గోదావరిలో వరుస పడవ ప్రమాదాలు... ఎందుకిలా జరుగుతోంది? ఎవరు బాధ్యులు?

ఫొటో సోర్స్, PApikondalu tourism/fb
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
గోదావరిలో పడవ ప్రయాణం అంటే వెంటనే గుర్తుకొచ్చేది పాపికొండల పర్యటన. భద్రాచలం దాటిన తర్వాత తూర్పు కనుమలను చీల్చుకుంటూ సాగే గోదావరి ప్రవాహం కనులవిందుగా ఉంటుంది. దానిని చూడడానికి పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పాపికొండలకు తరలివస్తుంటారు.
అదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మారుమూల గ్రామాల గిరిజనులు బయటకు వెళ్లాలంటే నదీ ప్రయాణమే తప్ప మరో మార్గం లేదు. దాంతో నిత్యావసరాలకు కూడా బోటు మీద ప్రయాణించాల్సిన పరిస్థితి అటు పోలవరం, ఇటు దేవీపట్నం మండలాల గిరిజనులది.
నిత్యం నదిని దాటుకుంటూ ప్రయాణం చేయాల్సిన సమయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రమాదాలు వరుసగా జరుగుతున్న తీరు దీనికి నిదర్శనం.
2018 మే 16న జరిగిన పడవ ప్రమాదంలో 21 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి బోటులో ప్రయాణించడం, వాటికితోడుగా సిమెంట్ సహా ఎక్కువ బరువు వేయడం, అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా అప్పట్లో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
గత ఏడాది ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా, గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారానికి పలు హామీలు ఇచ్చారు. రోడ్డు రవాణా ఏర్పాటు చేసేందుకుగానూ దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామానికి గతంలో ఉన్న కొండదారిని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

'రోడ్డు' విషయంలో కదలిక లేదు
గోదావరి ఒడ్డున్న ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని రంపచోడవరానికి చెందిన పి. అచ్యుత్ దేశాయ్ తెలిపారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''అప్పట్లో కలెక్టర్ కొంత ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించారు. కానీ, ఆచరణ రూపం దాల్చలేదు. ఇప్పటికీ గిరిజనులు నదిలో ప్రమాదకరమరమైన స్థితిలోనే ప్రయాణాలు చేస్తున్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు వంటి విషయాల్లో అప్పట్లో కొంత ప్రయత్నం జరిగిందిగానీ అది కూడా మధ్యలో నిలిపివేశారు. ఇప్పుడు వరదల సమయంలో పర్యాటక బోట్లను అనుమతించడం ఎలా జరిగిందన్నది అంతుబట్టడం లేదు'' అని ఆయన చెప్పారు.
పాపికొండల పర్యటనకు నిబంధనలెన్నో...
పాపికొండల పర్యటన కోసం పోలవరం, రాజమహేంద్రవరం నుంచి పలు ప్రైవేటు ఆపరేటర్లతో పాటుగా ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోట్లు నడుపుతోంది. సుమారుగా 80 బోట్లు తిరుగుతుంటాయని బోటు నిర్వాహకుడు రమేష్ బీబీసీకి తెలిపారు. వాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పలు అనుమతులు ఉండాలి.

ఫొటో సోర్స్, PApikondalu tourism/fb
నిబంధనలివే..
ఫిట్ నెస్ సర్టిఫికెట్- బోటు పరిస్థితి, నదీ జలాల్లో ప్రయాణించేటప్పుడు దానికి తగ్గ సామర్థ్యం. ఎంత మందికి అనుమతి అన్నది నిర్ధరిస్తారు. పోర్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇది జారీ అవుతుంది.
ఫైర్ సర్టిఫికెట్- ప్రమాదం జరిగినప్పుడు నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నట్టు నిర్ధరణ చేసుకోవాలి.
నీటిపారుదల శాఖ అనుమతి- జల ప్రవాహంలో ప్రయాణానికి తగ్గట్టుగా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతి ఉండాలి. లైఫ్ జాకెట్లు సహా అనేక అంశాలు పరిశీలించి జారీ చేస్తారు.
పోలీసుల అనుమతి- బోటు ప్రయాణించే సమయంలో పాపికొండలకు బయలుదేరగానే దేవీపట్నం వద్ద పోలీసులు బోటు తనిఖీ చేస్తారు. ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అవకాశం లేదని నిర్ధరించుకున్న తర్వాత బోటు ప్రయాణానికి అనుమతి లభిస్తుంది.
రాయల్ వశిష్టకు అనుమతి ఉంది
మంటూరు-కచ్చులూరు మధ్యలో రాయల్ వశిష్ట బోటు ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ బోటును కూడా దేవీపట్నం వద్ద పోలీసులు పరిశీలించి అనుమతించడంతోనే పాపికొండల వైపు తరలినట్టు స్థానికులు చెబుతున్నారు.
అయితే, బోటులో పర్యాటకుల సంఖ్యకు తగ్గట్టుగా లైఫ్ జాకెట్లు ఉన్నాయా లేదా అన్నది పూర్తిగా పరిశీలించినట్టుగా కనిపించడం లేదు. 14 మంది లైఫ్ జాకెట్లు ధరించి ఉండడంతో వారిని మాత్రం స్థానికులు రక్షించగలిగారు. మంటూరు సమీపంలో గోదావరిలో చేపల వేట సాగిస్తున్న గిరిజనులు కొందరు ఈ బోటు ప్రమాదాన్ని గ్రహించి కొందరిని రక్షించగలిగినట్టు చెబుతున్నారు.

వరదల సమయంలో అనుమతి లేదు
ఇటీవల గోదావరి ప్రమాదకరస్థితిలో ప్రవహించడంతో ప్రవాహం నిలుపుదల చేశామని, అయితే నదీ జలాల్లో ఉధృతి ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టడంతో బోట్లు బయలుదేరినట్టు కనిపిస్తోందని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ కృష్ణారావు బీబీసీకి తెలిపారు.
''ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 7.2 అడుగుల నీటి మట్టం ఉంది. 4.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నాం. ప్రస్తుతం 34 బోట్లకు అనుమతి ఉంది. కానీ, ఈరోజు ఒక్క బోటు మాత్రమే బయలుదేరిందని మాకున్న సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తాం'' అని తెలిపారు.
ముమ్మిడివరం మండలం పశువుల్లంక వద్ద గత ఏడాది ప్రమాదం జరిగింది. 2018 జూలై 15న జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మరణించారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాలేదు.
నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో నాటుపడవలో ప్రయాణిస్తూ స్కూల్ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
- #గ్రౌండ్‌రిపోర్ట్: ‘బోటు తలుపులు వేయడంతో ఈత వచ్చినా మునిగిపోయారు’
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- కాంగోలో ఉత్తరాంధ్రుల కష్టాలు: ‘భోజనం కూడా దొరకడం లేదట.. మా అబ్బాయి ఎలా ఉన్నాడో ఏమో’
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు
- కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








