండేళ్లలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిస్థితి దిగజారింది. దాని ఫలితాలు కూడా రాజకీయంగా ఉంటాయి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితిని సరిదిద్దేందుకు తక్షణమే రెండు రకాల విధానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని కౌశిక్ వ్యాఖ్యానించారు.
''తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా పరిష్కారాలు రూపొందించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి కార్యక్రమాలు తేవడం తాత్కాలిక పరిష్కారం. దీర్ఘకాలికంగా అభివృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక, ద్రవ్యసంబంధమైన విధానాల గురించి యోచించాలి'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పెట్టుబడుల స్థాయి కూడా క్రమంగా తగ్గుతూ వస్తోందని కౌశిక్ అన్నారు.
''2008-09లో జీడీపీలో దాదాపు 39 శాతం వాటా పెట్టుబడులదే. అది తగ్గుతూ ఇప్పుడు 30 శాతానికి చేరుకుంది. ఈ విషయాలు పత్రికల్లో రావు. ఆర్థికవేత్తలు మాత్రమే వీటి గురించి పట్టించుకుంటారు. దీర్ఘకాలిక అభివృద్ధి పెట్టుబడుల ద్వారానే సాధ్యమవుతుంది. ఇందులో రాజకీయ విధానాల పాత్ర ప్రధానం'' అని చెప్పారు.
''జనాల్లో ఆత్మవిశ్వాసం, సహకార భావన, భరోసా ఎక్కువగా ఉంటే పెట్టుబడులు ఎక్కువగా పెడతారు. భవిష్యత్తును సురక్షితం చేసుకుంటారు. అదే ఆందోళన ఉంటే, డబ్బును తమ వద్దే ఉంచుకుంటారు. తక్షణ అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తారు. అందుకే, పెట్టుబడులను పెంచేందుకు దీర్ఘకాలిక వ్యూహాల గురించి ఆలోచించాలి'' అని చెప్పారు.
భారత్ 'ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ'గా మారుతుందన్న మోదీ ప్రభుత్వ ప్రకటనల గురించి కూడా కౌశిక్ స్పందించారు.
''వచ్చే నాలుగైదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారడం అసంభవం. ఎందుకంటే దీన్ని అమెరికా డాలర్ ఆధారంగా కొలుస్తాం. వృద్ధి రేటు 4.5 శాతానికి చేరిన ఈ సమయంలో దాని గురించి ఆలోచించే ఆస్కారం కూడా లేదు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలికంగా మెరుగుపడటానికి వ్యక్తుల్లో నైతిక విలువలు కూడా ముఖ్యమని కౌశిక్ బసూ అన్నారు.
''సంపాదించడంతోపాటు సగటు మనిషి నైతికపరమైన నిబద్ధతతో ఉండటం కూడా అవసరం. నైతిక విలువలు, మంచి లక్షణాలు, అభివృద్ధికి దగ్గరి సంబంధం ఉంది. పేదవారిని చేరుకోవడం ద్వారానే మనం ధనిక దేశాన్ని నిర్మించగలం'' అని చెప్పారు.
''భారత గణాంకాలపై ప్రపంచబ్యాంక్‌లో ఎప్పడూ విశ్వసనీయత ఉండేది. అది తగ్గితే చాలా నష్టమని నేను చెప్పనక్కర్లేదు. కొన్ని రంగాల్లో పరిస్థితులను లెక్కగట్టడం చాలా కష్టమే. ఉదాహరణకు ఉద్యోగాల విషయానికి వస్తే ధనిక దేశాల్లో రెండే పరిస్థితులు ఉంటాయి. ఒకటి మీకు ఉద్యోగం ఉంటుంది. రెండోది మీకు ఉద్యోగం ఉండదు. కానీ, భారత్‌లో అలా కాదు. అసంఘటిత రంగంలో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. గణాంకాల్లో వీటిని తీసుకోవడం చాలా కష్టం'' అని అన్నారు.
''గణాంకాల్లో పారదర్శకతకు భారత్ పేరుపొందింది. గణాంకాలు బాగా ఉన్నా, లేకపోయినా.. వాటిని మనం బహిరంగపరచాలి. వాటిని అంగీకరించాలి. ఆయా రంగాల్లో మనం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని గుర్తించి, కృషి చేయాలి'' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎందుకు పరుగులు పెట్టించలేకపోతోంది?
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- GDP: ఆరేళ్ళలో అధమంగా 4.5 శాతానికి ఎలా పడిపోయింది - అభిప్రాయం
- ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్‌కు అంటుకున్న మంటలు
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటులో మోదీ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటి
- మోదీ ప్రభుత్వం గణాంకాలను దాచిపెట్టి, ఎవరికి మంచి చేయాలనుకుంటోంది
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









