వాతావరణ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం - 11 వేల మంది శాస్త్రవేత్తల హెచ్చరిక

మొక్క

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, మ్యాట్ మెక్‌గ్రాత్
    • హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి

ప్రపంచం వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందనే కీలక అధ్యయనాన్ని 153 దేశాలకు చెందిన దాదాపు 11 వేల మంది శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ గ్రూపు సమర్థించింది. ఇది కచ్చితంగా వాతావరణ అత్యవసర పరిస్థితేనని వారు స్పష్టం చేశారు.

వాతావరణంతో ముడిపడిన అనేక అంశాలకు సంబంధించిన 40 ఏళ్ల డేటా ఆధారంగా ఈ అధ్యయనం ఈ విషయాన్ని చెప్పింది. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విచారం వ్యక్తంచేసింది.

వాతావరణ మార్పులతో ఎంత తీవ్రమైన ముప్పుందో ప్రపంచాన్ని హెచ్చరించాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందని పరిశోధకులు చెప్పారు.

ప్రపంచం అంతకంతకూ వేడెక్కిపోతోందని, దీనివల్ల ఎదురయ్యే ముప్పును అంచనా వేయాలంటే కేవలం అంతర్జాతీయ ఉపరితల ఉష్ణోగ్రతలను లెక్కగడితే సరిపోదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

గత 40 ఏళ్లలో వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన మార్పులను ఈ అధ్యయనంలోని డేటా ప్రతిబింబిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

అడవుల దహనం

ఫొటో సోర్స్, Getty Images

జనాభా పెరుగుదల, జంతువుల సంఖ్యలో పెరుగుదల, తలసరి మాంస ఉత్పత్తి, అంతర్జాతీయంగా వృక్షాల నరికివేత, శిలాజ ఇంధనాల వినియోగం, ఇతర సూచీల ఆధారంగా ఈ అధ్యయనం సాగించారు.

వాతావరణ మార్పులపై పోరాటంలో గత నాలుగు దశాబ్దాల్లో కొన్ని అంశాల్లో పురోగతి కూడా సాధ్యమైంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ వనరుల వినియోగం గణనీయంగా పెరిగింది. పవన, సౌర ఇంధన వినియోగం దశాబ్దానికి 373 శాతం చొప్పున పెరిగింది. అయినప్పటికీ 2018లో శిలాజ ఇంధనాల వినియోగంతో పోలిస్తే పవన, సౌర ఇంధన వాడకం 28 రెట్లు తక్కువగా ఉంది.

అన్ని సూచీలను కలిపి చూస్తే- అత్యధిక కీలక సూచీలు ప్రతికూలంగా ఉన్నాయని, వెరసి వాతావరణ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని పరిశోధకులు చెప్పారు.

కర్బన ఉద్గారాలను, పశు ఉత్పత్తిని, అడవుల నరికివేతను, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోవడం లాంటి చర్యల ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని, లేదంటే ఇప్పటివరకు ఎదురైన దుష్ప్రభావాల కంటే తీవ్రమైన పర్యవసానాలు భవిష్యత్తులో ఎదురవుతాయని, వాతావరణ అత్యవసర పరిస్థితి అంటే ఇదేనని ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ థామస్ న్యూసమ్ వివరించారు.

ఈ చర్యలు చేపట్టకపోతే భూమిపై వివిధ ప్రాంతాలు మానవ ఆవాసానికి వీల్లేకుండా పోతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

గత నెలలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన అక్టోబరు... 2019 అక్టోబరే.

వర్షాభావం

ఫొటో సోర్స్, Getty Images

ఇతర నివేదికలకూ దీనికీ తేడా ఏమిటి?

ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) నిపుణులు, ఇతర శాస్త్రవేత్తలు జారీచేసిన చాలా హెచ్చరికలను ఈ అధ్యయనం కూడా చేస్తోంది. వాతావరణ మార్పుల ముప్పు తీవ్రంగా ఉండగా, ప్రపంచ స్పందన మాత్రం పేలవంగా ఉందనే స్పష్టమైన సందేశాన్ని ఈ అధ్యయనం సాగించిన పరిశోధకులు ప్రజలకు, ప్రభుత్వాలకు ఇస్తున్నారు. ఈ విషయంలో వివిధ గ్రాఫికల్ సూచీలను వారు వినియోగించారు.

పరిస్థితులు తీవ్రంగానే ఉన్నప్పటికీ, నిరాశాజనకంగా లేవనే భరోసానూ ఈ అధ్యయనం అందిస్తోంది. ఆరు కీలకమైన అంశాల్లో తక్షణం చర్యలు చేపడితే గొప్ప మార్పులు సాధ్యమేనని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. ఆ అంశాలు:

ఇంధనం: శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేలా రాజకీయ నాయకులు చర్యలు చేపట్టాలి. పెట్రోలు, డీజిల్, ఇతర శిలాజ ఇంధనాల కంపెనీలకు రాయితీలను ఎత్తివేయాలి. చమురు, గ్యాస్ స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలను తీసుకురావాలి.

