20 ఏళ్లుగా 200 విష సర్పాలతో కాటేయించుకుంటున్నాడు.. ఎందుకో తెలుసా

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో ప్రతి 5 నిమిషాలకూ ఒకరు పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి 5 నిమిషాలకు నలుగురు పాము కాటు వల్ల శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు.
కానీ, ప్రపంచంలో కొద్ది మంది ప్రమాదానికి ఎదురెళ్తున్నారు.. పాములతో కాటు వేయించుకుంటున్నారు.
అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన టిమ్ ఫ్రీడ్ విషసర్పాలతో కాటు వేయించుకుంటూ ఆ దృశ్యాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
అలాంటి ఒక వీడియోలో బ్లాక్ మాంబా పాము వెంటవెంటనే రెండు సార్లు ఆయన్ను కాటు వేశాక, మోచేతి కింద గాయమై రక్తం కారుతుండగా, విషం శరీరంలోకి పాకుతుంటే నొప్పిని పంటి బిగువన భరిస్తూ కెమెరాను చూస్తూ మాట్లాడుతుంటారు టిమ్.
''బ్లాక్ మాంబా కాటేస్తే కలిగే నొప్పి భయంకరంగా ఉంటుంది. వేయి తేనెటీగలు ఒకేసారి కుడితే కలిగే నొప్పిలా ఉంటుందది. తేనెటీగలు కుడితే ఒకటో రెండో మిల్లీగ్రాముల విషం శరీరంలోకి ఎక్కుతుంది. కానీ, ఒక బ్లాక్ మాంబా కాటేస్తే 300 నుంచి 500 మిల్లీగ్రాముల విషం శరీరంలోకి వెళ్తుంది.
టిమ్ తనను పాము కాటేసిన తరువాత ఏమవుతుందో 'బీబీసీ'కి చెప్పారు.
''కాటేసిన వెంటనే ఆ ప్రాంతమంతా వాపు వస్తుంది. తరువాత ఒకట్రెండు రోజులు లేవలేని పరిస్థితిలో ఉంటాను. వాపు తీవ్రతను బట్టి నా ఒంట్లోకి ఎంత విషం వెళ్లిందో నాకు అర్థమైపోతుంది. ఆ నొప్పి భరించలేనంతగా ఉంటుంది''.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకరం.. అనైతికం
టిమ్ వంటివారికి యూట్యూబ్‌లో పెద్దసంఖ్యలో ఫాలోవర్లున్నా ఇలాంటి వీడియోలను, విధానాన్ని వ్యతిరేకించేవారూ ఉన్నారు.
''వీళ్లు ఏం చేస్తుంటారో మాకేమీ అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా ప్రమాదకరం, అనైతికం కూడా. అలాంటివారితో మేం కలిసి పనిచేయం'' అని లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్‌కు చెందిన డాక్టర్ స్టువర్ట్ అన్స్‌వర్త్ చెబుతున్నారు.
లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ కూడా పాము విషానికి సరైన విరుగుడు (యాంటీ వీనమ్) కోసం పరిశోధనలు చేస్తోంది.
నిజానికి ఇలాంటి కొత్త టీకాలు, విరుగుడు మందులను తొలుత ఎలుకలు, ప్రయోగశాలల్లో వాడే ఇతర జంతువులపై ప్రయోగిస్తారు. అక్కడ మంచి ఫలితాలు వచ్చి, సురక్షితమైనవే అనుకుంటే మనుషులపైనా పరీక్షించి చూస్తారు.
''ఇలాంటి ప్రమాదకర ప్రయోగాలు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ఎవరూ ఇలాంటివి చేయకూడదు'' అని హెచ్చరిస్తున్నారు అన్స్‌వర్త్.
కానీ, ప్రపంచవ్యాప్తంగా ఔషధ రంగంలో విషానికి విరుగుడు మందుల ప్రయోగాలకు సంబంధించిన సరైన మార్గదర్శకాలు లేవు.
''వీటి ఉత్పత్తి, సురక్షిత పద్ధతులకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలు లేవు'' అని బ్రిటన్‌లోని వెల్‌కమ్ ట్రస్ట్ చెబుతోంది. ఈ సంస్థ విషానికి విరుగుడుగా కచ్చితంగా పనికొచ్చే టీకా తయారీ కోసం పరిశోధనలు చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణాలను పణంగా పెట్టి..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదానికి ఎదురెళ్తున్నారని.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారని అనేవారితో టిమ్ ఏకీభవించరు.
''ఇదంతా నేను యూట్యూబ్ వీడియోల కోసం చేయడం లేదు. ప్రజల ప్రాణాలు కాపాడే మందుకోసం ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను కలిసి పనిచేస్తున్న వైద్యులను గుర్తించడానికే యూట్యూబ్ వీడియోలు చేశాను'' అంటారాయన.

