50 ఏళ్లలో అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయం

బాల్టిమోర్ ఓరియోల్

ఫొటో సోర్స్, Gary Mueller, Macaulay Library at Cornell Lab of O

ఫొటో క్యాప్షన్, బాల్టిమోర్ ఓరియోల్
    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి

ఆసియా, అమెరికాల్లో పక్షులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని రెండు ప్రధానమైన అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

అమెరికా, కెనడాల్లో 1970తో పోలిస్తే ఇప్పుడు మూడు వందల కోట్ల పక్షులు తగ్గిపోయాయని, అంటే పక్షుల సంఖ్య 29 శాతం క్షీణించిందని ఉత్తర అమెరికాలో జరిపిన అధ్యయనం చెబుతోంది.

ఆసియాలోని ఇండొనేషియాలో జావా ద్వీపంలో పాడేపక్షులు (సాంగ్‌బర్డ్స్) తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఈ ఖండంలో నిర్వహించిన అధ్యయనం వెల్లడిస్తోంది. అక్కడ అడవుల్లో కంటే పంజరాల్లో ఉండే పక్షుల సంఖ్యే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది.

ఈ అధ్యయన ఫలితాలు అందరికీ ఒక మేల్కొలుపుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఈ అధ్యయనాలు సైన్స్, బయలాజికల్ కన్జర్వేషన్ పత్రికల్లో వెలువడ్డాయి.

లవ్ బర్డ్స్‌

ఫొటో సోర్స్, Gabby Salazar

ఫొటో క్యాప్షన్, ఆసియాలో పాడేపక్షుల్లో లవ్ బర్డ్స్‌కు ఆదరణ అధికం

300 కోట్ల పక్షులు ఎలా మాయమయ్యాయి?

గడ్డిభూములు, తీరం, ఎడారులు ఇలా అన్ని ప్రాంతాల్లో ఎన్ని పక్షులు తగ్గిపోయాయో ఉత్తర అమెరికా అధ్యయనం చెబుతోంది.

మనుషుల కార్యకలాపాల వల్ల పక్షులు ఆవాసం కోల్పోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అధ్యయనంపై అమెరికాలోని కార్నెల్ ల్యాబ్ ఆఫ్ ఆర్నిథాలజీ, అమెరికన్ బర్డ్ కన్జర్వన్సీలకు లీడ్ రీసర్చర్ డాక్టర్ కెన్ రూజన్‌బర్గ్ స్పందిస్తూ- కొన్ని జాతుల పక్షుల సంఖ్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలకు తెలుసని చెప్పారు. అరుదైన పక్షుల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏర్పడే లోటు సాధారణ పక్షులు, మానవ ఆవాసాలకు అలవాటు పడ్డ పక్షుల సంఖ్యలో పెరుగుదలతో పూడుతుందని తాము భావించామని, అయితే అలా జరగలేదని అధ్యయనాన్ని బట్టి తెలుస్తోందని ఆయన బీబీసీకి వివరించారు.

స్నోయీ ఔల్ (గుడ్లగూబ)

ఫొటో సోర్స్, Tom Johnson, Macaulay Library at Cornell Lab of Or

ఫొటో క్యాప్షన్, స్నోయీ ఔల్ (గుడ్లగూబ)

ఇంటి పెరట్లో నిత్యం కనిపించే పక్షులు, సాధారణ జాతుల పక్షులు కూడా భారీగా తగ్గిపోవడం విస్మయం కలిగిస్తోందంటూ రూజన్‌బర్గ్ ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి ఉత్తర అమెరికాలో మాదిరే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.

మనిషి కార్యకలాపాల వల్ల పక్షులు ఎదుర్కొంటున్న మనుగడ సంక్షోభానికి ఆసియాలో పరిస్థితి ఒక స్పష్టమైన ఉదాహరణని రూజన్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఆసియా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడిస్తోందన్నారు.

పాడేపక్షుల వ్యాపారం

పాడేపక్షుల కొనుగోలు, అమ్మకం ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో.. ముఖ్యంగా ఇండొనేషియాలోని జావా ద్వీపంలో ఇదో పెద్ద వ్యాపారం. చాలా పక్షులను అడవుల్లోంచి పట్టుకొచ్చి అమ్ముతారు.

ఈ వ్యాపారం ఈ పక్షుల ఉనికికే ముప్పు తెస్తోంది.