మీథేన్ నియంత్రణ: మీథేన్, హైడ్రోఫ్లోరోకార్బన్లు, మసి వంటి కాలుష్య కారకాలను నియంత్రిస్తే రానున్న దశాబ్దాల్లో భూగోళం వేడెక్కడాన్ని 50 శాతం మేర తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు.

ప్రకృతి: అడవుల నరికివేతను నిలిపివేయాలి. అడవులను, పచ్చికబయళ్లను, మడ అడవులను పెంచాలి. ఇలా చేస్తే కార్బన్‌డయాక్సైడ్ స్థాయిని తగ్గించవచ్చు.

ఆహారం: ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు చేసుకోవాలి. అత్యధికంగా ఆకుకూరలు, కూరగాయలనే ఆహారంగా తీసుకోవాలి. జంతు ఉత్పత్తుల వినియోగాన్ని బాగా తగ్గించాలి. ఆహార వృథాను పూర్తిగా అరికట్టాలి.

ఆర్థిక వ్యవస్థ: కర్బన ఉద్గారాలపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించాలి. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పెంపు, ధనార్జన పర్యావరణానికి నష్టం కలిగించకుండా చూడాలి.

జనాభా: అంతర్జాతీయ జనసంఖ్య రోజుకు దాదాపు రెండు లక్షల చొప్పు పెరుగుతోంది. జనాభాను స్థిరీకరించాల్సి ఉంది.

నీటికాలుష్యం, ప్లాస్టిక్

ఫొటో సోర్స్, RANDY OLSON / NATIONAL GEOGRAPHIC

మద్దతు పలికిన శాస్త్రవేత్తలు ఎవరు?

ఈ అధ్యయనాన్ని సమర్థించిన శాస్త్రవేత్తల్లో వాతావరణానికి సంబంధించిన అన్ని రంగాలవారు ఉన్నారు. దీనికి మద్దతుగా సంతకాలు చేసిన శాస్త్రజ్ఞుల పేర్లు ఆన్‌లైన్లో ఉన్నాయి.

"కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, 40 ఏళ్లుగా మనకు ఈ విషయం తెలుసు. అయినా మనం తగిన చర్యలు చేపట్టలేదు. ఈ సమస్య ఉందని తెలుసుకోవడం రాకెట్ సైన్స్ అంత కష్టమై పని కాదు, అందుకు రాకెట్ సైంటిస్ట్ కానక్కర్లేదు" అని డాక్టర్ న్యూసమ్ వ్యాఖ్యానించారు.

కార్లు

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధకుల సూచన ఏమిటి?

అనేక వాతావరణ సదస్సులు జరిగినా అర్థవంతమైన కార్యాచరణ లేకపోవడంపై పరిశోధకులు విసుగు చెందారు. అయితే వాతావరణ మార్పుల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో అంతర్జాతీయంగా ఉద్యమాలు ఊపందుకొంటుండం భవిష్యత్తుపై వారిలో నమ్మకం కలిగిస్తోంది.

అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతుండటం, ప్రభుత్వాలు కొత్త విధానాలు తీసుకొస్తుండటం, పాఠశాలల విద్యార్థులు పర్యావరణ ఉద్యమాలు చేపట్టడం, న్యాయస్థానాల్లో పర్యావరణ కేసులు సాగుతుండటం, మంచి మార్పు కోసం డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలో పౌరులు కదం తొక్కుతుండటం తమకు ఉత్సాహం కలిగిస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు.

వాతావరణ సంక్షోభం తీవ్రతను అర్థం చేసుకొనేందుకు, అందుకు అనుగుణంగా ప్రాథమ్యాలను మార్చుకొనేందుకు, చర్యల్లో పురోగతిని తెలుసుకొనేందుకు తమ అధ్యయనంలోని గ్రాఫికల్ సూచీలను పెద్దయెత్తున వినియోగించుకోవాలని విధాన రూపకర్తలకు, ప్రజలకు తాము పిలుపునిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

జనాభా పెరుగుదల

ఫొటో సోర్స్, Getty Images

జనాభా నియంత్రణ వివాదాస్పద అంశం

వాతావరణ మార్పుల నియంత్రణ చర్యల్లో భాగంగా జనాభా పెరుగుదలను నియంత్రించాలనే సూచన తీవ్రస్థాయిలో వివాదాస్పదమైన సూచన. కానీ, ఇది తప్పదని, దీనికి ప్రత్యామ్నాయం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది వివాదాస్పదమైన అంశమే. కానీ భూమిపై మనిషి వల్ల కలుగుతున్న ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు జనాభా గురించి కూడా చర్చించక తప్పదని డాక్టర్ న్యూసమ్ తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో చూస్తే జననాల రేటు స్వల్పంగా తగ్గిందని, తమ అధ్యయనంలో డేటా విశ్లేషణలో వెల్లడైన సానుకూల అంశాల్లో ఇది ఒకటని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)