ఫొటో సోర్స్, Getty Images
భూమ్మీద 3 వేల జాతుల పాములుండగా అందులో 200 జాతులు విషపూరితమైనవి. అవి కాటేస్తే ప్రాణాలు పోవడమో, శాశ్వత వైకల్యం కలగడమో జరుగుతుంది. ఇలాంటి చాలా విషసర్పాలతో టిమ్ సావాసం చేస్తుంటారు.
గత 20 ఏళ్లలో ఆయన 200 రకాల కట్ల, తాచు, నాగు పాములతో పాటు పింజర్లతోనూ కాటేయించుకున్నారు. అంతేకాదు.. 700 సార్లకు పైగా విషం ఇంజక్షన్లు కూడా వేయించుకున్నారు.
''బ్లాక్ మాంబా లాంటి పాముల విషాన్ని తట్టుకునే శక్తి శరీరం సంతరించుకోకపోతే అలాంటి విషం నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శ్వాస తీసుకోలేరు, కళ్లు మూతలు పడతాయి, మాట్లాడలేరు.. కండరాలు పనిచేయడం మానేస్తాయి. విషం కేంద్ర నాడీ వ్యవస్థనేమీ చేయదు.. కాబట్టి చనిపోయేవరకు అలా ఆలోచించొచ్చు' అని టిమ్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తాచుపాము కాటేస్తే
టిమ్ తన పెరట్లో చాలా పాములను పెంచుతున్నారు. వాటితో కాటు వేయించుకుని ప్రయోగాలు చేస్తుంటారు.
''ఆఫ్రికాలో కనిపించే నీటి తాచులు కూడా నా పెరట్లో ఉన్నాయి. అవి కనుక కాటేస్తే భరించడం చాలా కష్టం. నీటి తాచుల విషంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి. అవి నాడీ కణాలను దెబ్బతీస్తాయి''
''మిగతా రకాల తాచు పాముల్లో సైటోటాక్సిన్లుంటాయి. ఇవి కణజాలాన్ని చంపేస్తాయి. పింజర్లు కాటేస్తే ఇలానే అవుతుంది. పింజర్లు కాటేసినప్పుడు ఆ విషం మోతాదు, తీవ్రతను బట్టి కాటేసిన ప్రాంతంలోని మాంసమంతా మెల్లమెల్లగా శరీరం నుంచి వేరయి ఎముకలు కనిపిస్తాయి''
టిమ్ ఇలాంటి విషాలకు శరీరంలో నిరోధక వ్యవస్థ తయారయ్యేలా కొద్దిమొత్తాల్లో మెల్లమెల్లగా ఆ విషాన్ని ఎక్కించుకుంటారు. కానీ, ఇలాంటి పద్ధతులు చాలా ప్రమాదకరమన్న విమర్శలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిరోధక శక్తి సంతరించుకోవడం..
పందొమ్మిదో శతాబ్దం నుంచీ యాంటీ వీనమ్ తయారీ పద్ధతులు మారలేదు. గుర్రాలు, గొర్రెలు వంటి జంతువుల శరీరంలోకి తక్కువ మోతాదులో విషాన్ని ఇంజెక్ట్ చేసి ఆ తరువాత దాని రక్తం నుంచి యాంటీబాడీస్ సేకరిస్తారు.
''వాటిలానే మనం కూడా ఎందుకు విషాన్ని తట్టుకునేలా తయారుకాకూడదు?'' అంటారు టిమ్. అందుకే తనపైనే ప్రయోగాలు చేసుకుంటున్నానని చెబుతారాయన.
51 ఏళ్ల టిమ్ గతంలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేశారు. అంతేకానీ, రోగనిరోధక శాస్త్రాన్ని ఎన్నడూ చదువుకోలేదు, ఎన్నడూ యూనివర్సిటీకి కూడా వెళ్లలేదు.
విషకీటకాల కాటుతో చచ్చిపోతానేమోనన్న భయంతోనే ఆయన 20 ఏళ్లుగా ఇలా శరీరంలో విషనిరోధక వ్యవస్థ పెంచుకునేందుకు పాములతో కాట్లేయించుకుంటున్నారు.
మొదట్లో ఆయన సాలీడు, తేలు వంటివాటితో కాటేయించుకునేవారు.. ఆ తరువాత క్రమంగా తాచుపాములు, పింజర్లతోనూ కాటేయించుకోవడం ప్రారంభించారు.
''నేను ఈ భూమ్మీద ఉండే అన్నిరకాల విష సర్పాలతో కాటు వేయించుకోవడం లేదు. ఏవి కాటేస్తే మనిషి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతాడో అలాంటి భయంకర సర్పాలతోనే కాటేయించుకుంటున్నాను'' అంటారాయన.

ఫొటో సోర్స్, Swaminathan Natarajan
పాములతో కాటేయించుకునే టిమ్ అనేకసార్లు మృత్యువు అంచువరకు వెళ్లారు. అయినా, తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు.
టిమ్ ప్రయోగాలు ఆయనలోని విశ్వాసాన్ని పెంచగలిగాయి. అంతేకాదు.. సాధారణ మనుషుల కంటే ఆయనలో ఇప్పుడు రెట్టింపు యాంటీబాడీస్ ఉన్నాయని వైద్య పరీక్షలు తేల్చాయి. ఇదంతా 20 ఏళ్లుగా వేయించుకుంటున్న పాము కాట్ల వల్లేనని ఆయన చెబుతారు.
రెండేళ్ల కిందట టిమ్ యూట్యూబ్ వీడియోలను ఇమ్యునాలజిస్ట్ జాకబ్ గ్లాన్‌విలే చూశారు. ప్రఖ్యాత ఔషధ సంస్థ ఫైజర్‌లో పనిచేసి రిటైరైన ఆయన యాంటీవీనమ్ తయారుచేసే సొంత సంస్థ నెలకొల్పే పనిలో ఉన్నారప్పుడు.
ఆ సమయంలో టిమ్ వీడియోలు చూసి ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అతని రక్త నమూనాలను పరీక్షిస్తూ సమర్థమైన యాంటీవీనమ్ తయారీ కోసం కృషి చేస్తున్నారు.
అయితే.. టిమ్‌లా ఎవరూ చేయొద్దని మాత్రం ఆయన సూచిస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- మూడు కళ్ల పామును ఎప్పుడైనా చూశారా...
- పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ
- గోదావరిలో వరుస పడవ ప్రమాదాలు... ఎందుకిలా జరుగుతోంది? ఎవరు బాధ్యులు?
- గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'
- గోదావరి బోటు ప్రమాదం: 33కి చేరిన మృతులు.. మరో 14 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