పక్షులు

ఫొటో సోర్స్, Ken Rosenberg

దేశంలోకెల్లా అత్యధిక జనాభా ఉండే ద్వీపమైన జావాలో సుమారు ఏడున్నర కోట్ల పక్షులను పెంపుడు పక్షులుగా పెట్టుకున్నారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం, చెస్టర్ జూలో పీహెచ్‌డీ విద్యార్థి హ్యారీ మార్షల్ నేతృత్వంలోని బృందం జావాలో మూడు వేల కుటుంబాలపై జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

పక్షుల పాటల పోటీల్లో పాల్గొనేందుకు ఈ పక్షుల పట్ల చాలా మంది విపరీతమైన ఆసక్తి చూపుతారు. ఈ ఆసక్తిని 'కికావు-మానియా' అని వ్యవహరిస్తారు. ఈ పోటీల్లో- పాటలో శ్రావ్యత, పాట వ్యవధి, శబ్ద స్థాయి ప్రాతిపదికగా ఉత్తమ పక్షులను ఎంపిక చేస్తారు.

పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పక్షుల యజమానులకు గరిష్ఠంగా దాదాపు 50 వేల డాలర్లు బహుమతి కింద లభిస్తుంది.

ఈ పోటీల సంస్కృతి వల్ల పక్షులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో అడవుల నుంచి పక్షులను పట్టుకొచ్చి అమ్మడం పెరుగుతోంది. ఈ వ్యాపారం కారణంగా అనేక పక్షిజాతుల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.

జావాలో పక్షుల విక్రయం

ఫొటో సోర్స్, Gabby Salazar

ఫొటో క్యాప్షన్, జావాలో పక్షుల విక్రయం

ఆసియా అధ్యయనం లీడ్ రీసర్చర్ అయిన హ్యారీ మార్షల్ మాట్లాడుతూ- ఈ వ్యాపారం విలువ కోట్ల డాలర్లలో ఉంటుందని, ఇండొనేషియా ఆర్థిక వ్యవస్థలో ఇదో భాగమని చెప్పారు.

వందల కొద్దీ మార్కెట్లలో 200కు పైగా జాతుల పక్షులను అమ్ముతారని ఆయన వెల్లడించారు.

ఉత్తర అమెరికా, ఆసియా అధ్యయనాలను నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాలు రెండు ఖండాల్లో పరిస్థితులను వివరిస్తూనే- పక్షుల సంరక్షణకున్న అవకాశాలపై ఆశాభావం వ్యక్తంచేశారు.

పక్షుల పాటల పోటీలు

ఫొటో సోర్స్, Bernd Marcordes

ఫొటో క్యాప్షన్, ఇండొనేషియాలో పక్షుల పాటల పోటీలపై ప్రజలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది

పక్షుల పట్ల ఇండొనేషియా ప్రజలకున్న ప్రేమే వాటిని పంజరాల్లో బందీలుగా మార్చిందని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టువర్ట్ మార్స్‌డెన్ వెల్లడించారు.

ఇదే ప్రేమతో వారు పక్షులను సంరక్షించేలా చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

డాక్టర్ రూజన్‌బర్గ్ ఉత్తర అమెరికాలో పక్షుల సంరక్షణ విజయగాథను ఒకటి ప్రస్తావించారు.

కాక్టస్ రెన్

ఫొటో సోర్స్, Brian Sullivan, Macaulay Library at Cornell Lab o

ఫొటో క్యాప్షన్, కాక్టస్ రెన్

అమెరికా, కెనడాల్లో బాతు, ఇతర నీటిపక్షులు తగ్గిపోతుండటాన్ని గుర్తించిన బాతుల వేటగాళ్లు వాటి సంరక్షణకు ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. బాతుల వేటగాళ్లకు అవసరమైన సంఖ్యలో బాతుల సంఖ్య ఉండేలా చూసేందుకు చిత్తడి నేలల పరిరక్షణ, పునరుద్ధరణకు లక్షల డాలర్లు వెచ్చించారని తెలిపారు.

దీనిని ఒక నమూనాగా రూజర్‌బర్గ్ చెప్పారు. వేటాడని పక్షుల, తాము నివసించే ప్రాంతాల్లో ఉండాలని ప్రజలు కోరుకొనే పక్షుల సంరక్షణకు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తే పక్షుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)