మునిగిపోతున్న దేశ రాజధానిని మార్చేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images
ఇండోనేసియా రాజధానిని మారుస్తున్నట్లు ఆ దేశ ప్రణాళికా శాఖ మంత్రి తెలిపారు. ఓ కీలక నిర్ణయంలో భాగంగా జకార్తా నుంచి రాజధానిని మర్చాలని అధ్యక్షుడు జోకో విడోడో నిశ్చయించినట్లు ప్రణాళిక శాఖామంత్రి బంబాంగ్ బ్రోజెనెగోరో తెలిపారు.
అయితే కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. కానీ, రాజధాని రేసులో పలాన్‌కొరాయా ప్రాంతం ముందువరుసలో ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుత ఇండోనేసియా రాజధాని జకార్తా జనాభా కోటిమందికి పైనే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న ప్రాంతాల్లో జకార్తా కూడా ఒకటి.
ఏప్రిల్ 2019 మొదట్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం తనదేనని జోకో విడోడో ప్రకటించాక, రాజధాని మార్పు అంశం వెలుగులోకి వచ్చింది. కానీ మే 22 వరకు ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడదు.

ఫొటో సోర్స్, AFP
రాజధానిని ఎందుకు మారుస్తున్నారు?
1945లో డచ్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి రాజధాని మార్పుల అంశం పలుమార్లు చర్చకు వచ్చింది. ప్రపంచంలోనే జకార్తాలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని 2016లో ఒక సర్వే వెల్లడించింది. మంత్రులు సమావేశాలకు సకాలంలో చేరడానికి కూడా పోలీసుల కాన్వాయ్ సాయం తీసుకోవాల్సి వస్తోంది.
ఈ ట్రాఫిక్ సమస్య కారణంగా ఇండోనేసియా ఆర్థికరంగంపై ఏడాదికి 1.47వేల కోట్ల రూపాయల భారం పడుతోందని ప్రణాళికా శాఖ మంత్రి అన్నారు.
అధికార వికేంద్రీకరణలో భాగంగా గత రెండు దశాబ్దాలుగా మున్సిపాలిటీలకు రాజకీయ అధికారాలు, ఆర్థిక వరనులను ఎక్కువగా ఇస్తూవచ్చారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న ప్రాంతాల్లో జకార్తా ఒకటి. 2050 సంవత్సరం నాటికి జకార్తాలోని చాలా ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతాయని పలు సర్వేలు చెబుతున్నాయి.
గత పదేళ్లలో ఉత్తర జకార్తా 2.5 మీటర్లు మునిగిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతం ఏడాదికి సగటున 1 నుంచి 15 సెంటీమీటర్లు(8 అడుగులు) మేర మునిగిపోతోంది.
జకార్తా సముద్ర తీరప్రాంతంలో ఉంది. ఈ నగరం గూండా 13 నదులు ప్రవహిస్తాయి. జకార్తా నగరంలో సగభాగం సముద్ర మట్టానికి దిగువన ఉంది. తాగడానికి, ఇతర అవసరాల కోసం భూగర్భజలాలను తోడేయడమే ఇందుకు ముఖ్య కారణం.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయబోతున్నారు
అంతర్గత కేబినెట్ సమావేశంలో మూడు అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ మూడు ఆప్షన్స్‌ను అధ్యక్షుడికి కూడా వివరించారు. అందులో ఒకటి, ప్రస్తుత రాజధాని ప్రాంతంలోనే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయడం.
జకార్తా నగరం వెలుపలకు ఈ ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం రెండవది. ఇక మూడోది... కొత్త దీవిలో సరికొత్త రాజధానిని నిర్మించడం. అధ్యక్షుడు ఈ మూడో అంశానికే ప్రాధాన్యం ఇచ్చారు.
ఇందులో భాగంగా జకార్తాకు వందల కిలోమీటర్ల దూరంలో, బోర్నియోలోని పలాన్‌కొరాయా రాజధాని రేసులో ముందుందని మీడియోలో కథనాలు వచ్చాయి. అయితే 'పలాన్‌కొరాయా దేశ రాజధాని' అంశంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
''రాజధాని అయితే మా నగరం అభివృద్ధి చెందుతుంది. జకార్తాలో మాదిరిగానే విద్యారంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడున్న భూములు, అడవులు, ఖాళీ ప్రదేశాలన్నిటినీ ఉపయోగిస్తారు. కాలిమాంటన్ ప్రాంతంలోని అడవులు ప్రపంచానికే ఊపిరితిత్తులవంటివి. వాటి గురించి ఆలోచిస్తున్నా. ఆ అడవులను కోల్పోవలసి వస్తుంది'' అని ఒక హైస్కూల్ విద్యార్థి బీబీసీతో అన్నారు.

అయితే ఈ మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి పదేళ్లు పడుతుందని, ఇతర దేశాలు రాజధానిని మార్చగలిగినపుడు ఇండోనేసియా కూడా చేయగలదని సమావేశం అనంతరం ప్రణాళిక శాఖామంత్రి బంబాంగ్ బ్రోజెనెగోరో మీడియాతో అన్నారు.
''బ్రెజిల్ తన రాజధానిని ‘రియో డి జనరో’ నగరం నుంచి అమెజాన్ సమీపంలోని బ్రెజీలియాకు మార్చింది. కాన్‌బెర్రా నగరాన్నే తీసుకోండి.. ఈ నగరాన్ని సిడ్నీ, మెల్‌బోర్న్‌ల మధ్య నిర్మించారు. కజకిస్తాన్, మయన్మార్ దేశాలూ అలాగే రాజధాని నగరాలను మార్చాయి'' అని ఆయన మీడియాతో అన్నారు.
ఇండోనేసియా ఆర్థికాభివృద్ధిని దేశమంతా సమానంగా విస్తరించేలా చూస్తానని వీడోడో ప్రతిజ్ఞ చేశాక ఈ రాజధాని తరలింపు ప్రకటన వెలువడింది.

ఫొటో సోర్స్, Getty Images
'రాజధాని మార్పు... ఒక శక్తిమంతమైన సందేశం'
రెబెకా హెన్స్ఖే, మాజీ ఎడిటర్, బీబీసీ ఇండోనేసియా
రాజధాని మార్పు గురించి ఇండోనేసియా ప్రజలు ముందునుంచి సందేహిస్తూనే ఉన్నారు. కానీ ఇండోనేసియాను పాలించిన 6 మంది అధ్యక్షుల్లో ఎవ్వరూ ఈ దిశగా నిర్ణయం తీసుకోలేదు.
ఇండోనేసియా భిన్నత్వం కల దేశం. ఇక్కడున్న వేలాది దీవుల్లో వందలాది తెగలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. కానీ ఆర్థికాభివృద్ధి, సాంస్కృతికపరమైన ఉనికి, రాజకీయ రంగంలో ఎప్పుడూ జవనీస్ ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది.
ఇంతవరకు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన వారంతా జవనీయులే. ఇండోనేసియా సంపద మొత్తం జకార్తాలోనే కేంద్రీకృతమైంది.
జావా బయట నివసిస్తున్న ఇండోనేసియా ప్రజల్లో, ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని ప్రజల్లో, పాలకులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తి ఉంది.
అయితే, జావా బయటి ప్రాంతంలో రాజధాని తరలింపు జరిగితే, అసంతృప్తిగా ఉన్న ప్రజలకు.. అంతా మారుతోందన్న సందేశం పంపినట్లు అవుతుంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








