ఈ పగడాల దేశాన్ని మునిగిపోకుండా కాపాడడం ఎలా

ఫొటో సోర్స్, Getty Images
ఇది మధ్య పసిఫిక్‌లో ఉన్న కిరిటిమతి ద్వీపం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వలయాకారపు పగడపు దీవి.
ఈ ప్రత్యేక ద్వీపం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చిన్న ప్రాంతాల ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో, ప్రస్తుత అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ విధానాలు ఎంత పేలవంగా ఉన్నాయో అర్థమవుతుంది.
ఈ ద్వీపం బ్రిటిష్ వలసపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ అణ్వాయుధ పరీక్షలు నిర్వహించారు. 1979 జులై 12న ఈ దీవికి స్వాతంత్ర్యం వచ్చింది.
ఇక్కడ భూమధ్యరేఖ వెంబడి ఉండే 33 ద్వీపాల సమూహంగా రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి ఏర్పడింది. ఇప్పుడు, ఈ దీవులకు పర్యావరణ ముప్పు ముంచుకొస్తోంది.
సముద్ర మట్టానికి కేవలం రెండు మీటర్లలోపు ఎత్తులో కిరిటిమతి దీవి ఉంది. భూగ్రహం మీద అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న నివాస ద్వీపాలలో ఒకటి.
ప్రపంచ పటంలో నట్టనడుమ ఉంటుంది. కానీ, నేటికీ చాలా మందికి ఈ దీవి గురించి, ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియదు.
మారుతున్న పరిస్థితులను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇక్కడి ప్రజల సంస్కృతి కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కిరిబాటిలోని ద్వీపాలపై పర్యావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా పెరుగుతోంది. సముద్ర మట్టం పెరగడం వల్ల ఇప్పటికే కిరిటిమతి ద్వీపంలో సగం కుటుంబాలు ప్రభావితమయ్యాయని 2016లో ఐక్యరాజ్య సమితి తన నివేదికలో తెలిపింది.
బ్రిటిష్ కాలంనాటి అణు వ్యర్థాలు ఇక్కడి చిన్నిచిన్న ద్వీపాలలో నిల్వ ఉన్నాయి. అయితే, సముద్ర మట్టం పెరుగుతుండటంతో ఆ నిల్వల నిర్వహణ కూడా పెద్ద సవాలుగా మారుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పులతో సంభవిస్తున్న విపత్తుల ప్రభావంతో ఇప్పటికే అనేకమంది ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోయారు.
రానురాను ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. 2008 నుంచి ఇప్పటి వరకు ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 2.41 కోట్ల మంది శరణార్థులయ్యారు.
2050 నాటికి మరో 14.3 కోట్ల మంది కేవలం మూడు ప్రాంతాల నుంచే తమ నివాస ప్రాంతాలను వదిలివెళ్లాల్సి వచ్చే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ మూడు ప్రాంతాలు సబ్- సహరన్ ఆఫ్రికా, దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికా.
కిరిటిమతి ద్వీపవాసులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. విదేశాలలో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందగలిగేలా ఇక్కడివారిలో నైపుణ్యాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం "మైగ్రేషన్ విత్ డిగ్నిటీ" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వాతావరణ మార్పులతో ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. దాంతో, ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం 2014లో ఫిజీ దేశంలో 6,000 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కిరిబాటి ప్రజలకు ఉపాధి కల్పించేందుకు న్యూజీలాండ్ ప్రభుత్వం కూడా ''పసిఫిక్ యాక్సెస్ బ్యాలెట్'' అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికింద ఏటా 75 మంది కిరిబాటి పౌరులు న్యూజిలాండ్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తారు. వారిని లాటరీ పద్ధతిలో ఎంపికచేస్తారు. అయితే, ఇక్కడి ప్రజలు తమ ఇళ్లను, కుటుంబాలను, సంస్కృతి- సంప్రదాయాలను విడిచిపెట్టేందుకు ఇష్టపడకపోవడంతో ఆ కోటా నిండటంలేదని స్థానికులు అంటున్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వలసవచ్చే కిరిటిమతి దీవి కార్మికులను అనుమతించేలా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ప్రభుత్వాలు తమ వలసవిధానాలను సులభతరం చేయాలని ప్రపంచబ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కోరుతున్నాయి.
విదేశాలకు వలస వెళ్లేలా ప్రజలను ప్రోత్సహించడం సులువైన పనే. కానీ, సమస్యకు అదొక్కటే పరిష్కారమని అనుకోవడం పొరపాటు. సముద్రంలో మునిగిపోకుండా ఈ దీవిని కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది.
దీనిని అలాగే సముద్రానికి వదిలేస్తే, ప్రపంచంలో ఇక్కడ తప్పితే మరెక్కడా కనిపించని అరుదైన బోకికోకికో అనే పక్షి జాతి కనుమరుగవ్వడంతో పాటు, మరెన్నో ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది. అది ప్రపంచ వినాశనానికి దారితీయొచ్చు.
సముద్ర మట్టాలు ఇలా పెరుగుతూ పోతే, జీవవైవిధ్యానికి చిరునామాగా నిలిచే మరెన్నో చిన్న ద్వీపాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ సమాజం చేతులు కలిపితే ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. దాంతో, సుందరమైన ఈ దీవిలో ప్రజల గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను, జీవ వైవిధ్యాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. కానీ, ఆ దిశగా సంపన్న దేశాలు ముందుకు రాకపోవడంతో ఈ చిన్న ద్వీపాల ప్రజల కష్టాలు రోజురోజుకీ మరింత క్లిష్టంగా మారుతున్నాయి.
2019 సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న 'ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యాచరణ సదస్సు'లో ఈ సవాళ్లకు పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.
(బెకీ అలెక్సిస్-మార్టిన్, జేమ్స్ డైక్, జొనాధన్ టర్న్‌బుల్, స్టెఫానీ మాలిన్‌లు రాసిన ఈ వ్యాసాన్ని మొదట ది కన్వర్సేషన్ మీడియా సంస్థప్రచురించింది. తర్వాత క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ద్వారా బీబీసీ ప్రచురించింది.)
ఇవి కూడా చదవండి:
- 1967 యుద్ధం: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- ప్రకాశం ఫ్లోరోసిస్: ‘బతుకు వికసించదు... చావు కరుణించదు’
- రాజధానుల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ‘ఇండోనేసియా దేశ రాజధానిని మారుస్తున్నారు’
- ‘బంగాళాదుంపలు’ పండించారని భారతీయ రైతులపై కోట్ల రూపాయల దావా వేసిన ‘లేస్’
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
- మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో కనిపించడం వల్ల జిమ్ కార్బెట్కు వచ్చే లాభం ఏంటి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








