ఆంధ్రప్రదేశ్: గ్రామ స‌చివాల‌య ఉద్యోగ ప‌రీక్ష‌లపై వివాదం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది?

టీడీపీ నిరసన
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

స్థానిక‌ ప‌రిపాల‌న‌లో స‌మూల మార్పులు తేవాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. అక్టోబ‌ర్ 2న వీటి కార్యకలాపాలు మొదలవ్వబోతున్నాయి.

గ్రామ సచివాలయాల కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకునేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఉద్యోగాలకు అర్హత సాధించిన వారి ధ్రువప‌త్రాల ప‌రిశీల‌న మొదలైంది.

అయితే, ఈ పరీక్షల్లో ఏపీపీఎస్సీలో ప‌నిచేస్తున్న కొంద‌రికి టాప్ ర్యాంకులు రావ‌డంపై ఇప్పుడు వివాదం రేగుతోంది.

ప్ర‌తి 2 వేల జ‌నాభాకు ఒక స‌చివాల‌యం ఏర్పాటు చేసి, అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు వాటి ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లోనూ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్ప‌టికే నియ‌మించిన గ్రామ వాలంటీర్ల‌కు తోడుగా మ‌రో 10మంది చొప్పున సిబ్బందిని నియ‌మిస్తున్నారు.

ఇందుకోసం ఇంట‌ర్, డిగ్రీ, టెక్నిక‌ల్ విద్యార్హ‌త‌లు క‌లిగిన మొత్తం 1,26,728 పోస్టుల‌ను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో ప‌రీక్ష‌లు జరిగాయి.

మొత్తం 10 ర‌కాల పోస్టులు వీటిలో ఉన్నాయి. ఈ పరీక్షలకు 19,58,582 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల వారీగా క‌టాఫ్ మార్కులు నిర్ణ‌యించి, వారిలో 1,98,164 మందిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది.

కొన్ని పోస్టుల‌కు ఉన్న ఖాళీల కంటే త‌క్కువ మంది అర్హ‌త సాధించ‌గా, మ‌రికొన్ని పోస్టుల‌కు గ‌ట్టిపోటీ ఏర్పడింది. దీంతో జిల్లాల వారీగా రోస్ట‌ర్ పాయింట్స్‌ను బ‌ట్టి తుది జాబితా సిద్ధం చేయ‌బోతున్నారు.

అర్హులైన వారు కుల, నివాస‌, విద్యార్హ‌తా ధృవ‌ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈనెల 27న నియామ‌కాలు ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

రెండు రోజులపాటు శిక్ష‌ణ ఇచ్చి, వ‌చ్చే నెల 2న వారిని విధుల్లోకి తీసుకుంటామని చెప్పింది.

ఏపీపీఎస్సీ

ఫొటో సోర్స్, AP Government

ఏపీపీఎస్సీపై సందేహాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణాభివృద్ధి మ‌రియు పంచాయితీరాజ్‌తో పాటు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల ప‌రిధిలో ఈ నియామ‌కాలు జ‌రుగుతున్నాయి.

పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఏపీపీఎస్సీ తీసుకుంది. 3 కేట‌గిరీలుగా విభ‌జించి, ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.

సీఎం జగన్ ఫలితాలను విడుదల చేశారు.

అయితే, కొంద‌రు ఏపీపీఎస్సీ సిబ్బంది, వారి బంధువుల‌కు ఈ పరీక్షల్లో టాప్ ర్యాంకులు వచ్చాయి.

పేప‌ర్ లీక్ అయ్యింద‌న్న అనుమానాలతో కొన్ని క‌థ‌నాలు కూడా వచ్చాయి. కొన్ని విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కేట‌గిరీ-1 లో టాప్ ర్యాంక్ సాధించిన అనితమ్మ అనంత‌పురం జిల్లా బుక్క‌ప‌ట్నం మండ‌లం గ‌శిక‌వారిప‌ల్లె వాసి.

విజ‌య‌వాడ‌లోని ఏపీపీఎస్సీ కార్యాల‌యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఆమె కొంత‌కాలంగా ప‌నిచేస్తున్నారు.

అర్హ‌త సాధిస్తాన‌నే ముందు నుంచీ తాను ధీమాతో ఉన్నాన‌ని, కానీ మొద‌టి ర్యాంకు వ‌స్తుంద‌ని ఊహించలేదని ఆమె మీడియాతో చెప్పారు.

జగన్

ఫొటో సోర్స్, YSRCParty/twitter

ఫొటో క్యాప్షన్, పరీక్షల ఫలితాలను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు

అనితమ్మతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా.. ఆమె భర్త శ్రీనివాసరెడ్డి స్పందించారు.

''ఎనిమిదేళ్లుగా అనితమ్మ ఏపీపీఎస్సీలో ప‌నిచేస్తోంది. మొదట హైద‌రాబాద్‌లో చేసేది. ఆ తర్వాత కార్యాలయం విజయవాడకు తరలించడంతో అక్కడికి వెళ్లింది. అనేక నియామక పరీక్షలు ఆమె రాసింది. ఈ సారి విజయవంతమైంది. ప్రశ్నాపత్రాన్ని స్వయంగా ఆమె టైప్ చేసిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదు. ఆమె కార్యాలయంలో సహాయకురాలిగా మాత్రమే పనిచేస్తోంది'' అని ఆయన చెప్పారు.

