ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు

ఫొటో సోర్స్, A CURRENT AFFAIR
ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల కోసం ఆరు వారాలు డిస్నీలాండ్ టూర్ వెళ్లిన ఫియోనా మెల్బుల్ అనే మహిళ దానికోసం దాదాపు ఐదు లక్షలు ఖర్చు పెట్టానని వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన స్నేహితులను ఆకట్టుకోడానికి వేల డాలర్ల అప్పులు చేశానని ఈ 27 ఏళ్ల ఆస్ట్రేలియా మహిళ అంగీకరించారు.
విదేశాలకు సెలవులకు వెళ్లే స్తోమత లేదని తెలిసినా, ఆమె క్రెడిట్ కార్డులు ఉపయోగించి హాలీడే కోసం అమెరికాకు వెళ్లారు.
"దానికి మొత్తం రానూపోనూ 10 వేల డాలర్లు (7 లక్షలకు పైనే) ఖర్చైంది. ఈ టూర్ మిస్ కాకూడదనుకున్నా, అందుకే అప్పుచేసి మరీ వెళ్లా" అని ఆమె ఒక ఆస్ట్రేలియన్ న్యూస్ 'ఎ కరెంట్ అఫైర్ షో'లో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్నేహితులు అసూయ పడాలనే
"నా సోదరుడు చాలా ప్రాంతాలకు వెళ్తుంచాడు. తనను చూసి నాకూ విదేశీ ప్రయాణాలు చేయాలని అనిపించేది" అని ఫియోనా చెప్పారు.
తను "నేను డిస్నీలాండ్ వెళ్తున్నా" అన్నాడు. "నేను లేకుండానే వెళ్తావా" అని అడిగాను. ఆ టూర్ కోసమే అప్పు చేశాను. ఈ ట్రిప్‌లో అన్ని ఖర్చులకూ క్రెడిట్ కార్డులే వాడాను" అన్నారు ఫియోనా.
ఆమె ఈ హాలిడే కోసం అంత మొత్తం ఖర్చు పెట్టడానికి కారణం ఒకటే. ఫియోనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన 777 ఫాలోయర్లు కుళ్లుకునేలా అందమైన ఫొటోలు పెట్టాలనుకున్నారు.
"నేను ఎక్కడికెళ్లినా 10, 20 షాట్స్ తీసుకుంటా.. వాటిలో ఒక చక్కటి ఫొటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా.. తర్వాత స్నేహితులు దానిని ఎప్పుడుచూస్తారా అని ఎదురుచూస్తుంటాను" అన్నారు.
"వాళ్లు అసూయతో పెట్టే కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా బాగుంటుంది. మరిన్ని ఫొటోలు పెట్టి వారిని ఉడికించాలనిపిస్తుంది" అని ఫియోనా చెప్పారు.

ఫొటో సోర్స్, A CURRENT AFFAIR
ఇన్‌స్టాగ్రామ్ కోసం ఇలా అప్పులు ఎందుకు చేస్తున్నారు?
దీనికి సమాధానం ఇచ్చిన సైకాలజిస్ట్ క్రిస్టీన్ బాగ్లే-జోన్స్ "ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వారు ఎంత ఖర్చుపెడితే, అంత సంతోషం పొందచ్చని భావిస్తున్నారు" అని చెప్పారు.
"అదంతా ఫాస్ట్ ఫుడ్‌లా ఉంటుంది. అది మంచిది కాదు, పోషకాలు కూడా ఉండవు. కానీ మరోసారి తిందాం, అని అలా వెళ్తూనే ఉంటాం. ఇది కూడా అలాగే".
"సోషల్ మీడియాతో నిరంతరం 'కనెక్ట్' అయ్యుండేవాళ్లతో కొందరు వాళ్లను పోల్చుకుంటారు. అందరిలాగే చేయాలనుకుంటారు".
"అలా ఇతరులకు అసూయ పుట్టించాలనే మనస్థితి, వేరేవారితో పోల్చుకోవడం లాంటివి మనల్ని మనది కాని వేరే జీవితాన్ని కోరుకునేలా చేస్తుంది" అంటారు బాగ్లే.
"కానీ, అంత ఖర్చుచేసి సెలవులకు వెళ్లొచ్చాక మనకు అప్పులే మిగులుతాయి. మనం ఎదురుచూసిన ఆ హాలిడే థ్రిల్ కనిపించదు. కాబట్టి అలాంటివి నిరాశపరుస్తాయి" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ తగలబడుతోంది.. ఈ కార్చిచ్చును ఆపేదెలా?
- మునిగిపోతున్న ఈ దేశాన్ని కాపాడేదెలా
- ఉడుము దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ జంట
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- చిన్నారికి పాలు పడుతూ, జో కొడుతూ పార్లమెంటును నడిపించిన స్పీకర్
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








