'మృత్యు ద్వీపం'లో ట్రంప్, కిమ్‌ల సమావేశం

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల సమావేశానికి సంబంధించి మరింత స్పష్టత వచ్చింది. సింగపూర్‌లోని సెంటోజా ద్వీపంలో వారు చర్చల్లో పాల్గొంటారని అమెరికా అధ్యక్షుని భవనం వైట్ హౌస్ ప్రకటించింది.
సెంటోజా ద్వీపంలోని విలాసవంతమైన కపెల్లా హోటల్‌లో ట్రంప్, కిమ్ సమావేశమవుతారని వైట్ హౌస్ ప్రజా సంబంధాల అధికారి సారా సాండర్స్ ట్విటర్ ద్వారా తెలిపారు.
"మరిన్ని కొత్త బంధాలు అల్లుకుంటున్నాయి. సమావేశానికి ముందు మరింతగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇది ఎంతో ముఖ్యమైన సందర్భం. ఆ రెండు రోజులు చాలా విలువైనవి. " అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్రికేయులతో తన భావాలను పంచుకున్నారు.
ఈ నెల 12న ఈ సమావేశం జరగనున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది. ఈ సమావేశం కనుక జరిగితే అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధినేత కలవడం చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సెంటోజా ఎందుకు?
సింగపూర్‌లో చాలా కీలకంగా భావించే ప్రధాన దీవికి సెంటోజా చాలా దగ్గర్లో ఉండటం వల్ల భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. కేబుల్ కార్లు, మోనోరైల్, భూగర్భ రహదారులు వంటి వాటితో సురక్షితమైన రవాణా మార్గాలున్నాయి.
ఏమిటి ప్రత్యేకత?
సింగపూర్ కొన్ని దీవుల కలయిక. ఇందులోని 63 దీవుల్లో సెంటోజా ఒకటి. దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ద్వీపంలో ఖరీదైన రిసార్టులు, విలాసవంతమైన యాచెట్స్, కాసినోలు ఉంటాయి. అంతేకాదు మరోవైపు సముద్రపు దొంగలు, హత్యలు, నేరాలు వంటి చీకటి కోణాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దొంగల దీవి
బ్రిటిష్ పాలనలో సముద్ర వర్తకానికి సింగపూర్ ప్రధాన కేంద్రంగా నిలిచింది. భారత్, చైనా మధ్య ఉండటం ఆ దేశానికి బాగా కలిసొచ్చింది. బ్రిటిష్ పాలనకు ముందు కూడా సింగపూర్ వాణిజ్య కేంద్రంగా విలసిల్లేది. ఇదే సమయంలో సముద్రపు దొంగల బెడద కూడా పెరిగింది.
ఆ రోజుల్లో సెంటోజా సముద్రపు దొంగలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ జరిగే మారణకాండతో 'మృత్యుద్వీపం'గా ఇది ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ మలై, చైనీస్, బెగిస్ తెగలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో ప్రపంచ యుద్ధంలో నరమేధం
రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ సేనలు ఓడిపోవడంతో 1942లో సింగపూర్ జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది. అప్పుడు సింగపూర్ పేరును స్యోనన్‌గా మార్చారు. జపనీస్ భాషలో స్యోనన్ అంటే దక్షిణంలోని వెలుగు అని అర్థం.
ఆ తరువాత జపాన్ పాలనను వ్యతిరేకించిన వేలాది మందిని ఇక్కడ ఊచకోత కోశారు. వీరిలో ఎక్కువ మంది చైనా జాతికి చెందినవారు ఉన్నారు. 18 నుంచి 50 ఏళ్ల వయసులో గల చైనీస్ పురుషులను బంధించి తుపాకులతో కాల్చి చంపేవారు. సముద్రంలోకి నెట్టేసేవారు.
సెంటోజా ద్వీపంలోని సముద్ర తీరాల్లో అలలు ఒకప్పుడు ఎరుపు రంగుల్లో పోటెత్తాయి. ఎంతోమందిని ఇక్కడ చంపారు. ఇలాంటి తీరంలోనే ట్రంప్, కిమ్ కలవబోతున్న కపెల్లా హోటల్ ఉంది.
ఒకప్పుడు యుద్ధ ఖైదీలకు కారాగారంగా కూడా సెంటోజా ద్వీపం ఉండేది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