అనితమ్మతోపాటు ఏపీపీఎస్సీలోనే ఏఎస్‌ఓగా పనిచేస్తున్న దొడ్డా మ‌ల్లికార్జున రెడ్డి సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డికి కేట‌గిరీ-1లోనే మూడో ర్యాంక్ వ‌చ్చింది. కేటగిరీ-3లో ఆయన టాపర్‌గా నిలిచారు.

కేటగిరీ-3లో రెండో ర్యాంక‌ర్‌గా నిలిచిన వెన్నా మ‌హేశ్వ‌ర రెడ్డి కూడా ఏపీపీఎస్సీలోనే పనిచేస్తున్నారు.

ఆయ‌నతో బీబీసీ మాట్లాడింది.

''కష్టపడి చదవడంతోనే ర్యాంకు సాధించగలిగా. చాలా ప్ర‌య‌త్నాల త‌ర్వాత ఈ స్థాయిలో నిలిచా. అంత‌కుమించి ఏమీ చెప్ప‌లేను'' అని అన్నారు.

ఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించినవారిలో సాధారణ నేపథ్యమున్న కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మండ‌లం పెస‌ర‌పాడుకి చెందిన సంప‌త‌రావు దిలీపు కేట‌గిరీ-2లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించారు. ఆయ‌న తండ్రి కౌలురైతు.

తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని నాగులాప‌ల్లి గ్రామానికి చెందిన చింత‌ప‌ల్లి ర‌మ్య లాల‌స్య అనే యువ‌తికి డిజిట‌ల్ అసిస్టెంట్ కేట‌గిరిలో టాప్ ర్యాంక్ వచ్చింది. ఆమె తండ్రి సైకిల్ మెకానిక్‌.

పరీక్షలు, నిరుద్యోగం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘విచార‌ణ చేపట్టాలి’

ఏపీపీఎస్సీ తీరుపై చాలాకాలంగా ఉన్న విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే తాజా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ క‌నిపిస్తోంద‌ని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎం.సూర్యారావు విమ‌ర్శించారు.

''గ్రామ‌ స‌చివాల‌య ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్నాప‌త్నం చాలా కఠినంగా ఇచ్చారు. అభ్య‌ర్థులంద‌రూ చాలా అవ‌స్థ‌లు ప‌డ్డారు. ఫ‌లితాలు చూస్తుంటే అనుమానాలు వ‌స్తున్నాయి. కేట‌గిరీ-1లో టాప్ ర్యాంక్ సాధించిన అనిత‌మ్మ ఏపీపీఎస్సీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా ప‌నిచేస్తున్నారు. ఆమెకు టాప్ ర్యాంక్ రావ‌డమే అంద‌రికీ అనుమానాలకు తావిస్తోంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

''ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారిని విధులకు దూరం పెట్టాల్సి ఉంటుంది. కానీ, వారలా చేయలేదు. దీనిపై విచార‌ణ జ‌ర‌పాలి. ఎంతో మంది ఆశ‌లు పెట్టుకుని, క‌ష్ట‌ప‌డి పరీక్షలు రాశారు. ఇది ఏపీపీఎస్సీ వైఫ‌ల్య‌మే. ప్ర‌భుత్వం విచార‌ణ‌కు సిద్ధం కాక‌పోతే ఆందోళ‌న చేప‌డ‌తాం'' అని సూర్యారావు హెచ్చరించారు.

మ‌రోవైపు టీఎన్ఎస్ఎఫ్ కార్య‌క‌ర్త‌లు విజ‌య‌వాడ‌లో ఆందోళ‌న‌కు దిగారు.

ఏపీపీఎస్సీ కార్యాల‌యం ముందు ఆందోళ‌న‌కు ప్ర‌య‌త్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షుడు నాదెండ్ల బ్ర‌హ్మం చౌద‌రి స‌హా ప‌లువురిని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు త‌ర‌లించారు.

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

ఫొటో సోర్స్, peddireddyysrcp/twitter

ఫొటో క్యాప్షన్, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

ఏపీపీఎస్సీ మౌనం.. స్పందించిన మంత్రి

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఏపీపీఎస్సీ పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నా, ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేదు.

బీబీసీ పలుమార్లు ప్ర‌య‌త్నించినా ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గానీ, కార్య‌ద‌ర్శి గానీ స్పందించలేదు. ఆరోప‌ణ‌లపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరినా వారు మౌనం వహించారు.

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప‌కడ్బందీగా సాగింద‌ని, అవ‌క‌వ‌త‌క‌ల‌కు ఆస్కారమే లేద‌ని ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి బీబీసీతో చెప్పారు.

''రికార్డు స‌మ‌యంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వ‌హించి, ఫలితాలు వెల్లడించాం. ఇంత పెద్ద నియామ‌కాల ప్ర‌క్రియను విజ‌య‌వంతంగా పూర్తి చేశాం. గిట్ట‌ని వాళ్లు దుష్ప్ర‌చారాలు చేస్తున్నారు. ప్ర‌శ్నాప‌త్రాలు బ‌య‌ట‌కివచ్చే ఆస్కార‌మే లేదు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సాగింది. ఎక్క‌డా లోపం లేకుండా అధికారులు ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డానికి కొందరు ఆరోపణలు చేస్తున్నారు'' అని రామచంద్రారెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)