ఆస్ట్రేలియా కార్చిచ్చు: రాత్రిలా మారిన పగలు... పరుగులు తీసిన ప్రజలు

మల్లకూట

ఫొటో సోర్స్, Twitter/brendanh_au

ఫొటో క్యాప్షన్, మల్లకూటలో కార్చిచ్చు ప్రభావం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు తూర్పున సుమారు 500 కిలోమీటర్ల దూరాన విక్టోరియా రాష్ట్రంలో మల్లకూట అనే పర్యటక పట్టణం ఉంది.

ఇక్కడ ఇంచుమించు వెయ్యి మంది నివసిస్తున్నారు. క్రిస్మస్ సమయంలో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. చాలా మంది ఆస్ట్రేలియన్లు ఈ తీర ప్రాంతానికి విహారానికి వస్తారు.

డిసెంబరు 31న మంగళవారం ఉదయం ఈ ప్రాంతాన్ని కార్చిచ్చు కమ్మేసింది. ఆకాశం నల్లరంగులోకి మారి పగలు రాత్రిలా మారిపోయింది. వేల మంది ప్రాణభయంతో బీచ్‌కు పరుగులు తీశారు.

స్థానికులు నిద్రలేచే సరికి అంతటా దట్టమైన పొగ ఆవరించి ఉంది. ఆకాశం నారింజ పండు రంగులో కనిపించింది. కార్చిచ్చులు సమీపించే కొద్దీ ఆకాశం ఎరుపు రంగులోకి మారిపోయింది.

చీకటిమయమైన మల్లకూట

ఫొటో సోర్స్, Twitter: brendanh_au

ఫొటో క్యాప్షన్, చీకటిమయమైన మల్లకూట

మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు సైరన్ మోగింది.

అందరూ నీటి దగ్గరకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు.

తొమ్మిదిన్నరకల్లా నింగి నల్లగా మారిపోయింది.

మల్లకూట

ఫొటో సోర్స్, Instagram: travelling_aus_family

రేవు వద్ద ప్రజలు

ఫొటో సోర్స్, Instagram: travelling_aus_family

ఫొటో క్యాప్షన్, రేవు వద్ద ప్రజలు

వేల మంది ప్రజలు బీచ్‌కు పరుగులు తీయగా, మంటలార్పే సిబ్బంది వారిని అనుసరించారు.

అదే సమయంలో కొంత మంది బోట్లలో ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు.

బోట్లలో వెళ్లిపోయారు

ఫొటో సోర్స్, Twitter: BradleyWDeacon

ఫొటో క్యాప్షన్, కొందరు బోట్లలో వెళ్లిపోయారు
బోట్లలో జనం

ఫొటో సోర్స్, INSTAGRAM @IDASHOPE4STROKE

ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఇంతకుముందే హెచ్చరించారు. సోమవారం మరో హెచ్చరిక వెలువడింది. ఇప్పుడు ఖాళీ చేయడం ప్రమాదకరమని, ఎందుకంటే ఆలస్యమైందని, కాబట్టి ఉన్న చోటే ఉండాలని వారు తెలిపారు.

మంగళవారం ఉదయం 10:30 గంటల సమయానికి మల్లకూట రేవు వద్ద నీటి అంచున ప్రజలు గడపాల్సి వచ్చింది.

పొగ నుంచి రక్షణ కోసం చాలా మంది మాస్కులు ధరించారు.

సముద్రంలోకి వెళ్లడం చిట్టచివరి ప్రత్యామ్నాయమని విక్టోరియా అత్యవసర సేవల విభాగం మంగళవారం చెప్పింది.

మరోవైపు అత్యవసర సేవల సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతూ కనిపించారు.

మల్లకూటలో మంటలార్పే సిబ్బంది

ఫొటో సోర్స్, Instagram: travelling_aus_family

మల్లకూటలో సిబ్బంది

ఫొటో సోర్స్, Twitter: brendanh_au

మధ్యాహ్నానికల్లా ఆకాశం ఎరుపు-నారింజ రంగులోకి మారింది.

పొగ దట్టంగానే అలముకొని ఉంది.

మల్లకూట

ఫొటో సోర్స్, JONTY SMITH FROM MELBOURNE

గాలి దిశ మారి, ఆకాశంలో పరిస్థితి మెరుగుపడ్డాక స్థానికుడు డేవిడ్ జెఫ్రీ బీబీసీతో మాట్లాడారు.

విపత్తు పర్యవసానాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు. నల్లటి పొగ కమ్మేయడంతో పగలే రాత్రిలా అయ్యిందన్నారు. కార్చిచ్చుల శబ్దాలు చెవుల్లో మార్మోగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నామన్నారు.

దహనమైన ఇల్లు

ఫొటో సోర్స్, Twitter: brendanh_au

మల్లకూటలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నీరు అందించేందుకు, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు నౌకాదళ ఓడలను పంపే అవకాశముందని విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ చెప్పారు. ఈ ప్రాంతంలోని ప్రధాన రహదారిని మూసి ఉంచారు.

ప్రజలెవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. అయితే చాలా ఇల్లు దహనమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)